న్యూజిలాండ్‌ వీసా నిబంధనల్లో... సడలింపులు | New Zealand Announces Major Changes To Visa Rules, Check Out All The Details Inside | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ వీసా నిబంధనల్లో... సడలింపులు

Published Tue, Jan 7 2025 5:44 AM | Last Updated on Tue, Jan 7 2025 8:26 AM

New Zealand announces major changes to visa rules

వెల్లింగ్టన్‌: కార్మికుల కొరత తదితరాల నేపథ్యంలో వీసా నిబంధనలను న్యూజిలాండ్‌ సరళతరం చేసింది. ఇమిగ్రేషన్‌ ప్రక్రియను క్రమబద్దీకరిస్తూ గణనీయమైన మార్పులు చేసింది. పని అనుభవం, వేతనాలు, వీసా వ్యవధి తదితరాలను మార్చింది. న్యూజిలాండ్‌లో ఉపాధి పొందాలనుకునే కార్మికులకు కనీస అనుభవ అర్హతను మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. దాంతో ఇకపై ఆ దేశంలో ఉపాధి పొందడం మరింత సులభతరం కానుంది. న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. 

వీసాల్లో మార్పు..  
సీజనల్‌ వర్కర్లు న్యూజిలాండ్‌లో ఉండేందుకు రెండు కొత్త మార్గాలను కూడా ప్రవేశపెట్టారు. అనుభవజు్ఞలైన సీజనల్‌ కార్మికులకు మూడేళ్ల మల్టీ–ఎంట్రీ వీసా, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల సింగిల్‌–ఎంట్రీ వీసాలు ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన ఎంప్లాయర్‌ వర్క్‌ వీసా (ఏఈడబ్ల్యూవీ), స్పెసిఫిక్‌ పర్పస్‌ వర్క్‌ వీసా (ఎస్పీడబ్ల్యూవీ)లకు సగటు వేతన ప్రమాణాలను తొలగించారు. 

కొత్త నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగ అవకాశాలను పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది. మార్కెట్‌ రేటు ప్రకారం జీతాలివ్వాల్సి ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్‌ అండ్‌ న్యూజిలాండ్‌ స్టాండర్డ్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఆక్యుపేషన్స్‌ (ఏఎన్‌జెడ్‌ఎస్‌సీఓ) స్కిల్‌ లెవల్స్‌ 4 లేదా 5 పరిధిలోకి వచ్చే ఉద్యోగాలకు రెండేళ్ల వీసా వ్యవధిని మూడేళ్లకు పెంచారు. ఇప్పటికే రెండేళ్ల వీసా ఉన్న ఉద్యోగులు ఏడాది పొడిగింపు కోరవచ్చు. వలసదారులు తమ పిల్లలను వెంట తీసుకొచ్చేందుకు కనీస వార్షిక వేతనాన్ని 55,844 డాలర్లకు పెంచారు. 

విద్యార్థుల వీసాలో సవరణ 
పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా (పీఎస్‌ డబ్ల్యూవీ)ను కూడా న్యూజిలాండ్‌ సవరించింది. దీని ప్రకారం విద్యార్థులు అర్హతలను బట్టి అక్కడ మూడేళ్ల పాటు ఉండటానికి, పని చేయడానికి అనుమతిస్తారు. పీజీ డిప్లొమా తర్వాత మాస్టర్స్‌ పూర్తి చేసిన విద్యార్థులు పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసాకు అర్హత కోల్పోకుండా ఉండేందుకూ ఈ నిబంధనలు వీలు కలి్పస్తాయి.  శ్రామిక రంగ కంపెనీలకు కార్మికులను తీసుకోవడం మరింత సులభతరం కానుంది. స్టూడెంట్‌ వీసా తదితరాల నుంచి ఏఈడబ్ల్యూవీకి మారాలనుకునే వలసదారులకు వచ్చే ఏప్రిల్‌ నుంచి మధ్యంతర పని హక్కులు కూడా ఇస్తారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement