ప్రపంచ దేశాల్లో ఉద్యోగుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అయితే ఈ సమస్యను అధిగ మించేందుకు పలు సంస్థల యజమానులు రోజూ వారి కార్యకలాపాల్ని నిర్వహించేందుకు కొత్త కొత్త టెక్నాలజీవైపు మొగ్గుచూపుతున్నారు.ఆ టెక్నాలజీలలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది ఈ రోబోట్ టెక్నాజీ. కానీ ఈ రోబోట్ టెక్నాలజీతో సంస్థలు లాభాల్ని పొందుతున్నా.. ఉద్యోగులు ఉపాధి అవకాశాలు కోల్పోతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత కఠినమైన జాబ్ మార్కెట్‌లో ఉద్యోగాల నియామకం కష్టతరంగా ఉండటం, కరోనా మహమ్మారి, రికార్డు స్థాయిలో అట్రిషన్ రేటు, ఆర్థిక సంక్షోభం వంటి కారణాల వల్ల కార్యాలయాల్లో మనుషులు చేసే పనుల్ని రోబోలతో చేయించుకుంటున్నారు. దీంతో ఇటీవలి జాబ్ మార్కెట్‌లో ఉద్యోగుల లోటు తీర్చేందుకు రోబో టెక్నాలజీ ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందని మర్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం..అసోసియేషన్ ఫర్ అడ్వాన్సింగ్ ఆటోమేషన్ నివేదికలో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రోబో ఆర్డర్‌లు 40శాతం పెరిగాయి. ఇదే ఆర్డర్‌ల సంఖ్య గతేడాది 21శాతం ఉంది. పరిశ్రమ అంచనా విలువ 1.6 బిలియన్లకు చేరుకుంది.ఈ సందర్భంగా హ్యుమన్ వర్క్ ఫోర్స్ తగ్గించి..టెక్నాలజీతో కావాల్సిన పనుల్ని చేయించుకుంటున్నారని అమెటెక్ ఐఎన్‌సీ సీఈవో డేవిడ్ తెలిపారు.
అమెరికాలో పైపైకి ఉద్యోగ అవకాశాలు
ఈ ఏడాది మార్చిలో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు రికార్డు స్థాయిలో 11.5 మిలియన్లకు చేరుకున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.అదే సమయంలో ఉద్యోగుల సంక్షోభం సంవత్సరాల పాటు కొనసాగవచ్చని అంచనా వేశారు. ఏవియేషన్ నుంచి రిటైల్ వరకు ఇలా ప్రతి రంగంలో ఉద్యోగులు లేకపోవడంతో కంపెనీలు తక్కువ వనరులతో ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆందోళనలో ఉద్యోగులు
గ్రేట్ రిజిగ్నేషన్ కారణంగా అమెరికాలో సంస్థలు రోబో టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. దీంతో ఉపాధి అవకాశాల్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా.."ఆటోమేషన్ వినియోగం వేగవంతం అయితే ఉద్యోగాల్ని కోల్పోవాల్సి ఉంటుందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ డారన్ అసెమోగ్లు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment