కలుపు ద్రావణం పిచికారి చేసిన 13 రోజులకు గడ్డి మాడిపోయిన దృశ్యం(కలుపు ద్రావణం పిచికారీ), కలుపు నిర్మూలన ద్రావణం తయారీకోసం గడ్డి పీకుతున్న రైతు దత్తు
ఏ పంటకైనా కలుపు సమస్యే. కలుపు నివారణకు సంప్రదాయకంగా కూలీలతో తీయించడం లేదా గుంటక తోలటం చేస్తుంటారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా కూలీల కొరత నేపథ్యంలో కలుపు నిర్మూలనకు రసాయనిక కలుపు మందుల పిచికారీ పెరిగిపోయింది. గ్లైఫొసేట్ వంటి అత్యంత ప్రమాదకరమైన కలుపు మందుల వల్ల కేన్సర్ వ్యాధి ప్రబలుతోందని నిర్థారణ కావడంతో ప్రభుత్వాలు కూడా దీని వాడకంపై తీవ్ర ఆంక్షలు విధించడం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు సేంద్రియ కలుపు మందులపై దృష్టిసారిస్తున్నారు.
కలుపుతోనే కలుపును నిర్మూలించవచ్చని ఈ రైతులు అనుభవపూర్వకంగా చెబుతుండటం రైతాంగంలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పొలంలో ఏవైతే కలుపు రకాలు సమస్యగా ఉన్నాయో.. ఆ కలుపు మొక్కలు కొన్నిటిని వేర్లు, దుంపలతో సహా పీకి, ముక్కలు చేసి, పెనం మీద వేపి, బూడిద చేసి దానికి పంచదార, పాలు కలిపి మురగబెడితే తయారయ్యే ద్రావణాన్ని ‘గరళకంఠ ద్రావణం’ అని పిలుస్తున్నారు. ఈ ద్రావణాన్ని పొలం అంతటా పిచికారీ చేస్తే.. చల్లిన 12 రోజుల నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు ఎండిపోతున్నాయని చెబుతున్నారు.
ఈ ద్రావణంలో కలపని మొక్కలకు అంటే.. పంటలకు ఈ ద్రావణం వల్ల ఏమీ నష్టం జరగక పోవడం విశేషం. సీజన్‌లో రెండుసార్లు ఇలా కలుపు మొక్కల బూడిద నీటిని చల్లితే కలుపు తీయాల్సిన లేదా కలుపు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదని ఈ రైతులు నొక్కి చెబుతున్నారు. ఇది తాము కనిపెట్టిన పద్ధతి కాదని, 6వ శతాబ్దం నాటి ‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్నదేనంటున్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి, భూసారానికి హాని కలిగించని ‘కలుపుతోనే కలుపును నిర్మూలించే పద్ధతి’పై రైతుల అనుభవాలు వారి మాటల్లోనే.. ‘సాగుబడి’ పాఠకుల కోసం..!
ఇరవై రోజుల్లో కలుపు మాడిపోతుంది!
నా పేరు మర్కంటి దత్తాద్రి (దత్తు). ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఎన్.ఐ.ఆర్.డి. ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇచ్చి వస్తూనే.. నా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. ఈ ఏడాది పత్తి చేనులో కలుపు బాగా పెరిగింది. వృక్షాయుర్వేదంలో చెప్పినట్టు ఆచరించి ఫలితాలు పొంది సీనియర్ రైతులు మేకా రాధాకృష్ణమూర్తి, కొక్కు అశోక్ కుమార్ సూచించిన విధంగా నేను కలుపు మొక్కల బూడిద ద్రావణంతో నా ఎకరం పత్తి చేనులో కలుపును విజయవంతంగా నిర్మూలించుకుంటున్నాను. జూలై 15న ఈ ద్రావణాన్ని పత్తి పంటలో పిచికారీ చేశాను. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. అలాగే జూలై 15వ తేదీన పిచికారీ చేశాను. ఫలితాలు చాలా బాగున్నాయి. గడ్డి జాతి కలుపు మొక్కలు తొందరగా మాడిపోతున్నాయి. వెడల్పు ఆకులు/ వేరు వ్యవస్థ బలంగా ఉన్న మొక్కలు కొంచెం నెమ్మదిగా చనిపోతున్నాయి. మామూలుగా గరిక పీకినా రాదు. ఈ ద్రావణం చల్లిన ఆరో రోజు తర్వాత పట్టుకొని పీకగానే వస్తుంది. అప్పటికే దాని వేరు వ్యవస్థ మాడిపోయి ఉంది. 8–12 రోజుల నుంచి మొండి జాతుల కలుపు మొక్కలు చనిపోతాయి.
కలుపు మొక్కల బూడిద ద్రావణం తయారీ ఇలా..
ఎకరం పత్తి చేను కోసం నేను ద్రావణం తయారు చేసుకున్న విధానం ఇది.. గరిక, బెండలం, వయ్యారిభామ, గూనుగ అనే నాలుగు రకాల కలుపు మొక్కలను.. రకానికి కిలో చొప్పున వేర్లు, దుంపలతో సహా పచ్చి మొక్కలను పీకి, మట్టిని కడిగేయాలి. నీటి తడి ఆరిపోయే వరకు కొద్దిసేపు ఆరబెట్టి.. ముక్కలు చేసి.. పెనం మీద వేసి.. బూడిద చేశాను. ఇలా తయారు చేసిన బూడిద 200 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, లీటరు ఆవు పాలు కలిపితే.. నల్లటి ద్రావణం తయారవుతుంది. దీన్ని రెండు రోజులు బాగా, అనేకసార్లు కలియదిప్పాలి. మిక్సీలో పోసి.. తిప్పాలి. లేదా కవ్వంతో బాగా గిలకొట్టాలి. మూడో రోజు ఈ ద్రావణాన్ని.. ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిలో ఈ ద్రావణాన్ని కలిపి.. 2 రోజులు బాగా కలియబెడుతూ మురగబెట్టాలి. నీరు నీలి రంగుకు మారుతుంది.
3వ రోజు ఈ నీటిని నేరుగా కలుపుతో నిండిన పొలంలో పవర్ స్ప్రేయర్‌తో కలుపు మొక్కలు నిలువెల్లా బాగా తడిచి వేర్లలోకి కూడా ద్రావణం నీరు చేరేలా పిచికారీ చేయాలి. దీన్ని పిచికారీ చేసేటప్పుడు కచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. తేమ లేనప్పుడు పిచికారీ చేస్తే దీని ప్రభావం ఉండదు. పంట కాలంలో రెండు సార్లు పిచికారీ చేసుకుంటే.. ఏయే రకాల కలుపు మొక్కలను పీకి మసి చేసి ద్రావణం తయారు చేసి వాడామో.. ఆయా రకాల కలుపు జాతుల నిర్మూలన అవుతుంది. ఇంకా మిగిలిన రకాలేమైనా ఉంటే.. వాటితో మరోసారి ద్రావణం తయారు చేసి చల్లితే.. అవి కూడా పోతాయి. ఆ భూమిలో పంటలకు ఎటువంటి హానీ ఉండదు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధాన, అంతర పంటల మొక్కలను ఈ ద్రావణంలో వాడకూడదు.
ఒక్కోసారి కలుపు మొక్కల విత్తనాలు గాలికి కొట్టుకు వచ్చి పడినప్పుడు, ఆ రకాల కలుపు మళ్లీ మొలవొచ్చు. అలాంటప్పుడు మరోసారి ద్రావణం తయారు చేసి వాడాలి. ప్రమాదకరమైన రసాయనిక కలుపు మందులు చల్లకుండానే కలుపు సమస్య నుంచి ఈ గరళకంఠ ద్రావణంతో నిస్సందేహంగా బయటపడొచ్చు. ఇది నా అనుభవం. ఒకసారి ఏవైనా తప్పులు జరిగితే, ఫలితాలు పూర్తిగా రావు.. అలాంటప్పుడు మళ్లీ ప్రయత్నించండి. చల్లిన తర్వాత ఫలితాలు పూర్తిగా కంటికి కనపడాలంటే.. కనీసం 20 రోజులు వేచి ఉండాలి. గరళకంఠ ద్రావణంతో కలుపు నిర్మూలన అద్భుతంగా జరుగుతుంది. లేత కలుపు మొక్కలను త్వరగా నిర్మూలించవచ్చు. ముదిరిన కలుపు మొక్కల నిర్మూలనకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. బాగా ముదిరి విత్తనం వచ్చిన కలుపు మొక్కల నిర్మూలన కష్టం.
– మర్కంటి దత్తాద్రి (దత్తు) (80084 84100), సేంద్రియ పత్తి రైతు, విఠోలి, ముదోల్ మండలం, నిర్మల్ జిల్లా
(ఫొటోలు: బాతూరి కైలాష్, సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్)
వయ్యారి భామ, తుంగ, గరిక నిర్మూలన!
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అరెకరంలో ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ.. కలుపు నిర్మూలనకు గరళకంఠ ద్రావణం పిచికారీ చేశాను. ఏ కలుపు రకాలను తీసుకొని, బూడిద చేసి చల్లానో ఆ రకాల కలుపు మొక్కలన్నీ నూటికి నూరు శాతం చనిపోయాయి. తుంగ, గరికతోపాటు వయ్యారిభామ కూడా చనిపోయాయి. అయితే, కలుపు మొక్కలను పీకి బూడిద చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పంటకు సంబంధించిన మొక్కలు కలవకుండా చూసుకోవాలి. అవి కూడా కలిస్తే ఈ ద్రావణం చల్లినప్పుడు పంట కూడా చనిపోతుంది. పిచికారీ చేసిన 48 గంటలు దాటాక.. వేర్ల దగ్గర నుంచి ప్రభావం కనిపించింది. కలుపు ఎదుగుదల అప్పటి నుంచే ఆగిపోయింది. 20–30 రోజుల్లో కలుపు మొక్కలు చనిపోయాయి. ఆ పంట కాలంలో ఆ కలుపు మళ్లీ పుట్టదు.
– తుపాకుల భూమయ్య (96767 18709), జూలపల్లి, పెద్దపల్లి జిల్లా
చిన్న, పెద్ద రైతులెవరైనా అనుసరించవచ్చు!
కలుపు మొక్కలతో తయారు చేసిన గరళకంఠ ద్రావణంతో ప్రధాన పంట మొక్కలకు ఎటువంటి హానీ జరగదు. కలుపు మొక్కలు వేర్ల నుంచి మురిగిపోతాయి. కొద్ది రోజుల్లోనే పెరుగుదల ఆగిపోయి.. కలుపు మొక్కలు ముట్టుకుంటే ఊడిపోతాయి. తర్వాత కొద్ది రోజులకు ఎండిపోతాయి. ఎన్ని ఎకరాలకైనా బెల్లం వండే బాండీల్లో/పాత్రల్లో ఒకేసారి భారీ ఎత్తున కలుపు బూడిదను తయారు చేసుకొని.. దానితో ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చిన్న, పెద్ద రైతులు ఎవరైనా ఆచరించదగిన ఖర్చులేని, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని లేని కలుపు నిర్మూలన పద్ధతి అని అందరూ గుర్తించాలి. కలుపు మొక్కల బూడిదను ఎప్పటికప్పుడు వాడుకోవాలన్న నియమం ఏమీ లేదు. ఈ బూడిదను నిల్వ చేసుకొని.. ఆ తర్వాతయినా వాడుకోవచ్చు.
– కొక్కు అశోక్‌కుమార్ (98661 92761), సేంద్రియ రైతు, జగిత్యాల
తుంగ వేర్లు 3 రోజుల్లో మాడిపోతాయి!
2011 నుంచి ప్రకృతి వ్యవసాయంలో వరి, తదితర పంటలు పండిస్తున్నాను. వరిలో తుంగ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. వృక్షాయుర్వేదంలో చెప్పిన ప్రకారం.. కలుపును కలుపుతోనే నిర్మూలించడం సాధ్యమేనని అనుభవపూర్వకంగా మేం తెలుసుకున్నాం. తుంగ, గరిక వంటి కలుపును సమర్థవంతంగా నిర్మూలించాను. కిలో తుంగ గడ్డలతో సహా వేర్లు, మొక్కలు మొత్తం పీకి.. వేర్ల మట్టిని కడిగి.. పెనం మీద కాల్చి బూడిద చేయాలి. 100 గ్రా. కలుపు మొక్కల బూడిద, 100 గ్రా. పంచదార, అర లీటరు నాటావు పాలు కలిపి.. రెండు రోజులు తరచూ కలియదిప్పుతూ ఉండాలి. 2 రోజుల తర్వాత ఆ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి మరో రెండు రోజులు పులియబెట్టాలి. తరచూ కలియదిప్పుతూ ఉండాలి. మూడో రోజున ఆ ద్రావణాన్ని వరి పొలంలో అంతటా పిచికారీ చేయాలి. ఈ ద్రావణం కలుపును దుంపను నాశనం చేస్తుంది. మొదట దుంపను, వేర్లను ఎండిపోయేలా చేస్తుంది. క్రమంగా మొక్క కాండం, ఆకులు కూడా ఎండిపోతాయి. తుంగ మొక్కను పట్టుకొని పీకితే తేలిగ్గా రాదు. నేను ద్రావణం చల్లిన తర్వాత మూడో రోజు తుంగ మొక్కను పట్టుకుంటే చాలు ఊడి వస్తుంది. దుంప, వేర్లు మాడిపోయాయి. ఇలా నిర్మూలించిన తర్వాత మా పొలంలో మళ్లీ ఇంత వరకు తుంగ రాలేదు. వరి మొక్కలకు ఎటువంటి హానీ జరగలేదు. గరికను పెనం మీద మాడ్చి ద్రావణం తయారు చేసి చల్లితే 10 రోజులకు వడపడింది. పీకి చూస్తే వేరు ఎండిపోయింది. సాధారణంగా రసాయనిక కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత 48 గంటల్లో మొదట ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు.. పై నుంచి కిందకు ఎండిపోతాయి. ఈ ద్రావణం చల్లితే ఇందుకు భిన్నంగా.. మొదట వేర్లు, గడ్డలు, కాండం, కొమ్మలు, ఆకులు చివరగా ఎండుతాయి.
అయితే, భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు నిర్మూలన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చల్లిన ద్రావణం వేరు ద్వారా కిందికి దిగాలంటే భూమిలో పదును ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రైతులంతా రసాయనిక కలుపు మందులు వాడి భూములను నాశనం చేసుకోకుండా, స్వల్ప ఖర్చుతో ఈ ద్రావణం తయారు చేసుకొని వాడుతూ కలుపు నిర్మూలన చేసుకుంటున్నారు.
– మేకా రాధాకృష్ణమూర్తి (84669 23952), మంత్రిపాలెం, నగరం మండలం, గుంటూరు జిల్లా.
Comments
Please login to add a commentAdd a comment