వరుణ్ రూపొందించిన లోకాస్ట్ సోలార్ డ్రయ్యర్
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రైతులు ఆ రోజుకారోజే తక్కువ ధరకు తెగనమ్మేసుకుంటూ నష్టపోతూ ఉంటారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు, పుట్టగొడుగులను నిల్వ పెట్టుకునే సదుపాయాల్లేకపోవడమే ఇందుకు కారణం. అయితే, వీటిని పల్చటి ముక్కలుగా కోసి సోలార్ డ్రయ్యర్ల సాయంతో నాణ్యత, పోషకాల సాంద్రత ఏమాత్రం నష్టపోకుండా ఎండబెట్టి దాచుకోవచ్చు. ఎటువంటి రసాయనాలు కలపకుండానే ఏడాది వరకు నిశ్చింతగా గాలి చొరబడని డబ్బాల్లో నిల్వచేసుకోవచ్చు. వీలువెంబడి అమ్ముకోవచ్చు, ఏడాది పొడవునా తమ ఇంటి అవసరాలకూ వాడుకోవచ్చు.అయితే, సోలార్‌డ్రయ్యర్లు మార్కెట్‌లో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఈ దిశగా రైతులు ఆకర్షితులు కావడం లేదు. సోలార్ డ్రయ్యర్ల ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు ముఖ్య కారణం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు, కింది మధ్యతరగతి ప్రజలకు ఇవి అందుబాటులో లేవు. అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవు.
5 కిలోల డ్రయ్యర్ వెల రూ. 5,500
టన్నెల్ సోలార్ డ్రయ్యర్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వరుణ్ రహేజా అనే యువ ఇంజినీర్ ఇందుకు శ్రీకారం చుట్టాడు. గృహస్తులు, చిన్న రైతులకు అందుబాటులో ఉండే ధరలకే సోలార్ డ్రయ్యర్లను అందిస్తున్నాడు. 5 కిలోల పండ్లు, కూరగాయలను రెండు రోజుల్లో నాణ్యత, పోషకాలు చెడకుండా ఎండబెట్టే చిన్న డ్రయ్యర్‌ను రూ. 5,500లకు, 20 కిలోల సామర్థ్యం ఉండే డ్రయ్యర్‌ను రూ. 14,500కు అందిస్తున్నాడు. అవసరాన్ని బట్టి పారిశ్రామిక అవసరాల కోసం ఎంత పెద్ద సోలార్ డ్రయ్యర్లనయినా తయారు చేసి ఇస్తానని చెబుతున్నాడు
వరుణ్. గత ఏడాది నుంచి ఇప్పటికి 90 డ్రయ్యర్లను అందించానని తెలిపాడు. బీహార్‌లో గ్రామీణులకు పుట్టగొడుగుల ఒరుగులు తయారు చేయడానికి, ఉత్తరాఖండ్‌లో ఔషధ మొక్కలను నాణ్యత చెడకుండా ఎండబెట్టడానికి ప్రభుత్వాల సహకారంతో సరఫరా చేశామని వరుణ్ ‘సాగుబడి’ ప్రతినిధితో చెప్పారు. పొడవాటి గుడారం మాదిరిగా ఉండే డ్రయ్యర్‌లో గాలి ఎండ వల్ల వేడెక్కుతుంది. ఆ వేడి గాలి సోకడంతో పంట ఉత్పత్తుల ముక్కల్లోని తేమ త్వరగా ఆరిపోతుంది. చిన్న ఫ్యాన్ ఈ ఆవిరిని డ్రయ్యర్‌లో నుంచి బయటకు పంపుతుంది.
లోకాస్ట్ డ్రయ్యర్ల ప్రత్యేకతలు
కూరగాయలు, పండ్లు, ఉల్లి, వెల్లుల్లి.. ఏ వ్యవసాయోత్పత్తినైనా సోలార్ డ్రయ్యర్లతో పరిశుభ్రంగా, తక్కువ సమయంలో ఎండబెట్టవచ్చు. ఉదాహరణకు, టమాటాల ముక్కలను మామూలుగా ఎండలో పెడితే 7–8 రోజులకు గానీ పూర్తిగా ఎండవు. సోలార్ డ్రయ్యర్‌లో అయితే, కేవలం రెండు రోజులు చాలు. ఎండిన తర్వాత కూడా వీటిలో పోషక విలువలు, రుచి, రంగు, సువాసన ఉన్నవి ఉన్నట్టే ఉంటాయి. ఎండే క్రమంలో దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది. పురుగులు, పక్షుల, జంతువులు వల్ల కూడా పాడుకావు. వర్షం, మంచులో తడిసినా కూడా ఇబ్బందేమీ ఉండదు. తమ డ్రయ్యర్లను సులువుగా బిగించుకోవచ్చని, సులువుగా విడదీసుకొని తీసుకువెళ్లవచ్చని వరుణ్ తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఏడాదిలో 300 రోజులు సౌర విద్యుత్తుతో పనిచేసేలా వీటిని రూపొందించామన్నారు.
ఎండబెట్టిన ఉత్పత్తులకు మార్కెట్ ఉంది..
సోలార్ డ్రయ్యర్ల ద్వారా పరిశుభ్రమైన, నాణ్యమైన రీతిలో ఎండబెట్టిన ఒరుగులు, వాటి పొడులకు మార్కెట్‌లో డిమాండ్‌కు కొరత లేదని వరుణ్ చెబుతున్నారు. సోలార్ డ్రయ్యర్లతో తమ ఉత్పత్తులను ఎండబెట్టుకొని ఎటువంటి రసాయనాలను కలపకుండా భ్రదంగా నిల్వ చేసే చిన్న, సన్నకారు రైతులకు వీటిని కొనుగోలు చేసే ఆహార శుద్ధి కర్మాగారాలను పరిచయం చేస్తున్నామని వరుణ్ తెలిపారు. ఒకటి, రెండు డ్రయ్యర్లను కొనుగోలు చేసే వారికి దాన్ని ఎలా బిగించుకోవాలో తెలిపే మాన్యువల్‌ను, వీడియో సీడీని ఇస్తామని, ఫోన్ ద్వారా సూచనలిస్తామన్నారు. తమ డ్రయ్యర్లను ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసే రైతులకు పంట దిగుబడులతో నాణ్యమైన ఎండు ఆహారోత్పత్తుల తయారీలో 3 రోజుల పాటు శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. పంట దిగుబడులను శుభ్రపరిచి ముక్కలు తరిగే పద్ధతి, నాణ్యత చెడిపోకుండా ఎండబెట్టుకోవడం, గాలి చొరబడని ప్లాస్టిక్/గాజు డబ్బాల్లో ఎండు ఉత్పత్తులను నిల్వ చేసుకోవడంలో శిక్షణ ఇస్తామన్నారు. దీనితోపాటు మార్కెట్ సమాచారాన్ని కూడా అందించడం ద్వారా చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులు వృథాను అరికట్టడం, వారి ఆదాయాన్ని పెంపొందించడం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన లక్ష్యమని వివేక్ అంటున్నారు.
యు.ఎన్.ఈ.పి. ప్రశంస
తక్కువ ఖర్చుతో వరుణ్ రూపొందించిన సోలార్ డ్రయ్యర్ల పనితనాన్ని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం(యు.ఎన్.ఈ.పి.) మెచ్చుకోవడం విశేషం. ‘వరుణ్ తయారు చేసిన సోలార్ డ్రయ్యర్ల వంటి స్వల్పఖర్చుతో కూడిన ఆవిష్కరణలు రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా పెద్ద మార్పునకు దోహదపడతాయి. అంతేకాకుండా కోత అనంతర నష్టాలను గణనీయంగా తగ్గిస్తాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇదెంతో అవసరం’ అని యు.ఎన్.ఈ.పి.లోని సుస్థిర వ్యవసాయ విభాగం ప్రోగ్రామ్ ఆఫీసర్ క్లెమెంటైన్ ఓ కాన్నర్ అన్నారు.
వరుణ్‌ను ఈ–మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. solar.rsfp@gmail.com
‘నానబెట్టిన సిరిధాన్యాలు ఒక్క రోజులో ఎండుతున్నాయి’
వరుణ్ దగ్గర నుంచి 5 కిలోల సామర్థ్యం కలిగిన చిన్న సోలార్ డ్రయ్యర్(రూ.5,500)ను హైదరాబాద్‌కు చెందిన సూర్యప్రకాశ్‌రెడ్డి కొద్ది నెలల క్రితం కొరియర్‌లో తెప్పించుకున్నారు. సోలార్ డ్రయ్యర్ విడిభాగాలను వరుణ్ సూచించిన ప్రకారం తానే బిగించుకున్నారు. సిరిధాన్యాల బియ్యం నానబెట్టి ఎండబెట్టిన తర్వాత పిండి పట్టించి వినియోగదారులకు విక్రయిస్తూ ఉండే ఆయన సోలార్ డ్రయ్యర్ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నానబెట్టిన సిరిధాన్యాలను సోలార్ డ్రయ్యర్‌లో ఒక్క రోజులోనే బాగా ఎండుతున్నాయని తెలిపారు. దుమ్ము, పక్షులు, మంచు, వర్షం బెడద లేకుండా కూరగాయలు, పండ్లు వంటివి ఏవైనా నాణ్యత, రంగు చెడకుండా ఎండబెట్టుకోవచ్చని చిరువ్యాపారి సూర్యప్రకాశ్‌రెడ్డి (72999 97993) చెబుతున్నారు.
5 కిలోల సామర్థ్యం గల లోకాస్ట్ సోలార్ డ్రయ్యర్
మామిడి ఒరుగులు, ఎండిన పుట్టగొడుగులు, ఎండిన ఆపిల్ ముక్కలు, అరటి ఒరుగులు
Comments
Please login to add a commentAdd a comment