Vegitables crops
-
మండే ఎండలతో ముప్పు తోటల సంరక్షణ ఎలా?
ఏటేటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటలకు ప్రతి వేసవీ పెను సవాలుగా మారుతోంది. 2024వ సంవత్సరంలో ప్రతి నెలా గత 190 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2025లో గడచిన మూడు నెలల తీరూ అంతే. సాధారణం కన్నా 4–5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకావటం మార్చిలోనే అనుభవంలోకి తెచ్చింది ఈ సంవత్సరం. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ అధిక ఉష్ణోగ్రతల నుంచి వివిధ ఉద్యాన తోటల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సవివరంగా తెలియజేస్తున్నారు.మామిడి→ ప్రస్తుతం కాయలు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల వేసవిలో స్థిరమైన, తగినంత నీటి సరఫరా ఇవ్వాలి. → 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మామిడి చెట్లకు బిందుసేద్యం ద్వారా రోజుకు 4 నుంచి 5 గంటలు నీరు అందించాలి. → సాధారణ పద్ధతిలో నేల లక్షణాల ఆధారంగా 7 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటిని అందించాలి. → పండ్లకు కాగితపు సంచులు కడితే వేడి నుంచి రక్షించుకోవటానికి సహాయపడుతుంది. → నీటి యాజమాన్యం సరిగ్గా అమలు చేయకపోతే పండ్ల తొడిమె భాగంలో అబ్షిషన్ పొరలు ఏర్పడి పండ్లు రాలిపోవడానికి కారణమవుతాయి. → చెట్ల పాదులకు పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన (సేంద్రియ మల్చ్) ఏర్పాటు చేయాలి. → పొడి వాతావరణంలో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫి్రపోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. → పండు ఈగ నివారణకు లింగ ఆకర్షక బుట్టల ఉచ్చులను ఉపయోగించాలి. → గోలికాయ దశలో మామిడి కాయలు ఉన్నప్పుడు జిఎ3 (50 పిపిఎం) ఒక లీటరు నీటికి 50 మిల్లీ గ్రాములు కలిపి పిచియారీ చేయటం ద్వారా రాలే కాయలను 15% తగ్గించుకోవచ్చు.ద్రాక్ష→ ప్రతి రోజూ కనీసం చెట్టుకు 6–8 లీటర్ల నీటిని అందించాలి. ∙పందిళ్లపై షేడ్‌నెట్స్ వేస్తే, ద్రాక్ష గుత్తులపై సూర్యరశ్మి పడకుండా చేయవచ్చు.ఆయిల్ పామ్→ ముదురు ఆయిల్ పామ్ చెట్లకు సుమారుగా ఒక రోజుకు గాను ఏప్రిల్ నెలలో 250–300 లీటర్లు, అదేవిధంగా మే నెలలో 300–350 లీటర్ల నీరు అందించాలి. → సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. ‘ఇసారియా ఫ్యూమాజోరోజియా’ జీవ శిలీంధ్ర నాశనిని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు.→ కత్తిరించిన ఆకులను, మగ గెలలను, ఖాళీ గెలలను మొక్క మొదళ్లలో మల్చింగ్ వలె పరచాలి. తద్వారా నేలలోని నీటి తేమను కాపాడుకోవచ్చు.అరటి→ ఎండిన అరటి ఆకులు, వరి గడ్డి, మొక్కజొన్న గడ్డిని మల్చింగ్గా వేసి మొక్క మొదళ్లలో నీటి తేమను కాపాడాలి. → వేసవిలో నేరుగా సూర్యరశ్మి గెలలపై పడటం వలన గెలలు మాడిపోతాయి. తద్వారా వివిధ తెగుళ్లు ఆశించి కాయ / గెల కుళ్లిపోతుంది. కావున, నేరుగా సూర్యరశ్మి గెలలపై పడకుండా పక్కనే ఉన్న ఆకులను గెలలపై కప్పి గెల నాణ్యతను కాపాడాలి. → వెదురు / సర్వి /సుబాబుల్ వంటి కర్రలను వాడి అరటి చెట్టు కాండానికి ఊతం అందించాలి. లేదా టేపులను నాలుగు వైపులా కట్టాలి. తద్వారా వేసవి వడ గాలులకు అరటి చెట్లు పడిపోకుండా చూసుకోవచ్చు.కొబ్బరి→ పూత, కాత వస్తున్న చెట్లకు సుమారుగా 50–60 లీటర్ల నీటిని అందించాలి.→ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. దీని నివారణకు వేప నూనె (10,000 పిపిఎం) 2 మిల్లీ లీటర్లు / లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. 10–15 రోజుల అనంతరం ఇసారియా ఫ్యూమారోజియా అనే జీవ శిలీంధ్ర నాశినిని ఆకుల కింద భాగం తడిచేలా పిచికారీ చేస్తే పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించవచ్చు. → పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడి నేలలోని నీటి తేమను కాపాడాలి.కూరగాయ తోటల రక్షణ ఎలా?టమాట→ అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా కాయలు/ పండ్లలో పగుళ్లు వస్తాయి. ఎండ దెబ్బ తగలటం వల్ల నాణ్యతలేని పండ్ల దిగుబడికి దారితీస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టమాటలో ఆకుముడత తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. → నీడనిచ్చే వస్త్రాలతో షేడ్‌నెట్ ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు సూర్యకాంతి పడటం తగ్గుతుంది. నేల ఉష్ణోగ్రత, గాలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. → నేల తేమను నిలుపుకోవడానికి, నేల ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను తగ్గించడానికి మొక్క చుట్టూ వెండి రంగు ప్లాస్టిక్ మల్చింగ్ లేదా గడ్డిని వేయాలి. → అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల సమయంలో నేల తేమను త్వరగా కోల్పోతుంది. మొక్కలు ఆకుల ద్వారా తేమను బయటకు వదిలే ప్రక్రియ (బాష్పీభవనం) ద్వారా కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి తగినంత, తరచుగా నీటిని అందించాలి. → వేడిగాలుల సమయంలో తగినంత పోషకాలను అందించాలి. సంక్లిష్ట ఎరువుల (19–19–19 లేదా 13–0–45)తో పాటు సూక్ష్మపోషక మిశ్రమాలను 3–5 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరుకు 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే కూరగాయ పంటలు వేడి ఒత్తిడిని తట్టుకుంటాయి.→ బాష్పీభవనం తగ్గించడానికి కయోలిన్ 3–5% (30–50 గ్రా./లీ.) పిచికారీ చేయాలి. → వడలు తెగులు నియంత్రణ కోసం లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్‌తో నేలను తడపాలి. → వైరస్ తెగుళ్ల నివారణకు వ్యాధిసోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చ అట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించిన ప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనెతో పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి లీటరు నీటికి ఫి్రపోనిల్ను 0.2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలివంగ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వంగ పంటను మొవ్వు, కాయతొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంది. → వీటి నియంత్రణకు ఎకరానికి 08–10 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసి, నివారణ చర్యగా లీటరు నీటికి 3 మి.లీ. చొప్పున వేప నూనె (10,000 పిపిఎం)ను కలిపి పిచికారీ చేయాలి. → పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఫ్లూబెండియామైడ్ మందును 0.25 మి.లీ. లేదా ఇమామెక్టిన్బెంజోయేట్ మందును 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.బెండ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బెండకాయలో పల్లాకు తెగులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి. → వ్యాధి సోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చఅట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించినప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. లేదా డయాఫెంథియురాన్ను 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కలు:కృష్ణవేణి – 9110726430పసుపు : మహేందర్ : 94415 32072మిర్చి : నాగరాజు : 8861188885 -
చలికాలపు ఇంటిపంటలు
చలికాలంలో ఇంటిపెరట్లో, మేడపైన సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకోదగిన ప్రత్యేక కూరగాయ రకాలు కొన్ని ఉన్నాయి. ఆకుకూరలను ఏడాదిలో ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు. వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలూ/బీన్స్, క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, కాప్సికం, ఉల్లి, ముల్లంగి, వంగ, క్యారట్, టమాట, గోరుచిక్కుడు, పాలకూర, మెంతికూర వంటి రకాలను ఈ సీజన్లో నిక్షేపంగా సాగు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం సుదీర్ఘంగా కొనసాగడం వల్ల శీతాకాలపు పంటలకు సంబంధించి ఇప్పుడు నారు పోసుకోవడం కన్నా.. దగ్గరల్లోని నర్సరీల నుంచో, సీనియర్ ఇంటిపంటల సాగుదారుల నుంచో మొక్కల నారును తెచ్చుకొని నాటుకోవడం మేలు. ఈ సీజన్లో కుండీలు, మడుల్లో మొక్కలకు నీరు అంత ఎక్కువగా అసవరం ఉండదు. తేమను బట్టి తగుమాత్రంగా నీటిని అందించుకోవడం అవసరమని ఇంటిపంటల సాగుదారులు గుర్తించాలి. -
తీగజాతి కూరగాయల విత్తనాలు నాటుకునే సమయమిదే!
వేసవి ‘ఇంటిపంట’లపై తుమ్మేటి రఘోత్తమరెడ్డి సూచనలు జనవరి నెల చివరికొచ్చింది. చలి వెనకపట్టు పట్టింది. వేసవికాలంలో కూరగాయల కొరత లేకుండా ఉండాలంటే ఇప్పుడు తిరిగి విత్తనాలను నాటుకోవాలి. కొన్ని రకాలను మినహాయిస్తే, దాదాపు అన్ని రకాలను నాటుకోవచ్చు. మిర్చి, క్యాబేజి, క్యాలీఫ్లవర్, క్యారెట్, చిక్కుడు, టమాటా వంటివి ప్రధానంగా శీతాకాలపు పంటలు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని వర్షాకాలంలో కూడా పండించొచ్చు. కానీ, వేసవి కాలంలో పండించటం కష్టం. తగిన నీడ ఏర్పాటు చేసినా, మిర్చి, టమాటాలలో పూత నిలవదు, కాపు రాదు! ఇప్పుడు వీటి జోలికి పోకపోవడమే మంచిది! చిక్కుడు మినహా అన్ని రకాల తీగజాతి కూరగాయల విత్తనాలను నాటుకోవచ్చు. బీర, సొర, కాకర, దోస, పొట్ల వంటివి నాటుకోవచ్చు. గుమ్మడి నాటకూడదు. బెండ, గోరుచిక్కుడు, వంగ, అలసంద వంటివి నాటుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజి, క్యాలీఫ్లవర్ నారు దొరికితే నాటుకోవచ్చు. ఇప్పుడు నారు పోసి నాటుకోవాలంటే ఆలస్యం అవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా అన్ని రకాల విత్తనాలను, నార్లను నాటుకోవాలి. యథావిధిగా మట్టిలో తగినంత ఎరువు ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. నాలుగైదు రకాలను నాటి ఊరుకోకండి. వీలైనన్ని ఎక్కువ రకాలను నాటుకోవాలి. ఇరవై రకాలను నాటుకుంటే, అందులో కొన్ని పోయినా, మరికొన్ని కాస్తాయి! వాతావరణం మన చేతిలో ఉండదు. కొన్ని విషయాలలో మనం ఏమీ చెయ్యలేం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం మినహా! అందుకని ఎక్కువ రకాలను నాటుకోవాలి (‘మిద్దె తోట – చీడ పీడలు’ వాట్సప్ గ్రూప్‌లో సభ్యులు కాదలచినవారు పేరు, వాట్సప్ నంబర్‌ను ఈ కింది నెంబర్‌కు మెసేజ్ చేయవచ్చు). – తుమ్మేటి రఘోత్తమరెడ్డి (90001 84107), సేంద్రియ ‘మిద్దె తోట’ల నిపుణుడు -
ఈ వారం వ్యవసాయ సూచనలు
పుబ్బ కార్తె (సెప్టెంబర్ 13 వరకు): జీవన ఎరువుల వాడకం మేలు! ప్రస్తుత పరిస్థితుల్లో అధిక మోతాదులో రసాయనాలు వాడడం వల్ల సాగు ఖర్చు పెరగడమేకాకుండా వివిధ పర్యావరణ దుష్ఫలితాలు కూడా ఏర్పడుతున్నాయి. రసాయనాల ప్రభావాన్ని కొద్దిగానైనా నియంత్రించాలంటే జీవన ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. బ్యాక్టీరియాని ఉపయోగించి శిలీంధ్రాలను నాశనం చేయడం ఒక పద్ధతి అయితే.. శిలీంధ్రాలను వాడడం ద్వారా శిలీంధ్రాలను అరికట్టడం ఈ జీవ నియంత్రణలో రెండో పద్ధతి. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, బిసిల్లస్ తురంజియన్సిస్ అనే బ్యాక్టీరియా వర్గానికి చెందిన సూక్ష్మజీవులు, ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రంను జీవ నియంత్రణ పద్ధతిలో అధికంగా ఉపయోగిస్తారు. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ భూమిలో నివసించే వివిధ పంటల్ని నాశనం చేసే వడలు తెగులు, కాండం కుళ్లు తెగులు, ప్యూజేరియం, మాక్రోఫోమినా, రైజోక్టోనియా, స్క్లీరోషియ, స్క్లీరోషియారంల నుంచి పత్తి, వేరుశనగ, ఆముదం పంటలను, వంకాయ, బెండ, దోస వంటి కూరగాయల పంటలను సమర్థవంతంగా కాపాడుతుంది. బాసిల్లస్ తురంజియన్సిస్ లేదా బి.టి. మందులు రెక్కల జాతి పురుగులైన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, నామాల పురుగు వంటి పురుగుల లార్వాలను ఆశించి, వాటిని రోగగ్రస్తం చేయటం ద్వారా ఉధృతిని తగ్గిస్తుంది. క్రైకోడెర్మా విరిడి శిలీంధ్రం కంది, పత్తి, వేరుశనగ, శనగ పంటలకు సోకే ఎండుతెగుళ్లకు, పంటలను ఆశించే వేరుకుళ్లు తెగుళ్లకు, కూరగాయ తోటల్లో నారుకుళ్లు తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతుంది. సూడోమోనాస్ లేదా ట్రైకోడర్మాని విత్తన శుద్ధి కోసం ఒక కిలో విత్తనానికి 10గ్రా. కలిపి విత్తడానికి ముందు 12 గంటలు ఉంచి విత్తుకోవాలి. 20 కిలోల సూడోమోనాస్ 50 లీటర్ల నీటిలో కలిపిన మిశ్రమంలో మొక్క వేర్లు 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి. 5 కిలోల సూడోమోనాస్‌ను వర్మీకంపోస్టు/ వేరుశనగ/ వేపపిండితో కలిపి ఒక వారం ఉంచి మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి. 5 గ్రా. సూడోమోనాస్‌ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు : ఆంధ్రప్రదేశ్ : 1100, 1800 425 4440 తెలంగాణ : 1100, 1800 425 1110 కిసాన్ కాల్ సెంటర్ : 1800 180 1551 సంకరజాతి పశువుల్లో చూడి.. జాగ్రత్తలు! మంచి సంకరజాతి పశువులు ఈనిన 60-90 రోజుల్లో మళ్లీ చూడి కడుతుంది. 300 రోజుల వరకు పాలిస్తుంది. కానీ, ఈనిన 8-9 నెలల్లో క్రమంగా పాలు పితకడం మానేస్తేనే పశువు ఆరోగ్యం, తదుపరి ఈతలో పాలదిగుబడి, దూడ ఆరోగ్యం బాగుంటాయి. ఈనడానికి ముందు 2 నెలల్లో మేపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. తల్లి కడుపులో దూడ ఈ 2 నెలల్లోనే ఎక్కువగా పెరుగుతుంది. తదుపరి ఈతకు కావాల్సిన పోషక నిల్వలను సమకూర్చుకునేదీ ఈ కాలంలోనే. * చూడి పశువులకు మేపుదల తగినంత లేకపోతే పశువు నీరసంగా ఉంటే.. ఈనిన తర్వాత పాలదిగుబడి తక్కువగా ఉంటుంది. దూడ నీరసంగా ఉంటుంది. కొన్నిసందర్భాల్లో దూడ చనిపోతుంది. * ఈనిన 2-3 నెలల్లోనే మళ్లీ చూడి కట్టించాలి. పాలు ఎండిపోయే వరకు పాలు తీయకూడదు. ఈనిన 8-9 నెలలకల్లా పాలు తీయడం క్రమంగా ఆపేయాలి. తద్వారా తదుపరి ఈతకు అవసరమైన పోషకాల నిల్వలను పశువు సమకూర్చుకోగలుగుతుంది. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా -
ఇది ‘ఇంటిపంట’ల కాలం!
సాక్షి మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్పై అమితాసక్తిని రేకెత్తించింది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నప్పటికీ.. ఉన్నంతలో తులసితోపాటు నాలుగు పూలమొక్కలు పెంచుకోవడం చాలా ఇళ్లలో కనిపించేదే. అయితే, విష రసాయనాల అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయల ఆవశ్యకతపై చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను స్వయంగా సేంద్రియ పంటల సాగుకు ఉపక్రమింపజేసింది ‘ఇంటిపంట’. డాబాపైన, పెరట్లో, బాల్కనీల్లో.. వీలును బట్టి సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో ‘ఇంటిపంట’లు సాగు చేస్తున్న వారెందరో ఉన్నారు. జనాభా సంఖ్యలో వీరి సంఖ్య కొంచెమే కావచ్చు. కానీ, వీరి కృషి ఇతరుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఇంటిపంట’ కాలమ్‌ను ప్రతి శనివారం మళ్లీ ప్రచురించాలని ‘సాక్షి’ సంకల్పించింది. ఈ సందర్భంగా ‘ఇంటిపంట’తో స్ఫూర్తి పొందిన కొందరి అనుభవాలు క్లుప్తంగా.. తోటకూర, టమాటా..! ‘ఇంటిపంట’ కథనాలు చదివి స్ఫూర్తిపొంది ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ ప్రారంభించాను. మా డాబాపైన కొన్ని కుండీలు, నల్ల గ్రోబాగ్స్‌లో వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, వేపపిండితో మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని వాడుతున్నా. టమాటాతోపాటు చూడముచ్చటగా ఉండే చెర్రీ టమాటా సాగు చేశా. ప్రస్తుతం తోటకూర, గోంగూర, బెండ, మిరప కుండీల్లో పెంచుతున్నా. ఈ కుండీల మధ్యలో కొన్ని పూల మొక్కలు, బోన్సాయ్ మొక్కలు కూడా పెంచుతున్నా. ఇంటిపంట గూగుల్, ఫేస్బుక్ గ్రూప్‌ల ద్వారా సూచనలు, సలహాలు పొందుతున్నాను. - కాసా హరినాథ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కేపీహెచ్‌బీ 7 ఫేజ్, హైదరాబాద్ ‘ఇంటిపంట’ శిక్షణ పొందా.. మా ఇంటిపైన కుండీలు, గ్రోబాగ్స్, సిల్పాలిన్ మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాను. మూడేళ్ల క్రితం ఇంటిపంట శీర్షిక ద్వారా స్ఫూర్తిపొందాను. వనస్థలిపురంలో సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నేను, నా భార్య పాల్గొన్నాం. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్నాం. వర్మీకంపోస్టు, ఎర్రమట్టి, కోకోపిట్, వేపపిండి కలిపిన మిశ్రమాన్ని కుండీల్లో వేస్తున్నాను. స్వయంగా తయారుచేసుకున్న జీవామృతంతోపాటు వేప నూనె 10 రోజులకోసారి వాడుతున్నాం. గత వేసవిలోనూ వంకాయల కాపు బాగా వచ్చింది. ప్రస్తుతం మిరప, వంగ, బెండ, బీర, దొండ, గోరుచిక్కుడు, పాలకూర మా గార్డెన్లో ఉన్నాయి. కొందరం కలసికట్టుగా ఉంటూ ఇంటిపంటల సాగు సజావుగా కొనసాగిస్తున్నాం..’’ - కొల్లి దుర్గాప్రసాద్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి, కమలానగర్, హైదరాబాద్ ‘ఇంటిపంట’ల సేవలో.. వనస్థలిపురం ప్రాంతంలో ‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి కృషి చేస్తున్నా. గతంలో సాక్షి తోడ్పాటుతో వర్క్‌షాప్ నిర్వహించాం. ఇటీవల ఉద్యాన శాఖ తోడ్పాటుతో ఇంటిపంట సబ్సిడీ కిట్లను స్థానికులకు పంపిణీ చేయించాను. ఇంటిపంటల సాగులో స్థానికులకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నా. మా ఇంటి వద్ద జీవామృతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతున్నా. - భావనా శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం, వనస్థలిపురం, హైదరాబాద్ జీవామృతం, అమృత్‌పానీ.. మూడేళ్ల క్రితం ‘ఇంటిపంట’ కాలమ్ ద్వారా స్ఫూర్తి పొందా. మేడ మీద 150 బియ్యం సంచుల్లో ఆకుకూరలతోపాటు జొన్న. సజ్జ, మొక్కజొన్న మొక్కలను గతంలో పండించా. ప్రస్తుతం ఇంటిపక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చుక్కకూర, పాలకూర, తోటకూరతోపాటు జొన్న, సజ్జ, బీర, కాకర సాగుచేస్తున్నా. ఘనజీవామృతం, జీవామృతం, అమృత్‌పానీ వంటివి స్వయంగా తయారు చేసుకొని, క్రమం తప్పకుండా వాడుతూ చక్కని దిగుబడి సాధిస్తున్నా. నగరంలో ఉంటూ ఇంటిపంటల ద్వారా కొంతమేరకైనా సహజాహారాన్ని పండించుకోగలగడం ఆనందంగా ఉంది, ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న పెద్దలు, పిల్లలకు మెలకువలను ఓపిగ్గా వివరిస్తున్నా.. -ఎస్. సత్యనారాయణ మూర్తి విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి, రామనామక్షేత్రం, గుంటూరు పూల మొక్కల నుంచి కూరగాయల వైపు.. పూల మొక్కలు పెంచే అలవాటుండేది. ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ స్ఫూర్తితోనే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాను. మేడ మీద కుండీల్లో అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నా. బెండ మొక్కలున్న కుండీల్లో ఖాళీ ఎక్కువగా ఉందని తాజాగా ఎర్ర ముల్లంగిని సాగు చేశా. దిగుబడి బాగుంది. ఫేస్బుక్, గూగుల్‌లో ఇంటిపంట గ్రూప్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. - కందిమళ్ల వేణుగోపాలరెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, టీసీఎస్, హైదరాబాద్ ఫేస్బుక్, గూగుల్‌లో ‘ఇంటిపంట’! ‘ఇంటిపంట’లు సాగుచేసే వారి మధ్య స్నేహానికి ఫేస్బుక్, గూగుల్ గ్రూప్‌లు వారధిగా నిలుస్తున్నాయి. ఫేస్బుక్లో INTIPANTA - Organic Kitchen/Terrace Gardening గ్రూప్ ఉంది. ఇందులో సభ్యుల సంఖ్య 4,500 దాటింది! గూగుల్ గ్రూప్‌లో 773 మంది సభ్యులున్నారు. సమాచార మార్పిడికి, సలహాలకు, సంప్రదింపులకు ఇవి దోహదపడుతున్నాయి. గూగుల్ గ్రూప్ అడ్రస్ ఇది: https://groups.google.com/ forum/#!forum/intipanta intipanta@googlegroups.com కు మెయిల్ ఇస్తే ఇందులో వెంటనే సభ్యత్వం పొందొచ్చు.