roof garden
-
వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే..
ఇంకా వేసవికాలం పూర్తిగా రానేలేదు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం దాదాపు 12 నుంచి సాయంత్రం 4 వరకు విపరీతమైన వేడి ఉంటుంది. దాంతో బయట పనులకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. అలా అని ఇంట్లో ఉందామంటే కూడా వేడి తాళలేకపోతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లినా ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి.. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి.. ఏసీ వేసుకుంటే సరిపోతుంది కదా అంటారా? నిజమే కానీ అందరి ఇళ్లలో ఆ సౌకర్యం ఉండదు కదా.. దాన్ని భరించే స్థోమత చాలామందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకు మార్కెట్లో రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. చల్లదనాన్ని ఇచ్చే పెయింట్లు.. దాదాపు అన్ని ఇళ్లు నిర్మాణానికి కాంక్రీటే వినియోగిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సిమెంట్, ఇతర రేకుల ఇళ్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దాంతో ఆ ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీనికి పరిష్కారంగా పైకప్పులపై తెల్లని పెయింట్‌ను వేసుకోవడం ద్వారా చాలావరకు ఉపశమనం కల్గుతుంది. ఇంటిపై పడిన కిరణాలు తెలుగు రంగు కారణంగా పరావర్తనం చెంది వాతావరణంలో కలిసిపోతాయి. ఇందుకోసం పైకప్పుపై సున్నం మొదలు మార్కెట్లో దొరికే కూల్ రూఫ్ పెయింట్స్ వరకు వినియోగించవచ్చు. దీనివల్ల భవనంపైన 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గుతుంది. ఇంటి లోపల 2.1 నుంచి 4.3 డిగ్రీల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ షీట్స్‌తో రక్షణ.. బస్తీల్లో బిల్డింగ్‌లతోపాటు చాలావరకు రేకుల ఇళ్లు ఉంటాయి. వాటిలోనే ఎక్కువ మంది జీవిస్తుంటారు. వీరు తక్కువ ఖర్చుతో పైకప్పుపై ప్లాస్టిక్ షీట్స్‌ను పరిస్తే చాలు. గాలులకు ఎగిరిపోకుండా చూసుకోవాలి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీలో కొన్ని ఇళ్లపై ప్లాస్టిక్ షీట్స్‌ను పరిచి వేడి తగ్గించడం ద్వారా బస్తీవాసుల్లో అవగాహన కల్పించారు. ఆరేడు డిగ్రీల వరకు లోపల వేడి తగ్గినట్లు గుర్తించారు. సోలార్ ప్లేట్లతో.. ఇంటిని చల్లగా ఉంచడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తిచేస్తూ అవసరాలకు వాడుకునేలా సోలార్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు కిలోవాట్లకు సబ్సిడీ పోను రూ.1.10 లక్షలు ఖర్చువుతుంది. నెలకు 360 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇంటికి అవసరమైన విద్యుత్తును వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. డిస్కం నుంచి యూనిట్‌కు రూ.5 లపైన తిరిగి పొందవచ్చు. ఇదీ చదవండి.. కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు! మొక్కలను పెంచడంతో.. ఇంటిపైన ఖాళీ స్థలంలో మొక్కలను పెంచవచ్చు. దాంతో వేసవిలో చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. రకరకాల పూలు, అలంకరణ మొక్కలు, కూరగాయలు పెంచుకోవచ్చు. అయితే అంతకంటే ముందు వాటర్ లీకేజీలు లేకుండా వాటర్‌ఫ్రూపింగ్ చేయించాలి. ఇంటి చుట్టూ మొక్కలు, నీడనిచ్చే చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది. -
దుబాయ్ సిగలో 'రూఫ్‌టాప్ సేద్యం'
ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని ఏడు నగరాల్లోకెల్లా అత్యధిక జనసాంద్రత గల నగరం దుబాయ్. అద్భుతమైన నిర్మాణ కౌశలానికి ఇది మారుపేరు. దుబాయ్ అంటే చప్పున గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా (భమ్మీద అత్యంత ఎత్తయిన 830 మీటర్ల భవనం) వంటి ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన జీవనశైలే తప్ప.. వ్యవసాయం అసలు కాదు. అయితే, అది పాత సంగతి. ఇప్పుడు దుబాయ్ సిగలో ‘రూఫ్‌టాప్ సేద్యం’ తళుక్కుమంటోంది. పచ్చదనం, పర్యావరణ హితమైన జీవనం వైపు ఈ ప్రత్యేక ఉద్యమం దుబాయ్ పట్టణ వాతావరణాన్ని క్రమంగా పునర్నిర్మిస్తోంది. కాంక్రీటు అరణ్యానికి ఆకుపచ్చని సొబగులు అద్దుతోంది. ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలను భవనాల పైకప్పులపైనే నగరవాసులు పండించుకుంటున్నారు. అర్బన్ అగ్రికల్చర్ భావన అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఆకుపచ్చని పంటలతో నిండిన సుస్థిరమైన జీవనాకాంక్షను నెరవేర్చటం, వీలైనంత వరకు ఆహార భద్రతకు తోడ్పడడంతో పాటు.. నగరపు రొద మధ్యలో మనోల్లాస వాతావరణాన్ని కల్పిస్తోంది. రఫ్‌టాప్ కిచెన్ గార్డెనింగ్ ఎంత పాపులర్ అయ్యిందంటే.. ఇంటిపైన ఆహారాన్ని పండించుకునే సదుపాయాన్ని కల్పించే భవన నిర్మాణ ప్రాజెక్టుల కోసమే వెతుకుతున్నారంటే ఆశ్చర్యం లేదు! తీవ్రమైన ఎడారి వాతావరణం కారణంగా యూఏఈ.. ఆహారం మొత్తాన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తామరతంపరగా విస్తరిస్తున్న మిద్దె తోటల వల్ల ఆహార దిగుమతి కొంతమేరకైనా తగ్గే అవకాశం కనపడుతోంది. ఈ ట్రెండ్ వెనుక.. పర్యావరణానికి మేలు చేసే పనులను ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సహిస్త విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. 2050 నాటికి సుస్థిర జీవనం విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా మారాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో యూఏఈ ముందడుగేస్తోంది. ఆహారాన్ని స్థానికంగా పండించుకోవటం, కాంక్రీటు భవనాల ద్వారా విడుదలయ్యే వేడిని తగ్గించుకోవడం వంటి పనులకు లభిస్తున్న ప్రభుత్వ తోడ్పాటుతో దుబాయ్ వాసుల్లో మిద్దె తోటలపై అవగాహన, ఆసక్తి నానాటికీ ఇనుమడిస్తోంది. రఫ్‌టాప్ సేద్యం అంటే కేవలం పరిసరాలను పచ్చగా వర్చడం లేదా పంటలు పండించడం మాత్రమే కాదు. నలుగురూ కలసికట్టుగా పనిచేసే సంస్కృతికి నారు పొయ్యటం కూడా. నగరవాసులు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రకృతితో మమేకం కావడానికి మిద్దె తోటలు నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తున్నాయని దుబాయ్ వాసులు సంతోషపడుతున్నారు. ఎడారిలో సాధ్యమేనా? ఎడారి పరిస్థితులు ఉన్నప్పటికీ మిద్దెపైన ప్రత్యేక నిర్మాణాల ద్వారా కూరగాయలు, ఔషధ మొక్కలు సాగు చేసుకునేందుకు హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ వంటి అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు దోహదం చేస్తున్నాయి. తులసి, కలబంద వంటి ఔషధ మొక్కలు.. పాలకూర, చార్డ్, లెట్యూస్ వంటి పంటలను సులభంగా పండిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే ఈ పద్ధతులతో పోల్చితే అతి తక్కువ నీరే ఖర్చవుతోంది. నీటి కొరత పెద్ద సమస్యగా ఉన్న దుబాయ్ వంటి ప్రాంతంలో ఈ సాగు పద్ధతులు ఉపయోగకరం. నివాస భవనాలపై ప్రత్యేక శ్రద్ధతో రఫ్గార్డెన్లు నిర్మిస్తున్నందు వల్ల ‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ను తగ్గించడంలో తోడ్పడుతోంది. శీతలీకరణ అవసరాలు తగ్గుతున్నాయని భవన నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. సొంత రఫ్‌టాప్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకునే ఆసక్తి ఉన్నవారికి వర్గనిర్దేశం చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘రియల్’ ఆకర్షణ... నూతన సాంకేతిక ఆవిష్కరణలు, భవన నిర్మాణంలో జరుగుతున్న మార్పులు, ప్రభుత్వ మద్దతు, వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర జీవనశైలిపై పెరుగుతున్న సామాజిక అవగాహన.. దుబాయ్‌లో రఫ్‌టాప్ ఫార్మింగ్ విస్తరణకు దోహదపడుతున్నాయి. దీని వల్ల పట్టణ జీవవైవిధ్యం మెరుగుపడుతుంది. కాలుష్య కారకాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో గాలి నాణ్యత మెరుగవుతోంది. రఫ్‌టాప్ ఫార్మింగ్ సదుపాయాన్ని జోడించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పర్యావరణ స్పృహతో ఉన్న కొనుగోలుదారులను, ఆరోగ్యకరమైన జీవనానికి విలువనిచ్చే అద్దెదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ కేవలం రెసిడెన్షియల్ భవనాలకే పరిమితం కాలేదు. వాణిజ్య భవనాలపై కప్పులపై కూడా పంటల సాగు ఏర్పాట్లు నిర్మించటం సామాజిక బాధ్యతగా బిల్డర్లు భావిస్తున్నారు. ఇది సానుకల ప్రభావాన్ని కలిగిస్తోంది. స్మార్ట్ ఇరిగేషన్, సెన్సర్లు, డేటా అనలిటిక్స్ ద్వారా రఫ్‌టాప్ ఫార్మింగ్ మెరుగైన ఫలితాలను ఇవ్వడమే కాక, నేర్చుకునే వారికి ఆకర్షణీయంగా వరింది. విలాసాలను త్యాగం చేయకుండా నగరాలు ఆహార స్వావలంబన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎలా స్వీకరించవచ్చో చెప్పడానికి దుబాయ్‌లో పెరుగుతున్న మిద్దె తోటల ధోరణి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పొచ్చు. (చదవండి: 14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం) -
అవును... మిద్దెలపై డబ్బులు కాస్తాయి!
ఆరోజు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొని ఇంటికి తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయంకు చెందిన రెమాదేవి. కూరగాయలను కడుగుతున్నప్పుడు ఒకరకమైన రసాయనాల వాసన వచ్చింది. ఆ సమయంలో పిల్లలు, వారి భవిష్యత్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో తాను ఒక నిర్ణయం తీసుకుంది... ‘ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంటిదగ్గరే పండించుకుంటాను’ అలా మిద్దెతోటకు శ్రీకారం చుట్టింది రెమాదేవి. అమ్మమ్మ రంగంలోకి దిగింది. సేంద్రియ వ్యవసాయంలో అమ్మమ్మది అందెవేసిన చేయి. ఆమె సలహాలు, సూచనలతో మిద్దెతోట పచ్చగా ఊపిరిపోసుకుంది. కొంత కాలానికి...ఇంటి అవసరాలకు పోగా మిగిలిన కూరగాయలను అమ్మడం మొదలుపెట్టారు. తమకు ఉన్న మరో రెండు ఇండ్లలోనూ మిద్దెతోట మొదలుపెట్టింది రెమాదేవి. అలా ఆదాయం పెరుగుతూ పోయింది. మిద్దెతోటపై ఆసక్తి ఉన్న వాళ్లు రెమాను రకరకాల సలహాలు అడిగేవారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ‘రెమాస్ టెర్రస్ గార్డెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ‘మిద్దెతోటకు పెద్దగా ఖర్చు అక్కర్లేదు’ అని చెబుతూ ఆ తోటపెంపకానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెబుతుంది. వంటగది వ్యర్థాలతో మనకు కావల్సిన ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోల ద్వారా చూపుతుంది. దీంతో పాటు సోషల్ మీడియా ఫార్మింగ్ గ్రూప్స్ ద్వారా విత్తనాలు అమ్ముతుంది రెమాదేవి. కేవలం విత్తనాల అమ్మకం ద్వారానే నెలకు 60,000 రూపాయల ఆదాయం ఆర్జిస్తుంది. రెమాదేవిని అనుసరించి ఎంతోమంది మిద్దెతోటలను మొదలుపెట్టి రసాయన–రహిత కూరగాయలను పండించడమే కాదు, తగిన ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. మంచి విషయమే కదా! -
గ్రీన్ రూఫ్‌టాప్‌లు.. నగరాలకు చలువ పందిళ్లు!
ప్రపంచవ్యాప్తంగా భవనాల పైకప్పులు ఆకుపచ్చగా మారుతున్నాయి. నగరాలను మరింత నివాసయోగ్యంగా మార్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇళ్లు, వాణిజ్య భవనాల పైకప్పులు ‘గ్రీన్ రూఫ్’లుగా మారుతున్నాయి. అవి పూల మొక్కలు కావచ్చు లేదా కూరగాయ మొక్కలు కావచ్చు.. గ్రీన్ రూఫ్ల వల్ల ఒకటికి పది ప్రయోజనాలున్నాయని ప్రపంచం కోడై కూస్తోంది. ‘ప్రపంచ నగరాల దినోత్సవం’ సందర్భంగా గ్రీన్ రూఫ్‌లు అందించే పర్యావరణ, ఆరోగ్య, ఆహార ప్రయోజనాలను గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు! సగం మంది ప్రజలు పట్టణాలు, నగరాల్లోనే నివాసం ఉంటున్నారు. 2030 నాటికి ఈ శాతం మరింత పెరుగుతుంది. భూతాపోన్నతి వల్ల వాతావరణంలో ప్రతికూల మార్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా హెచ్చు తగ్గుల పాలవుతూ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. అతి వేడి, అతి చలి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. వాయు కాలుష్యానికి నగరాలే కేంద్ర బిందువులుగా మారాయి. ఇటీవలికాలంలో నగరాలు ఎదుర్కొంటున్న మరో ఉపద్రవం ఆకస్మిక కుండపోత వర్షాలు–వరదలు. ఇవి ప్రజల జీవన నాణ్యతను దెబ్బతీయటమే కాకుండా వారి శారీరక, మానసిక ఆరోగ్యాలనూ ప్రభావితం చేస్తున్నాయి. నగరాలు ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ, సామాజిక, ఆరోగ్య సమస్యలకు గ్రీన్ రూఫ్‌లు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్లు పచ్చదనాన్ని నగరాల్లోకి తిరిగి తీసుకొస్తున్నాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్ అంటే? గ్రీన్ రూఫ్‌టాప్ గార్డెన్ (మిద్దె తోట) అంటే.. ఇంటి పైకప్పు మీద ఉండే ఆకుపచ్చని తోట. మెసొపొటేమియా జిగ్గురాట్ల కాలం నుంచే భవనాల పైకప్పులపై తోటలు పెంచుతున్నారు. గ్రీన్ రూఫ్‌లు ఆధునిక రూపాన్ని సంతరించుకోవటం జర్మనీలో 50 ఏళ్ళ క్రితమే ప్రారంభమైంది. అప్పట్లో ఇది విడ్డూరంగా చెప్పుకునేవారు. అదే జర్మనీ ఇప్పుడు ‘ఐరోపా గ్రీన్ రూఫ్ క్యాపిటల్’గా పేరుగాంచింది. గ్రీన్ గార్డెన్... కంటికి ఆహ్లాదాన్నిస్తూనే, వేసవిలో చల్లదనాన్నీ/శీతాకాలంలో వెచ్చదనాన్నీ పంచుతూ విద్యుత్తును ఆదా చేస్తోంది. మిద్దెతోట... పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారాన్ని, మూలికలను అందిస్తున్నాయి. ఇక విద్యుత్తును అందించే సౌర ఫలకాలూ గ్రీన్ రూఫ్ గార్డెన్‌కు కొత్త సొబగులను అద్దుతున్నాయి. రూఫ్ గార్డెన్ ఖర్చెంత? గ్రీన్ రూఫ్ గార్డెన్లను ఏర్పాటు చేయటం కొంచెం ఖర్చుతో కూడిన పనే. భవనం స్లాబ్ దెబ్బ తినకుండా ఉండేందుకు, నీటిని ఒడిసి పట్టేందుకు, మొక్కలు/చెట్ల వేర్లు స్లాబ్‌లోకి చొరబడకుండా నివారించడానికి, ఇన్సులేషన్ కోసం అనేక దొంతర్లు వేసిన తర్వాత.. ఆపైన మొక్కలు/చెట్లు పెంచేందుకు రూఫ్ పైభాగంలో మట్టి మిశ్రమాన్ని 6 నుంచి 12 అంగుళాల మందంతో వేస్తారు. ఆ తర్వాత పచ్చని మొక్కలు లేదా పంటలు వేస్తారు. ఇదంతా చెయ్యటానికి చదరపు అడుగుకు 15 నుంచి 20 డాలర్లు ఖర్చు అవుతుందని ఒక అమెరికా సంస్థ అంచనా. గ్రీన్ రూఫ్‌టాప్ గార్డెన్లకు జర్మనీ, అమెరికా, జపాన్, కెనడా, సింగపూర్ అతిపెద్ద మార్కెట్లుగా మారాయి. ఈ మార్కెట్ 2025 నాటికి 880 కోట్ల డాలర్లకు పెరగనుందని పరిశోధనా సంస్థ టెక్నావియో అంచనా. అయితే.. సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకోవటం వరకే అయితే పెద్దగా ఖర్చు అవసరం లేదు. కంటైనర్లు, కుండీలు, ఎత్తు మడుల్లో వేసుకోవచ్చు. రూఫ్ మొత్తాన్నీ కప్పి ఉంచేలా అనేక దొంతర్లుగా గార్డెన్‌ను నిర్మించాలనుకుంటేనే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంటిపంటలతో ప్రాణవాయువు 10 అడుగుల వెడల్పు, 10 అడుగులు పొడవు వుండే స్థలంలో పెరిగే మొక్కలు 13 అడుగులఎత్తయిన చెట్టుతో సమానంగా బొగ్గుపులుసు వాయువును పీల్చుకొని ప్రాణవాయువును విడుదల చేస్తాయని అంచనా. గ్రీన్ రూఫ్ మన దేశానికీ కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ, దేశవ్యాప్తంగా సానుకూల స్పందన కనిపిస్తోంది. పెద్ద నగరాల్లో గ్రీన్ రూఫ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సుస్థిర జీవనం, పర్యావరణ స్పృహ కలిగిన నగరవాసులు సేంద్రియ ఆహారం ప్రాముఖ్యతను, సేంద్రియ ఇంటిపంటల సాగు ఆవశ్యకతను గ్రహిస్తున్నారు. కొసమెరుపు హైదరాబాద్ నగరంలో భవనాల పైకప్పుల విస్తీర్ణం కనీసం 50 వేల ఎకరాలకు పైగా ఉండొచ్చని ఒక అంచనా. దాదాపుగా ఈ రూఫ్లన్నీ ఖాళీగానే వున్నాయి. వీటిని గ్రీన్ రూఫ్ గార్డెన్లు గానో లేదా సేంద్రియ ఇంటిపంటల తోటలుగానో (సౌర ఫలకాలను కూడా వీటిలోనే పెట్టుకోవచ్చు) మార్చితే..? ఇదే మాదిరిగా ఇతర నగరాలూ, పట్టణాలను మార్చితే? పర్యావరణ పరంగా, ఆహార భద్రతా పరంగా, ప్రజారోగ్యపరంగా మహా అద్భుతమే ఆవిష్కృతమవుతుంది! – సాక్షి, సాగుబడి డెస్క్ నగరాలను చల్లబరిచే మార్గం పట్టణ ప్రాంతాల్లో భవనాల పైకప్పుల విస్తీర్ణం సాధారణంగా పట్టణ భూభాగంలో 5–35 శాతం వరకు ఉంటుంది. అమెరికాలో 90 శాతానికి పైగా భవనాల పైకప్పులు ఖాళీగా ఉన్నాయని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంచనా. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల కంటే నగర వాతావరణంలో 5.6 డిగ్రీల సెంటీగ్రేడ్ అధిక వేడి ఉంటుంది. దీన్నే ‘అర్బన్ హీట్ ఐలాండ్‘ అని పిలుస్తారు. గాలి కూడా సాధారణం కంటే వేడిగా ఉంటుంది. పైకప్పులు వేడిగా ఉన్నప్పుడు, భవనాల లోపలి గదులను చల్లబరచడం కష్టం. ఇది నగర విద్యుత్ గ్రిడ్‌పై అధిక భారాన్ని మోపుతుంది. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల నగరంలో వాయు కాలుష్యం కూడా తీవ్రమవుతుంది. ఉదాహరణకు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల గాలిలో ఓజోన్ వాయువు సాంద్రత పెరుగుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. అయితే.. భవనాల పైకప్పులపై కనీసం 30% విస్తీర్ణంలో మొక్కలు, చెట్లు పెంచినప్పుడు దాదాపు 1 డిగ్రీ సెల్సియస్ వరకు వాతావరణం చల్లబడిందని బాల్టిమోర్–వాషింగ్టన్ మెట్రోపాలిటన్‌లో జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. -
ఆ.. ఇల్లే ఒక ‘బృందా’వనం
మిర్యాలగూడ టౌన్: ఇంట్లో కొద్దిపాటి స్థలం ఉంటే చాలు..ఓ గది కట్టేద్దాం అనుకుంటాం. కానీ ఆ మహిళ తన ఇంటినే ఓ ఉద్యానవనంగా మార్చేసింది. తన ఇంటిపై ఉన్న కొద్దిపాటి స్థలంలో పలు ఉద్యాన పంటలు వేశారు. పూల కుండీల్లో వివిధ రకాల మొక్కలు, కూరగాయాల మొక్కలను సాగు చేస్తూ అందరికి ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. తన ఇంటిపైన వివిధ రకాల పూలు, కురగాయాలు, ఆకు కూరలు, పండ్లు పండిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాది ఓ మహిళ. ఎప్పుడు వంటింటిలో బీజీబీజీగా ఉండే ఈ మహిళకు మొక్కలు అంటే ఎంతో ప్రాణం. ఒక వైపు కుటుంబం కోసం మరో రెండు గంటల పాటు తన ఇంటిపై ఏర్పాటు చేపిన వనంపై సమయం కేటాయిస్తుంది పగిడిమర్రి పద్మాగోవర్ధనాచారి. మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటలో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ గోవర్ధనాచారి సతీమణి పద్మాగోవర్ధనాచారి గత కొంత కాలంగా సాంప్రదాయ ఎరువులను ఉపయోగించి మంచిదిగు సాగును చేస్తుంది. బృందావనంలా మారిన ఇల్లు: హనుమాన్‌పేటలో నివాసం ఉండే పయిడిమర్రి పద్మాగోవర్ధనాచారి ఇంటిపై అడుగుపెడితే చాలు అది ఒక బృందావనవనంగా ఉంటుంది. పచ్చదనం అంటే ఆమెకు ఎనలేని ప్రేమ. తన ఇంటి స్లాబ్‌పై వివిధ రకాల మొక్కలు, ఆకు కూరలు, కూరగాయాలు, పండ్ల మొక్కలు, రసాయన రహితంగా సహాసిద్దమైన పద్దతిలో పెంచుతుంది. అయితే ఏ జాతి మొక్కలకు ఎంత నీరు అవసరం, ఎంత వరకు సూర్యరష్మిపెరుగుతుంది. ఏ మొక్కకు ఎంత ఉష్ణోగ్రత ఉంటే తట్టుకుంది. ఎలా పండిస్తే భూసారం పెరుగుతుందనే విషయంపై తన భర్త సలహాలు, సూచనలు తీసుకుంటుంది. తన ఇంటి మూడవ ఆంతస్తుపై పర్మినెంట్‌గా గ్రీన్ సేట్‌ను ఇనుప సువ్వలతో తయారు చేసి పర్మినెంట్‌గా ఏర్పాటు చేసింది. కాగా ఐదారు డ్రమ్‌లు, 15 వరకు కుండీలు, బకెట్లలో రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టితో స్లాబ్ మీమ్‌లపై డ్రమ్ములు పెట్టి వివిధ రకాల మొక్కలతో పాటు ఆకుకూరలను వేసింది. వివిధ రకాల పంటలు: పగిడిమర్రి పద్మాగోవర్ధనాచారి తన ఇంటిపైన పందిరి వేయడంతో పాటు వివిధ కుండీలలో పూల మొక్కలు గులాబి, మల్లే, చామంతి, మందారం, లిల్లి, పారిజాతం, నూరు వరాల చెట్టులతో పాటు పలు రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. అదే విధంగా ఆకు కూరలు అయిన పాలకూర, బచ్చలకూర, మోంతుకూరలను పెంచుతున్నారు. తీగ పాదులకు పందిరి వేసి బీర, సోర, కాకర, దొండ, చిక్కుడు, దోసకాయలను పందిరిపైకి ఎక్కించాడు. అదే విధంగా కూండీలలో వంగ, టమాట, మిర్చి, బెండ, కోతిమీర, పూదీనా, కరివేపాక, మిర్చి వంటివి పండిస్తున్నాడు. అదే విధంగా జామ, ద్రాక్షతో పాటు మరిన్ని పంటలను ఇంటిపై పెంచుతూ పలువురిని ఆకట్టుకుంటున్నారు. వీటికి డ్రిఫ్తో ఖాళీ బాటిళ్లు, క్యాన్ల ద్వారా నీటి పోస్తున్నారు. మొక్కలతో ఎంతో ఆరోగ్యం తన ఇంటిపై ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో గ్రీన్ సెట్‌ను ఏర్పాటు చేసి ఈ మొక్కలకు ఎంత సూర్యరశ్మి అవసరం ఉంటుంది అనే దానిపై ఏర్పాటు చేశాం. ఇంటి మేడపై పూల మొక్కలు, కూరగాయాలతో పాటు వివిధ రకాల పండ్లను పెంచుతున్నాం. గత రెండేళ్లుగా తన ఇంటిపై పండిన కూరగాయాలు, పువ్వులను కూడా వాడుతున్నాం. అదే విధంగా పండ్లు కూడా మేము వేసిన చెట్టు ద్వారా వచ్చే పండ్లు, కూరగాయాలు తీనడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఆరోగ్యకరమైన కూరగాయాలను తీçనవచ్చు. దీని వలన ఒక వైపు పచ్చదనం, మరో వైపు మన ఇంటి అవసరాలు కూడా వెళ్లుతున్నాయి. – పగిడిమర్రి పద్మగోవర్ధనాచారి, మిర్యాలగూడ -
పచ్చని ఆవాసం.. ప్రకృతితో సావాసం
సాక్షి, జూబ్లీహిల్స్ : వాహనాల రణగొణ ధ్వనులు, కాలుష్యం మధ్య జీవిస్తూ.. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు తమ నివాసాలను పచ్చటి ఆవాసాలుగా మార్చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కృష్ణా రామా అంటూ ఊరికే కూర్చోకుండా తమ ఇళ్లను పచ్చదనంతో, కూరగాయలు పండించే వ్యవసాయ క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. అటు కాలుష్యం నుంచి కాపాడుకుంటూ, ఇటు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణానగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగులు బలరామ్, సుబ్రహ్మణ్యం. పక్షుల కిలకిలా రావాలు.. కృష్ణానగర్‌లోని ఎఫ్ బ్లాక్‌కు చెందిన బలరామ్ బీహెచ్ఈఎల్ ఉద్యోగి. నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. తనకున్న చిన్న ఇంటిని నందనవనంగా మార్చేశారు. మిద్దెపై కూరగాయలు, ఆయుర్వేద, ఔషధ గుణాలున్న మొక్కలు, పండ్ల మొక్కలు, పూలమొక్కలు పెంచుతున్నారు. దీంతోపాటు చిన్నపాటి గూళ్లను ఏర్పాటు చేసి పక్షులను పెంచుతున్నారు. ఉదయం పక్షులు కిలకిలారావాలతో ఆయన నిద్ర లేస్తారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే తనకు ఇష్టమని, అదే స్ఫూర్తితో తన ఇంటిని ఇలా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు బలరామ్ బలరామ్ ఇంటి మిద్దెపై పక్షులుమిద్దెపై పూలమొక్కలు, ఆ అనుభూతే వేరు.. సుబ్రహ్మణ్యం ఏజీ కార్యాలయంలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. కృష్ణానగర్‌లో నివసిస్తున్నారు. చిన్నప్పడు పెరట్లో పండిన కూరగాయలతో వంట చేసుకోవడం ఆయన బాగా గుర్తు. ఉద్యోగ విరమణ పొందగానే మిద్దెపై కూరగాయలు సాగు ప్రారంభించారు. టమాటా, సొరకాయ, బీరకాయ, మిర్చీ సహా పలురకాల ఆకుకూరలు పండిస్తున్నారు. తమ కుటుంబం మొత్తం ఇక్కడ పండిన కూరగాయలనే వండుకుంటామని ఆయన సంతోషంగా చెబుతున్నారు. ప్రతిఒక్కరూ కొద్ది స్థలంలోనైనా పూలు, కూరగాయలు పండించాలంటున్నారు ఆయన. -
తీగజాతి కూరగాయల విత్తనాలు నాటుకునే సమయమిదే!
వేసవి ‘ఇంటిపంట’లపై తుమ్మేటి రఘోత్తమరెడ్డి సూచనలు జనవరి నెల చివరికొచ్చింది. చలి వెనకపట్టు పట్టింది. వేసవికాలంలో కూరగాయల కొరత లేకుండా ఉండాలంటే ఇప్పుడు తిరిగి విత్తనాలను నాటుకోవాలి. కొన్ని రకాలను మినహాయిస్తే, దాదాపు అన్ని రకాలను నాటుకోవచ్చు. మిర్చి, క్యాబేజి, క్యాలీఫ్లవర్, క్యారెట్, చిక్కుడు, టమాటా వంటివి ప్రధానంగా శీతాకాలపు పంటలు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని వర్షాకాలంలో కూడా పండించొచ్చు. కానీ, వేసవి కాలంలో పండించటం కష్టం. తగిన నీడ ఏర్పాటు చేసినా, మిర్చి, టమాటాలలో పూత నిలవదు, కాపు రాదు! ఇప్పుడు వీటి జోలికి పోకపోవడమే మంచిది! చిక్కుడు మినహా అన్ని రకాల తీగజాతి కూరగాయల విత్తనాలను నాటుకోవచ్చు. బీర, సొర, కాకర, దోస, పొట్ల వంటివి నాటుకోవచ్చు. గుమ్మడి నాటకూడదు. బెండ, గోరుచిక్కుడు, వంగ, అలసంద వంటివి నాటుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజి, క్యాలీఫ్లవర్ నారు దొరికితే నాటుకోవచ్చు. ఇప్పుడు నారు పోసి నాటుకోవాలంటే ఆలస్యం అవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా అన్ని రకాల విత్తనాలను, నార్లను నాటుకోవాలి. యథావిధిగా మట్టిలో తగినంత ఎరువు ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. నాలుగైదు రకాలను నాటి ఊరుకోకండి. వీలైనన్ని ఎక్కువ రకాలను నాటుకోవాలి. ఇరవై రకాలను నాటుకుంటే, అందులో కొన్ని పోయినా, మరికొన్ని కాస్తాయి! వాతావరణం మన చేతిలో ఉండదు. కొన్ని విషయాలలో మనం ఏమీ చెయ్యలేం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం మినహా! అందుకని ఎక్కువ రకాలను నాటుకోవాలి (‘మిద్దె తోట – చీడ పీడలు’ వాట్సప్ గ్రూప్‌లో సభ్యులు కాదలచినవారు పేరు, వాట్సప్ నంబర్‌ను ఈ కింది నెంబర్‌కు మెసేజ్ చేయవచ్చు). – తుమ్మేటి రఘోత్తమరెడ్డి (90001 84107), సేంద్రియ ‘మిద్దె తోట’ల నిపుణుడు -
రూఫ్ గార్డెన్తో లుక్కే వేరు!
సాక్షి, హైదరాబాద్: రూఫ్ గార్డెన్ ఇంటికి అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అయితే ఈ రూఫ్ గార్డెన్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది నిపుణుల మాట. ఇంటి పైకప్పు మీద తోట వేసి... ఓ అందమైన బృందావనాన్ని నిర్మించవచ్చు. ఆ బృందావనంలో కాస్త శ్రమిస్తే పూలు పూయించవచ్చు, పండ్లు కాయించవచ్చు. రూఫ్ గార్డెన్ నిర్మించాలనుకునే వారు అందుకు అవసరమైన ప్రణాళికను భవన నిర్మాణం చేపట్టిన నాటి నుంచే అమలు చేయాలి. రూఫ్ గార్డెన్తో భవనంపై బరువు పెరుగుతుంది. అందువల్ల పిల్లర్స్‌ను రూఫ్ గార్డెన్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మించాలి. పిల్లర్లు మోయగలిగిన బరువు కంటే ఎక్కువ బరువైతే భవనానికి ముప్పే. పైకప్పుని చాలా పటిష్టంగా నిర్మించాలి. ఇది పటిష్టంగా లేకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మొక్కల పెంపకానికి అవసరమైన మీడియం(మృత్తిక)ను రాళ్లులేని మట్టితో ఏర్పాటు చేస్తే మంచిది. కొంత ఒండ్రు మన్ను కలిపితే ఇంకా బాగుంటుంది. భవనం పైభాగాన్ని (రూఫ్ డెక్) చాలా పటిష్టంగా నిర్మించాలి. మొక్కల వేళ్లు, నీళ్లు ఇందులోకి ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలి. మొక్కలకు పోసే నీరు రూఫ్ డెక్ సమీపంలోకి రాకుండా నిర్మించే డ్రైనేజీని వాస్తుకు అనుగుణంగా నిర్మించుకోవాలి. ఈ డ్రైనేజీలో నీరు నిలిచినా, అది కిందికి ఇంకకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ కాంక్రీట్ లేయర్‌ను వేయాలి.