ఈ వారం వ్యవసాయ సూచనలు | References to the agriculture of this week | Sakshi
Sakshi News home page

ఈ వారం వ్యవసాయ సూచనలు

Published Mon, Sep 1 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

ఈ వారం వ్యవసాయ సూచనలు

ఈ వారం వ్యవసాయ సూచనలు

పుబ్బ కార్తె (సెప్టెంబర్ 13 వరకు): జీవన ఎరువుల వాడకం మేలు!
ప్రస్తుత పరిస్థితుల్లో అధిక మోతాదులో రసాయనాలు వాడడం వల్ల సాగు ఖర్చు పెరగడమేకాకుండా వివిధ పర్యావరణ దుష్ఫలితాలు కూడా ఏర్పడుతున్నాయి. రసాయనాల ప్రభావాన్ని కొద్దిగానైనా నియంత్రించాలంటే జీవన ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలి.
బ్యాక్టీరియాని ఉపయోగించి శిలీంధ్రాలను నాశనం చేయడం ఒక పద్ధతి అయితే.. శిలీంధ్రాలను వాడడం ద్వారా శిలీంధ్రాలను అరికట్టడం ఈ జీవ నియంత్రణలో రెండో పద్ధతి.
సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, బిసిల్లస్ తురంజియన్సిస్ అనే బ్యాక్టీరియా వర్గానికి చెందిన సూక్ష్మజీవులు, ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రంను జీవ నియంత్రణ పద్ధతిలో అధికంగా ఉపయోగిస్తారు.
సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ భూమిలో నివసించే వివిధ పంటల్ని నాశనం చేసే వడలు తెగులు, కాండం కుళ్లు తెగులు, ప్యూజేరియం, మాక్రోఫోమినా, రైజోక్టోనియా, స్క్లీరోషియ, స్క్లీరోషియారంల నుంచి పత్తి, వేరుశనగ, ఆముదం పంటలను, వంకాయ, బెండ, దోస వంటి కూరగాయల పంటలను సమర్థవంతంగా కాపాడుతుంది.
బాసిల్లస్ తురంజియన్సిస్ లేదా బి.టి. మందులు రెక్కల జాతి పురుగులైన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, నామాల పురుగు వంటి పురుగుల లార్వాలను ఆశించి, వాటిని రోగగ్రస్తం చేయటం ద్వారా ఉధృతిని తగ్గిస్తుంది.
క్రైకోడెర్మా విరిడి శిలీంధ్రం కంది, పత్తి, వేరుశనగ, శనగ పంటలకు సోకే ఎండుతెగుళ్లకు, పంటలను ఆశించే వేరుకుళ్లు తెగుళ్లకు, కూరగాయ తోటల్లో నారుకుళ్లు తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతుంది.
సూడోమోనాస్ లేదా ట్రైకోడర్మాని విత్తన శుద్ధి కోసం ఒక కిలో విత్తనానికి 10గ్రా. కలిపి విత్తడానికి ముందు 12 గంటలు ఉంచి విత్తుకోవాలి.
20 కిలోల సూడోమోనాస్ 50 లీటర్ల నీటిలో కలిపిన మిశ్రమంలో మొక్క వేర్లు 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి.
5 కిలోల సూడోమోనాస్‌ను వర్మీకంపోస్టు/ వేరుశనగ/ వేపపిండితో కలిపి ఒక వారం ఉంచి మొక్కల మొదళ్ల దగ్గర వేసుకోవాలి. 5 గ్రా. సూడోమోనాస్‌ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
 ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం,  హైదరాబాద్

 
 శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు :
 ఆంధ్రప్రదేశ్ : 1100, 1800 425 4440
 తెలంగాణ : 1100, 1800 425 1110
 కిసాన్ కాల్ సెంటర్ : 1800 180 1551

 సంకరజాతి పశువుల్లో చూడి.. జాగ్రత్తలు!
మంచి సంకరజాతి పశువులు ఈనిన 60-90 రోజుల్లో మళ్లీ చూడి కడుతుంది. 300 రోజుల వరకు పాలిస్తుంది. కానీ, ఈనిన 8-9 నెలల్లో క్రమంగా పాలు పితకడం మానేస్తేనే పశువు ఆరోగ్యం, తదుపరి ఈతలో పాలదిగుబడి, దూడ ఆరోగ్యం బాగుంటాయి.
ఈనడానికి ముందు 2 నెలల్లో మేపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. తల్లి కడుపులో దూడ ఈ 2 నెలల్లోనే ఎక్కువగా పెరుగుతుంది. తదుపరి ఈతకు కావాల్సిన పోషక నిల్వలను సమకూర్చుకునేదీ ఈ కాలంలోనే.
*     చూడి పశువులకు మేపుదల తగినంత లేకపోతే పశువు నీరసంగా ఉంటే.. ఈనిన తర్వాత పాలదిగుబడి తక్కువగా ఉంటుంది. దూడ నీరసంగా ఉంటుంది. కొన్నిసందర్భాల్లో దూడ చనిపోతుంది.
 *    ఈనిన 2-3 నెలల్లోనే మళ్లీ చూడి కట్టించాలి. పాలు ఎండిపోయే వరకు పాలు తీయకూడదు. ఈనిన 8-9 నెలలకల్లా పాలు తీయడం క్రమంగా ఆపేయాలి. తద్వారా తదుపరి ఈతకు అవసరమైన పోషకాల నిల్వలను పశువు సమకూర్చుకోగలుగుతుంది.
 - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506),
  అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement