షాబాద్ : రోజు రోజుకూ తగ్గుతున్న నీటి వనరులు కూలీల కొరత, పెరుగుతున్న సాగు వ్యయం, సకాలంలో కురవని వర్షాలు, కరెంటు కోతలు వంటి సమస్యలతో వరి సాగు చేయాలంటేనే రైతులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి.
వీటిన్నింటికీ కొత్త యంత్రం డ్రమ్‌సీడర్ పరిష్కారం చూపిస్తుందంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు. వరి పంట అధికంగా పండించే నియోజకవర్గంలో సమయనికి నార్లు పోసుకోలేక నాట్లు వేసుకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులు డ్రమ్ సీడర్ వాడుకొని సాగును సులభం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
ప్రత్యేకతలు
కూలీల అవసరం ఎక్కువగా లేకుండా వరి విత్తనాలు విత్తుకునేందుకు డ్రమ్ సీడర్ యంత్రాన్ని రూపొందించారు. దీన్ని ప్లాస్టిక్‌తో తయారు చేయడంతో దీని బరువు కేవలం ఎనిమిది కిలోలు మాత్రమే. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ యంత్రానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెం.మీ. దూరంలో రెండు రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ముల్లో వరి గింజలు రాలడానికి వీలుగా మూడో వంతు మాత్రమే నింపాలి. ఇద్దరు చెరో వైపున పట్టుకుని లాగితే ఒకేసారి ఎనిమిది వరుసల్లో విత్తనాలు పడతాయి. వరుసలో కుదురుకు కుదురుకు మధ్యన 5 నుంచి 8 సెం.మీ. వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో కుదురులో ఐదు నుంచి ఎనిమిది విత్తనాలు రాలుతాయి.
సాగు పద్ధతి
సాధారణ సాగు మాదిరిగానే పొలాన్ని దున్నుకోవాలి. పొలమంతా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. విత్తన రకాన్ని బట్టి ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలను తీసుకోని నానబెట్టుకోవాలి. మొలకలు పెద్దగా వస్తే డ్రమ్ సీడర్ నుంచి రాలవు. కాబట్టి తగు మోతాదు నీళ్లలో చిన్న మొలకలు వచ్చే లా మాత్రమే విత్తనాలు నానబెట్టాలి. వీటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి గ్రాము కార్బండిజం పొడిని నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టుకోవాలి. విత్తే సమయంలో పొలంలో నీరు లేకుండా బురదగా ఉండేట్లు చూసుకోవాలి.
50 శాతం రాయితీపై లభ్యం
మిగతా వ్యవసాయ యంత్రం పరికరాల్లాగే డ్రమ్ సీడర్లను కూడా వ్యవసాయశాఖ అధికారులు 50 శాతం రాయితీపై అందిస్తున్నారు. ఒక డ్రమ్ సీడర్ విలువ రూ.4వేలు ఉండగా.. రాయితీపై రూ.2వేలకు అందజేస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షాబాద్ ఏఈఓ కుమార్ సూచిస్తున్నారు.
డ్రమ్‌సీడర్‌తో సాగు సులభం
Published Mon, Aug 25 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM
Advertisement