కూరగాయలు పండిస్తున్నబలరామ్, కూరగాయ మొక్కలతో సుబ్రహ్మణ్యం
సాక్షి, జూబ్లీహిల్స్ : వాహనాల రణగొణ ధ్వనులు, కాలుష్యం మధ్య జీవిస్తూ.. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు తమ నివాసాలను పచ్చటి ఆవాసాలుగా మార్చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కృష్ణా రామా అంటూ ఊరికే కూర్చోకుండా తమ ఇళ్లను పచ్చదనంతో, కూరగాయలు పండించే వ్యవసాయ క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. అటు కాలుష్యం నుంచి కాపాడుకుంటూ, ఇటు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణానగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగులు బలరామ్, సుబ్రహ్మణ్యం.
పక్షుల కిలకిలా రావాలు..
కృష్ణానగర్‌లోని ఎఫ్ బ్లాక్‌కు చెందిన బలరామ్ బీహెచ్‌ఈఎల్ ఉద్యోగి. నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. తనకున్న చిన్న ఇంటిని నందనవనంగా మార్చేశారు. మిద్దెపై కూరగాయలు, ఆయుర్వేద, ఔషధ గుణాలున్న మొక్కలు, పండ్ల మొక్కలు, పూలమొక్కలు పెంచుతున్నారు. దీంతోపాటు చిన్నపాటి గూళ్లను ఏర్పాటు చేసి పక్షులను పెంచుతున్నారు. ఉదయం పక్షులు కిలకిలారావాలతో ఆయన నిద్ర లేస్తారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే తనకు ఇష్టమని, అదే స్ఫూర్తితో తన ఇంటిని ఇలా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు బలరామ్
బలరామ్ ఇంటి మిద్దెపై పక్షులుమిద్దెపై పూలమొక్కలు,
ఆ అనుభూతే వేరు..
సుబ్రహ్మణ్యం ఏజీ కార్యాలయంలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. కృష్ణానగర్‌లో నివసిస్తున్నారు. చిన్నప్పడు పెరట్లో పండిన కూరగాయలతో వంట చేసుకోవడం ఆయన బాగా గుర్తు. ఉద్యోగ విరమణ పొందగానే మిద్దెపై కూరగాయలు సాగు ప్రారంభించారు. టమాటా, సొరకాయ, బీరకాయ, మిర్చీ సహా పలురకాల ఆకుకూరలు పండిస్తున్నారు. తమ కుటుంబం మొత్తం ఇక్కడ పండిన కూరగాయలనే వండుకుంటామని ఆయన సంతోషంగా చెబుతున్నారు. ప్రతిఒక్కరూ కొద్ది స్థలంలోనైనా పూలు, కూరగాయలు పండించాలంటున్నారు ఆయన.
Comments
Please login to add a commentAdd a comment