Labor shortages
-
చెరుకు రైతులకు చేదు నుంచి విముక్తి! టన్ను నరివేతకు రూ.400
సాక్షి, అమరావతి: చెరకు రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కూలీల కొరతను అధిగమించేందుకు అత్యాధునిక యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న యంత్రాల్లోని సాంకేతిక లోపాలను అధిగమించేలా దీన్ని రూపొందించారు. ఈ యంత్రం కూలీల కొరతవల్ల రైతులు పడుతున్న వెతలకు చెక్ పెట్టడమే కాదు.. కోత వ్యయాన్ని సగానికిపైగా తగ్గిస్తుంది. దేశంలో ప్రధానమైన వాణిజ్యపంటల్లో చెరకు ఒకటి. దేశవ్యాప్తంగా 48.51 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. మన రాష్ట్రంలో 55 వేల హెక్టార్లలో చెరకు సాగుచేస్తున్నారు. ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో పాటు కూలీల కొరత, కొత్తగా పుట్టుకొస్తున్న చీడపీడలు (పసుపు ఆకు, వైరస్ తెగుళ్లు) రైతులను వేధిస్తున్నాయి. సాగుకాలంలో కనీసం 40 రోజులు కూలీల అవసరం తప్పనిసరి. కూలీలు లేనిదే కోత కొయ్యలేని పరిస్థితి నెలకొంది. పెట్టుబడిలో 35 శాతం కూలీలకే.. గిరాకీని బట్టి టన్ను చెరకు నరకడానికి రూ.800 నుంచి రూ.1,200 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎకరాకు రూ.24 వేలకు పైగా కూలీల కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. మొత్తం సాగువ్యయంలో 35 శాతంగా నమోదవుతున్న కూలీల ఖర్చు రైతులకు భారంగా మారుతోంది. అయినప్పటికీ సమయానికి కూలీలు దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో రకాల చెరకు కోత యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటిలోని సాంకేతిక లోపాలు చక్కెర రికవరీకి అవరోధంగా ఉంటున్నాయి. దీంతో కోత సమయంలో ఎక్కువమంది రైతులు కూలీలపైనే ఆధార పడుతున్నారు. మేలైన కోత యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. కోల్హాపూర్‌లో వాడుకలో ఉన్న జైపూర్ వారి సూపర్ కేన్ హార్వెస్టర్‌ను అధ్యయనం చేశారు. కాస్త మార్పులు చేసి మన ప్రాంతానికి, మన రైతులకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఎలా పనిచేస్తుందంటే.. ఈ సూపర్ కేన్ హార్వెస్టర్ చెరకును నేలమట్టానికి నరికి చక్కెర కర్మాగారానికి తరలించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పైగా చక్కెర రికవరీకి ఏమాత్రం ఢోకా ఉండదు. ఈ హార్వెస్టర్ కింద, పై భాగాల్లో రెండు కట్టర్ బ్లేడులతో పాటు ఒక డిట్రాషింగ్ యూనిట్ ఉంటాయి. కట్టర్ బ్లేడులను చెరకు పొడవును బట్టి హైడ్రాలిక్ పవర్ సహాయంతో కావాల్సిన ఎత్తుకు సర్దుబాటు చేసుకోవచ్చు. కింద భాగంలో ఉండే కట్టరు బ్లేడు చెరకును నేలమట్టానికి నరికితే పైభాగంలో ఉండే కట్టరు బ్లేడ్ చెరకు మొవ్వను కోస్తుంది. తర్వాత చెరకు గడలు బెల్ట్ సాయంతో డిట్రాషింగ్ యూనిట్లోకి వెళతాయి. ఈ యూనిట్లో చెరకు గడలకు ఉన్న ఎండుటాకులను తెంచి పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత యంత్రం వెనుక భాగంలో ఉండే ట్రాలీలోకి పంపుతుంది. ఈ ట్రాలీ నుంచి సూపర్ గ్రబ్బర్ అనే యంత్రం ట్రాక్టర్లోకి లోడ్ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తిగా యంత్రమే చేస్తుంది. టన్నుకు రూ.400 చెల్లిస్తే చాలు.. ఈ యంత్రం ధర మార్కెట్లో రూ.33 లక్షలుగా ఉంది. 75 హెచ్‌పీ ట్రాక్టర్ రూ.13 లక్షలు, సూపర్ గ్రబ్బర్ రూ.4 లక్షలు కలిపి మొత్తం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ యంత్రం గంటకు 3–4 టన్నుల చొప్పున రోజుకు 25 టన్నుల చెరకును సునాయాసంగా నరికేస్తుంది. ఎక్కడికైనా ఈజీగా తరలించవచ్చు. ఈ యంత్రం సాయంతో చెరకు నరికేందుకు టన్నుకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. సరాసరి చెరకు దిగుబడి ఎకరాకు 30 టన్నులుగా తీసుకుంటే కూలీలతో నరికితే టన్నుకు రూ.800 చొప్పున రూ.24 వేలు ఖర్చవుతుంది. అదే ఈ యంత్రంతో నరికితే టన్నుకు రూ.400 చొప్పున 30 టన్నులకు రూ.12 వేలకు మించి ఖర్చవదు. అంటే కూలీలతో నరికించే దానికంటే ఖర్చును 50 శాతం వరకు తగ్గిస్తుంది. కూలీల వెతలుండవు సూపర్ కేన్ హార్వెస్టర్ మన ప్రాంతానికి, మన రైతులకు చాలా అనుకూలమైనది. చాలా ఈజీగా వినియోగించవచ్చు. ఏళ్ల తరబడి రైతులెదుర్కొంటున్న కూలీల వెతలకు పూర్తిగా చెక్ పెట్టొచ్చు. కోత ఖర్చు సగానికిపైగా తగ్గిపోతుంది. ఈ యంత్రంతో కోత కోస్తే చక్కెర రికవరీ శాతం పెరుగుతుందే తప్ప తగ్గే చాన్స్ ఉండదు. – డాక్టర్ పి.వి.కె.జగన్నాథరావు, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త, అనకాపల్లి -
Canada Labour Shortage: కెనడాలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు
అట్టావా: కెనడాలో ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతున్నాయని ఆ దేశ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. 2022 మేతో పోలిస్తే మరో 3 లక్షల ఖాళీలు పెరిగి మొత్తం 10 లక్షలను దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. కెనడాలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది రిటైర్మెంట్ వయస్సుకు దగ్గర పడటంతో విదేశీ కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది కెనడాలో అత్యధికంగా 4.3 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ లక్ష్యం 2024 నాటికి 4.5 లక్షలకు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉండటం వలసదారులకు సానుకూలంగా మారింది. వృత్తి నిపుణులు, సైంటిఫిక్– టెక్నికల్ సేవలు అందించేవారు, రవాణా, వేర్ హౌసింగ్, ఫైనాన్స్, బీమా, వినోదం, రియల్ ఎస్టేట్ రంగాల్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు నిర్మాణ రంగంలో సుమారు 90 వేల ఉద్యోగావకాశాలున్నాయి. విద్యారంగంలో 9,700 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆహార సేవల రంగంలో ఖాళీలు ఫిబ్రవరి నుంచి 10% మేర పెరిగాయి. రానున్న పదేళ్లలో సుమారు 90 లక్షల మంది రిటైర్మెంట్కు దగ్గర కానున్నారు. వాస్తవానికి కెనడాలో చాలా చిన్న వయస్సులోనే రిటైర్మెంట్లు తీసుకుంటారు. ప్రతి 10 రిటైర్మెంట్లలో మూడు ముందుగానే తీసుకునేవే ఉంటాయి. -
ఉద్యోగుల కొంపముంచుతున్న రోబోలు!
ప్రపంచ దేశాల్లో ఉద్యోగుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అయితే ఈ సమస్యను అధిగ మించేందుకు పలు సంస్థల యజమానులు రోజూ వారి కార్యకలాపాల్ని నిర్వహించేందుకు కొత్త కొత్త టెక్నాలజీవైపు మొగ్గుచూపుతున్నారు.ఆ టెక్నాలజీలలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది ఈ రోబోట్ టెక్నాజీ. కానీ ఈ రోబోట్ టెక్నాలజీతో సంస్థలు లాభాల్ని పొందుతున్నా.. ఉద్యోగులు ఉపాధి అవకాశాలు కోల్పోతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత కఠినమైన జాబ్ మార్కెట్లో ఉద్యోగాల నియామకం కష్టతరంగా ఉండటం, కరోనా మహమ్మారి, రికార్డు స్థాయిలో అట్రిషన్ రేటు, ఆర్థిక సంక్షోభం వంటి కారణాల వల్ల కార్యాలయాల్లో మనుషులు చేసే పనుల్ని రోబోలతో చేయించుకుంటున్నారు. దీంతో ఇటీవలి జాబ్ మార్కెట్లో ఉద్యోగుల లోటు తీర్చేందుకు రోబో టెక్నాలజీ ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందని మర్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం..అసోసియేషన్ ఫర్ అడ్వాన్సింగ్ ఆటోమేషన్ నివేదికలో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రోబో ఆర్డర్లు 40శాతం పెరిగాయి. ఇదే ఆర్డర్ల సంఖ్య గతేడాది 21శాతం ఉంది. పరిశ్రమ అంచనా విలువ 1.6 బిలియన్లకు చేరుకుంది.ఈ సందర్భంగా హ్యుమన్ వర్క్ ఫోర్స్ తగ్గించి..టెక్నాలజీతో కావాల్సిన పనుల్ని చేయించుకుంటున్నారని అమెటెక్ ఐఎన్‌సీ సీఈవో డేవిడ్ తెలిపారు. అమెరికాలో పైపైకి ఉద్యోగ అవకాశాలు ఈ ఏడాది మార్చిలో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు రికార్డు స్థాయిలో 11.5 మిలియన్లకు చేరుకున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.అదే సమయంలో ఉద్యోగుల సంక్షోభం సంవత్సరాల పాటు కొనసాగవచ్చని అంచనా వేశారు. ఏవియేషన్ నుంచి రిటైల్ వరకు ఇలా ప్రతి రంగంలో ఉద్యోగులు లేకపోవడంతో కంపెనీలు తక్కువ వనరులతో ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆందోళనలో ఉద్యోగులు గ్రేట్ రిజిగ్నేషన్ కారణంగా అమెరికాలో సంస్థలు రోబో టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. దీంతో ఉపాధి అవకాశాల్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా.."ఆటోమేషన్ వినియోగం వేగవంతం అయితే ఉద్యోగాల్ని కోల్పోవాల్సి ఉంటుందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ డారన్ అసెమోగ్లు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. -
కలుపుతోనే కలుపు నిర్మూలన!
ఏ పంటకైనా కలుపు సమస్యే. కలుపు నివారణకు సంప్రదాయకంగా కూలీలతో తీయించడం లేదా గుంటక తోలటం చేస్తుంటారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా కూలీల కొరత నేపథ్యంలో కలుపు నిర్మూలనకు రసాయనిక కలుపు మందుల పిచికారీ పెరిగిపోయింది. గ్లైఫొసేట్ వంటి అత్యంత ప్రమాదకరమైన కలుపు మందుల వల్ల కేన్సర్ వ్యాధి ప్రబలుతోందని నిర్థారణ కావడంతో ప్రభుత్వాలు కూడా దీని వాడకంపై తీవ్ర ఆంక్షలు విధించడం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు సేంద్రియ కలుపు మందులపై దృష్టిసారిస్తున్నారు. కలుపుతోనే కలుపును నిర్మూలించవచ్చని ఈ రైతులు అనుభవపూర్వకంగా చెబుతుండటం రైతాంగంలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పొలంలో ఏవైతే కలుపు రకాలు సమస్యగా ఉన్నాయో.. ఆ కలుపు మొక్కలు కొన్నిటిని వేర్లు, దుంపలతో సహా పీకి, ముక్కలు చేసి, పెనం మీద వేపి, బూడిద చేసి దానికి పంచదార, పాలు కలిపి మురగబెడితే తయారయ్యే ద్రావణాన్ని ‘గరళకంఠ ద్రావణం’ అని పిలుస్తున్నారు. ఈ ద్రావణాన్ని పొలం అంతటా పిచికారీ చేస్తే.. చల్లిన 12 రోజుల నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు ఎండిపోతున్నాయని చెబుతున్నారు. ఈ ద్రావణంలో కలపని మొక్కలకు అంటే.. పంటలకు ఈ ద్రావణం వల్ల ఏమీ నష్టం జరగక పోవడం విశేషం. సీజన్లో రెండుసార్లు ఇలా కలుపు మొక్కల బూడిద నీటిని చల్లితే కలుపు తీయాల్సిన లేదా కలుపు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదని ఈ రైతులు నొక్కి చెబుతున్నారు. ఇది తాము కనిపెట్టిన పద్ధతి కాదని, 6వ శతాబ్దం నాటి ‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్నదేనంటున్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి, భూసారానికి హాని కలిగించని ‘కలుపుతోనే కలుపును నిర్మూలించే పద్ధతి’పై రైతుల అనుభవాలు వారి మాటల్లోనే.. ‘సాగుబడి’ పాఠకుల కోసం..! ఇరవై రోజుల్లో కలుపు మాడిపోతుంది! నా పేరు మర్కంటి దత్తాద్రి (దత్తు). ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఎన్.ఐ.ఆర్.డి. ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇచ్చి వస్తూనే.. నా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. ఈ ఏడాది పత్తి చేనులో కలుపు బాగా పెరిగింది. వృక్షాయుర్వేదంలో చెప్పినట్టు ఆచరించి ఫలితాలు పొంది సీనియర్ రైతులు మేకా రాధాకృష్ణమూర్తి, కొక్కు అశోక్ కుమార్ సూచించిన విధంగా నేను కలుపు మొక్కల బూడిద ద్రావణంతో నా ఎకరం పత్తి చేనులో కలుపును విజయవంతంగా నిర్మూలించుకుంటున్నాను. జూలై 15న ఈ ద్రావణాన్ని పత్తి పంటలో పిచికారీ చేశాను. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. అలాగే జూలై 15వ తేదీన పిచికారీ చేశాను. ఫలితాలు చాలా బాగున్నాయి. గడ్డి జాతి కలుపు మొక్కలు తొందరగా మాడిపోతున్నాయి. వెడల్పు ఆకులు/ వేరు వ్యవస్థ బలంగా ఉన్న మొక్కలు కొంచెం నెమ్మదిగా చనిపోతున్నాయి. మామూలుగా గరిక పీకినా రాదు. ఈ ద్రావణం చల్లిన ఆరో రోజు తర్వాత పట్టుకొని పీకగానే వస్తుంది. అప్పటికే దాని వేరు వ్యవస్థ మాడిపోయి ఉంది. 8–12 రోజుల నుంచి మొండి జాతుల కలుపు మొక్కలు చనిపోతాయి. కలుపు మొక్కల బూడిద ద్రావణం తయారీ ఇలా.. ఎకరం పత్తి చేను కోసం నేను ద్రావణం తయారు చేసుకున్న విధానం ఇది.. గరిక, బెండలం, వయ్యారిభామ, గూనుగ అనే నాలుగు రకాల కలుపు మొక్కలను.. రకానికి కిలో చొప్పున వేర్లు, దుంపలతో సహా పచ్చి మొక్కలను పీకి, మట్టిని కడిగేయాలి. నీటి తడి ఆరిపోయే వరకు కొద్దిసేపు ఆరబెట్టి.. ముక్కలు చేసి.. పెనం మీద వేసి.. బూడిద చేశాను. ఇలా తయారు చేసిన బూడిద 200 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, లీటరు ఆవు పాలు కలిపితే.. నల్లటి ద్రావణం తయారవుతుంది. దీన్ని రెండు రోజులు బాగా, అనేకసార్లు కలియదిప్పాలి. మిక్సీలో పోసి.. తిప్పాలి. లేదా కవ్వంతో బాగా గిలకొట్టాలి. మూడో రోజు ఈ ద్రావణాన్ని.. ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిలో ఈ ద్రావణాన్ని కలిపి.. 2 రోజులు బాగా కలియబెడుతూ మురగబెట్టాలి. నీరు నీలి రంగుకు మారుతుంది. 3వ రోజు ఈ నీటిని నేరుగా కలుపుతో నిండిన పొలంలో పవర్ స్ప్రేయర్‌తో కలుపు మొక్కలు నిలువెల్లా బాగా తడిచి వేర్లలోకి కూడా ద్రావణం నీరు చేరేలా పిచికారీ చేయాలి. దీన్ని పిచికారీ చేసేటప్పుడు కచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. తేమ లేనప్పుడు పిచికారీ చేస్తే దీని ప్రభావం ఉండదు. పంట కాలంలో రెండు సార్లు పిచికారీ చేసుకుంటే.. ఏయే రకాల కలుపు మొక్కలను పీకి మసి చేసి ద్రావణం తయారు చేసి వాడామో.. ఆయా రకాల కలుపు జాతుల నిర్మూలన అవుతుంది. ఇంకా మిగిలిన రకాలేమైనా ఉంటే.. వాటితో మరోసారి ద్రావణం తయారు చేసి చల్లితే.. అవి కూడా పోతాయి. ఆ భూమిలో పంటలకు ఎటువంటి హానీ ఉండదు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధాన, అంతర పంటల మొక్కలను ఈ ద్రావణంలో వాడకూడదు. ఒక్కోసారి కలుపు మొక్కల విత్తనాలు గాలికి కొట్టుకు వచ్చి పడినప్పుడు, ఆ రకాల కలుపు మళ్లీ మొలవొచ్చు. అలాంటప్పుడు మరోసారి ద్రావణం తయారు చేసి వాడాలి. ప్రమాదకరమైన రసాయనిక కలుపు మందులు చల్లకుండానే కలుపు సమస్య నుంచి ఈ గరళకంఠ ద్రావణంతో నిస్సందేహంగా బయటపడొచ్చు. ఇది నా అనుభవం. ఒకసారి ఏవైనా తప్పులు జరిగితే, ఫలితాలు పూర్తిగా రావు.. అలాంటప్పుడు మళ్లీ ప్రయత్నించండి. చల్లిన తర్వాత ఫలితాలు పూర్తిగా కంటికి కనపడాలంటే.. కనీసం 20 రోజులు వేచి ఉండాలి. గరళకంఠ ద్రావణంతో కలుపు నిర్మూలన అద్భుతంగా జరుగుతుంది. లేత కలుపు మొక్కలను త్వరగా నిర్మూలించవచ్చు. ముదిరిన కలుపు మొక్కల నిర్మూలనకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. బాగా ముదిరి విత్తనం వచ్చిన కలుపు మొక్కల నిర్మూలన కష్టం. – మర్కంటి దత్తాద్రి (దత్తు) (80084 84100), సేంద్రియ పత్తి రైతు, విఠోలి, ముదోల్ మండలం, నిర్మల్ జిల్లా (ఫొటోలు: బాతూరి కైలాష్, సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్) వయ్యారి భామ, తుంగ, గరిక నిర్మూలన! ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అరెకరంలో ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ.. కలుపు నిర్మూలనకు గరళకంఠ ద్రావణం పిచికారీ చేశాను. ఏ కలుపు రకాలను తీసుకొని, బూడిద చేసి చల్లానో ఆ రకాల కలుపు మొక్కలన్నీ నూటికి నూరు శాతం చనిపోయాయి. తుంగ, గరికతోపాటు వయ్యారిభామ కూడా చనిపోయాయి. అయితే, కలుపు మొక్కలను పీకి బూడిద చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పంటకు సంబంధించిన మొక్కలు కలవకుండా చూసుకోవాలి. అవి కూడా కలిస్తే ఈ ద్రావణం చల్లినప్పుడు పంట కూడా చనిపోతుంది. పిచికారీ చేసిన 48 గంటలు దాటాక.. వేర్ల దగ్గర నుంచి ప్రభావం కనిపించింది. కలుపు ఎదుగుదల అప్పటి నుంచే ఆగిపోయింది. 20–30 రోజుల్లో కలుపు మొక్కలు చనిపోయాయి. ఆ పంట కాలంలో ఆ కలుపు మళ్లీ పుట్టదు. – తుపాకుల భూమయ్య (96767 18709), జూలపల్లి, పెద్దపల్లి జిల్లా చిన్న, పెద్ద రైతులెవరైనా అనుసరించవచ్చు! కలుపు మొక్కలతో తయారు చేసిన గరళకంఠ ద్రావణంతో ప్రధాన పంట మొక్కలకు ఎటువంటి హానీ జరగదు. కలుపు మొక్కలు వేర్ల నుంచి మురిగిపోతాయి. కొద్ది రోజుల్లోనే పెరుగుదల ఆగిపోయి.. కలుపు మొక్కలు ముట్టుకుంటే ఊడిపోతాయి. తర్వాత కొద్ది రోజులకు ఎండిపోతాయి. ఎన్ని ఎకరాలకైనా బెల్లం వండే బాండీల్లో/పాత్రల్లో ఒకేసారి భారీ ఎత్తున కలుపు బూడిదను తయారు చేసుకొని.. దానితో ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చిన్న, పెద్ద రైతులు ఎవరైనా ఆచరించదగిన ఖర్చులేని, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని లేని కలుపు నిర్మూలన పద్ధతి అని అందరూ గుర్తించాలి. కలుపు మొక్కల బూడిదను ఎప్పటికప్పుడు వాడుకోవాలన్న నియమం ఏమీ లేదు. ఈ బూడిదను నిల్వ చేసుకొని.. ఆ తర్వాతయినా వాడుకోవచ్చు. – కొక్కు అశోక్‌కుమార్ (98661 92761), సేంద్రియ రైతు, జగిత్యాల తుంగ వేర్లు 3 రోజుల్లో మాడిపోతాయి! 2011 నుంచి ప్రకృతి వ్యవసాయంలో వరి, తదితర పంటలు పండిస్తున్నాను. వరిలో తుంగ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. వృక్షాయుర్వేదంలో చెప్పిన ప్రకారం.. కలుపును కలుపుతోనే నిర్మూలించడం సాధ్యమేనని అనుభవపూర్వకంగా మేం తెలుసుకున్నాం. తుంగ, గరిక వంటి కలుపును సమర్థవంతంగా నిర్మూలించాను. కిలో తుంగ గడ్డలతో సహా వేర్లు, మొక్కలు మొత్తం పీకి.. వేర్ల మట్టిని కడిగి.. పెనం మీద కాల్చి బూడిద చేయాలి. 100 గ్రా. కలుపు మొక్కల బూడిద, 100 గ్రా. పంచదార, అర లీటరు నాటావు పాలు కలిపి.. రెండు రోజులు తరచూ కలియదిప్పుతూ ఉండాలి. 2 రోజుల తర్వాత ఆ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి మరో రెండు రోజులు పులియబెట్టాలి. తరచూ కలియదిప్పుతూ ఉండాలి. మూడో రోజున ఆ ద్రావణాన్ని వరి పొలంలో అంతటా పిచికారీ చేయాలి. ఈ ద్రావణం కలుపును దుంపను నాశనం చేస్తుంది. మొదట దుంపను, వేర్లను ఎండిపోయేలా చేస్తుంది. క్రమంగా మొక్క కాండం, ఆకులు కూడా ఎండిపోతాయి. తుంగ మొక్కను పట్టుకొని పీకితే తేలిగ్గా రాదు. నేను ద్రావణం చల్లిన తర్వాత మూడో రోజు తుంగ మొక్కను పట్టుకుంటే చాలు ఊడి వస్తుంది. దుంప, వేర్లు మాడిపోయాయి. ఇలా నిర్మూలించిన తర్వాత మా పొలంలో మళ్లీ ఇంత వరకు తుంగ రాలేదు. వరి మొక్కలకు ఎటువంటి హానీ జరగలేదు. గరికను పెనం మీద మాడ్చి ద్రావణం తయారు చేసి చల్లితే 10 రోజులకు వడపడింది. పీకి చూస్తే వేరు ఎండిపోయింది. సాధారణంగా రసాయనిక కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత 48 గంటల్లో మొదట ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు.. పై నుంచి కిందకు ఎండిపోతాయి. ఈ ద్రావణం చల్లితే ఇందుకు భిన్నంగా.. మొదట వేర్లు, గడ్డలు, కాండం, కొమ్మలు, ఆకులు చివరగా ఎండుతాయి. అయితే, భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు నిర్మూలన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చల్లిన ద్రావణం వేరు ద్వారా కిందికి దిగాలంటే భూమిలో పదును ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రైతులంతా రసాయనిక కలుపు మందులు వాడి భూములను నాశనం చేసుకోకుండా, స్వల్ప ఖర్చుతో ఈ ద్రావణం తయారు చేసుకొని వాడుతూ కలుపు నిర్మూలన చేసుకుంటున్నారు. – మేకా రాధాకృష్ణమూర్తి (84669 23952), మంత్రిపాలెం, నగరం మండలం, గుంటూరు జిల్లా. -
డ్రమ్‌సీడర్‌తో సాగు సులభం
షాబాద్ : రోజు రోజుకూ తగ్గుతున్న నీటి వనరులు కూలీల కొరత, పెరుగుతున్న సాగు వ్యయం, సకాలంలో కురవని వర్షాలు, కరెంటు కోతలు వంటి సమస్యలతో వరి సాగు చేయాలంటేనే రైతులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి. వీటిన్నింటికీ కొత్త యంత్రం డ్రమ్‌సీడర్ పరిష్కారం చూపిస్తుందంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు. వరి పంట అధికంగా పండించే నియోజకవర్గంలో సమయనికి నార్లు పోసుకోలేక నాట్లు వేసుకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులు డ్రమ్ సీడర్ వాడుకొని సాగును సులభం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రత్యేకతలు కూలీల అవసరం ఎక్కువగా లేకుండా వరి విత్తనాలు విత్తుకునేందుకు డ్రమ్ సీడర్ యంత్రాన్ని రూపొందించారు. దీన్ని ప్లాస్టిక్‌తో తయారు చేయడంతో దీని బరువు కేవలం ఎనిమిది కిలోలు మాత్రమే. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ యంత్రానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెం.మీ. దూరంలో రెండు రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ముల్లో వరి గింజలు రాలడానికి వీలుగా మూడో వంతు మాత్రమే నింపాలి. ఇద్దరు చెరో వైపున పట్టుకుని లాగితే ఒకేసారి ఎనిమిది వరుసల్లో విత్తనాలు పడతాయి. వరుసలో కుదురుకు కుదురుకు మధ్యన 5 నుంచి 8 సెం.మీ. వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో కుదురులో ఐదు నుంచి ఎనిమిది విత్తనాలు రాలుతాయి. సాగు పద్ధతి సాధారణ సాగు మాదిరిగానే పొలాన్ని దున్నుకోవాలి. పొలమంతా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. విత్తన రకాన్ని బట్టి ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలను తీసుకోని నానబెట్టుకోవాలి. మొలకలు పెద్దగా వస్తే డ్రమ్ సీడర్ నుంచి రాలవు. కాబట్టి తగు మోతాదు నీళ్లలో చిన్న మొలకలు వచ్చే లా మాత్రమే విత్తనాలు నానబెట్టాలి. వీటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి గ్రాము కార్బండిజం పొడిని నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టుకోవాలి. విత్తే సమయంలో పొలంలో నీరు లేకుండా బురదగా ఉండేట్లు చూసుకోవాలి. 50 శాతం రాయితీపై లభ్యం మిగతా వ్యవసాయ యంత్రం పరికరాల్లాగే డ్రమ్ సీడర్లను కూడా వ్యవసాయశాఖ అధికారులు 50 శాతం రాయితీపై అందిస్తున్నారు. ఒక డ్రమ్ సీడర్ విలువ రూ.4వేలు ఉండగా.. రాయితీపై రూ.2వేలకు అందజేస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షాబాద్ ఏఈఓ కుమార్ సూచిస్తున్నారు.