Simplification Terms
-
న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో... సడలింపులు
వెల్లింగ్టన్: కార్మికుల కొరత తదితరాల నేపథ్యంలో వీసా నిబంధనలను న్యూజిలాండ్ సరళతరం చేసింది. ఇమిగ్రేషన్ ప్రక్రియను క్రమబద్దీకరిస్తూ గణనీయమైన మార్పులు చేసింది. పని అనుభవం, వేతనాలు, వీసా వ్యవధి తదితరాలను మార్చింది. న్యూజిలాండ్‌లో ఉపాధి పొందాలనుకునే కార్మికులకు కనీస అనుభవ అర్హతను మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. దాంతో ఇకపై ఆ దేశంలో ఉపాధి పొందడం మరింత సులభతరం కానుంది. న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వీసాల్లో మార్పు.. సీజనల్ వర్కర్లు న్యూజిలాండ్‌లో ఉండేందుకు రెండు కొత్త మార్గాలను కూడా ప్రవేశపెట్టారు. అనుభవజు్ఞలైన సీజనల్ కార్మికులకు మూడేళ్ల మల్టీ–ఎంట్రీ వీసా, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల సింగిల్–ఎంట్రీ వీసాలు ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన ఎంప్లాయర్ వర్క్ వీసా (ఏఈడబ్ల్యూవీ), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (ఎస్పీడబ్ల్యూవీ)లకు సగటు వేతన ప్రమాణాలను తొలగించారు. కొత్త నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ రేటు ప్రకారం జీతాలివ్వాల్సి ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ఏఎన్జెడ్ఎస్సీఓ) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 పరిధిలోకి వచ్చే ఉద్యోగాలకు రెండేళ్ల వీసా వ్యవధిని మూడేళ్లకు పెంచారు. ఇప్పటికే రెండేళ్ల వీసా ఉన్న ఉద్యోగులు ఏడాది పొడిగింపు కోరవచ్చు. వలసదారులు తమ పిల్లలను వెంట తీసుకొచ్చేందుకు కనీస వార్షిక వేతనాన్ని 55,844 డాలర్లకు పెంచారు. విద్యార్థుల వీసాలో సవరణ పోస్ట్ స్టడీ వర్క్ వీసా (పీఎస్ డబ్ల్యూవీ)ను కూడా న్యూజిలాండ్ సవరించింది. దీని ప్రకారం విద్యార్థులు అర్హతలను బట్టి అక్కడ మూడేళ్ల పాటు ఉండటానికి, పని చేయడానికి అనుమతిస్తారు. పీజీ డిప్లొమా తర్వాత మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు అర్హత కోల్పోకుండా ఉండేందుకూ ఈ నిబంధనలు వీలు కలి్పస్తాయి. శ్రామిక రంగ కంపెనీలకు కార్మికులను తీసుకోవడం మరింత సులభతరం కానుంది. స్టూడెంట్ వీసా తదితరాల నుంచి ఏఈడబ్ల్యూవీకి మారాలనుకునే వలసదారులకు వచ్చే ఏప్రిల్ నుంచి మధ్యంతర పని హక్కులు కూడా ఇస్తారు. -
సెజ్‌ల నిబంధనల సరళతరంపై కసరత్తు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నిబంధనలు సరళతరం చేయడంపైనా, వీటి నుంచి యూనిట్లు వైదొలిగే ప్రక్రియను సులభతరం చేయడంపైనా కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ ఈ విషయాలు తెలిపారు. డిమాండ్ అంతగా లేని ప్రాంతాల్లోని ప్రస్తుత సెజ్‌ల గుర్తింపును పాక్షికంగా ఉపసంహరించి, ఆయా స్థలాలను పారిశ్రామిక.. ఇతరత్రా అవసరాలకు వినియోగించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. సెజ్‌లకు పన్ను రాయితీల గడువు ముగిసిపోతున్నందున వీటిలో యూనిట్లను ఏర్పాటు చేయడానికి కొత్త వ్యాపారవేత్తలు పెద్ద స్థాయిలో ఆసక్తి చూపకపోవచ్చని గోయల్ తెలిపారు. ముంబైలోని శాంటాక్రూజ్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎగుమతిదారులతో భేటీ సందర్భంగా గోయల్ ఈ విషయాలు వివరించారు. 2020 మార్చి 31లోగా కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త సెజ్ యూనిట్లకు మాత్రమే ఆదాయ పన్నుపరమైన ప్రయోజనాలు లభిస్తాయంటూ 2016–17 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం షరతు పెట్టింది. ఎగుమతి హబ్‌లుగా ఎదిగిన సెజ్‌లు.. ప్రత్యామ్నాయ పన్ను వడ్డన, రాయితీల ఉపసంహరణ గడువు విధింపు వంటి అంశాల కారణంగా క్రమంగా ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లాజిస్టిక్స్ సెంటర్ ప్రారంభం.. మరోవైపు, ముంబైలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను గోయల్ ప్రారంభించారు. అంతర్జాతీయంగా పోటీ, ఆర్థిక సంక్షోభపరమైన సవాళ్ల కారణంగా సరఫరా వ్యవస్థలను నిర్వహించడం మరింత సంక్లిష్టంగా మారిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అధునాతన పరిశోధనలు, లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపు తదితర అంశాల్లో పరిశ్రమకు కేంద్రం తగు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. -
వ్యాపార నిబంధనల సరళీకరణపై దృష్టిపెట్టండి
ప్రభుత్వానికి నాస్కామ్ సూచన న్యూఢిల్లీ: ‘వ్యాపారాన్ని ప్రారంభించేందుకు భారత్‌లో ఉన్న నిబంధనల సరళీకరణపై ప్రభుత్వం దృష్టిసారించాలి. మంచి ఊపు మీదున్న స్టార్టప్ రంగంలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నంపై కాదు’ అని నాస్కామ్ సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నా, పలు అనుమతులు, క్లియరెన్సులు వ్యాపారాల ప్రారంభానికి ఆటంకంగా ఉన్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. భారత్‌లో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘చక్కని వ్యాపార ఆలోచనలు, ఔత్సాహిక వ్యాపారవేత్తల సంఖ్య కంటే పెట్టుబడి చేయదగ్గ డబ్బే అధికంగా ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడికి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా నగదు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కంపెనీల్లో పెట్టుబడి చేయాల్సిన అవసరం లేదు. వ్యాపార ప్రారంభం, నిబంధనల అమలు భారం, మూసివేతలో ఇబ్బందులు పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి’ అని వివరించారు. ఆ చర్చే లేదిక్కడ..: వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఎన్ని గంటల సమయం తీసుకుంటుంది అన్న అంశంపై పలు దేశాలు పోటీపడుతున్నాయి. అసలు భారత్‌లో ఆ చర్చే లేదని చంద్రశేఖర్ అన్నారు. ‘3-4 ఉద్యోగులతో కొత్త వ్యాపారం ఏర్పాటుకు పారిశ్రామికవేత్త 50-60 అనుమతులు, క్లియరెన్సులు వివిధ శాఖల నుంచి తీసుకోవాల్సి వస్తోంది. సులభతర నిబంధనలు తీసుకురావడం చాలా సులువు. నిబంధనలు వద్దని నేను చెప్పడం లేదు. టెక్నాలజీ స్టార్టప్స్ వంటి కొన్ని రంగాల కంపెనీలకు ఇన్ని అనుమతులు, క్లియరెన్సులు అవసరం లేదు. స్టార్టప్‌ల ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలను ఒకే పరిధి కిందకు తెచ్చే పథకాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉంది’ అని వివరించారు.