వేసవి ‘ఇంటిపంట’లపై తుమ్మేటి రఘోత్తమరెడ్డి సూచనలు
జనవరి నెల చివరికొచ్చింది. చలి వెనకపట్టు పట్టింది. వేసవికాలంలో కూరగాయల కొరత లేకుండా ఉండాలంటే ఇప్పుడు తిరిగి విత్తనాలను నాటుకోవాలి. కొన్ని రకాలను మినహాయిస్తే, దాదాపు అన్ని రకాలను నాటుకోవచ్చు. మిర్చి, క్యాబేజి, క్యాలీఫ్లవర్, క్యారెట్, చిక్కుడు, టమాటా వంటివి ప్రధానంగా శీతాకాలపు పంటలు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని వర్షాకాలంలో కూడా పండించొచ్చు. కానీ, వేసవి కాలంలో పండించటం కష్టం.
తగిన నీడ ఏర్పాటు చేసినా, మిర్చి, టమాటాలలో పూత నిలవదు, కాపు రాదు! ఇప్పుడు వీటి జోలికి పోకపోవడమే మంచిది! చిక్కుడు మినహా అన్ని రకాల తీగజాతి కూరగాయల విత్తనాలను నాటుకోవచ్చు. బీర, సొర, కాకర, దోస, పొట్ల వంటివి నాటుకోవచ్చు. గుమ్మడి నాటకూడదు. బెండ, గోరుచిక్కుడు, వంగ, అలసంద వంటివి నాటుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజి, క్యాలీఫ్లవర్ నారు దొరికితే నాటుకోవచ్చు. ఇప్పుడు నారు పోసి నాటుకోవాలంటే ఆలస్యం అవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా అన్ని రకాల విత్తనాలను, నార్లను నాటుకోవాలి.
యథావిధిగా మట్టిలో తగినంత ఎరువు ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. నాలుగైదు రకాలను నాటి ఊరుకోకండి. వీలైనన్ని ఎక్కువ రకాలను నాటుకోవాలి. ఇరవై రకాలను నాటుకుంటే, అందులో కొన్ని పోయినా, మరికొన్ని కాస్తాయి! వాతావరణం మన చేతిలో ఉండదు. కొన్ని విషయాలలో మనం ఏమీ చెయ్యలేం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం మినహా! అందుకని ఎక్కువ రకాలను నాటుకోవాలి (‘మిద్దె తోట – చీడ పీడలు’ వాట్సప్ గ్రూప్‌లో సభ్యులు కాదలచినవారు పేరు, వాట్సప్ నంబర్‌ను ఈ కింది నెంబర్‌కు మెసేజ్ చేయవచ్చు).
– తుమ్మేటి రఘోత్తమరెడ్డి (90001 84107), సేంద్రియ ‘మిద్దె తోట’ల నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment