నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి
సుమోటో పిల్ విచారణలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నీటి వనరుల పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలు, వాటి పరిరక్షణకు ఏం చేస్తున్నారో వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, హోంశాఖ, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ మహానగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్ మారే ప్రమాదం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదిక ప్రభుత్వం నీటి వనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం సుమోటో పిల్‌గా విచారణ చేపట్టేందుకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment