drum seeder
-
పార్వతీపురం రైతుకు పేటెంట్ మంజూరు చేసిన భారత ప్రభుత్వం
బహుళ పంటలను ఒకేసారి విత్తుకునేందుకు అన్ని విధాలుగా రైతుకు ఉపయోగకరమైన వినూత్న పరికరం (డ్రమ్‌సీడర్)ను రూపొందించిన పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన గ్రామీణ ఆవిష్కర్త దమరసింగి బాబూరావుకు భారత ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. తొలుత ఇనుముతో తయారు చేసిన ఈ పరికరంపై పేటెంట్‌కు 2015లోనే ఆయన దరఖాస్తు చేయగా, ఇటీవలే పేటెంట్ సర్టిఫికెట్ అందింది. తదనంతరం మరింత తేలిగ్గా ఉండాలన్న లక్ష్యంతో స్టెయిన్లెస్ స్టీల్‌తో తక్కువ బరువుతో ఉండేలా, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా బాబూరావు దీన్ని మెరుగుపరిచారు. 2 ఎం.ఎం. సైజు నుంచి 16 ఎం.ఎం. సైజు వరకు ఎంత సైజు ఉన్న ఏ పంట విత్తనాలనైనా స్వయంగా రైతే స్వల్ప మార్పులు చేసుకోవటానికి, వరుసల మధ్య దూరాన్ని కూడా అనుకూలంగా సులువుగా మార్చుకోవటానికి ఈ డ్రమ్‌సీడర్ అనువుగా ఉంది. పత్తి, పెసలు, కందులు వంటి మూడు పంటలను ఒకేసారి విత్తుకోవడానికి ఈ ఆధునిక డ్రమ్‌సీడర్ ఉపయోగపడుతుండటం విశేషం. అన్ని రకాల చిరుధాన్యాలు, నువ్వులు, వేరుశనగ, బఠాణి, గోధుమ, వరి, పెసర, మినుము, పుల్లశనగ, పెద్ద బఠాణి, పెద్ద వేరుశనగలను సైతం దీనితో విత్తుకోవచ్చు. దీనికి ఏడు సీడ్ బాక్సులు అమర్చారు. రైతులే మార్పులు చేసుకోవచ్చు 2.5 అడుగులు (30 అంగుళాల) ఎత్తున ఇరువైపులా చక్రాలను అమర్చటం, 6 అంగుళాల వెడల్పు గల చక్రాలను అమర్చటంతో దీన్ని ఉపయోగించటం సులువు. పెద్ద చక్రాలను ఏర్పాటు చేయటం, పంటను బట్టి విత్తనం సైజును బట్టి, వరుసల మధ్య దూరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి చక్రాలను ఇప్పి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా రెండు స్క్రూలు ఇప్పితే చాలు అవసరమైన మార్పులు మెకానెక్ అవసరం లేకుండా రైతే స్వయంగా చేసుకోవచ్చని, అందుకే ఈ డ్రమ్‌సీడర్ తక్కువ కాలంలోనే రైతుల ఆదరణ పొందిందని బాబూరావు ‘సాక్షి’తో చెప్పారు. నాలుగు వేరియంట్లు ఎకనామిక్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ అని పిలుస్తున్నారు. ఇందులో నాలుగు వేరియంట్లను బాబూరావు రైతులకు అందుబాటులోకి తెచ్చారు. పొలంలో యంత్రాలు అవసరం లేకుండా ఇద్దరు మనుషులు సులువుగా లాగుతూ విత్తనాలు వేసుకునే విధంగా, జోడెడ్లకు కట్టి లాక్కెళ్లేలా, ట్రాక్టర్‌కు వెనుక బిగించే విధంగా, 6.5 హెచ్‌పి హోండా ఇంజన్‌తో అనుసంధానం చేసి ఒక మనిషి నడిపే విధంగా స్టెయిన్లెస్ స్టీల్‌తో డ్రమ్సీడర్లను ఆయన రూపొందించారు. వేరియంట్‌ను బట్టి దాని ధర, బరువు ఆధారపడి ఉంటుంది. మనుషులు లక్కెళ్లే దాని బరువు 25 కిలోలు ఉంటుంది. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసేది 80 కిలోల బరువు ఉంటుంది. ‘ఆంగ్రూ’ పోషణ్ ఇంక్యుబేషన్ సెంటర్ బాబూరావుకు రూ. 4 లక్షల గ్రాంటు ఇవ్వటం విశేషం. పల్లెసృజన తోడ్పాటుతో రాష్ట్రపతి భవన్‌లోని ఇన్నోవేషన్ ఫెస్టివల్‌తో పాటు అనేక మేళాల్లో బాబూరావు (94409 40025) ఈ డ్రమ్‌సీడర్‌ను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ప్రకృతి సేద్యంపై ఎన్‌ఐపిహెచ్‌ఎం సర్టిఫికెట్ కోర్సు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేపట్టదలచిన/ చేపట్టిన కనీసం ఇంటర్ చదివిన యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు అనుబంధ సంస్థ, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) సర్టిఫికెట్ కోర్సు నిర్వహించనుంది. ‘ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలో మొక్కల ఆరోగ్య యాజమాన్యం’ పేరుతో వచ్చే డిసెంబర్ నుంచి 3 నెలల సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సు కాలపరిమితి డిసెంబర్ 6 నుంచి 2014 మార్చి 13 వరకు. యువతీ యువకులకు శిక్షణ ఇవ్వటం ద్వారా గ్రామస్థాయిలో మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యం. తరగతి గదిలో పాఠాలతో పాటు పొలంలో పని చేస్తూ నేర్చుకునే పద్ధతులు కూడా ఈ కోర్సులో భాగం చేశారు. ఇంటర్ పూర్తి చేసిన లేదా వ్యవసాయ పాలిటెక్నిక్ పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన గ్రామీణ యువతకు ఈ కోర్సు అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. కోర్సు ఫీజు రూ. 7,500. ఎన్‌ఐపిహెచ్‌ఎంలో ఉండి శిక్షణ పొందే రోజుల్లో ఉచిత వసతి కల్పిస్తారు. భోజన ఖర్చులు అభ్యుర్థులే భరించాల్సి ఉంటుంది. కోర్సు డైరెక్టర్‌గా డా. ఒ.పి. శర్మ వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా. కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. నవంబర్ 20లోగా ఫీజు చెల్లించి, దరఖాస్తులు పంపాలి. డిసెంబర్ 22 నుంచి ఏపీ పుష్ప ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాలుగో పుష్ప ప్రదర్శన, అమ్మకం కార్యక్రమాన్ని డిసెంబర్ 22 నుంచి 27 వరకు జరగనుంది. విజయవాడలోని (పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు) సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజి గ్రౌండ్లో జరుగుతుంది. వివరాలకు.. 93935 77018. -
పెద్దగా కూలీల అవసరం లేకుండానే వరిని సాగుచేసే అవకాశం
-
డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు...!
-
డ్రమ్‌సీడర్‌తో సాగు సులభం
షాబాద్ : రోజు రోజుకూ తగ్గుతున్న నీటి వనరులు కూలీల కొరత, పెరుగుతున్న సాగు వ్యయం, సకాలంలో కురవని వర్షాలు, కరెంటు కోతలు వంటి సమస్యలతో వరి సాగు చేయాలంటేనే రైతులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి. వీటిన్నింటికీ కొత్త యంత్రం డ్రమ్‌సీడర్ పరిష్కారం చూపిస్తుందంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు. వరి పంట అధికంగా పండించే నియోజకవర్గంలో సమయనికి నార్లు పోసుకోలేక నాట్లు వేసుకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులు డ్రమ్ సీడర్ వాడుకొని సాగును సులభం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రత్యేకతలు కూలీల అవసరం ఎక్కువగా లేకుండా వరి విత్తనాలు విత్తుకునేందుకు డ్రమ్ సీడర్ యంత్రాన్ని రూపొందించారు. దీన్ని ప్లాస్టిక్‌తో తయారు చేయడంతో దీని బరువు కేవలం ఎనిమిది కిలోలు మాత్రమే. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ యంత్రానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెం.మీ. దూరంలో రెండు రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ముల్లో వరి గింజలు రాలడానికి వీలుగా మూడో వంతు మాత్రమే నింపాలి. ఇద్దరు చెరో వైపున పట్టుకుని లాగితే ఒకేసారి ఎనిమిది వరుసల్లో విత్తనాలు పడతాయి. వరుసలో కుదురుకు కుదురుకు మధ్యన 5 నుంచి 8 సెం.మీ. వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో కుదురులో ఐదు నుంచి ఎనిమిది విత్తనాలు రాలుతాయి. సాగు పద్ధతి సాధారణ సాగు మాదిరిగానే పొలాన్ని దున్నుకోవాలి. పొలమంతా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. విత్తన రకాన్ని బట్టి ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలను తీసుకోని నానబెట్టుకోవాలి. మొలకలు పెద్దగా వస్తే డ్రమ్ సీడర్ నుంచి రాలవు. కాబట్టి తగు మోతాదు నీళ్లలో చిన్న మొలకలు వచ్చే లా మాత్రమే విత్తనాలు నానబెట్టాలి. వీటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి గ్రాము కార్బండిజం పొడిని నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టుకోవాలి. విత్తే సమయంలో పొలంలో నీరు లేకుండా బురదగా ఉండేట్లు చూసుకోవాలి. 50 శాతం రాయితీపై లభ్యం మిగతా వ్యవసాయ యంత్రం పరికరాల్లాగే డ్రమ్ సీడర్లను కూడా వ్యవసాయశాఖ అధికారులు 50 శాతం రాయితీపై అందిస్తున్నారు. ఒక డ్రమ్ సీడర్ విలువ రూ.4వేలు ఉండగా.. రాయితీపై రూ.2వేలకు అందజేస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షాబాద్ ఏఈఓ కుమార్ సూచిస్తున్నారు. -
ఈ సీడర్‌తో అన్నీ కలిసొస్తాయి
గత దశాబ్ద కాలంలో వరి సేద్య పద్ధతుల్లో ఎన్నో విప్లవాత్మక మా ర్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో డ్రమ్‌సీడర్ వినియోగం ఒకటి. దీనివల్ల విత్తన మోతాదు, నీటి వినియోగం, చీడపీడల బెడద, పంటకాలం, సాగు ఖర్చు... ఇవన్నీ తగ్గుతాయి. ఒకవేళ డ్రమ్‌సీడర్ అందుబాటులో లేకుంటే మొలకెత్తిన విత్తనాలను చేలో నేరుగా వెదజల్లవచ్చు. ఈ నేపథ్యంలో డ్రమ్‌సీడర్ వినియోగంపై ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.సంధ్యారాణి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఓ.శారద, ఎం.సునీల్ కుమార్ అందిస్తున్న సూచనలు... వరి పండించే భూములన్నింటిలోనూ డ్రమ్‌సీడర్‌ను ఉపయోగించవచ్చు. అయితే సమస్యాత్మక నేలలు పనికిరావు. సాధారణ పద్ధతిలో మాదిరిగానే పొలాన్ని తయారు చేయాలి. పొలం లో నీరు నిల్వ ఉండకూడదు. ఒకవేళ నీరు ఎక్కువైతే బయటికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. వీలైనంత వరకూ పొలా న్ని చదును చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకుంటే చదును చేయడం, నీరు పెట్టడం తేలికవుతుంది. ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో విత్తనాలు వేసే రోజే ఆఖరి దమ్ము చేసి, చదును చేసి, పలచని నీటి పొర ఉండేలా చూసుకోవాలి. ఎలా వేయాలి? రకాన్ని బట్టి ఎకరానికి 10-15 కిలోల విత్తనాలు సరిపోతాయి. కాండం గట్టిగా-వేరు వ్యవస్థ దృఢంగా ఉండి, పడిపోని రకాలైతే బాగా అనువుగా ఉంటాయి. విత్తనాలను ముందుగా 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని గోనెసంచిలో వేసి లేదా వాటిపై గోనెసంచిని కప్పి 24 గంటల పాటు మండె కడితే విత్తనాలు మొలకెత్తుతాయి. వాటిని నీడలో ఆరబెట్టి, ఆ తర్వాతే సీడర్లో నింపాలి. విత్తనాలు వేసేటప్పుడు చేను బురద పదును మీద ఉంటే సరిపోతుంది. సీడర్కు 4 ప్లాస్టిక్ డబ్బాలు, ఒక్కో డబ్బాకు 18 రంధ్రాలు ఉంటాయి. రంధ్రాల మధ్య 2.5-3 సెంటీమీటర్లు, డబ్బాల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఒకసారి సీడర్‌ను లాగితే 8 వరుసల్లో, 20 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు పడతాయి. గింజలు పొలంలో రాలడానికి వీలుగా ప్రతి డబ్బాలో 3/4వ వంతు మాత్రమే విత్తనాలను నింపాలి. సీడర్‌ను నేర్పుగా, ఒకే వేగంతో లాగాలి. విత్తిన 24 గంటల వరకూ నీరు పెట్టకూడదు. కలుపు సమస్య ఎక్కువే తొలి దశలో చేలో నీరు నిలగట్టకుండా, ఆరుతడిగా వరిని సాగు చేయడం వల్ల కలుపు సమస్య ఎక్కువగానే ఉంటుంది. దాని నివారణకు విత్తనాలు వేసిన 2-3 రోజుల్లో ఎకరానికి 200 లీటర్ల నీటిలో లీటరు పెండిమిధాలిన్/400 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్/35 గ్రాముల ఆక్సాడయార్జిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే 200 లీటర్ల నీటిలో 80-100 మిల్లీలీటర్ల బిస్ పైరిబాక్ సోడియం కలిపి పిచికారీ చేయాలి. ఊద ఎక్కువగా ఉంటే 200 లీటర్ల నీటిలో 300-400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్‌ను, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే 400 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. కలుపు మొక్కలపై పడేలా మందును పిచికారీ చేయాలి. ఆ సమయంలో చేలో నీరు ఉండకూడదు. పైరు పెరిగే దశలో కూలీలతో కలుపు తీయించాలి. నీరు-ఎరువుల యాజమాన్యం విత్తనాలు వేసినప్పటి నుంచి పైరు పొట్ట దశకు చేరుకునే వరకూ చేను బురద పదును మీద ఉంటే సరిపోతుంది. అప్పటి నుంచి కోతకు వారం పది రోజుల ముందు వరకూ చేలో 2 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉండాలి. సిఫార్సు చేసిన భాస్వరం ఎరువు మొత్తాన్నీ దమ్ములోనే వేయాలి. పొటాష్‌ను 2 సమాన భాగాలుగా చేసుకొని దమ్ములో, పైరు 60-65 దశలో (మూడో దఫా నత్రజని ఎరువుతో కలిపి) వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 సమాన భాగాలుగా చేసి విత్తిన 15-20 రోజులకు, 40-45 రోజులకు, 60-65 రోజులకు మూడు దఫాలుగా వేసుకోవాలి. ఎన్నో ప్రయోజనాలు డ్రమ్‌సీడర్‌ను వినియోగించడం వల్ల పంట వారం పది రోజుల ముందే కోతకు వస్తుంది. నారుమడి పెంపకం, నాట్లు వేయడం వంటి పనులు ఉండవు కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ.3,000 వరకూ తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడినంత ఉండడం వల్ల దిగుబడి 10-15% పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేయవచ్చు. ఎకరం పొలంలో విత్తనాలు వేయడానికి 2 గంటలు చాలు. పైగా ఒకరిద్దరు ఉంటే సరిపోతుంది. చీడపీడల తాకిడి కూడా తక్కువగానే ఉంటుంది. కోనోవీడర్ నడిపితే... డ్రమ్ సీడర్‌తో విత్తినప్పుడు, విత్తిన 20-25 రోజులకు చేలో కోనోవీడర్‌ను నడపాలి. దీనివల్ల కలుపు మొక్కలు భూమిలో కలిసిపోతాయి. ఆ తర్వాత చేలో కలుపు ఉన్నా, లేకపోయినా 10 రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు కోనోవీడర్‌ను తిప్పితే భూమి బాగా కదిలి, వేరు వ్యవస్థకు గాలి-పోషకాల లభ్యత పెరుగుతుంది. పీచు వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది. పిలకలు ఎక్కువ సంఖ్యలో వచ్చి, మొక్క గుబురుగా ఉంటుంది. దిగుబడి పెరుగుతుంది. కోనోవీడర్‌ను నడపడానికి ముందు రోజు సాయంత్రం పొలానికి పలచగా నీరు పెట్టాలి.