flowers tree
-
జపాన్‌లో పుష్పవిలాసం.. హనామీ ఫెస్టివల్.. జపాన్ జాతీయ పండుగ
రుతువులు మారే వేళ.. ప్రకృతి వింత అందాలను సంతరించుకున్న వేళ.. నింగిలోని కోటి తారలే నేలపై పూలై విరబూసే సమయాన.. ఒక పండుగ శోభ మది మదిని ఆహ్లాదపరుస్తుంది. రాలేటి పూలు రాగాలు పలికిస్తుంటే, పూసేటి పూలు సుగంధాలు వెదజల్లుతూ ఉంటే తెలుగువారు ఆమని పాడవే హాయిగా అని పాటలు పాడుకుంటారు. అదే జపాన్‌లో అయితే చెర్రీ బ్లాసమ్ (సకుర) చెట్ల కింద కూర్చొని వేడుకలు చేసుకుంటారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది చెర్రీ బ్లాసమ్ సీజన్ జపాన్ను ముందుగానే పలకరించింది. జపాన్ దేశవ్యాప్తంగా చెర్రీ బ్లాసమ్ చెట్లు ఎక్కడంటే అక్కడే కనిపిస్తాయి. సాధారణంగా మార్చి చివరి వారంలో ఈ చెట్లు విరగబూస్తాయి. కానీ ఈ ఏడాది పది రోజుల ముందే చెర్రీ బ్లాసమ్స్ పూసాయి. రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు నిండా తెలుపు, గులాబీ రంగుల్లో పువ్వులు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. కొన్ని చెట్లకు పసుపు, ఆకుపచ్చ రంగుల్లో కూడా పూలు పూస్తాయి. ఈ పూలు కేవలం 15 నుంచి నెల రోజుల వరకు మాత్రమే ఉండి ఆ తర్వాత నేల రాలిపోతాయి. అందుకే ఈ సీజన్లో జపాన్‌లో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. చెర్రీ బ్లాసమ్‌ని మహోత్సవంలా నిర్వహిస్తారు. దీనినే హనామీ ఫెస్టివల్ అంటారు. ఇది జపాన్ జాతీయ పండుగ. వెయ్యేళ్ల క్రితం నుంచే హనామీ ఉత్సవాలు జపాన్ నేలపై జరుగుతున్నాయి. ఈ సీజన్ ఎందరో కవుల హృదయాలను తట్టి లేపి దేశానికి అమృతంలాంటి కవిత్వాన్ని పంచి ఇచ్చింది. ఈ సీజన్లో ప్రజలు తమ బాధలన్నీ మర్చిపోయి రోజంతా చెట్ల కింద ఆడుకుంటారు. పాడుకుంటారు. ముచ్చట్లు చెప్పుకుంటారు. తింటారు. తాగుతారు. అక్కడే సేద తీరుతారు. పార్కులు, రోడ్డుకిరువైపులా చెర్రీలు కనువిందు చేస్తుంటే ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చీర్స్ చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తారు. చైనా, కొరియా, తైవాన్, యూరప్, అమెరికా దేశాల్లో కూడా చెర్రీ బ్లాసమ్ చెట్లు ఉన్నప్పటికీ జపాన్‌లో చేసినట్టుగా ఒక పండుగలా వైవిధ్యభరితంగా మరెవరూ చేయరు. ఆహ్లాదంతో ఆదాయం ఈ పండుగ జపాన్ వాసులకు ఆహ్లాదాన్ని పంచడమే కాదు ఆదాయాన్ని కూడా భారీగా సమకూరుస్తుంది. ఈ సీజన్లో జపాన్‌కి పర్యాటకులు పోటెత్తుతారు. గత రెండు మూడేళ్లుగా కరోనా మహమ్మారితో ఈ పండుగ కాస్త కళ తప్పింది. ఈ ఏడాది అన్ని భయాలు తొలగిపోవడంతో జపాన్ వాసులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. మార్చి నుంచి ఏప్రిల్ వరకు కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్లు పూస్తే, దేశానికి ఉత్తరాదివైపు ఉండే హిరోసాకి వంటి నగరాల్లో మేలో పూలు పూస్తాయి. ఈ సీజన్లో చెర్రీ చెట్లు దేశ ఖజానాకు 61,580 కోట్ల యెన్ల ఆదాయం తెచ్చిపెడతాయి. ఈ సమయంలో జపాన్‌కు ఏటా 23 లక్షల విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఈ సారి జపాన్‌కు బుకింగ్స్ గతం కంటే 70 శాతం ఎక్కువయ్యాయని ట్రావెలింగ్ సంస్థల గణాంకాలు వెల్లడించాయి. హనామీ పండుగలో పాల్గొనడానికి ముందస్తు బుకింగ్‌లకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. టోక్యోలో ప్రధాన కంపెనీలు దేశ విదేశాల్లోని తమ ప్రతినిధుల్ని చెర్రీ పిలిచి చెట్ల కిందే పార్టీలు చేసుకుంటాయి. అయితే ఈ చెట్లను ముందుగానే ప్రభుత్వం దగ్గర బుక్ చేసుకోవాల్సి ఉంటుంది! అలాగాక అప్పటికప్పుడు చెట్ల కింద పార్టీ చేసుకుందామంటే దొరకడం కష్టమే!! ఈ సీజన్లో జపాన్‌లో ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీల ఆదాయం ఓ రేంజ్లో ఉంటుంది. అవును మరి.. చెర్రీ అంటే ఏమనుకున్నారు. ఫ్లవర్ కాదు పవర్....!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖరీదైన కారులో వెళ్లి పూలకుండీల దొంగతనం.. వీడియో వైరల్..
ఖరీదైన లగ్జరీ కారు. పైగా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్. వీళ్ల బిల్డప్ చూస్తే చాలా రిచ్ అనుకుంటారు. కానీ వీళ్లు చేసిన పని తెలిస్తే మాత్రం ఇదేం బుద్ధిరా నాయనా అంటారు. ఔను మరి.. వీళ్లు పట్టపగలు కారులో వెళ్లి రోడ్డుపై ఉన్న పూలకుండీలను ఎంచక్కా డిక్కీలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. గురుగ్రాంలోని శంకర్ చౌక్‌లో ఈ ఘటన జరిగింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు పూలకుండీలను ఎత్తుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరి తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జీ-20 కార్యక్రమం కోసం శంకర్ చౌక్‌లో ప్రత్యేకంగా ఈ పూలను అలంకరించినట్లు తెలుస్తోంది. రంగురంగుల పుష్పాలు, రకరకాల పూల కుండీలతో ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వీటిని చూసిన ఈ ఇద్దరికీ ఏమనిపించిందో ఏమో తెలియదు గానీ.. ఎంచక్కా కారులో వచ్చి పూలకుండీలను దర్జాగా ఎత్తుకెళ్లారు. #G20 के सौंदर्यीकरण के "चिंदी चोर" गुरुग्राम में शंकर चौक पर #Kia कार सवार ने दिनदहाड़े पौधों के गमले उड़ाए ।।@gurgaonpolice @DC_Gurugram @cmohry @MunCorpGurugram @OfficialGMDA @TrafficGGM pic.twitter.com/aeJ2Sbejon — Raj Verma-Journalist🇮🇳 (@RajKVerma4) February 27, 2023 అయితే వీరిద్దరు నిజంగా దొంగలేనా? పూలకుండీలను చోరీ చేశారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. వీరిని గుర్తించేందుకు నెటిజన్లు ప్రయత్నించారు. కారు నంబర్‌ప్లేట్‌ను కనిపెట్టి పోలీసులకు క్లూ అందించేందుకు తమ వంతు కృషి చేశారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్.. -
పచ్చని ఆవాసం.. ప్రకృతితో సావాసం
సాక్షి, జూబ్లీహిల్స్ : వాహనాల రణగొణ ధ్వనులు, కాలుష్యం మధ్య జీవిస్తూ.. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు తమ నివాసాలను పచ్చటి ఆవాసాలుగా మార్చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కృష్ణా రామా అంటూ ఊరికే కూర్చోకుండా తమ ఇళ్లను పచ్చదనంతో, కూరగాయలు పండించే వ్యవసాయ క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. అటు కాలుష్యం నుంచి కాపాడుకుంటూ, ఇటు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణానగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగులు బలరామ్, సుబ్రహ్మణ్యం. పక్షుల కిలకిలా రావాలు.. కృష్ణానగర్‌లోని ఎఫ్ బ్లాక్‌కు చెందిన బలరామ్ బీహెచ్ఈఎల్ ఉద్యోగి. నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. తనకున్న చిన్న ఇంటిని నందనవనంగా మార్చేశారు. మిద్దెపై కూరగాయలు, ఆయుర్వేద, ఔషధ గుణాలున్న మొక్కలు, పండ్ల మొక్కలు, పూలమొక్కలు పెంచుతున్నారు. దీంతోపాటు చిన్నపాటి గూళ్లను ఏర్పాటు చేసి పక్షులను పెంచుతున్నారు. ఉదయం పక్షులు కిలకిలారావాలతో ఆయన నిద్ర లేస్తారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే తనకు ఇష్టమని, అదే స్ఫూర్తితో తన ఇంటిని ఇలా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు బలరామ్ బలరామ్ ఇంటి మిద్దెపై పక్షులుమిద్దెపై పూలమొక్కలు, ఆ అనుభూతే వేరు.. సుబ్రహ్మణ్యం ఏజీ కార్యాలయంలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. కృష్ణానగర్‌లో నివసిస్తున్నారు. చిన్నప్పడు పెరట్లో పండిన కూరగాయలతో వంట చేసుకోవడం ఆయన బాగా గుర్తు. ఉద్యోగ విరమణ పొందగానే మిద్దెపై కూరగాయలు సాగు ప్రారంభించారు. టమాటా, సొరకాయ, బీరకాయ, మిర్చీ సహా పలురకాల ఆకుకూరలు పండిస్తున్నారు. తమ కుటుంబం మొత్తం ఇక్కడ పండిన కూరగాయలనే వండుకుంటామని ఆయన సంతోషంగా చెబుతున్నారు. ప్రతిఒక్కరూ కొద్ది స్థలంలోనైనా పూలు, కూరగాయలు పండించాలంటున్నారు ఆయన. -
23 ఏళ్లుగా ఇంటిపంటల సాగు
బాల్యంలో పెరటి తోటల పనుల్లో భాగం పంచుకున్న అనుభవాలు ఆమెను చక్కని టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెనర్‌గా నిలబెట్టాయి. చెన్నైలోని తిరువోత్రియూర్ ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్న పాలిన్ శ్యామ, గోపి నటరాజన్ దంపతులు ప్రకృతికి అనుగుణమైన జీవన శైలిని గత 23 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. సుమారు 50 రకాల పండ్లు, కూరగాయలను తమ ఇంటి మేడపైనే పాలిన్ సునాయాసంగా పెంచుతున్నారు. ‘నేను కేరళలో పుట్టాను. మా ఇంటి పెరట్లో కూరగాయలు, పండ్లు, పూల మొక్కల పెంపకంలో మా తాత గారికి సాయం చేస్తుండేదాన్ని. అప్పట్లో కొబ్బరి పొట్టును ఎరువుగా వేసేవాళ్లం. రుచికరమైన సొంత కూరగాయలు, పండ్లు తిన్న బాల్యానుభవమే పెళ్లయి మద్రాసు వచ్చాక టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ పెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది’ అంటున్నారు పాలిన్. మొక్కలకు పోషకాలు అందించేందుకు 23 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ, తప్పులు చేస్తూ నేర్చుకున్నానని ఆమె అంటున్నారు. వంటింటి తడి వ్యర్థాలు ఏవైనా సరే మున్సిపాలిటీ వాళ్లకు ఇవ్వకుండా కంపోస్టు తయారు చేసుకుంటూ, ఆ కంపోస్టుతోనే టెర్రస్ మీద కుండీలు, గ్రోబాగ్స్‌లో కూరగాయలు, పండ్లు పండించుకుంటున్నారామె. 3 మట్టి పాత్రలలో (ప్లాస్టిక్ బకెట్లలో కూడా కంపోస్టు చేసుకోవచ్చు) వ్యర్థాలు, మట్టిని పొరలు పొరలుగా వేస్తూ.. రెండు రోజులకోసారి కలియదిప్పుతూ.. పైపైన పుల్లటి మజ్జిగ చిలకరిస్తూ ఉంటే.. 60 రోజుల్లో కంపోస్టు సిద్ధమవుతుందని పాలిన్ తెలిపారు. కుండీలు, గ్రోబాగ్స్‌లో మొక్కలకు నెలకోసారి గుప్పెడు కంపోస్టు వేస్తూ ఉంటానన్నారు. చేపల మార్కెట్‌కు వెళ్లి చేపలు ముక్కలు చేసిన తర్వాత మిగిలిపోయే వ్యర్థాలను తీసుకువచ్చి.. కిలో చేపల వ్యర్థాలకు కిలో బెల్లం కలిపి(నీరు కలపకూడదు).. గాజు పాత్రలో వేసి గట్టిగా మూత పెట్టాలి. 40 రోజులకు మంచి పోషక ద్రవం తయారవుతుంది. అదే ఫిష్ అమినోయాసిడ్. దీన్ని 5ఎం.ఎల్.ను 10 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపైన పిచికారీ చేస్తాను, మొక్కల మొదళ్లలో పోస్తాను అన్నారామె. కోడిగుడ్ల పెంకులను పిండి చేసి కాల్షియం కోసం మొక్కలకు వేస్తూ ఉంటారు. తన కిచెన్ గార్డెన్లో ఉన్న 75 కుండీల్లో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు, బోన్సాయ్ మొక్కల ఉత్పాదకత చాలా బాగుందని సంతోషంగా చెబుతున్నారు. చెన్నై అనగానే నీటికొరతే గుర్తుకొస్తుంది. అయితే, టెర్రస్ మీద నుంచి వర్షపు నీటిని వృథా పోనియ్యడం లేదు. వాన నీటిని తమ ఇంటి ఆవరణలోని బోరుకు రీచార్జ్ చేసేందుకు వాడుతున్నారు. తద్వారా మండు వేసవిలోనూ నీటి కొరత ఉండటం లేదన్నారు. పర్యావరణ అనుకూల జీవనవిధానాన్ని అనుసరిస్తూ చక్కని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు పండించుకొని తినడంతోపాటు నీటి సంరక్షణ చేస్తూ పాలిన్, గోపి నటరాజన్ దంపతులు నగరవాసులకే ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ స్పృహతో నాగరికతకు సరికొత్త అర్థం చెబుతున్నారు. గోపి, పాలిన్ శ్యామ దంపతులు -
చినుకు పూల చెట్టు
సినుకు పూలు జల్లి సిగురు కొమ్మ సరసమాడె. కరిగిపోయిన సీకటి కాటుక ముఖాన్ని కడుక్కొని తెట్టన తెల్లారింది మొగులు. భుజాల మీద పొడెండ మెరువంగ కోండ్రేస్తూ అతడు. తూరుపున మొలిసిన పొద్దును సిగనిండా ముడిసి విత్తనాలు చల్లుతూ ఆమె! తలపుల తలనిండా పంటను మోసుకుంటూ కలె దున్నిన దుక్కిలో వాళ్లు. అలసిన శ్రమ దేహాలను ఆదమరపి నిదురపుచ్చె భూమి! - తైదల అంజయ్య 9866862983 అంకురం నా బాల్యం నుంచీ ఇంటా, బయటా మాతృభాష మీద దండయాత్రలు జరిగాయి. నాటి నిజాం ప్రభుత్వం ఉర్దూను బోధనా భాషగా నిర్ణయించింది. బడిలో ఉర్దూలోనే బోధన. ఇక ఇంట్లో మా నాయనగారు సంస్కృతంలోనే మాట్లాడేవారు. తెలుగులో మాట్లాడితే మైలపడి పోతానేమో అని భయపడే ఛాందసుడాయన. ‘‘నువ్వు ఎటు వెళుతున్నావ్’’ అనడానికి ‘‘త్వంకుత్ర గచ్ఛసి’’ అనేవారు! నాకు సంస్కృతం మీద గౌరవమే గాని, ఇంతటి ఛాందసం నాకు నచ్చేది కాదు. ఇక మదర్సా బడిలో ఉర్దూలో ప్రార్థనతో మా దినచర్య ప్రారంభమయ్యేది. (‘‘ప్రళయకాలం వరకూ పరమేశ్వరుడు ఈ రాజ్యాన్ని (హైదరాబాదు) సుస్థిరంగా వుంచుగాక.’’) ‘‘తాబద్ ఖాలిఖె ఆలం, యెరియాసత్క్ఖ్రే’’ అనే పల్లవితో ఈ ప్రార్థనాగీతం ప్రారంభమయ్యేది. ఏడుస్తూ ఈ ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేసేవారితో గొంతు కలపని వారిని కొట్టేవాడు హెడ్ మాస్టరు. అలా దెబ్బలు తిన్నవాళ్ళలో నేనొకణ్ణి. ఇలా ఇంటా, బయటా నా బాల్యంలో తెలుగు మీద దండయాత్రలు ప్రారంభమయ్యాయి. నేను ఇంట్లోను, బడిలోను ఎదురు తిరగవలసి వచ్చేది. నాలో తిరుగుబాటు బీజాలు ఆ విధంగా నాటుకున్నాయి. (‘యాత్రాస్మృతి’లోంచి) - జూలై 22న దాశరథి కృష్ణమాచార్య జయంతి పద్యంలా కాళ్లకిందకు పడకుండా పరికిణీని ఒద్దికగా కొంచెమంటే కొంచెమే పెకైత్తి ఆమె అతడ్ని పువ్వులా కోసుకెళ్తుంది పెరట్లోంచి వాకిట్లో అరుగుపై బోర్లా పడుకుని నల్లని ఆకాశం పడిపోయిన అతని కంట్లో తన నవ్వుల్నే పదే పదే అటు ఇటు దొర్లిస్తూ ఆడుకుంటుంది ఇన్నాళ్లు కురవగా అలసిన వానలావున్న అతడి గుండెలపై వెన్నెల వెలుతుర్లో చెరువులా ఆమె నిశ్శబ్దంగా తలాన్చి పడుకున్నాక అతడు తడిరెక్కలతోవున్న గువ్వలా బయటికొచ్చి ఆమెనొక పద్యంలా దాచేస్తాడు ఇంట్లోనే - సత్యగోపి 8500845710 కొత్త రంగుల దారుల్లో నువ్వొక విప్పారిన పూర్ణచందమామవి నీ నిగూఢత్వం తెలియని చిన్నపిల్లలాగే నిరభ్యంతరంగా వాత్సల్య మనోయింద్రధనస్సునైనను అచ్చంగా నీకివ్వాలని వెన్నెలపై సప్తవర్ణాలు వెలవెలేనన్నావు అద్దుడు కాగితపు పంజరంలో యింకిపోయిన రంగుల వాత్సల్య స్వప్నాలని తిరిగి వెతుక్కొంటూ... - కుప్పిలి పద్మ ఈవెంట్ మల్లెమాల సాహిత్య పురస్కారాలు 2009 నుండీ ప్రదానం చేస్తున్న ‘మల్లెమాల సాహిత్య పురస్కారం’ను ఈ ఏడాది పాలగిరి విశ్వప్రసాద్‌కు ఇస్తున్నట్టు మల్లెమాల వేణుగోపాలరెడ్డి తెలియజేస్తున్నారు. 2015లో కాత్యాయనీ విద్మహేకు ఈ పురస్కారాన్ని ప్రకటించీ ప్రదాన సభ జరపనందున, ఇరువురికీ ఈ జూలై 24న ఉదయం 9:30కు హరిత ఆడిటోరియం, ఎస్పీ బంగ్లా ఎదుట, కడపలో పురస్కార ప్రదానం చేయనున్నారు. షేక్ హుస్సేన్ సత్యాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి, పొత్తూరి సుబ్బారావు, మధురాంతకం నరేంద్ర, ఎన్.దాదాహయత్, వి.ప్రతిమ, ఆవుల రామచంద్రయ్య, అబ్బిగారి రాజేంద్రప్రసాద్, అలపర్తి పిచ్చయ్య చౌదరి, జానమద్ది విజయభాస్కర్ పాల్గొంటారు. ముస్లిం అస్తిత్వ సాహిత్య సదస్సు ‘బాబ్రీ విధ్వంసం అనంతర తెలుగు ముస్లిం అస్తిత్వ సాహిత్యం’ అంశంపై జూలై 24న ప్రకాశం జిల్లా ఒంగోలులో సదస్సు జరగనుంది. బహుజన రచయితల వేదిక, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి, ముస్లిం చైతన్య వేదికల ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో పత్ర సమర్పణ, కవి సమ్మేళనం, కొన్ని పుస్తకాల ఆవిష్కరణ ఉంటాయి. ఇందులో- ఖాదర్ మొహియుద్దీన్, ఉషా ఎస్.డానీ, సయ్యద్ నశీర్ అహ్మద్, సలీం సయ్యద్, యాకూబ్, చల్లపల్లి స్వరూపారాణి, షాజహానా, కరీముల్లా, స్కైబాబ, అన్వర్, షమీవుల్లా, ఇనాయతుల్లా, రెహానా, ఖాజా, దోనెంపూడి నారాయణరావు, కోయి కోటేశ్వరరావు, దాసోజు లలిత, మల్లవరపు ప్రభాకరరావు పాల్గొంటారు. చిత్రకూటమి యాత్ర ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలూ, తోవపొడవునా అనేక గిరిజన గ్రామాలూ వారి మౌఖిక సాహిత్యం, ముఖ్యంగా బాలల సాంస్కృతిక విశేషాల పట్ల ఆసక్తితో ఆగస్ట్ 13, 14, 15 తేదీల్లో 60 మంది రచయితలు, విద్యార్థులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తలపెట్టిన యాత్ర ‘చిత్రకూటమి’. విశాఖసముద్రం నుంచి బయల్దేరి విజయనగరం, సాలూరు, సుంకి ఘాట్, కోరాపుట్, జైపూర్, జగదల్పూర్ మీదుగా చిత్రకూట్ జలపాతాలని ముట్టివచ్చే ఈ యాత్రని ప్రరవే(ఏపీ), మహిళా చేతన, సంస్కృతి గ్లోబల్ స్కూల్, తెలుగు రీడర్స్ క్లబ్, 10 టీవీ అక్షరం సమన్వయం చేస్తున్నాయి. ఈ సందర్భంగా అధ్యయనం కోసం గోండులు, గదబలు, సంతాలీలు, సవరబాలల మౌఖిక సాహిత్యం గురించిన సమాచారాన్ని telugu.elibrary@gmail.com కు పంపాల్సిందిగా బృంద సభ్యులు కె.ఎన్.మల్లీశ్వరి, కె.పద్మ విజ్ఞప్తి చేస్తున్నారు. సొరాజ్జెం పుస్తకావిష్కరణ అక్కినేని కుటుంబరావు తెలుగు రచన ‘సొరాజ్జెం’ను అల్లాడి ఉమ, ఎం.శ్రీధర్ అదే పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. ప్రచురణ: ఓరియంట్ బ్లాక్స్వాన్. ఈ పుస్తకావిష్కరణ జూలై 23న సాయంత్రం 5:30కి విద్యారణ్య హైస్కూల్, గ్రీన్ గేట్స్, సైఫాబాద్, హైదరాబాద్‌లో జరగనుంది. కె.సునీతా రాణి, గోపాల్ గురు, కల్పన కన్నబీరన్, సౌజన్య తమలపాకుల పాల్గొంటారు. కైతల కవాతు పుస్తకావిష్కరణ తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో- కైతల కవాతు(తెలంగాణ జన విముక్తి గీతాలు) పుస్తకావిష్కరణ సభ జూలై 24న పగలు 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో జరగనుంది. జయధీర్ తిరుమలరావు, కేశవరావు జాదవ్, కుదురుపాక రాజవ్వ, చుక్కా రామయ్య, విమలక్క, పాశం యాదగిరి, తెలిదేవర భానుమూర్తి, మోహన్ బైరాగి, ఎ.కె.ప్రభాకర్, బి.నర్సన్ పాల్గొంటారు. కోడూరి పుస్తకాలావిష్కరణ కోడూరి శ్రీరామమూర్తి రచనలు ‘మహాత్ముడు- పర్యావరణము’, ‘సాహిత్యానుభూతి’ ఆవిష్కరణ సభ జూలై 31న ఆనం రోటరీ హాలు, వై జంక్షన్ వద్ద, రాజమండ్రిలో సాయంత్రం 5:30కు జరగనుంది. ఆవిష్కర్త: తుర్లపాటి కుటుంబరావు. పుస్తకాల పరిచయం: ఆర్.ఎస్.వేంకటేశ్వరరావు, తల్లావఝుల పతంజలి శాస్త్రి, నండూరి రాజగోపాల్. పెనుగొండ లక్ష్మీనారాయణ, ఎండ్లూరి సుధాకర్, తుమ్మిడి రామ్‌కుమార్, పట్టపగలు వెంకటరావు పాల్గొంటారు. నిర్వహణ: కళాగౌతమి. కొత్త పుస్తకాలు కాన్పుల దిబ్బ కథకుడు: చింతకింది శ్రీనివాసరావు; పేజీలు: 124; వెల: 110; ప్రతులకు: శ్రీనిజ ప్రచురణలు, 6-60/1, రవీంద్రనగర్, ఓల్డ్ డైరీ ఫామ్, విశాఖపట్నం-530040; ఫోన్: 8897147067 చింతకింది రెండో కథాసంపుటి ఇది. ఇందులో 10 కథలున్నాయి. ‘‘దాలప్పతీర్థం’ కంటే ఈ కథలు ఒక పరిపక్వదశలో వచ్చినవి. తనెక్కడుండి, ఎవరిపక్షం వహించి మాట్లాడుతున్నాడో స్పష్టంగా చెబుతాయి’. ‘కళింగాంధ్ర స్థానీయ జీవితాల చుట్టూ తిరుగుతూనే ప్రపంచాన్ని చుట్టివస్తున్నాయీ కథలు. లోకంలోని చీకటి వెలుగులన్నింటినీ తడుముతున్నాయి’. ‘చింతకింది కథలో ఉత్తరాంధ్ర మాండలికం ఒక పాత్రగా కలగలసిపోయింది. పాత్రోచిత మాండలిక భాషా వైవిధ్యమంతా ఈ కథల్లో ప్రాణం పోసుకుంది’. శికారి కథకుడు: పర్కపెల్లి యాదగిరి; పేజీలు: 116; వెల: 120; ప్రతులకు: 1-1-94/4ఎ, నెహ్రూపార్క్ దగ్గర, 2వ అంతస్థు, సిద్దిపేట; ఫోన్: 9299909516 ‘తెలంగాణ అట్టడుగు జీవితాల గురించి రాసిన పది కథలు ఇవి’. ‘ఆర్థిక సంస్కరణల అమలు తొలి దశ దాటి, రెండో దశలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఉత్పాదక రంగానికి ప్రాధాన్యం తగ్గి, అనుత్పాదక రంగానికి ప్రాధాన్యం పెరగడమనే లక్షణం సమాజంలో ఏ విధమైన అసమానతలకు దారి తీస్తుందో, ప్రజలను ఏ విధంగా పరాయీకరణకు గురి చేస్తుందో ఆయన కథలన్నీ చెబుతాయి’. ‘తెలంగాణ భాషను ఎంత పఠనయోగ్యంగా, రుచీపచీ ఉండేట్లుగా వాడవచ్చునో ఆయన కథలను చదివితే అర్థమవుతుంది’. వైష్ణవ సాక్షి రచన: పానుగంటి లక్ష్మీనరసింహారావు; సంపాదకుడు: మోదుగుల రవికృష్ణ; ప్రచురణ: సంస్కృతి; పేజీలు: 104; వెల: 70; ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, ఫోన్: 040-24652387 ‘పంతులుగారు సాక్షి వ్యాసాల రచయితగా ఆధునిక తెలుగు సాహిత్యాకాశంలో ధగధగ మెరిసేతార. సాక్షి వ్యాసాలలో వైష్ణవ సంబంధ వ్యాసాల సంకలనమే ఈ గ్రంథం’. వ్యాసాలకు అవసరమైన చోటల్లా విలువైన పాదసూచికలు ఇచ్చారు. వైష్ణవం పేరుమీద వచ్చిన సామెతలు, జాతీయాలు అనుబంధంలో చేర్చారు. వాసు చిత్రాలు అదనపు ఆకర్షణ! వాళ్లు రచన: భువనచంద్ర; పేజీలు: 264; వెల: 125; ప్రతులకు: 29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-2; ఫోన్: 0866-2436642 ‘ఈ లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పొందడం ఎలా?’ అని తనను వేధించిన ప్రశ్నకు ఒక సంతృప్తికర సమాధానాన్ని వెతుక్కుంటూ రచయిత తన యౌవన కాలంలో సాగించిన ఆధ్యాత్మిక ప్రయాణమే ఈ పుస్తకం. పాదచారి అనే కలంపేరుతో స్వప్న మాసపత్రికలో భువనచంద్ర ధారావాహికగా రాసిన ఈ ‘అలౌకిక ప్రపంచ దర్శ’నాన్ని ‘సాహితి ప్రచురణలు’ పుస్తకంగా తెచ్చింది.