బాల్యంలో పెరటి తోటల పనుల్లో భాగం పంచుకున్న అనుభవాలు ఆమెను చక్కని టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెనర్‌గా నిలబెట్టాయి. చెన్నైలోని తిరువోత్రియూర్ ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్న పాలిన్ శ్యామ, గోపి నటరాజన్ దంపతులు ప్రకృతికి అనుగుణమైన జీవన శైలిని గత 23 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. సుమారు 50 రకాల పండ్లు, కూరగాయలను తమ ఇంటి మేడపైనే పాలిన్ సునాయాసంగా పెంచుతున్నారు.
‘నేను కేరళలో పుట్టాను. మా ఇంటి పెరట్లో కూరగాయలు, పండ్లు, పూల మొక్కల పెంపకంలో మా తాత గారికి సాయం చేస్తుండేదాన్ని. అప్పట్లో కొబ్బరి పొట్టును ఎరువుగా వేసేవాళ్లం. రుచికరమైన సొంత కూరగాయలు, పండ్లు తిన్న బాల్యానుభవమే పెళ్లయి మద్రాసు వచ్చాక టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ పెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది’ అంటున్నారు పాలిన్. మొక్కలకు పోషకాలు అందించేందుకు 23 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ, తప్పులు చేస్తూ నేర్చుకున్నానని ఆమె అంటున్నారు. వంటింటి తడి వ్యర్థాలు ఏవైనా సరే మున్సిపాలిటీ వాళ్లకు ఇవ్వకుండా కంపోస్టు తయారు చేసుకుంటూ, ఆ కంపోస్టుతోనే టెర్రస్ మీద కుండీలు, గ్రోబాగ్స్‌లో కూరగాయలు, పండ్లు పండించుకుంటున్నారామె.
3 మట్టి పాత్రలలో (ప్లాస్టిక్ బకెట్లలో కూడా కంపోస్టు చేసుకోవచ్చు) వ్యర్థాలు, మట్టిని పొరలు పొరలుగా వేస్తూ.. రెండు రోజులకోసారి కలియదిప్పుతూ.. పైపైన పుల్లటి మజ్జిగ చిలకరిస్తూ ఉంటే.. 60 రోజుల్లో కంపోస్టు సిద్ధమవుతుందని పాలిన్ తెలిపారు. కుండీలు, గ్రోబాగ్స్‌లో మొక్కలకు నెలకోసారి గుప్పెడు కంపోస్టు వేస్తూ ఉంటానన్నారు. చేపల మార్కెట్‌కు వెళ్లి చేపలు ముక్కలు చేసిన తర్వాత మిగిలిపోయే వ్యర్థాలను తీసుకువచ్చి.. కిలో చేపల వ్యర్థాలకు కిలో బెల్లం కలిపి(నీరు కలపకూడదు).. గాజు పాత్రలో వేసి గట్టిగా మూత పెట్టాలి. 40 రోజులకు మంచి పోషక ద్రవం తయారవుతుంది.
అదే ఫిష్ అమినోయాసిడ్. దీన్ని 5ఎం.ఎల్.ను 10 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపైన పిచికారీ చేస్తాను, మొక్కల మొదళ్లలో పోస్తాను అన్నారామె. కోడిగుడ్ల పెంకులను పిండి చేసి కాల్షియం కోసం మొక్కలకు వేస్తూ ఉంటారు. తన కిచెన్ గార్డెన్‌లో ఉన్న 75 కుండీల్లో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు, బోన్సాయ్ మొక్కల ఉత్పాదకత చాలా బాగుందని సంతోషంగా చెబుతున్నారు.
చెన్నై అనగానే నీటికొరతే గుర్తుకొస్తుంది. అయితే, టెర్రస్ మీద నుంచి వర్షపు నీటిని వృథా పోనియ్యడం లేదు. వాన నీటిని తమ ఇంటి ఆవరణలోని బోరుకు రీచార్జ్ చేసేందుకు వాడుతున్నారు. తద్వారా మండు వేసవిలోనూ నీటి కొరత ఉండటం లేదన్నారు. పర్యావరణ అనుకూల జీవనవిధానాన్ని అనుసరిస్తూ చక్కని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు పండించుకొని తినడంతోపాటు నీటి సంరక్షణ చేస్తూ పాలిన్, గోపి నటరాజన్ దంపతులు నగరవాసులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ స్పృహతో నాగరికతకు సరికొత్త అర్థం చెబుతున్నారు.
గోపి, పాలిన్ శ్యామ దంపతులు
23 ఏళ్లుగా ఇంటిపంటల సాగు
Published Tue, Nov 19 2019 6:59 AM | Last Updated on Tue, Nov 19 2019 6:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment