న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నిబంధనలు సరళతరం చేయడంపైనా, వీటి నుంచి యూనిట్లు వైదొలిగే ప్రక్రియను సులభతరం చేయడంపైనా కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ ఈ విషయాలు తెలిపారు. డిమాండ్ అంతగా లేని ప్రాంతాల్లోని ప్రస్తుత సెజ్‌ల గుర్తింపును పాక్షికంగా ఉపసంహరించి, ఆయా స్థలాలను పారిశ్రామిక.. ఇతరత్రా అవసరాలకు వినియోగించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు.
సెజ్‌లకు పన్ను రాయితీల గడువు ముగిసిపోతున్నందున వీటిలో యూనిట్లను ఏర్పాటు చేయడానికి కొత్త వ్యాపారవేత్తలు పెద్ద స్థాయిలో ఆసక్తి చూపకపోవచ్చని గోయల్ తెలిపారు. ముంబైలోని శాంటాక్రూజ్ ఎలక్ట్రానిక్ ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎగుమతిదారులతో భేటీ సందర్భంగా గోయల్ ఈ విషయాలు వివరించారు. 2020 మార్చి 31లోగా కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త సెజ్ యూనిట్లకు మాత్రమే ఆదాయ పన్నుపరమైన ప్రయోజనాలు లభిస్తాయంటూ 2016–17 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం షరతు పెట్టింది. ఎగుమతి హబ్‌లుగా ఎదిగిన సెజ్‌లు.. ప్రత్యామ్నాయ పన్ను వడ్డన, రాయితీల ఉపసంహరణ గడువు విధింపు వంటి అంశాల కారణంగా క్రమంగా ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
లాజిస్టిక్స్ సెంటర్ ప్రారంభం..
మరోవైపు, ముంబైలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌ను గోయల్ ప్రారంభించారు. అంతర్జాతీయంగా పోటీ, ఆర్థిక సంక్షోభపరమైన సవాళ్ల కారణంగా సరఫరా వ్యవస్థలను నిర్వహించడం మరింత సంక్లిష్టంగా మారిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అధునాతన పరిశోధనలు, లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపు తదితర అంశాల్లో పరిశ్రమకు కేంద్రం తగు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment