Special Economic Zone
-
‘రీజనల్’ చుట్టూ సెజ్‌లు!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిని గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనుండటంతో..ఈ రోడ్డు ఉండే చాలా ప్రాంతాలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. అక్కడి భూములకు డిమాండ్ పెరుగుతుంది, రోడ్డు సదుపాయం వల్ల పరిశ్రమల స్థాపనకూ వీలవుతుంది. అలాంటి చోట్ల ‘స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)’లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గం సుగమం అవుతుందని.. అదే సమయంలో సెజ్‌లలో కంపెనీలకు భూములు కేటాయించటం ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇది సాకారం కావాలంటే.. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారయ్యే ప్రాంతా ల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టాల్సి ఉండనుంది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ సాధ్యాసా ధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.గతంలోనే ప్రతిపాదనలున్నా..హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల నిడివితో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్).. నగర రూపురేఖలను మార్చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా 2006లో ఓఆర్ఆర్ నిర్మాణానికి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ శంకుస్థాపన చేశారు. ఆరేళ్ల తర్వాత దశలవారీగా అది అందుబాటులోకి వచ్చింది. ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మంచి పురోగతి మొదలైంది. డిమాండ్ పెరిగింది. కానీ ఆ రోడ్డును ఆనుకుని ప్రభుత్వానికి కొత్తగా భూవనరులేవీ సమకూరకపోవడంతో.. అదనపు ఆదాయమేదీ రాలేదు. భవిష్యత్తులో రీజనల్ రింగురోడ్డు కూడా ఔటర్ రింగు రోడ్డు తరహాలోనే ఆయా ప్రాంతాలకు కొత్త రూపును ఇవ్వడం ఖాయమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఔటర్ నిర్మాణ సమయంలో ప్రభుత్వం సొంతంగా ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోకపోవటం వంటి పొరపాటును ఇప్పుడు చేయవద్దని.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొంత భూమిని సేకరించి పెట్టుకోవాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.అలైన్మెంట్ మార్పు నేపథ్యంలో..రీజనల్ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని సొంతంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో రూపొందించిన అలైన్‌మెంట్‌ను కాదని.. కొత్త అలైన్‌మెంట్‌ను రూపొందిస్తోంది. భూసేకరణ వ్యయంలో 50శాతం భరించటం మినహా మొత్తం నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించే అవకాశాన్ని కూడా కాదనుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ సాహసానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రింగ్‌రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునే అంశంపై దృష్టి పడింది.అంత భూసేకరణ సాధ్యమేనా?రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి 2 వేల హెక్టార్ల భూమి అవసరమవుతోంది. దానికంటే దక్షిణ రింగ్ దాదాపు 50 కిలోమీటర్ల నిడివి ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తోంది. అంటే సుమారు 2,400 హెక్టార్లకుపైగా భూమి రోడ్డు నిర్మాణానికే కావాలి. ఈ భూముల సేకరణ ఎలాగన్నది చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే రీజనల్ ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అలాంటిది రోడ్డు కోసమే కాకుండా అదనంగా భూమిని సేకరించడం ఎంతవరకు సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో మల్లన్నసాగర్, ఇతర ప్రాజెక్టులకు భూములి చ్చేందుకు రైతులు ఇష్టపడక న్యాయ పోరాటం చేశారు. ఇప్పుడు రీజనల్ రింగ్ విషయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు కాకుంటే.. రీజనల్ రోడ్డు వెంట భవిష్యత్తులో భూమిని సమీకరించడం సాధ్యమయ్యే పనికాదని.. ఇప్పుడే ముందుకెళ్తే ప్రయోజనమని అధికారవర్గాలు చెబుతు న్నాయి. -
అచ్యుతాపురం సెజ్ ఘటన.. 15కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. మధ్యాహ్నం రియాక్టర్ పేలే సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక గాయపడిన క్షతగాత్రుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు గాయపడ్డ క్షతగాత్రుల సంఖ్య 50 దాటింది. మరణించిన వారిలో చల్లపల్లి హారిక (24), పూడి మోహన్ (23), దుర్గా ప్రసాద్, చిన్నారావులు,రాజశేఖర్ ఉన్నారు. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు1. వి. సన్యాసినాయుడు (50), ప్లాంట్ ఏజీఎం2. రామిరెడ్డి, ల్యాబ్ హెడ్3. హారిక కెమిస్ట్4. పార్థసారథి(23), ప్రొడక్షన్ ఆపరేటర్5. వై. చిన్నారావు, ప్లాంట్ హెల్పర్6.పి.రాజశేఖర్ (22)7. మోహన్, ఆపరేటర్8. గణేష్, ఆపరేటర్9. హెచ్. ప్రశాంత్10. ఎం. నారాయణరావు.. మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులకు అందని మెరుగైన వైద్యం👉 ఎసెన్షియా కంపెనీ ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు అందని మెరుగైన వైద్యం👉 అత్యవసర మెరుగైన వైద్యం అందించకపోతే క్షతగాత్రుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం 👉 వైద్యం అందడం లేదని అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్న క్షతగాత్రులు 👉 అటు ఇటు తిరుగుతూ అధికారులు హడావిడి చేస్తున్నారే తప్ప మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవడం లేదని బాధితుల ఆగ్రహం చేతులెత్తేసిన ఫైర్ ఫైటర్స్👉 పెరిగి పోతున్న మృతుల సంఖ్య 👉మృతదేహాల వెలికితీత లో చేతులెత్తిశిన ఫైర్ ఫైటర్స్👉 కైలసపురం నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు👉 గ్యాస్ కట్టర్లతో శిధిలాలను తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు👉శిధిలాల కింద పదుల సంఖ్యలో మృతదేహాలుఅధికారులు పట్టించుకోవడం లేదు👉ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు రాలేదు👉కంపెనీ బస్సులోనే గాయాలతో మేమంతా ఆసుపత్రికి వచ్చాం👉ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించడం లేదు👉నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది అయినా డాక్టర్లు పట్టించుకోవడం లేదు👉అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు👉క్షతగాత్రులు అందరినీ మెరుగైన చికిత్స కోసం వైజాగ్ తరలించవచ్చు కానీ ఆ ప్రక్రియ ఇక్కడ జరగడం లేదు..- నాయుడు, క్షతగాత్రుడు ఏడు అంతస్తుల ఎసెన్షియా కంపెనీలో మూడోఫ్లోర్‌లో 500 కిలో లీటర్ రియాక్టర్ పేలినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు దాటికి మూడోఫ్లోర్ గోడలు ధ్వంసం అయ్యాయి. దీంతో స్లాబు కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. శిధిలాల కింద చిక్కుకున్న కార్మికుల్ని రక్షించేందుకు పొక్లెయిన్ సహాయంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. 300 మంది కార్మికులు పనిచేస్తున్న ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం అనకాపల్లి ఉష ప్రైమ్ ఆసుపత్రికి తరలించి, వారికి చికిత్సను అందిస్తున్నారు. వారిలో చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక ఘటనా స్థలానికి చేరుకుంది. 15 ఫైరింజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మరో రియాక్టర్ పేలే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలు పెట్టారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెనుప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
సెజ్ నిబంధనల సరళతరంపై దృష్టి - పియుష్ గోయల్
ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) అభివృద్ధికి దోహదపడేలా కొన్ని నిబంధనలను సరళతరం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. వాణిజ్యం, కస్టమ్స్ సుంకాలపరంగా భారత్‌లోని సెజ్‌లను విదేశీ భాగంగా పరిగణిస్తారు. దేశీయంగా విక్రయించుకోవడానికి వీటిలోని యూనిట్లకు ఆంక్షలు వర్తిస్తాయి. వీటిని సడలించాలంటూ సెజ్‌లు కోరుతున్న నేపథ్యంలో గోయల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎగుమతులపై సుంకాల రీఫండ్‌కు సంబంధించిన ఆర్వోడీటీఈపీ పథకం ప్రయోజనాలను సెజ్‌లకు కూడా వర్తింపచేయాలన్న సెజ్ యూనిట్ల విజ్ఞప్తి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గోయల్ చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు విరుద్ధంగా ఉండదని నమ్మకం కలిగినప్పుడు దాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. 2021లో ప్రవేశపెట్టిన ఈ పథకంలో యార్న్, డెయిరీ వంటి 8,500 పైచిలుకు ఉత్పత్తులను చేర్చినప్పటికీ.. సెజ్‌లు, ఎగుమతి ఆధారిత యూనిట్లను (ఈవోయూ) మాత్రం స్కీము నుంచి మినహాయించారు. ఎకానమీపై సమీక్ష ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయెల్ న్యూఢిల్లీలో బుధవారం సమావేశం అయినప్పటి చిత్రం ఇది. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు, భారత్ అర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా, రష్యా–ఉక్రేయిన్ యుద్ధం ప్రభావం వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో భాగంగా ఉన్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) పురోగతిపై కూడా ఇరువురు అగ్రశ్రేణి మంత్రులు చర్చించినట్లు సమాచారం. రూపీలో భారత్ వాణిజ్యం మరింత పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. -
AP: అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగాలే ఉద్యోగాలు
అచ్యుతాపురం (అనకాపల్లి): రాష్ట్రంలోని యువతకు మంచిరోజులొచ్చాయి. ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతను ఇప్పటికే అక్కున చేర్చుకున్న అచ్యుతాపురం సెజ్‌లో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. రానున్న రోజుల్లో కనీసం 1.80 లక్షల మందికి ఉద్యోగాలు/ఉపాధి కల్పించేందుకు ఇక్కడి ఎస్ఈజెడ్ జోన్లో కర్మాగారాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో 5,400 ఎకరాల భూమి సెజ్, నాన్ సెజ్ కింద సేకరించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన బ్రాండిక్స్, ఏషియన్ పెయింట్స్, లా రస్, యకోహహాతో పలు బ్రాండెడ్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. వివిధ రకాల కోర్సులు పూర్తి చేసిన వారికి అచ్యుతాపురం సెజ్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. సిఫారసులు లేకుండా క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నారు. లారస్ విస్తరణలో భాగంగా 1,800 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కొద్ది నెలల్లో మరో 2 కంపెనీలకు శంకుస్థాపన జరగనుంది. వీటిలో 1,800 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లో నిర్మాణాలు పూర్తయి కార్యకలాపాలు జరుగుతున్న కంపెనీలు 450 కాగా.. వీటిలో 1.20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. మరో 223 కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిద్వారా అదనంగా మరో లక్షల 80 వేల ఉద్యోగాలు రానున్నాయి. డిప్లమో, డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు కార్మికులకు వైద్య సేవలందించే ఈఎస్ఐ ఆస్పత్రికి స్థలం కేటాయింపు జరిగింది. చదవండి: కాల్చేస్తే ‘సరి’.. -
డెలాయిట్ రాజీనామాకు సరైన కారణాలు లేవు
న్యూఢిల్లీ: ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సంబంధించి డెలాయిట్ చెబుతున్న కారణాలు సహేతుకంగా, నమ్మశక్యంగా లేవని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) వ్యాఖ్యానించింది. ఈ అంశంపై స్టాక్ ఎక్సే్చంజీలకు 163 పేజీల వివరణ సమరి్పంచింది. డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్‌తో తమ నాయకత్వం నిర్వహించిన సమావేశాల్లో గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ వ్యవహారాలపై డెలాయిట్ ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అయితే, ఇతర సంస్థలన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవైనందున.. వాటిల్లో నియామకాల విషయంలో సిఫార్సులు చేయడమనేది ఆడిటర్ పరిధిలో ఉండదని డెలాయిట్‌కు తాము స్పష్టం చేసినట్లు వివరించింది. ఆడిటర్‌గా కొనసాగేందుకు డెలాయిట్ ఇష్టపడకపోవడం వల్ల సామరస్యంగా క్లయిట్–ఆడిటర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్లు తెలిపింది. డెలాయిట్ రాజీనామా వల్ల ఆరి్థక ఫలితాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి కొన్ని లావాదేవీలపై డెలాయిట్ కూడా సందేహాలు వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్‌లోని ఇతరత్రా సంస్థలకు తాము అధికారిక ఆడిటర్లుగా లేనందున తక్షణం ఏపీసెజ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆగస్టు 12న ప్రకటించింది. దీంతో ఏపీసెజ్ ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్‌ను ఆడిటర్‌గా నియమించుకుంది. -
అదానీ పోర్ట్స్ నుంచి నిష్క్రమణ యోచనలో డెలాయిట్
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఆడిటర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెలాయిట్ తప్పుకోవడానికి కారణమేంటనేది నిర్దిష్టంగా వెల్లడి కాలేదు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో ప్రస్తావించిన నిర్దిష్ట లావాదేవీలపై డెలాయిట్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022–23 ఆర్థిక ఫలితాల నివేదికలో మూడు సంస్థలతో లావాదేవీల గురించి డెలాయిట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతర్గతంగా ఖాతాల మదింపు చేయడం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ చేస్తుండటం వంటి అంశాల కారణంగా హిండెన్‌బర్గ్ ఆరోపణల విషయంలో బైటి ఆడిటర్‌తో పరీక్ష చేయించడం అవసరమని అదానీ గ్రూప్ భావించలేదని పేర్కొంది. బైటి ఏజెన్సీ ద్వారా మదింపు జరగకపోవడం, సెబీ విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం వల్ల కంపెనీ అన్ని నిబంధనలనూ పాటిస్తోందా లేదా అనేది తాము ధృవీకరించే పరిస్థితి లేదని తెలిపింది. -
వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు
న్యూఢిల్లీ: వర్క్ ఫ్రం హోం వెసులుబాటునుంచి ఆఫీసులకు వెడుతున్న పలు స్పెషల్ ఎకనామిక్ జోన్ల(సెజ్)లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశంలోlr ప్రత్యేక ఆర్థిక మండళ్ల యూనిట్లలో ఉన్న ఐటీ, ఐటీ ఆదారిత కంపెనీల్లోని 100 శాతం మంది ఉద్యోగులకు ఇంటి నుండి పూర్తి పనిని అనుమతించింది. వచ్చే ఏడాది డిసెంబరు (2023 డిసెంబర్) వరకు ఇంటినుంచే పనిచేసుకోవచ్చు. దీనికి సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ కొన్ని షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఒక యూనిట్ తన ఉద్యోగులను ఇంటి నుండి లేదా సెజ్ వెలుపల ఏ ప్రదేశం నుండైనా పనిచేసుకోవడానికి అనుమతించవచ్చు. ప్రస్తుతానికి సెజ్‌లలో మొత్త ఉద్యోగుల్లో సగం మంది, గరిష్టంగా ఒక సంవత్సరం పాటు ఇంటి నుండి పని చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. సెజ్‌లలోని యూనిట్ యజమానులు సంబంధిత జోన్ల డెవలప్మెంట్ కమిషనర్‌కు సమాచారం అందించి సంబంధిత ఆమోద పత్రం పొందాలి. భవిష్యత్తులో ఇంటి నుండి పని ప్రారంభించాలనుకునే యూనిట్లు ఇంటి నుండి పని ప్రారంభించే తేదీకి లేదా ముందు మెయిల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరెవరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారనేది బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు.ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడానికి ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు లేదా ఇతర పరికరాలను అందించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సదరు యూనిట్ ఉత్పత్తి చేసే ఉత్పత్తుల ఎగుమతి ఆదాయాన్ని సంబంధిత యూనిట్ ఉద్యోగి నిర్ధారించాల్సి ఉంటుందని కూడా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. -
ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్!
లాస్ ఏంజిల్స్: భారత్ రూపాయి ఇటీవలి సంవత్సరాలలో ఇతర కరెన్సీల కంటే అధిక స్థిరత్వాన్ని కనబరిచినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2014 ముందుతో పోలిస్తే క్షీణత సగటు రేటు తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. రూపాయి క్షీణత ద్వారా ప్రయోజనం పొందాలని ఎగుమతిదారుడు భావించకూడదని, ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు, ప్రపంచ మార్కెట్లలో వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యం ఆధారంగా పటిష్ట స్థాయిలో వారు కార్యకలాపాలను నిర్వహించాలని మంత్రి అన్నారు. ఆదాయాల్లో అధికభాగం ఎగుమతుల ద్వారా (డాలర్ల రూపంలో) ఆర్జించే ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ వంటి రంగాలు రూపాయి బలహీనత వల్ల ప్రయోజనం పొందే విషయం తెలిసిందే. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి మారకం విలువ 36 పైసలు బలపడి నెల గరిష్టస్థాయి రూ.79.17 వద్ద ముగిసింది. ఇక్కడ ఒక కార్యక్రమంలో మీడియాతో గోయల్ ఇంకా ఏమన్నారంటే... తగిన స్థాయిలోనే రూపాయి రూపాయి అటు సౌలభ్యకరమైన లేక ఇటు అసౌలభ్యకరమై స్థాయిలో ఉందని నేను అనుకోను. రూపాయి తన సహజ స్థానాన్ని కనుగొంటోంది. ఇది అనేక అంశాలపై ఆదారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం, మూలధన ప్రవాహం, ప్రతి దేశంలో రిస్క్–రివార్డ్ నిష్పత్తి వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఇటీవలి సంవత్సరాలలో చాలా దేశాల కరెన్సీల కంటే భారత రూపాయి మరింత సుస్థిరతను కనబరుస్తోంది. ఇది హర్షణీయం. ఒకవైపు దిగుమతులకు అవరోధం కాకుండా, మరోవైపు ఎగుమతులకు పోటీపూర్వకంగా రూపాయి ఈ స్థాయిలో ఉండాలన్న అంశాలన్ని పరిశీలిస్తే, (దిగుమతుల ఆధారపడే చమురు, రిఫైనరీ సంబంధిత రంగాలకు రూపాయి బలహీనత భారం అవుతుంది. రూపాయి బలంగా ఉంటే ఆయా కంపెనీలు తక్కువ డాలర్లు వెచ్చించి... తమకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోగలుగుతాయి. లేదంటే తమ దిగుమతులకు ఎక్కువ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది) ప్రస్తుతం మన కరెన్సీ తగిన స్థాయిలోనే ఉందని భావించాలి. 2014 ముందు వార్షికంగా సగటు రూపాయి క్షీణత 3.25–3.5 శాతం మధ్య ఉంది. ప్రస్తుతం 2.5 శాతం వద్దే ఉంది. రూపాయి పటిష్టత మెరుగుదలలో ఇది కీలకమైన అంశం. ఈయూతో ఎఫ్‌టీఏ చర్చలు జెనరలైజ్డ్ టారిఫ్ ప్రిఫరెన్స్ స్కీమ్ (జీఎస్పీ) కింద ఎగుమతి ప్రయోజనాలను ఉపసంహరించుకునే ప్రణాళికలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఉందన్న వార్తల గురించి అడిగినప్పుడు, గోయల్ సమాధానం చెబుతూ, భారత్ ఎగుమతిదారులు తమ స్వశక్తిప్రాతిపదికన ప్రపంచ సరఫరాల చైన్‌కు సేవలు అందించగలుగుతాయన్న ధీమాను వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ జీఎస్పీ ప్రయోజనాలను తొలగించిన తర్వాత 2023 జనవరి నుండి ఈయూకు ఎగుమతి చేసే దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన ప్లాస్టిక్, యంత్రాలు, మెకానికల్ ఉపకరణాలు వంటి రంగాల నుంచి భారత్ ఎగుమతులపై తక్కువ లేదా జీరో–డ్యూటీ రాయితీలు నిలిచిపోతాయన్న అందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై గోయల్ మాట్లాడుతూ, ‘‘యూరోపియన్ యూనియన్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) చర్చలు చేపడుతోంది. ఆ చర్చలపై దృష్టి సారిస్తాం. ఏ సందర్భంలోనైనా వాణిజాన్ని విస్తరించడానికి జీఎస్పీ అవసరమని నేను అనుకోను. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్యం మంచిదే. అయితే ఈయూతో మనకు జీఎస్పీ లేనంతమాత్రాన దేశం నుంచి ఎగుమతులు నష్టపోతాయన్న భావన సరికాదు’’ అని అన్నారు. సెజ్‌లో 100 శాతం వర్క్ ఫ్రం హోమ్ ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) యూనిట్లలోని ఉద్యోగులు.. 100 శాతం వర్క్ ఫ్రం హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) విధానంలో పని చేసేందుకు అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు గోయల్ తెలిపారు. ప్రస్తుతం సెజ్ యూనిట్లలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందికి గరిష్టంగా ఏడాది పాటు డబ్ల్యూఎఫ్‌హెచ్ ఇచ్చే వెసులుబాటు ఉంది. అమెరికాతో పటిష్ట వాణిజ్యం అమెరికాతో వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడంపై గోయల్ మాట్లాడుతూ, ఆ దేశ మార్కెట్ పరిమాణం, స్థాయిని బట్టి అమెరికాలోని ప్రతి రంగం భారత్ వ్యాపారాలకు అవకాశం ఇస్తోందని తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికాది కీలకపాత్ర అని పేర్కొంటూ, వారు సాంకేతికత భారీ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తుండడం వాస్తవమన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఇక్కడ ‘ఆకాశమే హద్దు‘ అని అన్నారు. అమెరికాతో ప్రస్తుతం 159 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ వాణిజ్యాన్ని రాబోయే ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలలో 500 బిలియన్ డాలర్లకు పెంచడం లక్ష్యమని తెలిపారు. పెరుగుతున్న భారత్ వాణిజ్య లోటును తగ్గించడానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) ఎలా దోహదపడతాయని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ప్రతి ఒడంబడికా భారత్ తన భాగస్వామ్య దేశాలన్నింటితో వాణిజ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. దీర్ఘకాలంలో ఇది వాణిజ్యలోటు తగ్గుదలకు దోహపడే అంశమని వివరించారు. ‘‘వాస్తవానికి, ఎగుమతులు పెరుగుతాయి. దిగుమతుల్లో కూడా కొంత వృద్ధి ఉండవచ్చు. అంతిమంగా, ఆర్థిక కార్యకలాపాలు రెండు విధాలుగా వృద్ధి చెందుతాయి. నేను అంతర్జాతీయ వాణిజ్యాన్ని మొత్తంగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను. భారత్ ఎగుమతులపై మాకు ఎంతో విశ్వాసం ఉంది. 2030 నాటికి, భారత్ ట్రిలియన్ డాలర్ల వస్తువుల ఎగుమతిని, ట్రిలియన్ డాలర్ల సేవల ఎగుమతులను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించలమన్న విశ్వాసమూ ఉంది’’ అని గోయెల్ ఈ సందర్భంగా అన్నారు. -
మునుపెన్నడూ ఇటు చూడని పారిశ్రామిక దిగ్గజాలు.. ఇప్పుడు ఏపీకీ వస్తున్నారు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడని పారిశ్రామికవేత్తలు తాను సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాన్ని గుర్తించే గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభిస్తోందన్నారు. పరిశ్రమలకు ఎలాంటి సహాయం, సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్‌తో అందుబాటులో ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వాలు బకాయిపడ్డ వివిధ ప్రోత్సాహకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని గుర్తు చేశారు. వచ్చే నెలలో విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా నెలకొల్పిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) మొదటి దశ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి టైర్‌పై సంతకం చేసిన అనంతరం రెండో దశ ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మరో 8 పరిశ్రమలకు కూడా సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అనంతరం ఇటీవల వివాహం జరిగిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడు సూర్య, లక్ష్మీ సౌందర్యరాశి దంపతులను మర్రిపాలెంలోని వారి స్వగృహంలో సీఎం జగన్ ఆశీర్వదించారు. ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... 15 నెలల వ్యవధిలోనే ఉత్పత్తి ఆరంభం ప్రపంచంలో టాప్ 5–6 స్థానాల్లో ఉన్న జపాన్ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరం. రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటుకు 2020 సెప్టెంబరులో మన దగ్గరకు వచ్చారు. అక్కడనుంచి చకచకా అన్ని రకాలుగా తోడ్పాటు అందించాం. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కాగా కేవలం 15 నెలల వ్యవధిలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తి దశలోకి వచ్చింది. మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకోవడంతో రెండో దశకు కూడా నాంది పలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు రెండో దశ ప్లాంట్‌కు శంకుస్ధాపన జరుగుతోంది. రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగస్టు 2023లోగా పూర్తి చేస్తామని చెబుతున్నారు. తొలిదశలో రూ.1250 కోట్లతో దాదాపు 1,200 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇవాళ మొదలయ్యే రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2,000 మందికి ఉపాధి ఇక్కడే అందుబాటులోకి వస్తుంది. భరోసా కల్పించే బాధ్యత మనదే.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా అక్కడ మన యువతకు మెరుగైన ఉద్యోగాలు లభించడం చాలా అవసరం. ఆ ప్రాంతంలో చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలు ఇప్పించగలిగితే పేదరికం నుంచి బయటపడే పరిస్థితులు మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా చేయాల్సినవన్నీ చేస్తూ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగా ఏదైనా పరిశ్రమ ఏర్పాటైతే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశాం. మనవైపు నుంచి కూడా వారికి సహాయ, సహకారాలు అందాలి. ఎవరైనా ఏపీకి రావడానికి సంతోషపడాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే గొడవ పడకుండా పరిష్కరించుకునేలా అడుగులు వేయాలి. అప్పుడే ఆ పారిశ్రామికవేత్తలకు నమ్మకం, విశ్వాసం పెరిగి పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. తద్వారా మన యువతకు పుష్కలంగా ఉద్యోగాలు లభిస్తాయి. మనవాళ్లు చాలా మంచివాళ్లు.. బాగా కష్టపడి పనిచేస్తారు... ఎటువంటి సమస్యలూ సృష్టించరు.. అని పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగితే రాష్ట్రంలోకి ఇంకా పెట్టుబడులు వస్తాయి. ఆ బాధ్యత మన భుజాలపైనే ఉంది. రానున్న రెండేళ్లల్లో మరో 1.64 లక్షల ఉద్యోగాలు ఈ మూడేళ్ల వ్యవధిలోనే అతి భారీ, భారీ పరిశ్రమల విభాగంలో 98 పరిశ్రమలు రూ.39,350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 60,541 మందికి గత మూడేళ్లలో ఉద్యోగాలు లభించాయి. ఇదే సమయంలో మరో 31,671 ఎంఎస్ఎంఈలు రూ.8,285 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా మరో 1,98,521 మందికి ఉద్యోగాలు లభించాయి. రాబోయే ఒకటి రెండేళ్లలో మరో 56 అతి భారీ, భారీ పరిశ్రమలు దాదాపు రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా మరో 1,64,155 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. పారిశ్రామికవేత్తల ఓటుతో నంబర్ వన్‌గా.. ఇవాళ రాష్ట్రంలో పారిశ్రామిక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నాం. తొలిసారిగా ఈదఫా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్టిఫికేషన్ తీరు కూడా మార్చారు. ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఇస్తున్నారు. అలా నిబంధనలు మార్చిన నేపథ్యంలో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్ 1 ర్యాంకు సాధిస్తోంది. ప్రతి అడుగులోనూ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. పాత బకాయిలు పిలిచి మరీ చెల్లించాం.. గతంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోయాయి. చిన్న పరిశ్రమలు నడవలేక మూతబడుతున్న పరిస్థితుల్లో కూరుకుపోయాయి. రాష్ట్రంలో దాదాపు లక్షకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉండగా పది లక్షల మందికి పైగా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకుని మరీ పాత బకాయిలను చెల్లించడంతోపాటు ఏటా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. చేయి పట్టుకుని ప్రోత్సహిస్తూ ఈ మూడేళ్లలో రూ.1,463 కోట్లు ఎంఎస్ఎంఈలకు ఇచ్చాం. ఇలా ప్రభుత్వం ప్రతి దశలోనూ ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తోంది కాబట్టే 2021–22లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు 11.43 శాతం సాధించాం. దేశంలో చూస్తే అది కేవలం 8.9 శాతమే ఉంది. దేశంతో పోలిస్తే రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. పది శాతం ఎగుమతులే లక్ష్యం... ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా నాలుగు కొత్త పోర్టులతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. తద్వారా ఎగుమతుల్లో రాష్ట్ర వాటా భారీగా పెరగనుంది. 2021–22లో రాష్ట్ర ఎగుమతుల విలువ 19.3 బిలియ¯న్ డాలర్లు ఉంది. మొత్తం దేశం ఎగుమతుల్లో ఇది 4.58 శాతం. ఈ పోర్టులు పూర్తైన తరువాత ఏపీ నుంచి ఎగుమతులు 10 శాతానికి పెంచేలా అడుగులు వేస్తున్నాం. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 3 పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంలోనే ఏర్పాటవుతున్నాయి. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్ – బెంగళూరు కారిడార్లున్న రాష్ట్రం ఏపీ మాత్రమే. గతంలో మన రాష్ట్రం వైపు చూడని వారు కూడా ఇప్పుడు మనవైపు చూస్తున్నారు. మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. గతంలో సెంచరీ ఫ్లైవుడ్ బజాంకాల పేరు విన్నారా? ఈరోజు బజాంకాలు వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచరీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. బంగూర్ల పేరు గతంలో విన్నారా? ఎప్పుడూ రాష్ట్రంవైపు చూడని వారు ఇవాళ రాష్ట్రంలో శ్రీసిమెంట్స్ ఫ్యాక్టరీని స్థాపిస్తున్నారు. ఆదిత్యా బిర్లా ఏపీకి వచ్చి వారి ప్లాంట్‌ను ప్రారంభించడం గతంలో చూశారా? ఈరోజు ఆదిత్య బిర్లా మన రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వారి ప్లాంట్‌ను ప్రారంభించారు. గతంలో అదానీ.. అదానీ అని పేరుకు మాత్రమే అనేవారు. అదానీ సంస్ధ గతంలో ఏపీలో ఎప్పుడూ అడుగులు ముందుకు వేయలేదు. జగన్ సీఎం అయిన తర్వాతే అదానీలు ముందడుగు వేశారు. ప్రతి పెద్ద పరిశ్రమకు చెందిన వారంతా ఏపీవైపు చూసేలా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెబుతున్నాం. మీరు పరిశ్రమ స్థాపించండి.. అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఏపీలో తొలి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు తమ సంస్థ మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ఏపీలోనే చేపట్టామని ఏటీసీ సీవోవో అనిల్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందుతున్నాయని ధన్యవాదాలు తెలియచేశారు. అధికారులు ఫోన్ చేసి మరీ మీకు లైసెన్స్ మంజూరైందని తెలియచేశారని చెప్పారు. సీఎం జగన్‌ను యువత ఎంతో అభిమానిస్తోందన్నారు. వచ్చే ఏడాది తమ ప్లాంట్ రెండో దశ ప్రారంభానికి రా>వాలని సీఎంను ఆహ్వానించారు. నూతన ప్లాంట్‌తో లక్ష్యాన్ని సాధిస్తాం ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, అందుకు అచ్యుతాపురం ప్లాంట్ ఎంతో దోహదం చేస్తుందని ఏటీసీ సీఈవో నితిన్ పేర్కొన్నారు. మొదటి దశ ప్లాంట్‌లో రోజుకు 69 టన్నుల రబ్బర్ వినియోగిస్తున్నామని, రెండో దశ ప్లాంట్ పూరైత్తే 132 టన్నులకు చేరుకుంటుందని తెలిపారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఏపీకి మరిన్ని జపాన్ కంపెనీలు! పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తామని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ టాగా మషయూకి వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చదవండి: కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్‌కు ఆహ్వానం -
ప్రత్యేక ఆర్థిక జోన్ల పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: కొత్త చట్టం ద్వారా ప్రత్యేక ఆర్థిక మండలాలను (ఎస్ఈజెడ్) పునర్ వ్యవస్థీకరించడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎస్ఈజెడ్లకు సంబంధించి దిగుమతి సుంకాల వాయిదా, ఎగుమతి పన్నుల నుండి మినహాయింపు వంటి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ప్రోత్సాహకాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండలాలను నియంత్రించే ప్రస్తుత చట్టాన్ని కొత్త చట్టంతో భర్తీ చేయాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వార్షిక బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ మేరకు రూపొందే ‘‘డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్’’ (డీఈఎస్‌హెచ్)లో రాష్ట్రాలు భాగస్వాములు కావడానికి వీలుగా కేంద్రం పలు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. కొత్త బిల్లుకు సంబంధించి ఆర్థికమంత్రిత్వశాఖసహా పలు మంత్రిత్వశాఖల అభిప్రాయాలను వాణిజ్య మంత్రిత్వశాఖ స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలు అందిన తర్వాత వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక కొత్త బిల్లును రూపొందించి, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దీనిని పార్లమెంటులో ప్రవేశపెడుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రోత్సాహకాలు ఇవీ... ఎస్ఈజెడ్లో ఒక యూనిట్ ద్వారా దేశీయ సేకరణపై ఐజీఎస్టీ (ఇంటిగ్రేడెట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) మినహాయింపు, ఈ జోన్ల డెవలపర్లకు పరోక్ష పన్ను ప్రయోజనాల కొనసాగింపు, దేశీయ టారిఫ్‌లకు సంబంధించి ఉపయోగించిన మూలధన వస్తువుల అమ్మకాలపై తరుగుదల అనుమతించడం వంటివి ప్రత్యేక ఆర్థిక జోన్లకు ఇస్తున్న ప్రోత్సాహకాల ప్రతిపాదనల్లో ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత డెవలప్మెంట్ హబ్‌లలో అధీకృత కార్యకలాపాలను చేపట్టే యూనిట్లకు ఎలాంటి మినహాయింపులు లేకుండా 15 శాతం కార్పొరేట్ పన్ను రేటును వర్తింపజేయాలన్నది బిల్లు ప్రతిపాదనల్లో మరోటి. తయారీ, ఉద్యోగ కల్పనను పెంచడానికి రాష్ట్రాలు కూడా ఈ జోన్లకు సహాయక చర్యలను కూడా అందించే వీలు కల్పించాలన్నది బిల్లులో ప్రధాన లక్ష్యంగా ఉంది. 2022–23 బడ్జెట్ సమర్పణ సందర్భంగా లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎకానమీలో కీలకపాత్ర... దేశంలో ఎగుమతి కేంద్రాలు, తయారీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 2006లో ప్రస్తుత సెజ్ చట్టం రూపొందింది. 2022 జూన్ 30 నాటికి కేంద్రం 425 ఎస్ఈజెడ్ డెవలపర్లకు అధికారిక అనుమతులు ఇచ్చింది. అయితే అందులో ప్రస్తుతం 268 పని చేస్తున్నాయి. ఈ జోన్లు దాదాపు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. దాదాపు 27 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఈ జోన్ల నుంచి ఎగుమతులు 32 శాతం పెరిగి దాదాపు రూ.2.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక 2020–21లో ఈ జోన్ల నుంచి రూ.7.6 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా, 2021–22లో ఈ విలువ రూ.10 లక్షలకు చేరింది. -
అచ్యుతాపురంసెజ్‌కు పారిశ్రామిక శోభ.. 16వ తేదీన 16 పరిశ్రమలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోంది. వైఎస్ జగన్ సర్కారు చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో భారీ, మధ్య తరహా, చిన్న పరిశ్రమలు అనేకం వస్తున్నాయి. తద్వారా భారీగా పెట్టుబడులు రావడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కూడా లభిస్తోంది. అదే ఒరవడిలో విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఈ నెల 16న మూడు భారీ పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభంతోపాటు మరో 13 పరిశ్రమలకు భూమి పూజ జరగనుంది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీతో పాటు ఫార్మా, ఇథనాల్ యూనిట్లు ఉత్పత్తికి సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏటీసీ టైర్ల యూనిట్‌ను 16న ప్రారంభించనున్నారు. ఇదే సందర్భంలో మిగతా రెండు యూనిట్లలో ఉత్పత్తితోపాటు మిగతా పరిశ్రమల భూమిపూజకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏటీసీ టైర్స్ రూ.2,350 కోట్లతో హాఫ్ హైవే టైర్ల తయారీ పరిశ్రమను అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేసింది. సుమారు రూ.1,152 కోట్ల పెట్టుబడులతో తొలిదశ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమైంది. అలాగే రూ.60 కోట్లతో ఫార్మాసూటికల్, రూ.84 కోట్లతో బయోఫ్యూయల్ ప్లాంట్ కూడా నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు యూనిట్ల ద్వారా రూ.1,295.39 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడంతో పాటు 1,974 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇదే సెజ్‌లో ఏర్పాటవుతున్న వివిధ రంగాలకు చెందిన మరో 13 యూనిట్ల ద్వారా రూ.1,132.34 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. 3,686 మందికి ఉపాధి లభించనుంది. బల్క్ డ్రగ్స్, పండ్ల ప్రాసెసింగ్ యూనిట్, పారిశ్రామిక ఆక్సిజన్ తయారీ, ఫెర్రో అల్లాయిస్ వంటి కంపెనీలు వీటిలో ఉన్నాయి. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అచ్యుతాపురంలో 1,900 ఎకరాల్లో ఏపీ సెజ్ పేరుతో ఈ పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సెజ్‌లో 20కిపైగా యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.5,000 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతోంది. చదవండి: మార్పును పట్టుకుందాం.. -
సెజ్‌లకు కొత్త రూపు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎగుమతులకే పరిమితమవుతున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) సమగ్ర ఆర్థిక హబ్‌లుగా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక మండళ్లలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబంధనలను సడలించడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం తదితర చర్యలు తీసుకునే యోచనలో ఉంది. అలాగే సెజ్‌లలోని యూనిట్లు దేశీయంగా కూడా విక్రయించుకునేందుకు అనుమతించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో రూపొందించిన ముసాయిదా చర్చా పత్రం ప్రకారం హబ్‌లను డెవలప్మెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్‌లు (దేశ్)గా వ్యవహరించనున్నారు. వాటిల్లోని సంస్థలు దేశీయంగా విక్రయించుకోవడంతో పాటు జోన్‌కు వెలుపలి సంస్థల కోసం కాంట్రాక్టు తయారీ కార్యకలాపాలు కూడా చేపట్టేందుకు అనుమతించనున్నారు. కొంత మేర ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే చర్యలు కూడా తీసుకోనున్నారు. సంయుక్తంగా ఏర్పాటు.. ఇలాంటి హబ్‌లను కేంద్రం, రాష్ట్రం విడివిడిగా లేదా కలిసి నెలకొల్పవచ్చు. తయారీ లేదా సర్వీసు కార్యకలాపాల కోసం లేదా ఈ రెండింటి కోసం వ్యక్తులు కూడా ఏర్పాటు చేయవచ్చు. సెజ్‌ల వెలు పలి సంస్థలతో సమానంగా పన్ను భారం వర్తించే లా హబ్‌లలోని యూనిట్లు దేశీయంగా జరిపే విక్ర యాలపై ఈక్వలైజేషన్ లెవీ విధించే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల తర్వాత రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలను కూడా అభివృద్ధిలో భాగం చేసే ఉద్దేశంతో సెజ్ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తేనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధన్యం సంతరించుకున్నాయి. -
అచ్యుతాపురం: బ్రాండిక్స్ కంపెనీలో విషవాయువు లీక్
అచ్యుతాపురం (అనకాపల్లి): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (ఎస్ఈజెడ్) లోని బ్రాండిక్స్ అపరెల్ పార్కు సిటీలో శుక్రవారం ఉదయం విషవాయువు లీకైంది. ఒక్కసారిగా కళ్ల మంటలు, శ్వాస తీసుకోలేకపోవడం, వాంతులతో అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులు విలవిల్లాడారు. అందరూ బయటకు పరుగులు తీశారు. సుమారు 178 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇద్దరికి విశాఖ కేజీహెచ్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, అస్వస్థతకు గురైన వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో బ్రాండిక్స్ సంస్థకు చెందిన దుస్తులు తయారు చేసే పెద్ద అపెరల్ పార్కు ఉంది. ఇక్కడ అందరూ మహిళలే పని చేస్తుంటారు. ఈ అపరెల్ పార్కులోని దుస్తులకు సంబంధించిన సీడ్స్ కంపెనీలో శుక్రవారం మ«ధ్యాహ్నం 11.20 గంటల సమయంలో గ్యాస్ లీకైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. కళ్ల మంటలు, వాంతులతో అల్లాడిపోయారు. ఆ సమయంలో సుమారు 800 మంది మహిళలు పనిచేస్తున్నట్లు సమాచారం. వారంతా బయటకు పరుగులు తీశారు. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. విషవాయువు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడి సిబ్బంది అంచనా వేసి ముందుగా ప్రాథమిక చికిత్స చేసే యత్నం చేశారు. సొమ్మసిల్లి పడిపోయిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే, ఈ గ్యాస్ ఎక్కడి నుంచి లీకయిందన్న విషయం వెల్లడి కాలేదు. గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి ఆరా అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి సమీక్షించారు. సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ పీల్చి ఇబ్బందిపడ్డ బాదితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, గ్యాస్ లీక్ అవుతున్న పరిశ్రమని అధికారులు కంట్రోల్ లోకి తీసుకోవాలని ఆదేశించారు. -
శ్రీ సత్యసాయి: నూతన జిల్లాలో మరో సెజ్
పరిశ్రమల ఏర్పాటుతో ప్రజల ఆర్థిక సామర్థ్యం పెంపొందుతుంది. తలసరి ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనా సాధ్యమవుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. కొత్త జిల్లా శ్రీ సత్యసాయిలో ఆర్థిక రథం పరుగులు పెట్టించడానికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో మరో సెజ్ ఏర్పాటు చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త జిల్లాలో ఆర్థిక కాంతులు మరింతగా విస్తరించనున్నాయి. సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: పరిశ్రమల ఖిల్లాగా ఖ్యాతి పొందిన శ్రీ సత్యసాయి జిల్లాలో మరో పెద్ద సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు కానుంది. చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద 880 ఎకరాల్లో అందుబాటులోకి రానుంది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చిలమత్తూరు మండలం బెంగళూరుకు కేవలం 100 కి.మీ దూరంలోనే ఉండటంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రైతులకు కళ్లు చెదిరే పరిహారం.. సెజ్ ఏర్పాటు ద్వారా భూములు కోల్పోయే రైతులు తొలుత ధర తక్కువ ఇస్తారేమే అని లోలోన ఆందోళన చెందారు. అంతే కాకుండా 880 ఎకరాల్లో పట్టా భూములు కేవలం 174 ఎకరాలు మాత్రమే ఉండగా, మిగిలినదంతా అసైన్మెంట్ భూమే. అయితే ఎలాంటి పక్షపాతమూ కనబరచకుండా భూమి కోల్పోయే ప్రతి రైతుకూ పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా కళ్లు చెదిరే రీతిలో ఎకరాకు రూ.25 లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిర్ణయించిన మేర రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. భూముల ధరలకు రెక్కలు.. ప్రభుత్వం సెజ్ ఏర్పాటు కోసం భూ సేకరణ చేస్తోందన్న విషయం బయటకు రాగానే టేకులోడు పరిసర ప్రాంతాల్లో భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ప్రభుత్వమే రూ. 25 లక్షలు ప్రకటించడంతో చుట్టుపక్కల భూములను మూడు రెట్లు అధికంగా చెల్లించి కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. రెండు జాతీయ రహదారులకు అనుసంధానం.. టేకులోడు సమీపంలో ఏర్పాటు చేస్తున్న సెజ్‌కు రెండు జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉంది. అటు 544ఈ జాతీయ రహదారి పూణే జాతీయ రహదారికి, ఇటు 44 వ జాతీయ రహదారి బెంగళూరు, హైదరాబాద్‌కు కనెక్టివిటీ కలిగిఉంది. దీంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కియా కార్ల తయారీ పరిశ్రమ, నాసిన్ ట్రైనింగ్ సంస్థ, ఇండజ్ జీన్ వ్యాక్సిన్ కేంద్రం వంటి పరిశ్రమలు దగ్గరగా ఉండటం కూడా ప్రధాన అనుకూలతలుగా మారనున్నాయి. వేలమందికి ఉద్యోగావకాశాలు.. సెజ్ కార్యరూపం దాల్చితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాది దొరకనుంది. బయట రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే బాధ తప్పుతుంది. దీంతో నిరుద్యోగులకు సెజ్‌ల ఏర్పాటు కల్పతరువుగా మారనుంది. ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ ఉత్పత్తుల హబ్‌గా మారుస్తాం టేకులోడు వద్ద ఏర్పాటు చేస్తున్న సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)ను ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ ఉత్పత్తుల హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఇవే కాకుండా ఏ ఇతర కంపెనీలు వచ్చినా ఆహ్వానిస్తాం. ప్రతిపాదిత సెజ్ ప్రాంతానికి నీటి సదుపాయం కల్పించడానికి రూ.7 కోట్లతో పైప్‌లైన్ పనులు ప్రారంభించాం. ఏపీఐఐసీకి చెందిన 250 ఎకరాల భూమి ఉన్నా, మరో 850 ఎకరాలను భూమి సేకరించాం. బెంగళూరు నగరానికి దగ్గరగా ఉండడంతో పరిశ్రమలు అధికంగా వస్తాయని భావిస్తున్నాం. – మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ -
కొత్త సెజ్ చట్టంతో బహుళ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదిత ప్రత్యేక ఆర్థిక జోన్ల (సెజ్) కొత్త చట్టం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్లకు సంబంధించి ప్రస్తుత చట్టం స్థానంలో తీసుకువస్తున్న కొత్త చట్టంతో వ్యవస్థలో అన్ని అనుమతులు, విధి విధానాలు, కార్యకలాపాలు సింగిల్ విండో కింద జరుగుతాయని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక రంగం పురోగతికి కొత్త చట్టం దోహదపడుతుందని ఆయన అన్నారు. సెజ్‌లను నియంత్రించే ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్(డీఈఎస్‌హెచ్)లో రాష్ట్రాలను భాగస్వాములు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత సెజ్ యాక్ట్‌ను 2006లో తీసుకువచ్చారు. ఎగుమతుల పెరుగుదల, మౌలిక రంగం పురోగతి, ఉపాధి కల్పన ఈ చట్టం ప్రధాన లక్ష్యం. అయితే కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు, పన్ను ప్రోత్సాహకాల తొలగింపు వంటి చర్యల తర్వాత ఈ జోన్ల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. కొత్త చట్టంతో తిరిగి సెస్‌లకు బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని, దేశాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. సెజ్ 2.0 ముసాయిదా యాక్ట్ తయారీ పక్రియలో ఉందని, వచ్చే కొద్ది నెలల్లో ప్రస్తుత సెజ్ యాక్ట్ స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో దాదాపు 20 శాతం సెజ్‌ల వాటా కావడం గమనార్హం. -
సెజ్‌ల నిబంధనల సరళతరంపై కసరత్తు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) నిబంధనలు సరళతరం చేయడంపైనా, వీటి నుంచి యూనిట్లు వైదొలిగే ప్రక్రియను సులభతరం చేయడంపైనా కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ ఈ విషయాలు తెలిపారు. డిమాండ్ అంతగా లేని ప్రాంతాల్లోని ప్రస్తుత సెజ్‌ల గుర్తింపును పాక్షికంగా ఉపసంహరించి, ఆయా స్థలాలను పారిశ్రామిక.. ఇతరత్రా అవసరాలకు వినియోగించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. సెజ్‌లకు పన్ను రాయితీల గడువు ముగిసిపోతున్నందున వీటిలో యూనిట్లను ఏర్పాటు చేయడానికి కొత్త వ్యాపారవేత్తలు పెద్ద స్థాయిలో ఆసక్తి చూపకపోవచ్చని గోయల్ తెలిపారు. ముంబైలోని శాంటాక్రూజ్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఎగుమతిదారులతో భేటీ సందర్భంగా గోయల్ ఈ విషయాలు వివరించారు. 2020 మార్చి 31లోగా కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త సెజ్ యూనిట్లకు మాత్రమే ఆదాయ పన్నుపరమైన ప్రయోజనాలు లభిస్తాయంటూ 2016–17 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం షరతు పెట్టింది. ఎగుమతి హబ్‌లుగా ఎదిగిన సెజ్‌లు.. ప్రత్యామ్నాయ పన్ను వడ్డన, రాయితీల ఉపసంహరణ గడువు విధింపు వంటి అంశాల కారణంగా క్రమంగా ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లాజిస్టిక్స్ సెంటర్ ప్రారంభం.. మరోవైపు, ముంబైలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను గోయల్ ప్రారంభించారు. అంతర్జాతీయంగా పోటీ, ఆర్థిక సంక్షోభపరమైన సవాళ్ల కారణంగా సరఫరా వ్యవస్థలను నిర్వహించడం మరింత సంక్లిష్టంగా మారిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అధునాతన పరిశోధనలు, లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపు తదితర అంశాల్లో పరిశ్రమకు కేంద్రం తగు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. -
అచ్యుతాపురం సెజ్‌లోనీ పరిశ్రమలో ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లోనీ పరిశ్రమలో మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. అభిజిత్ ఫెరో ఎల్లాయిస్ కంపెనీలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కార్మికులు పరుగులు తీయడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ ట్యాంకర్ పైప్ లైన్ లీకేజీ కారణంగా ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగినప్పటికీ విషయాన్ని పరిశ్రమ యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రత్యేక ఆర్థిక జోన్లకూ పన్ను రిఫండ్ పథకం?
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్లకూ (ఎస్ఈజడ్) పన్నులు, సుంకాల రిఫండ్ పథకం– ఆర్ఓడీటీఈపీ (రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడె ప్రొడక్ట్స్) ప్రయోజనాలను వర్తింపజేయాలని ఈఓయూ, ఎస్ఈజడ్ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈపీసీఈఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కింద వివిధ ప్రొడక్టులపై విధించిన వివిధ కేంద్ర, రాష్ట్ర సుంకాలు, పన్నులు, లెవీలను ఎగుమతిదారులకు రిఫండ్ జరుగుతుంది. అలాగే ఈ రంగానికి మౌలికరంగం హోదా ఇవ్వాలని కోరింది. తద్వారా ప్రాధాన్యత రంగం కింద తక్కువ రేటుకు ఎస్ఈజడ్లకు బ్యాంకుల నుంచి రుణాల మంజూరు సాధ్యమవుతుందని పేర్కొంది. పెరుగుతున్న ఎగుమతులు జోన్ల నుంచి ఎగుమతుల భారీ పెరుగుదలకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి– ఈపీసీఈఎస్ ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. ఈపీసీఈఎస్ చైర్మన్ భువనేష్ సేథ్ ఆయా అంశాలపై మాట్లాడుతూ, ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 2020–21లో ఎస్ఈజడ్ ఎగుమతుల విలువ రూ.7.55 లక్షల కోట్లుకాగా, 2021–22లో ఈ విలువ రూ.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా కోవిడ్ ముం దస్తు ఎగుమతుల విలువ (2019–20లో రూ.7.84 లక్షల కోట్లు)ను ఈ విభాగం అధిగమిస్తుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి నౌకాశ్రయాలకు రవాణా సౌలభ్యతపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్ఓడీటీఈపీ వివరాలు ఇవీ.. ఆర్ఓడీటీఈపీ స్కీమ్ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ, కేంద్రం ఇటీవలే ఆర్ఓడీటీఈపీ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.12,454 కోట్లు కేటాయించింది. 8,555 ఉత్పత్తులకు వర్తించే విధంగా ఆర్‌ఓడీటీఈపీకి ఈ నిధులను కేటాయించింది. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై విధించిన సుంకాలు, పన్నుల రిఫండ్‌కు ఉద్ధేశించిన ఈ పథకం కింద పన్ను రిఫండ్ రేట్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. వివిధ రంగాలకు సంబంధించి పన్ను రిఫండ్ రేట్లు 0.5 శాతం నుంచి 4.3 శాతం శ్రేణిలో ఉన్నాయి. విద్యుత్ చార్జీలపై సుంకాలు, రవాణా ఇంధనంపై వ్యాట్, వ్యవసాయం, సొంత అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి, మండీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్‌పన్ను వంటి విభాగాల్లో రిఫండ్స్ జరుగుతాయి. రిఫండ్ జరిగే 8,555 ఉత్పత్తుల్లో సముద్ర ప్రాంత ఉత్పత్తులు, దారం, డెయిరీ ప్రొడక్టులు, వ్యవసాయం, తోలు, రత్నాలు–ఆభరణాలు, ఆటోమొబైల్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ ఉన్నాయి. స్టీల్, రసాయనాలు, ఔషధ రంగాలకు మాత్రం ఆర్ఓడీటీఈపీ పథకం వర్తించదు. ఎటువంటి ప్రోత్సాహకాలూ లేకుండా ఈ రంగాలు కార్యకలాపాలు నిర్వహించడమే దీనికి కారణం. జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ కేంద్రం ఇటీవలే ఆర్ఓఎస్సీటీఎల్ స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. ఎస్ఈజడ్లవైపు దేశంలో మొత్తం 427 జోన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర ఉంది. అయితే జూన్ 30వ తేదీ నాటికి వీటిలో 267 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2021 జూన్ 30వ తేదీ నాటికి ప్రత్యేక జోన్లపై రూ.6.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిలో దాదాపు 24.47 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎస్ఈజడ్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎగుమతులు భారీగా 41.5 శాతం పెరిగాయి. విలువలో ఇది 2.15 లక్షల కోట్లు. ఔషధాలు, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణం. దేశం ఎగుమతుల్లో నాల్గవ వంతు ప్రత్యేక జోన్ల నుంచి జరుగుతుండడం గమనార్హం. నేడు కొత్త కార్యాలయం ప్రారంభం దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిమాలయ భవన్లో ఈపీసీఈఎస్ కొత్త కార్యాలయం సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభమవుతుందని చైర్మన్ భువనేష్ సేథ్ తెలిపారు. వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్, వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యంలు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ‘ఎగుమతులు పెంపు, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక వినియోగం, నూతన ఆవిష్కరణలు– ఎస్ఈజడ్లపై ప్రభావం’ అన్న అంశంపై పీడబ్ల్యూసీ నిర్వహించిన ఒక అధ్యయన నివేదికను ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరుగుతుందని కూడా ఆయన వెల్లడించారు. చదవండి : గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ -
స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్ల (ఎస్ఈజడ్) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎగుమతులు భారీగా 41.5 శాతం పెరిగాయి. విలువలో ఇది 2.15 లక్షల కోట్లు. ఔషధాలు, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం ఎగుమతుల్లో నాల్గవ వంతు ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి జరుగుతుండడం గమనార్హం. 2019–20లో ఎస్ఈజడ్ల నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల విలువ రూ.7.97 లక్షల కోట్లు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020–21లో 7.56 లక్షల కోట్లకు తగ్గింది. జోన్ల పరిస్థితి ఇదీ... దేశంలో మొత్తం 427 జోన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర ఉంది. అయితే జూన్ 30వ తేదీ నాటికి వీటిలో 267 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2021 జూన్ 30వ తేదీ నాటికి ప్రత్యేక జోన్లపై రూ.6.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది. వీటిలో దాదాపు 24.47 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. జోన్ల నుంచి ఎగుమతుల భారీ పెరుగుదలకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి– ఈపీసీఈఎస్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. మండలికి భవనేశ్ సేథ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. దేశం ఎగుమతులు ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు దేశం లక్ష్యం. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశ ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య ఎగుమతులు 74.5 శాతం పెరిగి 130.82 బిలియన్ డాలర్లకు చేరాయి. మరో ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టు–మార్చి 2022) 269.44 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. అంటే నెలకు సగటును 33.68 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాల్సి ఉంది. కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో 2020 మార్చి నుంచి వరుసగా ఆరు నెలలు ఆగస్టు వరకూ ఎగుమతులు క్షీణతను చూశాయి. అయితే సెప్టెంబర్‌లో వృద్ధిబాటలోకి వచ్చినా, మళ్లీ మరుసటి రెండు నెలలూ (అక్టోబర్–నవంబర్) క్షీణతలోకి జారిపోయాయి. తిరిగి 2020 డిసెంబర్లో స్వల్పంగా 0.14 శాతం వృద్ధి నమోదయ్యింది. అప్పటి నుంచీ వృద్ధి బాటలోనే ఎగుమతులు పయనిస్తున్నాయి. 2020–21 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ చూస్తే, ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, మరింత పెరగనున్న ఇళ్ల కొనుగోళ్లు -
కృష్ణపట్నం.. అదానీ పరం
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుంది. ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో విశ్వ సముద్ర హోల్డింగ్స్‌కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏపీసెజ్ సోమవారం స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలియచేసింది. దీంతో కృష్ణపట్నం పోర్టులో వాటా 75 శాతం నుంచి 100 శాతం వరకు చేరినట్లు తెలిపింది. గతేడాది అక్టోబర్ నెలలో 75 శాతం వాటాను కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక ఏడాది 2021 ఎబిట్టాకు(చెల్లించాల్సిన పన్నులు, వడ్డీలు, తరుగుదల వంటివన్నీ లెక్కలోకి తీసుకొని లెక్కించే ఆదాయం) 10.3 రెట్లు అధికంగా కృష్ణపట్నం పోర్టు విలువను రూ.13,765 కోట్లుగా మదింపు వేసినట్లు తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 38 మిలియన్ టన్నుల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా రూ.1,840 కోట్ల ఆదాయం, ఎబిట్టా రూ.3,125 కోట్లుగా పేర్కొంది. విస్తరణ దిశగా కృష్ణపట్నం పోర్టు ప్రస్తుతం 64 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగివున్న కృష్ణపట్నం పోర్టును భారీగా విస్తరించనున్నట్లు ఏపీసెజ్ సీఈవో కరన్ అదాని తెలిపారు. 2025 నాటికి ప్రస్తుత పోర్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డీప్‌వాటర్ పోర్టు కావడం, 6,800 ఎకరాలు ఉండటం మాస్టర్ ప్లాన్ ప్రకారం పోర్టు సామర్థ్యం 300 మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్లే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశాలుగా పేర్కొన్నారు. దక్షిణాంధ్రప్రదేశ్‌కు కృష్ణపట్నం పోర్టును ముఖద్వారంగా తీర్చిదిద్దుతామని, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇది ఎంతో కీలకంకానుందని చెప్పారు. తూర్పు తీరంపై ప్రత్యేక దృష్టి 2025 నాటికి ఏపీసెజ్ నిర్వహణ సామర్థ్యం 500 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో తూర్పు తీర ప్రాంతంపై అదానీ గ్రూపు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమిళనాడులో కట్టపల్లి, ఎన్నోర్ పోర్టులను కొనుగోలు చేసిన అదానీ, మన రాష్ట్రంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటా కొనుగోలు రూ.14,800 కోట్లు వ్యయం చేయగా, గంగవరం పోర్టులో 89.6 శాతం వాటాను రూ.5554 కోట్లకు కొనుగోలు చేసింది. అదాని గ్రూపు రాష్ట్రంలోని ఈ రెండు పోర్టులో కొనుగోలు చేయడం కోసం రూ.20,354 కోట్లు వ్యయం చేసింది. రాష్ట్ర ఆదాయంలో మార్పు ఉండదు కృష్ణపట్నం పోర్టులో ఏపీసెజ్ 100 శాతం వాటాను కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఎటువంటి ప్రభావం చూపదని ఏపీ మారిటైమ్ బోర్డు స్పష్టం చేసింది. కృష్ణపట్నం పోర్టు ఆదాయంలో 2.6 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుందని, ఇప్పుడు 100 శాతం వాటా తీసుకున్నా అదే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీథరన్ ‘సాక్షి’కి తెలిపారు. -
గంగవరం పోర్టులో అదానీకి 89.6% వాటా
సాక్షి, అమరావతి: గంగవరం పోర్టు లిమిటెడ్(జీపీఎల్)లో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటాను రూ.3,604 కోట్లతో కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) లిమిటెడ్ తెలిపింది. ఈ ఒప్పందాన్ని నియంత్రణ సంస్థ ఆమోదించాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. జీపీఎల్లో వార్బర్గ్ పింకస్ సంస్థకు చెందిన 31.5 శాతం వాటాను మార్చి 3న ఏపీఎస్ఈజెడ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వార్బర్గ్ పింకస్, డీవీఎస్ రాజు, కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు వాటాను కలిపితే జీపీఎల్లో తమ వాటా 89.6 శాతానికి చేరుకుందని ఆ సంస్థ పేర్కొంది. అదానీ పోర్ట్స్ 2% అప్... గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ షేరు 2 శాతం ఎగిసింది. బీఎస్ఈలో ఒక దశలో ఏకంగా 4.67 శాతం ఎగిసి రూ. 755.35 స్థాయిని కూడా తాకి చివరికి 2.3 శాతం లాభంతో రూ. 738.20 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో 2 శాతం లాభంతో రూ. 737 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈలో 11.74 లక్షలు, ఎన్ఎస్ఈలో 3 కోట్ల షేర్లు చేతులు మారాయి. -
గందరగోళంలో సెజ్ యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ పరిణామాలతో అద్దెలపరంగా కేంద్రం ఇచ్చిన వెసులుబాటులో స్పష్టత కొరవడటంతో ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) యూనిట్లు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. వివరాల్లోకి వెడితే.. లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్న నేపథ్యంలో తమకు తోడ్పాటు ఇవ్వాలంటూ సెజ్ ఎగుమతిదారులు కేంద్రాన్ని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన కేంద్ర వాణిజ్య శాఖ కొన్ని ఊరట చర్యలు ప్రకటించింది. వీటి ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెజ్ యూనిట్ల లీజు అద్దె పెరగదు. అలాగే, తొలి త్రైమాసికం లీజు అద్దెను జూలై 31 వరకూ వాయిదా వేస్తూ గత నెల 28న నోటిఫికేషన్ జారీ చేసింది. వాయిదాపడిన చెల్లింపులపై వడ్డీ భారం ఉండబోదని పేర్కొంది. తమ తమ జోన్లలో ఈ ఆదేశాలను అమలు చేయాల్సిందంటూ ప్రభుత్వ, ప్రైవేట్ సెజ్ డెవలపర్లకు సూచించింది. ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్ని తొలి త్రైమాసికంగా పరిగణిస్తారు. తొలి త్రైమాసికం అద్దెను వాయిదా వేశారు సరే!!. ఈ వాయిదా జులై 31 వరకూ ఉంటుందని పేర్కొనటంతో ఈ వాయిదా వేసిన అద్దెను జూలై 31లోగా చెల్లించేయాలా? లేక జూలై 31 వరకూ అద్దెను వాయిదా వేసి ఆ తరవాత చెల్లించవచ్చా? అనే సందిగ్ధంలో సెజ్ యూనిట్లున్నాయి. దీనిపై స్పష్టత రాకముందే తమ అద్దెలు చెల్లించాల్సిందేనంటూ డెవలపర్లు ఒత్తిడి తెస్తున్నట్లు పలు కంపెనీలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని, అద్దె వాయిదాలపై స్పష్టతనివ్వాలని, డెవలపర్లకూ తగు ఆదేశాలివ్వా లని కోరాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ క లిసి 356 నోటిఫైడ్ సెజ్‌లుండగా అందులో విశాఖ, చెన్నై, కాండ్లా సహా 8 ప్రభుత్వ సెజ్‌లున్నాయి. -
సెజ్‌లు ఏర్పాటు చేసింది అందుకే
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి శనివారం బ్రాండిక్స్ ఇండియా కంపెనీలో పర్యటించారు. దుస్తులు ఎగుమతి గురించి అడిగి తెలుసుకున్నారు. కంపెనీలో 60 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. 20 ఉద్యోగాలు కల్పించడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. మౌలిక వసతులు కల్పిస్తే మరింత మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం గౌతం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే సదుద్దేశంతో వైఎస్సార్ సెజ్‌లను ఏర్పాటు చేశారన్నారు. కానీ టీడీపీ హయాంలో పరిశ్రముల పూర్తిగా గాడితప్పాయని ఆరోపించారు. కాలుష్యం విషయంలో పరిశ్రమలు నిబంధనలు పాటించాలని ఆయన ఆదేశించారు. -
పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు
సాక్షి, తూర్పు గోదావరి : పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మకు చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు సెజ్ రైతుల నుంచి నిరసన ఎదురయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్మ గురువారం రమణక్కపేటలో పర్యటిస్తుండగా సెజ్ రైతులు ఎమ్మెల్యే ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. గత ఎన్నికలకు ముందు సెబ్ భూముల్లో ఏరువాక చేసి వాటిని తిరిగి రైతులకు ఇచ్చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటివరకూ ఆ హామీని నేరవేర్చలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు తిరిగి ఇవ్వాలని.. లేదా నూతన భూసేకరణ చట్టం కింద తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను ఈడ్చిపడేశారు. అయితే రైతుల పట్ల నిర్దయగా వ్యవహరించిన ఎమ్మెల్యే వర్మ పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. -
సెజ్ పాలసీ కమిటీలో ఏపీ, తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ : స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (సెజ్) పాలసీని అధ్యయనం చేసేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి భారత్ ఫోర్జ్ సంస్థ చైర్మన్ బాబా కల్యాణీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో 9 మంది ప్రముఖులు, అధికారులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. శ్రీ సిటీ సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, హైదరాబాద్ ఫీనిక్స్ డెవలపర్ డైరెక్టర్ శ్రీకాంత్ బాడిగ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న సెజ్ విధివిధానాలను సమీక్షించి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలకు అనుకూలంగా నూతన సెజ్ పాలసీని రూపొందించేందుకు ఈ కమిటీ మూడు నెలల్లో సిఫార్సులు సమర్పించాల్సి ఉంటుంది. -
సెజ్ పాలసీ అధ్యయనానికి గ్రూప్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (సెజ్) పాలసీ అధ్యయనానికి ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి దీనికి హెడ్‌గా వ్యవహరిస్తారని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘గ్రూప్ సెజ్ పాలసీని విశ్లేషిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎగుమతిదారుల అవసరాలను తీర్చేందుకు అవసరమైన సలహాలను సూచిస్తుంది. ఇతర వాటితో పోలుస్తూ పాలసీకి సంబంధించిన తులనాత్మక విశ్లేషణను రూపొందిస్తుంది’ అని వివరించింది. ఈ గ్రూప్ మూడు నెలల కాలంలో తన ప్రతిపాదనలను ఒక నివేదిక రూపంలో మంత్రిత్వ శాఖకు అందజేస్తుంది. ఇక గ్రూప్‌లో శ్రీసిటీ సెజ్ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, కె రహేజ గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజ, టాటా స్టీల్ సెజ్ ఎండీ అరుణ్ మిశ్రా, మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్ ఎండీ అనిత అర్జున్‌దాస్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడ్, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (పరిశ్రమలు) సభ్యులుగా ఉంటారు. -
ఆంధ్రప్రదేశ్‌కి ఆ ప్రతిపాదన లేదు : కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : కర్నూలులో కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ ఏర్పాటు ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సీఆర్ చౌదరీ బుధవారం తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ (సీఈజెడ్) ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిందని విజయసాయి రెడ్డి తెలిపారు. సీఈజెడ్ ఏర్పాటులో కేంద్రం చేపట్టిన చర్యలేమిటో తెలపాలని సంబంధిత మంత్రిని ఆయన కోరగా..ప్రస్తుతానికి సీఈజడ్ ఏర్పాటు ప్రతిపాదనేదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ టవర్‌కూ మొండిచేయే..! రాష్ట్రంలో ఎగుమతుల ప్రోత్సాహానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా విశాఖ జిల్లా దువ్వాడలోని స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లో ఐటీ టవర్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని సీఆర్ చౌదరీ వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని మాత్రం వెల్లడించలేదు. ఏ మేరకు నిధుల కేటాయింపులు జరిగాయన్న విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేశారు. -
ఎస్ఈజెడ్లో పర్యావరణ కాలుష్యంపై ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గురువారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో భేటీ అయ్యారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో నెలకొన్న స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్ఈజెడ్)లో దాదాపు 40 కంపెనీలు పర్యావరణ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ కాలుష్యం సృష్టిస్తున్నాయంటూ ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. ఎస్ఈజెడ్లో దాదాపు 40 కంపెనీలు పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టవలసిన మురుగు నీటిని శుద్ధి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయనందున అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని అనేక గ్రామాల్లో తాగు నీరు కలుషితంగా మారిపోయిందన్నారు. శుద్ధి చేయని కాలుష్య జలాలను ఆయా కంపెనీలు సముద్రంలోకి విడుదల చేస్తున్నందున సముద్ర జలాలు కూడా కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్ఈజెడ్లోని కంపెనీల కారణంగా భూగర్భ జలాలు, సముద్ర జలాలు కూడా కలుషితమైపోతూ రైతులు, మత్స్యకారులకు ఎనలేని నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ సమస్యపై ఎస్ఈజెడ్ పరిసర బాధిత గ్రామాల ప్రజలు అనేకమార్లు ఆందోళనలు చేపట్టారని, తమ గోడు పట్టించుకోవాలంటూ పలుమార్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని విజయసాయి రెడ్డి తెలిపారు. కాబట్టి తక్షణమే దీనిపై స్పందించి ఎస్ఈజెడ్లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని బాధిత గ్రామాల ప్రజలను జల కాలుష్యం బారి నుంచి కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతామన్, హర్ష వర్దన్, ఎస్సీ కమిషన్ చైర్మన్ రాం శంకర్ కఠారియాను ఎంపి విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాధ్ బృందం కలిశారు. విశాఖలోని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ విశాఖ అచ్యుతాపురం ఎస్ఈజడ్లో వ్యర్ధాల శుద్ది కేంద్రం ఏర్పాటు చేయాలని హర్షవర్ధన్‌కి విజ్ఞప్తి చేశారు. సముద్రంలోకి వదులుతున్న వ్యర్థాల వల్ల మత్స్య సంపద నాశనమవుతోందన్నారు. అలాగే నావల్ బేస్ నిర్మాణం కోసం ఆరుగ్రామాలు ఖాళీ చేయించారని, రాంబిల్ నిర్వాసితులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని రక్షణ శాఖ మంత్రిని కోరారు. దీంతోపాటు ఎస్సీ మహిళను వివస్త్రను చేసిన ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. -
కాకినాడ సెజ్‌కు లోకేశ్ గిఫ్ట్
అమరావతి: కాకినాడ సెజ్‌కు అసాధారణ, ప్రత్యేక అధికారాలు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు కల్పించిన అధికారాలను కాకినాడ సెజ్ భూములున్న ప్రాంతంలో రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే.. సెజ్ భూములున్న గ్రామాలలో పంచాయతీల తీర్మానం అవసరం లేకుండా సెజ్‌లో ఎలాంటి పరిశ్రమలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. సెజ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమలపై ఆయా గ్రామ పంచాయతీలు ఎలాంటి స్థానిక పన్నులూ వసూలు చేసుకునే వెసులుబాటు ఉండదు. నారా లోకేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఇందుకు సంబంధించి ఫైలు వేగంగా కదులుతోంది. తొమ్మిదిలో 5 గ్రామాలు వ్యతిరేకించినా.. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి, పొండంగి మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల పరిధిలో 8,672 ఎకరాలలో సెజ్ ఏర్పాటైంది. సెజ్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఉండే అధికారాలను రద్దు చేయాలంటూ గత ఏడాది ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై సంబంధిత తొమ్మిది గ్రామ పంచాయతీల అభిప్రాయం తెలియజేయాలంటూ 2016 సెప్టెంబరు 20వ తేదీన ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా అధికారులను ఆదేశించింది. సెజ్ భూములపై గ్రామ పంచాయతీల అధికారాల రద్దు అంశంపై తొమ్మిది గ్రామ పంచాయతీలలో తీర్మానాలు ప్రవేశపెట్టగా ఐదు గ్రామ పంచాయతీలు వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోగా, నాలుగు పంచాయతీలు అనుకూలంగా తీర్మానం చేశాయి. యు. కొత్తపల్లి మండలం శ్రీరాంపేట, రమణక్కపేట, పొన్నాడ, కొత్తమూలపేట, కొమరగిరి గ్రామ పంచాయతీలు వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించగా.. యు. కొత్తపల్లి మండలం మూలపేట, పొండంగి మండలం ఏవీ నగరం, కేవీ పెరమాళ్లపురం, కోదాడ గ్రామ పంచాయతీలు అను కూలంగా తీర్మానాలను ఆమోదించాయి. గ్రామ పంచాయతీల తీర్మానాలను జత చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి డిసెంబరు 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. అయితే, గ్రామ పంచాయతీలు వ్యతిరేకించినా సెజ్ భూములపై పంచాయతీల అధికారాలను రద్దు చేసి, సెజ్‌కు విశేషాధికారాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించబడిన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. లోకేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఇందుకు సంబంధించిన ఫైలు సిద్ధమైంది. లోకేశ్ ఈ ఫైలుపై సంతకం చేయడమే ఇక మిగిలింది. కాకినాడ సెజ్ ఒక్కటే స్పెషల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందకు పైగా సెజ్‌లు ఏర్పాటయ్యాయి. ఏ సెజ్‌కూ ఇలాంటి ప్రత్యేకాధికారాలు కల్పించలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టాలన్నా సంబంధిత గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ అనుమతి తీసుకున్న తర్వాతే నిర్మాణ పనులు మొదలు పెడతారు. ఆ భవనం నుంచి ప్రతి ఏటా సంబంధిత గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలు చేసుకునే అధికారం ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు కల్పించబడిన ఇలాంటి ప్రత్యేకాధికారాలను కాకినాడ సెజ్ కోసం రద్దు చేయడంపై అధికారవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. -
5 సెజ్‌లకు అనుమతి
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఐదు కొత్త ప్రత్యేక ఆర్థిక మండలాలు(స్పెషల్ ఎకనామిక్ జోన్–సెజ్)ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన వాటిల్లో ఒరాకిల్ ఇండియా, ఎల్ అండ్‌టీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ఒరాకిల్ ఇండియా కంపెనీ కర్నాటకలో ఐటీ, ఐటీఈఎస్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నది. ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కూడా రెండు ఐటీ, ఐటీఈఎస్ సెజ్‌లను ఇదే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నది. కర్నాటకలోనే ఐటీ జోన్ ఏర్పాటు చేస్తామన్న మోడర్న్ అసెట్ అండ్ మోడర్న్ అసెట్(ఫేజ్ టూ) ప్రతిపాదన కూడా ఆమోదం పొందింది. -
వేలానికి జీవీకే గ్రూప్ ‘సెజ్’
► సిద్ధమైన సిండికేట్ బ్యాంకు ► రూ.175 కోట్లు బాకీపడ్డ కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే గ్రూప్‌కు సిండికేట్ బ్యాంక్ షాకిచ్చింది. రుణ రికవరీలో భాగంగా తమిళనాడులో 2,500 ఎకరాల్లో విస్తరించిన జీవీకే పెరంబలూరు సెజ్ స్థలాన్ని వేలానికి పెట్టింది. సిండికేట్ బ్యాంకుకు గ్రూప్ కంపెనీ జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.175.08 కోట్లు బాకీ పడింది. సర్ఫేసీ యాక్ట్–2002 కింద రికవరీ కోసం బ్యాంకు ఈ మేరకు గురువారం పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. రిజర్వ్ ప్రైస్ రూ.257 కోట్లుగా ఉంది. జనవరి 6న తొలిసారి నిర్వహించిన వేలానికి స్పందన రాలేదు. దీంతో మరోసారి మార్చి 27న ఈ–వేలానికి బ్యాంకు సిద్ధమైంది. 2015 డిసెంబరులో రూ.156.76 కోట్ల బాకీ చెల్లించాలంటూ నోటీసు ఇచ్చిన తర్వాత 2016 సెప్టెంబరు నుంచి 2017 ఫిబ్రవరి మధ్య జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.8.9 కోట్లు మాత్రమే సిండికేట్ బ్యాంకుకు చెల్లించింది. మరో రెండు బ్యాంకులు సైతం.. సిండికేట్ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులు సైతం ఇదే సెజ్ స్థలంపై జీవీకే గ్రూప్ కంపెనీలకు రుణాలను మంజూరు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు రూ.1,078 కోట్లు అప్పు ఇచ్చింది. యాక్సిస్ బ్యాంకు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.205 కోట్లు రుణం అందించింది. కాగా, 2016 మార్చి నాటికి జీవీకే గ్రూప్ రుణ భారం రూ.32,290 కోట్లు ఉన్నట్టు సమాచారం. కంపెనీ 2015–16లో కన్సాలిడేటెడ్ నిర్వహణ ఆదాయం రూ.4,164 కోట్లపై రూ.1,212 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వాటాల విక్రయం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న జీవీకే గ్రూప్‌కు సిండికేట్ బ్యాంక్ చర్య ఇబ్బందికర పరిణామమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. చెల్లిస్తామంటున్నారే తప్ప.. బాకీ విషయమై బ్యాంకుతో చర్చిస్తున్నామని జీవీకే అంటోంది. మొత్తం బాకీని కొన్ని వారాల్లో చెల్లిస్తామని మరీ చెబుతోంది. అయితే ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు తోసిపుచ్చారు. కంపెనీ ప్రతినిధులు బ్యాంకుతో చర్చిస్తున్నట్టు తనకు సమాచారం లేదని సిండికేట్ బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయం ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. బాకీ చెల్లించే ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడించారు. మొదటిసారి వేలం నోటీసు ఇచ్చినప్పుడు కూడా బాకీ తిరిగి చెల్లిస్తామని కంపెనీ చెప్పిందేగానీ, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లేవీ చేయలేదని ఆ అధికారి వ్యాఖ్యానించారు. సెజ్ స్థలాన్ని ఒకే యూనిట్‌గా విక్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుకు రావాల్సిన మొత్తాన్ని స్వీకరిస్తాం. ఇతర రుణదాతలకు చెల్లించేందుకు వీలుగా మిగిలిన వేలం సొమ్మును కంపెనీకి ఇస్తాం అని ఆయన వివరించారు. -
చిత్తూరులో సీసీఎల్ సెజ్
⇒ ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంటు ఏర్పాటు ⇒ మొత్తం రూ.340 కోట్ల పెట్టుబడి ⇒ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ తయారీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో సెజ్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందింది. వరదయ్యపాలెం మండలం కువ్వకొల్లి వద్ద కంపెనీ 100 ఎకరాలను కొనుగోలు చేసింది. ఇందులో 25 ఎకరాల్లో సెజ్ రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ స్థాయిలో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ తయారీ ప్లాంటు నెలకొల్పనున్నట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ యూనిట్లో 2018 అక్టోబరు–డిసెంబరు నాటికి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. సెజ్ రాకతో పన్ను ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. ఇప్పటికే సంస్థకు గుంటూరు జిల్లా దుగ్గిరాలతోపాటు వియత్నాం, స్విట్జర్లాండులోనూ కాఫీ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఎగుమతుల కోసం.. సెజ్‌లో ఏర్పాటు కానున్న ప్లాంటు వార్షిక సామర్థ్యం 5,000 టన్నులు ఉండనుంది. దీని కోసం రూ.340 కోట్ల దాకా పెట్టుబడి పెట్టనున్నట్టు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పూర్తిగా ఎగుమతుల కోసమే దీనిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో 200 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. దుగ్గిరాల ప్లాంటు వార్షిక సామర్థ్యం 20,000 టన్నులు. స్విట్జర్లాండ్ ప్లాంటు 3,000 టన్నులు. వియత్నాం ప్లాంటు 10,000 టన్నులు ఉంది. మూడేళ్లలో వియత్నాం ప్లాంటు సామర్థ్యం రెట్టింపు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లు చేశామన్నారు. సంస్థ ఉద్యోగుల సంఖ్య 1,000కి పైమాటే. వందలాది బ్రాండ్లలో.. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలకు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రైవేట్ లేబుల్ విభాగంలో ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తిలో ఈ సంస్థ ప్రపంచ నంబర్ వన్‌గా ఉంది. స్ప్రే డ్రైడ్ కాఫీ పౌడర్, స్ప్రే డ్రైడ్ కాఫీ గ్రాన్యూల్స్, ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ గ్రాన్యూల్స్, ఫ్రీజ్ కాన్సెంట్రేటెడ్ లిక్విడ్, డీకాఫీనేటెడ్ కాఫీ, ఫ్లేవర్డ్ కాఫీ తదితర విభాగాల్లో 200లకు పైగా స్పెషాలిటీ క్రాఫ్టెడ్ బ్లెండ్స్లో కాఫీలను తయారు చేస్తోంది. వీటిని ప్రపంచవ్యాప్తంగా 100 కంపెనీలు వివిధ బ్రాండ్లలో విక్రయిస్తున్నాయి. సంస్థ ఆదాయంలో ఎగుమతుల వాటా 97 శాతముంది. సీసీఎల్ తన సొంత కాంటినెంటల్ బ్రాండ్‌లో భారత్‌లో పలు నగరాల్లో కాఫీని అమ్ముతోంది. దిగుమతుల ప్రభావం లేదు.. వియత్నాం నుంచి కాఫీ గింజలతో సహా ఆరు ఉత్పత్తుల దిగుమతులను భారత ప్రభుత్వం మార్చి 7 నుంచి బ్యాన్ చేసింది. 2015–16 ఏడాదిలో కాఫీ గింజల దిగుమతులు 64 వేల టన్నుల్లో సగ భాగం వియత్నాం నుంచి కొనుగోలు చేసినవే. ముడి కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్, వియత్నాం, కొలంబియా, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాలు టాప్‌లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఒకే ధర ఉండడంతో ఇప్పుడు ఇతర దేశాలపై కంపెనీలు ఆధారపడతాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రభావం తమ కంపెనీపై ఉండదని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వియత్నాంలో కంపెనీకి భారీ ప్లాంటు ఉందని గుర్తు చేశారు. గుంటూరు ప్లాంటుకు కావాల్సిన ముడి కాఫీని భారత్‌తోపాటు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. -
కొత్త బిజినెస్ సెంటర్.. వెయ్యి ఉద్యోగాలు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గ్లోబల్ ఫైనాన్స్ అండ్ ఎకౌంటింగ్ సంస్థను ప్రారంభించనున్నట్టు లిక్కర్ కంపెనీ డియాజియో బిజినెస్ సర్వీస్ ఇండియా(డీబీఎస్ఐ) ప్రకటించింది. కార్లే టౌన్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) లో కొత్త వ్యాపారకేంద్రాన్ని సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కొత్త కేంద్రం కోసం 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని వెల్లడించింది. 2017 అక్టోబర్ 17 నాటికి దేశంలో వ్యాపార సేవలను మొదలు పెడతామని డియాజియో మేనేజింగ్ డైరెక్టర్ ట్రేసీ బర్న్స్ చెప్పారు. ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ రంగాలపై దృష్టి పెట్టామన్న డీబీఎస్ఐ బిజినెస్ ఇంటలిజెన్స్, ఎనలిటిక్స్ అండ్ డేటా, ఇతర సేవల వైపు వేగంగా పయనిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో 1,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే నియామకాలు మొదలుపెట్టామని 100మందిని ఎంపిక చేశామని తెలిపింది. నైపుణ్యానికి పెద్ద పీట వేసి ప్రోత్సాహాన్నిచ్చే తాము చాలా అవకాశాలను కల్పించడంతో పాటు స్త్రీ పురుషులకు సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఎస్ఈజెడ్పై బహిరంగ చర్చకు సిద్ధమా?
ఎమ్మెల్యే వర్మకు దొరబాబు సవాల్ గొల్లప్రోలు : ఎస్ఈజెడ్పై పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చేస్తున్న అసత్యప్రచారాలు మానుకోవాలని, ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమాని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు సవాల్ విసిరారు. గొల్లప్రోలులో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఈజెడ్పై ఎమ్మెల్యే చేసిన ప్రకటనలపై ఖండించారు. ఎస్ఈజెడ్పై ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించేందుకు నియోజకవర్గంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. ఎస్ఈజెడ్ భూములు పార్టీ అధినేత జగన్ మోహ¯Œæరెడ్డికి చెందినవని, ఎస్ఈజెడ్ను దివంగత సీఎం వైఎస్ ఏర్పాటు చేశారంటూ ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఎస్ఈజెడ్ ఏర్పాటుకు జీఓను చంద్రబాబు జారీ చేశారని, ఈ భూములన్నీ చంద్రబాబు బినామీల పేరిట ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతంలో ఏరువాక చేపట్టిన చంద్రబాబు.. ఎస్ఈజెడ్కు సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మాటను విస్మరించారని విమర్శించారు. మంత్రి యనమల, ఎమ్మెల్యే కలసి తొండంగి మండలంలో దివీస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూసేకరణ చేపట్టి రైతులను, కోన గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రైతులు భూములను లాక్కోవడం, చెరువుల్లో మట్టి అమ్ముకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అక్కర్లేదని, ప్యాకేజీ ముఖ్యమని రాష్ట్ర ప్రజల మనోభాలను దెబ్బతీశారన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కురుమళ్ల రాంబాబు, పట్టణ కన్వీనర్ పర్ల రాజా, పిఠాపురం మున్సిపాలిటీ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబీ, గొల్లప్రోలు నగర పంచాయతీ ఫ్లోర్‌లీడర్ తెడ్లపు చిన్నారావు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మొగలి అయ్యారావు, మాజీ సర్పంచ్ చిన్నారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
సెజ్ బాధితులకు అండగా పోరాడతాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోట: కర్లపూడి సెజ్ బాధితులకు అండగా నిలబడి పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. ఆదివారం కర్లపూడి గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. కోస్టల్ కారిడార్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక్కడ ఉన్న భూములు వాటి స్థితిగతుల ఆధారంగా ఎకరాకు రూ.కోటి నష్ట పరిహారంగా చెల్లించాలన్నారు. కోట, చిల్లకూరు మండలాల్లో 11 వేల ఎకరాలు పరిశ్రమలకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేసిన విషయాన్ని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. పరిశ్రమల కోసం గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. భూ బాధితులకు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, డివిజన్ కార్యదర్శి యాదగిరి, కోట మండల కార్యదర్శి పీవీ కృష్ణయ్య, కర్లపూడి సర్పంచ్ సన్నారెడ్డి చెంచురాఘవరెడ్డి ఉన్నారు. సెజ్‌లు, సీపీఎం మధు, కోట -
హనుమకొండ ఐటీ సెజ్ ఏర్పాటుకు మరింత గడువు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి మరికొంత గడువు లభించింది. దీనితో సహా మొత్తం ఏడు సంస్థలకు సెజ్‌ల ఏర్పాటుకు గాను కేంద్రం మరికొంత గడువిచ్చింది. -
ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలు!
అందరికీ కాదు.. కొందరికే.. న్యూఢిల్లీ: ఉద్యోగం ఆఫీసుకు వెళ్లి చేయాలి. ఇప్పుడు ఇలాంటిదేమీ లేకుండా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయొచ్చు. ఈ సౌకర్యం అందరికీ కాదండోయ్.. కేవలం ఐటీ, ఐటీఈఎస్ సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండళ్లు) యూనిట్ల ఎంప్లాయిస్‌కు మాత్రమే. వీరు ఇంటి వద్ద నుంచైనా, మరేఇతర ప్రదేశం నుంచైనా ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐటీ, ఐటీఈఎస్ సెజ్ యూనిట్లలోని ఉద్యోగులు.. ఇంటి నుంచి, సెజ్ వెలుపలి ప్రాంతం నుంచి వారి ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించవచ్చా? లేదా? అనే అంశంపై స్పష్టతనివ్వాలని పరిశ్రమ సంబంధిత ప్రతి నిధులు, ఇన్వెస్టర్లు మంత్రిత్వ శాఖను కోరారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ పలు నిబంధనలతో సెజ్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయొచ్చని తె లిపింది. ‘ఉద్యోగి సెజ్ వెలుపల నుంచి బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటే.. అతను రెగ్యులర్ ఎంప్లాయి అయ్యిండాలి. బయట నిర్వర్తించే బాధ్యతలు సెజ్ యూనిట్ సర్వీసులకు లోబడి ఉండాలి. ఆ బాధ్యతలు సెజ్ ప్రాజెక్టులకు సంబంధించినవి కావాలి’ వంటి తదితర నిబంధనలు మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. అలాగే ఉద్యోగి ఇంటి వద్ద నుంచి పనిచేయడానికి వీలుగా అతనికి ల్యాప్‌టాప్/కంప్యూటర్ వంటి కనెక్టివిటీ సౌకర్యాలను కల్పించాలని పేర్కొంది. -
నాట్లకు ఇబ్బంది రానివ్వం
ఎస్సారెస్పీ నీటితో ఎల్ఎండీని నింపుతాం అవసరమైతే చెరువులు, కుంటలకు నీళ్లిస్తాం నేటినుంచే నీటిని విడుదల చేస్తున్నాం.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం వైద్యులు, సిబ్బంది సెలవులు రద్దు చేశాం 15 రోజుల్లోగా మరో 2కోట్ల మెుక్కలు నాటుతాం దళితులకు భూమి ఇద్దామంటే అమ్మేవాళ్లు లేరు మంత్రి ఈటల రాజేందర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఖరీఫ్ సీజన్లో నాట్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా రైతాంగానికి భరోసా ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాల్వ, కాకతీయ కాల్వ ద్వారా ఎల్ఎండీ, మధ్యమానేరు రిజర్వాయర్లకు బుధవారం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అవసరాల మేరకు ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలను నింపి పంటలను కాపాడుతామన్నారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో రానున్న 15 రోజుల్లో ప్రభుత్వ లక్ష్యాన్ని మించి 4.5 కోట్ల మొక్కలు నాటనున్నామని చెప్పారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున వైద్యులు, సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో నీళ్లు కలుషితం కాకుండా ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని, పీహెచ్‌సీల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో ముఖ్యాంశాలివీ. సాక్షి : ఎస్సారెస్పీ నిండకుండానే నీటిని విడుదల చేయడానికి కారణమేంటి? ఈటల : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఎస్సారెస్పీ నిండనేలేదు. మొన్నటి వర కైతే జిల్లాలో భయంకరమైన పరిస్థితి ఉండేది. భూగర్భ జలాలు అడుగంటినయ్. బోర్లు, బావులు ఎండిపోయినయ్. పశువులు తాగడానికి నీళ్లు లేకుండే. ఇప్పుడిప్పుడే బాగా వానలు పడుతున్నయ్. రాష్ట్రం వచ్చాక తొలిసారి ఎస్సారెస్పీ నిండుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 44 టీఎంసీల నీరుంది. ఎగువన ఇంకా వానలు పడుతున్నందున 50 టీఎంసీల వరకు నీళ్లు వచ్చే అవకాశముంది. నిబంధనల ప్రకారం 40 టీఎంసీలుంటే తాగునీటికే నీరు వదలాలి. కానీ వానలు పడతాయనే నమ్మకంతో ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నం. బుధవారం ఉదయం 11 గంటలకు నేను, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పోచంపాడులో పూజలు నిర్వహించి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీళ్లను వరద కాలువ, కాకతీయ కాలువల ద్వారా ఎల్ఎండీకి విడుదల చేస్తాం. సాక్షి : ఎల్ంఎడీ నిండాక చెరువులు, కుంటలు నింపుతారా? ఈటల : ప్రస్తుతానికైతే నాట్లకు ఏమాత్రం ఇబ్బంది రానివ్వం. రైతులకు అవసరమైన మేరకు సాగు నీరందిస్తాం. అవసరాన్ని బట్టి చెరువులు, కుంటలు కూడా నింపుతం. ఈసారి ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండుతోంది. ఇప్పటికే 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాబట్టి నాట్లకు ఏమాత్రం ఇబ్బంది రానీయం. సాక్షి : కాకతీయ కెనాల్ ఆధునికీకరణ పనులు పూర్తయినట్లేనా? ఈటల : గతంలో ఎన్నడూ లేనంతగా ఎల్ఎండీ ఎగువన, దిగువన రూ.200 కోట్లు ఖర్చు చేసి కాకతీయ కెనాల్ కెపాసిటీని పెంచినం. వరంగల్ జిల్లాలో కొంత పని మినహా దాదాపు కాలువ ఆధునికీకరణ పనులు పూర్తయినయ్. సాక్షి : సీజనల్ వ్యాధుల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు..? ఈటల : డాక్టర్లకు సెలవులు రద్దు చేసినం. మంచి కండీషన్లో ఉన్న 108 వాహనాలను ఏజెన్సీ, మారుమూల గ్రామాల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించినం. ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాలని చెప్పినం. వానాకాలంలో పాముకాటుకు గురయ్యే అవకాశాలున్నందున ఆసుపత్రుల్లో ఆయా మందులను సిద్ధంగా ఉంచాలని సూచించినం. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున క్లోరినేషన్ తప్పకుండా చేయాలని, అందుకు కేటాయించిన సొమ్మును దానికి మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసినం. అట్లాగే ప్రతి రోజూ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించినం. జిల్లాలో మరణాలుంటే ఎందుకు చనిపోయారో తప్పనిసరిగా కారణాలు వెల్లడించాలి. జిల్లాలో ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ముందుల కోసం తగిన నిధులు విడుదల చేసినం. నిధుల వ్యయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్లకే సర్వధికారాలిచ్చినం. సాక్షి : జిల్లాలో హరితహారం లక్ష్యం నెరవేరలేదు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం పెంచాలని సీఎం చెబుతున్నారు కదా! ఈటల : జిల్లాలో ఇప్పటివరకు రెండున్నర కోట్ల మొక్కలు నాటినం. ఇంకా రెండు కోట్ల మొక్కలు నాటుతం. ఇప్పటికే నర్సరీల్లో 75 లక్షల టేకు, ఇరవై లక్షల పండ్ల, పది లక్షల ఈత, మరో పది లక్షల యూకలిప్టస్ సహా మొత్తం కోటిన్నర మొక్కలు అందుబాటులో ఉన్నయ్. వచ్చే పదిహేను రోజుల్లో ఇంకా రెండు కోట్ల మొక్కలు నాటుతం. ఎమ్మెల్యేలను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేస్తున్నం. కరీంనగర్ జిల్లాలో హరితహారం ముగింపు లేదు. నిరంతరం కొనసాగిస్తాం. ఖాళీ స్థలం కన్పిస్తే మొక్కలు నాటుతం. గుట్టల, వాగుల పక్కన, రోడ్లకు ఇరువైపుల, అడవుల్లో, చెరువు శిఖం భూములుసహా ప్రతిచోట మొక్కలు నాటుతం. మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించాలని ఇప్పటికే తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినం. అధికారులు ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమై ఉన్నరు. సాక్షి : మేనిఫెస్టోలో పేర్కొన్న డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు భూపంపిణీ ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు కదా? ఈటల : అట్లేం లేదు. వాస్తవానికి మొన్నటివరకు తాగడానికి నీళ్లకే ఇబ్బంది ఉండే. ఇప్పుడిప్పుడే మంచిగ వానలు పడుతున్నయ్. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళుతోంది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం గ్రౌండింగ్ అవుతోంది. అట్లాగే దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. ఎక్కడెక్కడ భూములు అందుబాటులో ఉంటే ఆ మేరకు దళితులకు ఇస్తామని చెప్పినం. ఆ మేరకు భూములు కొనుగోలు చేసి దళితులకు ఇస్తున్నం. ఇల్లంతకుంట మండలంలో 500 ఎకరాల భూమి కొనిచ్చినం. గ్రామాల్లో రైతులు భూములను సోషల్ స్టేటస్‌గా భావిస్తున్నందున ఎవరూ అమ్మేందుకు సిద్ధపడటం లేదు. ప్రభుత్వ భూములు లేవు. ఎవరైనా భూములను అమ్మడానికి ముందుకొస్తే వాటిని కొనుగోలు చేసి దళితులకు అందజేస్తున్నం. సాక్షి : ప్రాజెక్టులకు భూసేకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారినట్లుంది? ఈటల : ఎవరు ప్రాజెక్టులు కట్టాలన్నా భూమి మీదే తప్ప ఆకాశంలో కట్టలేరు కదా! ప్రాజెక్టులు కడితే భూములు మునగక తప్పదు. అందుకు కొంతమంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. ప్రాజెక్టులు నిర్మిస్తే లక్షలాది మంది బతుకులు బాగుపడుతయ్. దయచేసి ప్రతిపక్షాలు భూసేకరణపై రాద్ధాంతం చేయకుండా నిర్మాణాత్మక సూచనలిస్తే స్వీకరిస్తం. ప్రజలకు అన్యాయం చేయడం మా ప్రభుత్వ అభిమతం కాదు. రాష్ట్ర ప్రజలకు నీళ్లివ్వడమే మా లక్ష్యం. -
కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రమణక్క పేటలోని సరుగుడు తోటలను నరికేందుకు గురువారం అధికారులు ప్రయత్నించారు. దీంతో సెజ్ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు, స్థానికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలు తెలియాల్సి ఉంది. -
పోస్కో ఒడిశా సెజ్ ఆమోదం రద్దు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన పొస్కో కంపెనీకి ఒడిశాలో ప్రత్యేక ఆర్థిక మండలం(సెజ్) ఏర్పాటు కోసం ఇచ్చిన సూత్రప్రాయ ఆమోదాన్ని కేంద్రం రద్దు చేసింది. గత నెల 28న జరిగిన సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన గల బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్(బీఓఏ) ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సెజ్ కోసం పోస్కో కంపెనీ చేసిన ప్రయత్నలు సంతృప్తికరంగా లేవని భావించిన బీఓఏ కమిటీ సెజ్ ఆమోదాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందని బీఓఏ మినట్స్ వెల్లడించాయి. ఒడిశాలోనే లాంకో సోలార్ ఏర్పాటు చేయనున్న సెజ్ అనుమతిని కూడా ఇదే కారణాలతో బీఓఏ రద్దు చేసింది. -
మాట తప్పడంలో మేటి
► సెజ్’పై హామీలకు చెల్లుచీటీ చంద్రబాబుపై జ్యోతుల ఆక్షేపణ సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎన్నికలకు ముందు ఒకలా చెప్పి, తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరించడంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని మించినవారు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. సెజ్ భూముల్లో ఏరువాక సాగినప్పుడు, కాకినాడలో సెజ్ వ్యతిరేక సభలో ప్రకటనలు చేసి.. వాటిని మరచిపోవడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పలువురు సెజ్ రైతులు సోమవారం మధ్యాహ్నం కాకినాడలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో నెహ్రూను కలిశారు. సెజ్ కోసం భూములిచ్చిన తమకు ప్రభుత్వం నుంచి తగిన న్యాయం జరిగేలా చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆయన..రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. సర్కారు తీరు డొంకతిరుగుడు.. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు నెహ్రూ సమాధానమిస్తూ.. ప్రభుత్వం ద్వంద్వ వైఖరివల్లే సెజ్ రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి రాతపూర్వకంగా సమాధానం కోరితే డొంకతిరుగుడుగా వచ్చిందని వెల్లడించారు. ‘సెజ్‌కోసం సేకరించిన భూముల రైతులకు సదరు భూమిలోని ప్రతి సెంటును తిరిగి ఇచ్చేయడం ద్వారా.. సేకరించిన భూముల్లో సేద్యం జరిగేటట్లు చూడడమవుతుందని’ 2012 ఏప్రిల్ 21న అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటన చేశారా? అయితే ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకోవడమైందా? అయితే భూములను తిరిగి పొందిన రైతులు ఎంతమంది? అలా రైతులకు తిరిగి ఇచ్చేసిన భూవిస్తీర్ణం ఎంత? లేకపోతే ఎప్పటిలోగా సదరు భూములను రైతులకు తిరిగి ఇచ్చివేస్తారు?’ అని సభలో రాతపూర్వకంగా సమాధానం కోరినట్లు చెప్పారు. దీనికి ‘21-04-2012న సభలో అప్పటి విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎటువంటి ప్రకటనా చేయలేదు’ అని ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందన్నారు. తాము అడిగిన మిగతా మూడు ప్రశ్నలకు ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అనే సమాధానం వచ్చిందన్నారు. జ్యోతులతో పాటు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు గుత్తుల సాయి, అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జంపన సీతారామచంద్రవర్మ, ఫ్రూటీ కుమార్, శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి తదితరులు ఉన్నారు. -
సెజ్‌కు సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలి
-
సెజ్ భూముల అవినీతిపై వామపక్షాల ఆందోళన
పెనుకొండ (అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా తుంగోడు సెజ్ భూముల నష్టపరిహారం చెల్లింపులో అధికారులు రూ.2 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం నేతలు, సమాచార హక్కు ఐక్యవేదిక నేతలు, సీపీఐ, సీపీఎం నేతలు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని సోమందేపల్లి ఎంపీడీవో కార్యాలయంవద్ద ధర్నా చేశారు. రైతులకు దక్కాల్సిన కోట్లాది రూపాయలను అధికారులు స్వాహా చేశారని, అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు. -
జగన్ భూములే అయితే జనానికి పంచరేం?
- మంత్రి యనమల మౌనంలో ఆంతర్యమేమిటి? - కేఎస్ఈజెడ్ ప్రభుత్వ భూములపై ‘దేశం’ నేతల కన్ను - అడ్డుకోవడానికి న్యాయ పోరాటం సాగిస్తాం - వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల తుని : కాకినాడ సెజ్ భూములన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డివని గతంలో ప్రచారం చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ భూములను రైతులకు పంచకుండా మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఆయన గురువారం తొండంగి మండలం పెరుమాళ్లపురంలో విలేకరులతో మాట్లాడారు. ఆ భూములు తనవే అయితే వెంటనే రైతులకు పంచాలని ఇటీవల జగన్ డిమాండ్ చేసినా యనమల స్పందించక పోవడం వెనుక రహస్యాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాకినాడ సెజ్ భూములను కారు చౌకగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వంకార్పోరేట్ సంస్థ అయిన జీఎంఆర్‌కు ధారాదత్తం చేసిందని విమర్శించారు. పట్టిసీమలో ఎకరానికి రూ.23 లక్షల పరిహారం ఇచ్చారని, ఇక్కడ రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని, లేకపోతే పట్టిసీమ లాగే ఇక్కడా రూ.23 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెజ్ భూములకు సమీపంలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూములను రహస్య ఒప్పందం ప్రకారం టీడీపీ నేతలు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పూర్తి ఆధారాలు సేకరించామని, దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి తాము సహకరిస్తామన్నారు. అయితే ఇక్కడ జరిగేది పచ్చ చొక్కాల నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారుల అండదండలతో సాగుతున్న అవినీతిపై పోరాటం మాత్రమే అన్నారు. పెట్రో కారిడార్ వల్ల ఈ ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తక్కువ ఓట్ల శాతంతో గద్దెనెక్కిన టీడీపీ నాయకులు జీవితాంతం అధికారంలో ఉంటామనుకుంటే సాధ్యం కాదన్నారు. ఏది ఏమైనా సెజ్ రైతులకు న్యాయం జరిగే వరకు అహర్నిశలు పోరాటం సాగిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటికైనా పంచుతారా?
పిఠాపురం / తుని : కాకినాడ సెజ్ (కేఎస్ఈజెడ్) భూములు కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నేతలకు చెందినవంటూ తెలుగుదేశం నేతలు చేసిన గోబెల్స్ ప్రచారానికి తెరపడింది. ‘ఆ భూములు తనవైతే వాటిని సంబంధిత రైతులకు పంచేయాలని’ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పెరుమాళ్లపురంలో బహిరంగసభలో మాట్లాడుతూ చేసిన ప్రకటనతో ‘దేశం’ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టరుుంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెజ్ భూముల్లో ఏరువాక సాగించి, అధికారంలోకి వస్తే రైతులకు భూములు తిరిగి ఇస్తామన్నారని, ఇప్పటి వరకూ మీనమీషాలు లెక్కించిన సర్కారు ఇప్పుడైనా భూముల్ని పంచుతుందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు వరకూ సెజ్ భూములు జగన్‌వి అంటు ప్రచారం చేసి, సెజ్ వ్యతిరేక పోరాట సమితికి వెన్నుదన్నుగా ఉంటామని ప్రకటనలు చేసిన పిఠాపురం, తుని నియోజకవర్గాల తెలుగుదేశం నేతలు ఎన్నికల అనంతరం పారిశ్రామికీకరణ మంత్రం జపిస్తుండడం వెనుక మర్మమేమిటని నిలదీస్తున్నారు. భూములు సేకరించి ఏళ్లు దాటినా ఒక్క పరిశ్రమా రాలేద ని బహిరంగంగా ప్రకటనలు చేసిన ‘దేశం’ నేతలు ప్రస్తుతం సెజ్ వ్యతిరేక పోరాట సమితి నాయకులనే సెజ్ అనుకూల సమితిగా మార్చేసి మరీ పరిశ్రమలు రావాలని జపం చేస్తుండడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. పగ్గాలు చేపట్టి ఏడాదైనా ఏవీ పరిశ్రమలు? తమ జీవనాధారమైన భూములను బలవంతంగా లాక్కుని అన్యాయం చేస్తున్నారని స్థానిక సెజ్ రైతులు గురువారం వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌కు వినతి పత్రం ఇచ్చారు. దీంతో ఆయన రైతుల ‘ఆ భూములు తనవని ప్రచారం చేస్తున్న తెలుగుదేశం నాయకులు తక్షణం వాటిని రైతులకు పంచడానికి తాను సుముఖంగా ఉన్నానని, వెంటనే పంచేయాలని’ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘అలా పంపిణీ చేస్తే చాలా సంతోషిస్తా’నని ఆయన అన్న మాటలతో సెజ్ రైతుల్లో నూతనోత్సాహం పెల్లుబికింది. అలాగే ఎకరం రూ.కోటి వరకు పారిశ్రామికవేత్తలకు అమ్ముకుంటున్న ప్రభుత్వం సెజ్‌కు సేకరించిన భూముల రైతులకు రూ.70 లక్షలైనా చెల్లించాలని బహిరంగ సభలో డిమాండ్ చేశారు. 2002లో కాకినాడ సెజ్‌కు నోటిఫికేషన్ ఇచ్చి, జీఓ విడుదల చేసింది చంద్రబాబు నాయుడేనని, అప్పట్లో ఎకరం ధర రూ.1.50 లక్షలుగా నిర్ణయించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, సెజ్‌లో భూములు కోల్పోయిన రైతులను నిలువునా నమ్మించడానికి ఏరువాక సాగిస్తూ ‘దేశం’ అధినేత ఆడింది నాటకమని జగన్ ధ్వజమెత్తడంతో తమ బతులకు భరోసా ఇచ్చారంటు సెజ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదివేల ఎకరాలు సేకరించి ఇప్పటి వరకు ఆరేళ్లుగా ఎటువంటి పరిశ్రమలు స్థాపించలేదని, గత ప్రభుత్వాలను విమర్శించిన తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎందుకు పరిశ్రలు స్థాపించలేక పోయిందని, నిరుద్యోగులకు భరోసా ఇవ్వలేక పోయిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు ఆ భూములు కాంగ్రెస్‌వని ఒకసారి, వైఎస్సార్ సీపీవని ఒకసారి ప్రకటనలు చేసిన ‘దేశం’ నేతలు జగన్ ప్రకటనతో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని, భూములు ఎప్పుడు పంచేది బహిరంగంగా తెలపాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే దాడిశెట్టికి అభినందన తమ సమస్యను జగన్ దృష్టికి తీసుకెళ్లిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చొరవతోనే ఆయన తమకు భరోసా ఇచ్చారని సెజ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమను నమ్మించి నట్టేట ముంచిన ‘దేశం’ నేతల అసలు స్వరూపం జగన్ ప్రకటనతో బయట పెట్టించారని ఎమ్మెల్యే రాజాను అభినందిస్తున్నారు. -
'నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ ఇచ్చెయ్'
-
సెజ్ ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన
మహేశ్వరం: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిరాల తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం పర్యటించారు. ఇక్కడి హార్డ్‌వేర్ పార్క్, ఫ్యాబ్‌సిటీ, ఇందూటెక్, బ్రాహ్మణి, సైన్స్‌సిటీ ప్రాజెక్టు ప్రాంతాలను ఆయన సందర్శించారు. వాటికి సంబంధించిన వివరాలు, పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
సెజ్ ప్రతిపాదిత భూముల్లో అగ్నిప్రమాదం
శ్రీరాంపురం: తూర్పుగోదావరి జిల్లాలోని సెజ్ ప్రతిపాదిత భూముల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారుగా 12 ఎకరాల విస్తీర్ణంలోని పంటలు బుగ్గిపాలయ్యాయి. ఈ సంఘటన కొంతపల్లి మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో మంగళవారం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలిసిరాలేదు. ఈ ప్రమాదంలో 12 ఎకరాల విస్తీర్ణంలో జీడిమామిడి, మామిడి, చెరకు పంటలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం సెజ్ పరిధిలోకి రావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశ్నించడమే ప్రజాద్రోహమా!
జన్యుమార్పిడి పంటలు ఆహార భద్రతకు ఏవిధంగా సమాధానం కాలేవో ప్రారంభ సదస్సులో ఇచ్చిన ఉపన్యాసంలో నేను వివరించాను. ఆ పంటలను పండించడం వల్ల వాతావరణ ంలోను, మన ఆరోగ్యంలోను సంభవించే విపరిణామాలను గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాను. తరువాత జరిగిన ఒక గోష్టిలో జన్యుమార్పిడి పంటల అనుకూలుడైన ఒక వక్త ప్రసంగించారు. ఆయన నాకూ, అల్‌కాయిదాకు సంబంధం ఉన్నదనే వరకూ వెళ్లిపోయాడు. జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకించిన వారి మీద కూడా ‘అభివృద్ధి నిరోధకులు’ అంటూ ముద్ర వేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. నేను మంగ ళూరులో ఒక సభలో మాట్లాడవలసి వచ్చింది. దేశమంతా ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) మాయాజాలంలో కొట్టుకు పోతున్న కాలమది. ఆర్థిక మండళ్ల ఆర్థికస్తోమత ఏపాటిదో, ఇలాంటి విధానం ఎలాంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందో సాంఘికంగా గానీ, ఆర్థికంగా గానీ ఆ అంశాల మూల్యాం కన ఏదీ జరగకుండానే సెజ్‌లను, ఆర్థికాభివృద్ధిని త్వరితం చేసే యంత్రాలూ, వ్యూహాలూ అన్నట్టు దేశం మీద రుద్దే యత్నం జరిగింది. మంగళూరు సమావేశానికి రైతులూ, సామాజిక ఉద్యమకారులు, వివిధ రంగాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. ఆర్థిక మండళ్ల పేరిట జరుగుతున్న భూఆక్రమణలు, నిర్వాసితులవుతున్న ప్రజలు అనే అంశాలను గురించి వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నించాను. నా ఉపన్యాసం ముగించి నేను సభా మందిరం నుంచి బయటకు వచ్చాక అక్కడ కొన్ని వాల్ పోస్టర్లు నాకు స్వాగతం పలికాయి. నన్ను ‘నక్సలైట్’ అంటూ, ‘జాతి విద్రోహి’ అంటూ సంబోధిస్తూ వెలసిన పోస్టర్లే అవన్నీ. ఆర్థిక మండళ్ల ఏర్పాటు ప్రత్యేక ఆర్థిక మండళ్ల మీద యూపీఏ ప్రధాని డాక్టర్ మన్మో హన్‌సింగ్ కూడా అపారమైన విశ్వాసాన్ని ప్రకటించిన సందర్భం ఒకటి కూడా నాకు బాగా గుర్తుంది. ఒక బిజినెస్ వార్తాపత్రిక నిర్వహించిన వార్షిక పురస్కారాల సభలో డాక్టర్ మన్మోహన్ పాల్గొన్నారు. తరువాత ప్రశ్న-జవాబు కార్యక్రమం మొదలైంది. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఒక ప్రశ్న వేశారు. వాణిజ్యానికి ప్రోత్సాహం ఇవ్వగలిగే కొద్దిపాటి వాతావరణం కూడా లేని మన దేశంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థలో చదివిన విద్యార్థి బయటకు వచ్చి ఏంచేస్తాడు? అన్నదే ఆ ప్రశ్న సారాంశం. ‘యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడానికి, ప్రోత్సాహకాలు కల్పించడానికే మేం ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తున్నాం’ అన్నా రు ప్రధాని. అసలు ఆర్థిక మండళ్ల ఏర్పాటు యోచన కార్యరూపం ధరిస్తున్నదని ఆ సమావేశంలోనే ప్రధాని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు సెజ్‌ల ద్వారా ఒక కొత్త రూపు, ఒక వేగం తథ్యమని ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ కూడా ఎంతగానో విశ్వసించారు. సెజ్‌ల చట్టం 2005లో రూపుదిద్దుకుంది. దేశమంతటా ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. మరోవైపు సెజ్‌ల పేరుతో భూములు లాక్కుంటున్నారంటూ పేదలూ, రైతుల నుంచి వెల్లువెత్తిన నిరసనలను ఎవరూ ఖాతరు చేయలేదు. ఆర్థిక మండళ్లను వ్యతిరేకించడం ప్రగతి నిరోధ కులు చేసే పని అన్న రీతిలో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు, అందులోని పెద్దలు ప్రచారం సాగిం చారు కూడా. బెడిసికొట్టిన వ్యూహం అయితే ఏడేళ్ల తరువాత ప్రత్యేక ఆర్థిక మండళ్ల వ్యవహారం దిగుమతి చేసుకున్న ఆలోచనగా బయటపడింది. ఇందుకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదిక జాడ లేకుండాపోయింది. 2007- 2013 సంవత్సరాల మధ్య జరిగిన ఆర్థిక మండళ్ల కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో, ఆ ఆలోచన ఎంత అవాస్తవికమో ఆ నివేదిక నమోదు చేసింది. సెజ్ పథకం అమలుకు సంబం ధించిన నివేదికను అధ్యయనం చేసిన తరువాతే కాగ్ ప్రభుత్వాన్ని తూర్పారపట్టింది. ఆ కాలంలో మొత్తం 576 సెజ్ పథకాలను ఖరారు చేశారు. అందులో 392 సెజ్‌ల గురించి ప్రకటనలు కూడా వెలువడ్డాయి. అయితే అందులో కార్యకలాపాలు సాగుతున్న ఆర్థిక మండళ్లు కేవలం 170. ఇందులో మళ్లీ 48 శాతం కంటే తక్కువగానే ఎగుమతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అవన్నీ కలసి 2013-2014 కాలంలో చేసిన ఎగుమతులు కేవలం 3.8 శాతం. దేశంలో పలుచోట్ల 45,635.63 హెక్టార్ల భూమిని సెజ్ పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయనున్నట్టు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందుకు సంబం ధించిన కార్యకలాపాలు ప్రారంభించిన భూమి 28,488.49 హెక్టార్లు. అంటే ఇది సేకరించిన భూమిలో 62 శాతం. దీనిని దృష్టిలో ఉంచుకునే కాగ్ చేసిన వ్యాఖ్యను గమనిం చాలి. ప్రజల నుంచి ప్రభుత్వం భూమిని సేకరించిందంటే గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి సంపదను కార్పొరేట్ ప్రపంచానికి దఖలు పరిచిందని రుజువవుతున్నదని కాగ్ తీవ్రంగానే వ్యాఖ్యానించింది. సెజ్ ఏర్పాటు పేరుతో భూములు తీసుకున్నవారిలో చాలా మంది ఇతర అవస రాలకు వాటిని ఉపయోగించుకున్నారు. సెజ్ భూములతో సంబంధం లేని బయటి వారికి అందులో ప్రవేశం దొరికింది. ఇంకా చిత్రం ఏమిటంటే, ఈ రీతిలో సాగిన సెజ్ చట్టం దుర్వినియోగాన్ని వాణిజ్య మంత్రిత్వశాఖ కళ్లప్పగించి చూసింది. కడిగిపారేసిన ‘కాగ్’ ఇంకా దారుణంగా, ఈ సెజ్ భూములలో ఇళ్లు, పాఠశా లలు, ఆస్పత్రులు నిర్మించడానికి డెవలపర్లను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది సెజ్ ఏర్పాట్ల పేరుతో చేసిన చట్టానికి పూర్తి విరుద్ధం. సెజ్ చట్టం ప్రకారం, పారిశ్రామిక అవసరాల కోసమే అక్కడ నిర్మించవలసిన కట్టడాలు ఏవీ ఆ భూములలో కనిపించడం లేదు. ఆర్థికాంశాలు రాసే ఒక పత్రిక అయితే ఈ పథకం ఎప్పుడో మూలపడిందని రాసింది. సెజ్ పేరుతో కేటాయించిన భూమిలో దాదాపు యాభై శాతం నిరుపయోగంగా ఉండిపోయింది. ఎగుమ తులలో గాని, ఉద్యోగాలు కల్పించడంలో గాని ఆర్థిక మండళ్ల భూముల ద్వారా ఎలాంటి ఫలితాలు అందలేదు. అందులో చాలా భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వర్గం లా మారిందన్న విమర్శ కూడా వచ్చింది. అయితే పన్నుల రూపంలో వచ్చే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవడానికి ఈ భూములు ఐటీ సంస్థలకు మాత్రం బాగా ఉపయోగ పడ్డాయి. చిత్రం ఏమిటంటే, 2007లో ఏర్పాటైన పార్ల మెంటరీ స్థాయీ సంఘం సెజ్‌ల వల్ల ఆదాయంలో వచ్చిన నష్టం వివరాలను కూడా తెలియచేసింది. అంటే ప్రధాని ప్రకటించిన రెండేళ్లకే సెజ్‌లు ఏ రూపం దాల్చాయో స్థాయీ సంఘమే బయటపెట్టింది. సెజ్‌లకు 2005- 2012 మధ్య ఇచ్చిన ట్యాక్స్ హాలిడే కారణంగా రూ.1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని స్థాయీ సంఘం తేల్చింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే ద్రోహం కాదు ఇలా ఉండగా, ఆర్థికాభివృద్ధి పేరుతో భూములను ఖాళీ చేయించిన లక్షలాది పేదలకు సానుభూతిగా ఒక్క సాంత్వన వచనం కూడా ఎవరి నోటి నుంచి వెలువడలేదు. గ్రీన్‌పీస్ సామాజిక కార్యకర్త ప్రియా పిళ్లై కేసు గురించి ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను వార్తాపత్రికలో చదువుతున్నపుడు నాకు ఆర్థిక మండళ్ల అనుభవం గుర్తుకు వచ్చింది. ప్రియా పిళ్లై విదేశాలకు వెళ్లడానికి అనుమతి నిరాకరణకు సంబం ధించి కోర్టులో ప్రాథమిక వాదోపవాదాలు జరిగాయి. అందుకు సంబంధించిన వార్త అది. ఈ కేసుకు న్యాయ చరిత్రలో ఎంతో ఖ్యాతి వచ్చింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నంత మాత్రాన జాతి వ్యతిరేకంగా భావించరాదని ప్రభుత్వ ప్రతి నిధులను కోర్టు ఆ కేసులో హెచ్చరించింది. అలాగే తరు వాత జరిగిన వాదోపవాదాలలో జాతీయ వాదానికీ, వీర జాతీయ వాదానికీ మధ్య తేడాను గుర్తించవలసిందని కూడా హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ సంద ర్భంలోనే ప్రస్తావించుకోవలసిన మరొక సంఘటన కూడా ఉంది. రెండు దశాబ్దాల క్రితం లండన్‌లో ఏర్పాటైన మొదటి ప్రపంచ ఆహార, వ్యవసాయ సదస్సుకు నన్ను ఆహ్వానించారు. వ్యవసాయోత్పత్తుల అంతర్జాతీయ వాణి జ్యవ్యవస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమమది. జన్యుమార్పిడి పంటలు ఆహార భద్రతకు ఏవిధంగా సమాధానం కాలేవో ప్రారంభ సదస్సులో ఇచ్చిన ఉపన్యాసంలో నేను వివరిం చాను. ఆ పంటలను పండించడం వల్ల వాతావరణంలోను, మన ఆరోగ్యంలోను సంభవించే విపరిణామాలను గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాను. తరువాత జరిగిన ఒక గోష్టిలో జన్యుమార్పిడి పంటల అనుకూలుడైన ఒక వక్త ప్రసంగిం చారు. ఆయన నాకూ, అల్‌కాయిదాకు సంబంధం ఉన్నదనే వరకూ వెళ్లిపోయాడు. జన్యుమార్పిడి పంటలను వ్యతిరే కించిన వారి మీద కూడా ‘అభివృద్ధి నిరోధకులు’ అంటూ ముద్ర వేస్తున్నారు. వాణిజ్య ప్రయోజనాలతో సహా అనేక ఇతర వాస్తవాలు, అంశాలు- చౌకగా, సులభంగా లభించే ప్రత్యామ్నాయాలను గురించి చెప్పేవారిని మూలకు నెట్టేటట్టు చేస్తున్నాయి. అలాంటి వారిపై అనేక ముద్రలు వేస్తున్నాయి. ప్రత్యామ్నాయ దృక్పథం తప్పుకాదు ఒక అంశాన్ని విమర్శించాలంటే చాలా పరిశోధన, విశ్లేషణ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆ తరువాత ఒక సందర్భంలో అన్నారు. దీనితో నేను కూడా ఏకీభవిస్తాను. వార్తాపత్రికలో వచ్చిన ఒక పతాకశీర్షికను మనం నమ్ము తాం. మనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడడానికి అది చాలు కూడా. నిజానికి మనలో చాలా మంది పతాక శీర్షికను మించి వివరాలలోకి వెళ్లడానికి ప్రయత్నం చేయం. నేను చాలా టీవీ చానళ్ల చర్చలలో పాల్గొంటూ ఉంటాను. చిత్రంగా అక్కడ ఒకే ఆలోచనా విధానం ఉన్న వారి నుంచే నాకు ఎక్కువ ప్రతిఘటన ఎదురవుతూ ఉంటుంది. ప్రత్యా మ్నాయ దృక్పథం అణచివేతకు గురవుతోంది లేదా గుర్తిం పునకు నోచుకోవడం లేదు. ప్రశ్నించేవాడు, విమర్శించే వాడు కూడా జాతీయ వాదులే. వీరు కూడా ఈ భూగో ళాన్ని సజావుగా ఉంచడానికి కృషి చేస్తున్నవారే. నిలకడగా ఉండే ఆర్థికవృద్ధిని సాధించడం, అభివృద్ధి మహిళాభ్యు న్నతికి అనుకూలంగా, ప్రజానుకూలంగా, పర్యావర ణానుకూలంగా ఉండటం కోసం కట్టుబడి ఉన్నవారే. పర్యావరణానికి చేటు చేయని రీతిలో దోపిడీలేని, సహజ వనరులను సద్వినియోగం చేసుకునే చోట మాత్రమే అభి వృద్ధి సాధ్యమవుతుంది. అలాంటి వ్యవస్థ కోసమే మన మంతా ఎదురుచూడాలి. ఎవరు అవ్యవస్థకు వ్యతిరేకంగా గళం ఎత్తుతారో వారంతా జాతిలో చైతన్యాన్ని నిలిపి ఉంచ గలిగేవారే. అలాగే వీర జాతీయ వాదం ప్రకటించేవారు ఎంతమాత్రం జాతీయ వాదులు కారన్న సంగతి వాస్తవం. ఇలాంటివారు మనలను ఫాసిజం వైపు నడుపుతారు. అంతవరకే. (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు) ఈమెయిల్: hunger55@gmail.com -
తెలంగాణ, ఏపీలో 14 సెజ్‌ల రద్దు యోచన
- జాబితాలో డెక్కన్ ఇన్ఫ్రా, ఏపీ మార్క్‌ఫెడ్ సెజ్‌లు - 20న తుది నిర్ణయం హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 14 ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)కు ఇచ్చిన లాంఛనప్రాయమైన అనుమతులను కేంద్ర వాణిజ్య శాఖ రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ఏర్పాటులో ఎటువంటి పురోగతి లేనందున అనుమతులను రద్దు చేయాలంటూ డెవలప్మెంట్ కమిషనర్ (డీసీ) సిఫార్సు చేయడం ఇందుకు కారణం. ఈ నెల 20న జరిగే సమావేశం కోసం వాణిజ్య శాఖలో భాగమైన అనుమతుల బోర్డు (బీవోఏ) రూపొందించిన ఎజెండాలో ఈ అంశాలు ఉన్నాయి. అనుమతులు రద్దయ్యే అవకాశమున్న 14 సెజ్‌లలో 12 ఆర్థిక మండళ్లు తెలంగాణలో ఉండగా, మరో రెండు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్నాయి.ఈ జాబితాలో.. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్(డీఐఎల్ఎల్) సెజ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు(ఏపీహెచ్‌బీ) దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీహెచ్‌బీకి 57.44%, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (విభజనకు ముందు) 42.56% వాటాలు ఉన్నాయి. డీఐఎల్ఎల్కి తెలంగాణలో దాదాపు 6,819 ఎకరాల స్థలం ఉంది. ఇది గతంలో ఐటీ/ఐటీఈఎస్, ఫార్మా, వజ్రాభరణాలు, ఇంజనీరింగ్ మొదలైన రంగాలకు సంబంధించి సెజ్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు కూడా పొందింది. దీనికి ఇచ్చిన అనుమతుల గడువు పూర్తయిపోయిన సంగతి 2012, 2013లో కూడా తెలియజేసినప్పటికీ సెజ్ డెవలపర్ నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ ఇంతవరకూ సమర్పించలేదని బీవోఏ పేర్కొంది. దీంతో డీఐఎల్ఎల్కి ఇచ్చిన అనుమతులన్నింటినీ రద్దు చేయాలంటూ డీసీ సిఫార్సు చేసినట్లు వివరించింది. మరోవైపు, ప్రభుత్వ సంస్థ ఏపీ మార్క్‌ఫెడ్.. కరీంనగర్లో తలపెట్టిన సెజ్‌కి కూడా అనుమతులు రద్దు చేయాలని డీసీ సూచించారు. ప్రాజెక్టులో ఎటువంటి పురోగతీ లేకపోవడమే దీనికి కూడా కారణమని బీవోఏ పేర్కొంది. -
‘కోడ్’ కొండెక్కిందా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగానే రెవెన్యూ అధికారులు కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్‌ఈజడ్) భూములపై సమావేశమవడం చర్చనీయాంశమైంది. సమావేశం నిర్వహించడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ కొండెక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోడ్‌ను అమలు చేయాల్సిన రెవెన్యూ అధికారులే ఉల్లంఘించడానికి కలెక్టరేట్ సాక్షిగా నిలిచిందంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నాటి నుంచే రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్ విషయాన్ని ప్రకటించి, ప్రవర్తనా నియమావళిని విధిగా అమలుచేయాలని ఆదేశించారు. కాగా ఆదివారం కలెక్టరేట్లోని విధాన గౌతమి హాలులో కేఎస్‌ఈజడ్ భూ సేకరణపై రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ భూ సేకరణ విషయంలో చాలా కాలంగా కొన్ని ప్రతిబంధకాలున్నాయి. కేఎస్‌ఈజడ్ పరిధిలోని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు భూ సేకరణకు చెల్లించే ప్యాకేజీపై అభ్యంతర పెట్టడంతో వివాదం నెలకొంది. ఆ క్రమంలో కేఎస్‌ఈజడ్ ప్రాంతానికి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, ఆర్డీఓలతో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు అంబేద్కర్, విశ్వేశ్వరరావు, కేఎస్‌ఈజడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోరా జయరాజ్ పాల్గొన్నారు. ఈ సమావేశం నిర్వహణ ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందనే వాదనతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. అధికార పార్టీ నాయకులూ హాజరయ్యారు.. మరో ఐదు నెలల్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు కోట్లాది రూపాయలతో పనులు చేపట్టాల్సి ఉంది. సుమారు రూ.900 కోట్ల పనులకు ఇప్పుడిప్పుడే టెండర్లు పిలుస్తున్నారు. ఆ టెండర్లు పిలవవచ్చా, లేదా అనే సందేహాన్ని ఇటీవల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో వెల్లడించి నివృత్తి చేసుకున్నారు. పుష్కరాలు మహా పర్వం కావడంతో ప్రజాప్రతినిధులు, నేతలను పిలవకుండా పనులు చేపట్టే వెసులుబాటును ఎన్నికల ప్రధానాధికారి కల్పించారని కలెక్టర్ రాజమండ్రిలో స్పష్టం చేశారు. అలాంటిది కేఎస్‌ఈజడ్ భూ సేకరణపై రెవెన్యూ అధికారులు సమావేశమవడం, దానికి ప్రభుత్వం నామినేట్ చేసిన అధికారపార్టీకి చెందిన నాయకులు, సెజ్ ప్రాంతానికి చెందిన స్థానిక నేతలు కూడా హాజరవడం చర్చనీయాంశమైంది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయ వర్గానికి మాత్రమే పరిమితమైనవి కావడంతో ఆ కోడ్ నిబంధనలు వర్తించవనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ సమావేశం కోడ్ ఉల్లంఘన కాదు.. కేఎస్‌ఈజడ్ విషయమై సమావేశం గురించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్‌ను ‘సాక్షి’ సంప్రదిం చింది. ఆ సమావేశం ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఉపాధ్యా య, విద్య, విద్యా సంస్థలకు సంబంధించిన అనుమతు లు, వాటిని ప్రభావితం చేసే సమావేశాలు నిర్వహిస్తేనే కోడ్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. -
జేఎస్‌డబ్ల్యూ విజయనగరం సెజ్ సరెండర్!
- ఇదే వరుసలో మరో 56... - ఆర్థిక మందగమనం, పన్ను సమస్యలు ప్రధాన కారణం... న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఎస్ కోట వద్ద తమ ప్రత్యేక ఆర్థిక జోన్ (ఎస్ఈజెడ్- సెజ్)ను ప్రభుత్వానికి సరెండర్ చేసేయడానికి డెవలపర్ జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ సిద్ధమయ్యింది. దాదాపు 240 హెక్టార్లలో ప్రతిపాదించిన ఈ సెజ్ అల్యూమినియం రంగానికి ఉద్దేశించారు. ఈ సెజ్ డెవలప్మెంట్కు సంబంధించిన అనుమతుల గడువు నిజానికి 2012 ఫిబ్రవరి 26తో ముగిసింది. ముడి ఖనిజం మైనింగ్‌కు పర్యావరణ పరమైన ఆమోదాలు లభించకపోవడం, బాక్సైట్ సరఫరా ఒప్పందాల సంతకాలు పెండింగులో ఉండడం వంటి అంశాల వల్ల ఈ సెజ్ అభివృద్ధికి అవాంతరాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో సెజ్‌ను సరెండర్ చేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. 20న కీలక సమావేశం... జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియంసహా దాదాపు 56 పత్యేక ఆర్థిక జోన్లల పట్ల ఇన్వెస్టర్లు అనాసక్త ధోరణిలో ఉన్నారని సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఆయా సెజ్‌ల డెవలపర్లు తమ సెజ్ ఆమోదిత అప్లికేషన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్శ్వనాథ్, డీఎల్ఎఫ్ వంటి సంస్థలు ఉన్నాయి. వీటికి సంబంధించి న్యూఢిల్లీలో ఫిబ్రవరి 20న జరిగే ఒక అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. నిరుత్సాహానికి కారణం! 50కి పైగా సెజ్ డెవలపర్లు ఇప్పటికే తమ ప్రాజెక్టులను సరెండర్ చేశారు.ఆర్థిక మందగమనంలో ఉండడం వల్ల పలు డెవలపర్లు సెజ్‌ల అభివృద్ధి విషయంలో పలు అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఆయా పరిస్థితుల నేపథ్యంలో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ (ఎంఏటీ), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వంటి అంశాలు సెజ్‌లకు విఘాతంగా మారినట్లు విమర్శలు ఉన్నాయి. దేశంలో ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఆవిర్భవించిన సెజ్‌లు ఆయా ప్రతికూల అంశాల వల్ల క్రమంగా తమ ఆకర్షణను కోల్పోతున్నాయన్న విమర్శ ఉంది. పెట్టుబడుల పెంపునకు రానున్న బడ్జెట్ సెజ్‌లపై మ్యాట్‌ను ప్రస్తుత 18.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ఇటీవల పరిశ్రమల సంఘం- సీఐఐ కేంద్రానికి తన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో విన్నవించింది. 2005-06లో ఈ జోన్ల నుంచి ఎగుమతుల విలువ దాదాపు రూ.22,840 కోట్లు. 2013-14 నాటికి ఈ విలువ రూ.4.94 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల విలువను దాదాపు రూ.20.15 లక్షల కోట్లకు పెంచాలన్నది ప్రణాళిక. ఈ పరిస్థితుల్లో సెజ్‌ల వైపు నుంచి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. -
సెజ్‌లలోనూ పాఠశాలలు, ఆస్పత్రులు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్) ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సెజ్‌లలో ప్రాసెసింగ్‌కి ఉపయోగించని స్థలంలో పాఠశాలలు, ఆస్పత్రులు, హోటళ్లు వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు డెవలపర్లను అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు, లాభాలు మెరుగుపర్చుకునేందుకు ఈ మేరకు అనుమతులు ఇవ్వాలని సెజ్ డెవలపర్లు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ తరహా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డెవలపర్లకు పన్నులు మొదలైన వాటి రూపంలో ఎటువంటి మినహాయింపులూ లభించవు. సెజ్‌లలో ఇప్పటికే ఉత్పాదక, సర్వీసు కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారు మాత్రమే ఉపయోగించుకునేలా ఒక భాగంలోనూ, బయటివారు కూడా వినియోగించుకునేలా మరో భాగంలోనూ సామాజిక.. వ్యాపారావసరాల మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతి ఉంటుంది. తాజా నోటిఫికేషన్ బట్టి .. సెజ్‌లలోని నాన్-ప్రాసెసింగ్ స్థలంలో గృహ నిర్మాణాలకు 25 శాతాన్ని మించి ఉపయోగించకూడదు. వాణిజ్యపరమైన ఇన్ఫ్రా ఏర్పాటు కోసం 10 శాతానికి మించి వాడుకోకూడదు. నాన్-ప్రాసెసింగ్ స్థలంలో 45 శాతం ఓపెన్ ఏరియా ఉండాలి. మిగతా స్థలంలో పాఠశాలలు, కాలేజీలు, సాంస్కృతిక కేంద్రాలు, శిక్షణా సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు మొదలైనవి ఏర్పాటు చేసుకోవచ్చు. -
సెజ్ భూములు దుర్వినియోగం
కాగ్ ఆక్షేపణ న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) పేరిట సమీకరిస్తున్న భూములు దుర్వినియోగం అవుతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఆక్షేపించింది. ‘సెజ్‌ల కోసం అంటూ డెవలపర్లు ప్రభుత్వం నుంచి భూములు తీసుకోవడం/కొనుక్కోవడం చేస్తున్నారు. అయితే, ఇందులో నామమాత్రం స్థలాన్నే సెజ్ కింద ప్రకటించడం జరుగుతోంది. ఆ తర్వాత కొన్నాళ్లకు డీ నోటిఫికేషన్ చేసి, ధరల పెరుగుదల ప్రయోజనాలను పొందుతుండటం పరిపాటిగా మారింది’ అంటూ కాగ్ పేర్కొంది. ఆరు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మొదలైనవి) 39,245.56 హెక్టార్ల స్థలాన్ని నోటిఫై చేయగా, ఇందులో 5,402.22 హెక్టార్లను (14 శాతం) తర్వాత డీనోటిఫై చేసి, ఇతరత్రా వాణిజ్య అవసరాలకు మళ్లించడం జరిగినట్లు కాగ్ తెలిపింది. అలాగే, నాలుగు రాష్ట్రాల్లో 11 డెవలపింగ్ సంస్థలు.. సెజ్ భూములను తాకట్టు పెట్టి రూ. 6,310 కోట్లు రుణం తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు, అర్హత లేనప్పటికీ పలు కేసుల్లో పన్ను పరమైన మినహాయింపులు కూడా ప్రభుత్వం ఇచ్చినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో సెజ్‌ల అనుమతి, పర్యవేక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందంది. రిలయన్స్ కేజీ-డీ6 వ్యయాల్లో కోత పెట్టాలి కేజీ-డీ6 గ్యాస్ క్షేత్రంపై చేసిన వ్యయాలకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 357.16 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,179 కోట్లు) రికవరీకి కేంద్రం అనుమతించరాదని కాగ్ సూచించింది. ఆ సంస్థ వ్యయ రికవరీల్లో కోత పెట్టాలని పేర్కొంది. కేజీ-డీ6 బ్లాకు వ్యయాలపై రెండో సారి ఆడిట్ చేసిన కాగ్ ఈ మేరకు సూచనలు చేసింది. -
టార్గెట్... సీజ్
సాక్షి ప్రతినిధి, కడప: ఆ ప్రజాప్రతినిధి అధికార దుర్వినియోగానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఇందుకు యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఒక్కడి కోసం 48 మందిని టార్గెట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ‘ఎద్దు ఈనిందంటే దూడను గాటకట్టేయండి’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. క్రషర్ మిషన్ అంటే సీజ్ చేయండి అన్నట్లుగా మసలుకుంటున్నారు. చట్టానికి ఎవరూ అతీతులుకారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే సంవత్సరాల తరబడి నిబంధనలను పాటించని అధికారులు ఒక్కమారుగా విరుచుకుపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఊహించని స్థితిలో ప్రజాప్రతినిధిగా ఎంపికై అధికారపార్టీలో భాగస్వామిగా ఉన్న నాయకుడి టార్గెట్‌కు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అడ్డగోలుగా క్రషర్లు సీజ్.... ‘రాజు తలచుకుంటే కొరడా దెబ్బలు కొదవా’ అన్నట్లుగా కంకర మిషన్లు సీజ్ చేయాలనుకుంటే సవాలక్ష కారణాలు. అయితే నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల ఆదేశించారంటూ మైనింగ్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న క్రషర్ మిల్లులపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించారు. కొన్ని క్రషర్లపై విజిలెన్స్ కేసులు నమోదయ్యాయి. వీరు నామినల్ ఫైన్ చెల్లించి అప్పీళ్లకు వెళ్లారు. ఆ కేసులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని మైనింగ్ అధికారులు హెచ్చరించాల్సి ఉంది. బకాయిలు చెల్లించేంతవరకూ రాయల్టీలు ఇవ్వమని నిరాకరించాల్సి ఉంది. అంతేకాకుండా డిమాండ్ నోటీసులు సైతం ఇవ్వాల్సిందిగా నిబంధనలు వివరిస్తున్నాయి. ఇవేవి పాటించకుండా ఏకంగా బకాయిలు ఉన్న క్రషర్లు సీజ్ చేయడమే లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 48 క్రషర్లును సీజ్ చేశారు. రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ జిల్లాలోనే ఇది ప్రధమంగా మైనింగ్ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఒక్కడి కోసం ఇంత చేయాలా.. మేము మీ అనుచరులం కాదా.. రాజకీయంగా మీ టార్గెట్ ఆఒక్కడిపైనే కదా.. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడ్తున్నారు. మనోళ్ల మిషన్లు సైతం సీజ్ చేశారంటూ ఆ టీడీపీ ప్రజాప్రతినిధిని ఆయన అనుచరుడు ఒకరు నిలదీసినట్లు తెలుస్తోంది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన అయిన ఆ నాయకుడు అధికారం ఉందని అన్యాయంగా కఠిన చర్యలకు పాల్పడకూడదని వాపోయినట్లు సమాచారం. బకాయిలు వసూళ్లు చేయాల్సిన పద్దతి ఇదేనా అంటూ మండిపడినట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థి ఒక్కరినే టార్గెట్ చేస్తే పక్కాగా తెలుస్తుందని జిల్లా వ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించమని ఆనేత సలహా మేరకే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని పలువురు యజమానులు వాపోతున్నారు. పైగా క్రషర్ మిషన్లు సీజ్ చేస్తే పైరవీలు చేయవద్దంటూ ఆ ప్రజాప్రతినిధి టీడీపీ నేతలకు వివరించినట్లు సమాచారం. ప్రత్యర్థి 3.5 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని ఈ వ్యవహారంలో మీకు నష్టం కల్గితే దానిని చెల్లిస్తానని ఆ ప్రజాప్రతినిధి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వల్ప మొత్తానికే కంకర మిషన్ సీజ్ చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, డిమాండ్ నోటీసు ఇస్తే ఒక భాగం చెల్లిస్తామని కొంతమంది యజమానులు అధికారులకు మొరపెట్టుకున్నట్లు సమాచారం. అయితే సగం మొత్తం చెల్లించిన వారికే అవకాశం ఇవ్వాలనే దిశగా మైనింగ్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మైనింగ్ యంత్రాంగం అడ్డగోలు చర్యలపై కొందరు హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. రాజకీయ కక్ష సాధింపు చర్యలను నియంత్రించేందుకు మరికొందరు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. -
జన్మ ధన్యమయింది:నరేంద్ర మోడీ
రాయ్‌గఢ్ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రక ప్రాధాన్యమున్న రాయగఢ్ ప్రాంతాన్ని సందర్శించడంతో తన జన్మ ధన్యమయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. నవశేవాలో సెజ్‌కు శనివారం భూమిపూజ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. నౌకాశ్రయాల అనుసంధానానికి రూ.1,926 కోట్లతో నిర్మించనున్న ప్రాజెక్టుకు కూడా భూమిపూజ నిర్వహించారు. షోలాపూర్‌లోనూ పవర్ గ్రిడ్‌ను ఆవిష్కరించారు. సాక్షి, ముంబై: ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత మహారాష్ట్రలో తొలిసారిగా రాయగఢ్‌కు రావడంతో తన జన్మ ధన్యమయిందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న రాయగఢ్ ప్రాచీన హిందూ నగర రాజధాని అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా రాయగఢ్ నవశేవాలో రూ.నాలుగు వేల కోట్ల అంచనావ్యయంతో నిర్మించబోయే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి శనివారం భూమిపూజ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. నవశేవాలోని ‘జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్’ (జేఎన్పీటీ) సమీపంలో దీనిని నిర్మిస్తారు. బీజేపీ పాలనలో భూమిపుత్రులకు (అన్నదాతలు) అమిత ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై’ అన్న నినాదంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోడీ చివర్లోనూ ఇదే నినాదం చేసి రాయగఢ్ ప్రజల మనసులను గెలుచుకున్నారు. అదేవిధంగా నౌకాశ్రయాల అనుసంధానం కోసం రూ. 1,926 కోట్లతో నిర్మించనున్న రహదారి ప్రాజెక్టుకు కూడా మోడీ భూమిపూజ నిర్వహించారు. భూమిపుత్రులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ విద్య,ఆరోగ్యంతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాయగఢ్ పర్యటనతో తన జన్మ ధన్యమయిందని వ్యాఖ్యానించినప్పుడు చప్పట్లు మార్మోగాయి. ఈ సెజ్ కారణంగా నష్టపోయిన రైతులకు ఈ సందర్భంగా మోడీ చేతుల మీదుగా భూములు పంపిణీ చేశారు. విలాస్ జోషి, బాలకృష్ణ ధరణే, మధుకర్, ఠాకూర్, కమలాకర్ ధరణే తదితరులకు భూమి పత్రాలు అందజేశారు. ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉంది... మనదేశానికి దిగుమతులకంటే ఎగుమతుల అవసరం అధికంగా ఉందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. యువశక్తితో ఎగుమతులను వృద్ధి చేయవచ్చన్నారు. ‘ఓడరేవులు దేశానికి ప్రవేశద్వారాలుగా మారాలి. ఎగుమతుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడాలి. ఇలా జరిగితే మన జాతి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. ప్రపంచమార్కెట్ లో మనదేశంసుస్థిరస్థానాన్ని సాధించగలుగుతుం ది. అంతర్జాతీయ విపణిలో సముద్రవాణిజ్యం అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కం టెయినర్లు హిందూ మహాసముద్రం మీదుగా వెళ్తున్నాయి. భవిష్యత్‌లో సముద్ర వాణిజ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని వివరించారు. అందుకే రేవు పట్టణాల్లో ‘సాగర్మాల’ పథకాలను ప్రారంభిస్తామని ప్రధాని ప్రకటించారు. వీటి వల్ల తీర ప్రాంతాలు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. చవాన్.. ఆందోళన చెందకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 146 సెజ్‌ల గురించి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ముందుకు కదలడం లేదని అన్నారు. దీనిపై నరేంద్ర మోడీ స్పందిస్తూ సెజ్‌ల పురోగతిపై ముఖ్యమంత్రి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ‘రోగులను బాగుచేసేందుకు మంచి డాక్టర్ అవసరం. అలాంటి డాక్టర్ లభించారు. మహారాష్ట్రతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సమస్యలను మా ప్రభుత్వం పరిష్కరిస్తుంది’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర్‌నారాయణ, ప్రతిపక్ష నాయకులు ఏక్నాథ్ ఖడ్సే, వినోద్ తావ్డేతోపాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. నిరంతర విద్యుత్ అందిస్తాం షోలాపూర్, న్యూస్‌లైన్: దేశవ్యాప్తంగా పుష్కలంగా విద్యుత్‌ను అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మారుమూల గ్రామాలకు సైతం 365 రోజులు విద్యుత్‌ను అందించడమే తమ లక్ష్యమన్నారు. షోలాపూర్‌కు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చేరుకున్న నరేంద్ర మోడి హోం మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. షోలాపూర్-పుణే నాలుగు లైన్ల రహదారి, పవర్గ్రిడ్నును జాతికి అంకితం చేశారు. అలాగే షోలాపూర్-సంగారెడ్డి, షోలాపూర్-ఎడిషి వరకు నిర్మించబోయే నాలుగులైన్ల రహదారులకు శంకుస్థాపన చేశారు. గవర్నర్ కె. శంకర్నారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఎంపీ రవీంద్ర గైక్వాడ్, వినోద్ తావ్డే, దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే జపాన్ రాయబార కార్యాలయ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘బీఎస్పీ.. బిజ్లీ(కరెంటు), సడక్ (రోడ్లు), పానీ (నీరు)కి తమ ప్రభుత్వం అత్యధికం ప్రాధాన్యం ఇస్తుంది. కరెంటు 24 గంటలు రైతులకు అందుబాటులో ఉంటేనే మంచి దిగుబడి సాధిస్తాడు. సువిశాల రహదాలు ఉంటేనే ధాన్యాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్మవచ్చు. మనదేశంలో వర్షాలకు కొదవ లేదు. ఆ నీటిని నిల్వ చేసుకోవాలి. ఈ మూడూ సక్రమంగా ఉంటే రైతులు దేశంలో బంగారం పండిస్తారు. షోలాపూర్ పవర్‌గ్రిడ్ ద్వారా దేశంలోని నలుమూలలకూ విద్యుత్ సరఫరా చేయవచ్చు’ అని మోడీ అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు సరిపడా బొగ్గు, గ్యాస్‌ను సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి చవాన్ విజ్ఞప్తికి మోడీ సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్స్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, మరమగ్గాలు అధికంగా ఉన్న షోలాపూర్ వంటి పట్టణాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ నాలుగులైన్ల రహదారులు, విద్యుత్ ఉత్పత్తికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే చవాన్ ప్రసంగం ప్రారంభించగానే.. జనం ‘వద్దు వద్దు’ అంటూ నినాదాలు చేయగా, మోడీ వారించారు. దీంతో కేవలం ఐదు నిముషాల్లో చవాన్ ప్రసంగం ముగిసింది. -
ఎమ్మార్ ఎంజీఎఫ్ సెజ్ రద్దు
న్యూఢిల్లీ: ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్‌కు ఇచ్చిన సెజ్ ఆమోదాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు సెయిల్ సెలెమ్ సెజ్, మరో 25 సెజ్ ఆమోదాలను కేంద్రం రద్దు చేసింది. ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్‌ల) ఏర్పాటుకు 18 సంస్థలకు మరింత గడువునిచ్చింది. ఈ నిర్ణయాలను గత నెల 24న వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ (బీఓఏ) తీసుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెజ్ ఆమోదాల రద్దుకు సంబంధించి 43 కేసులను బీఓఏ పరిశీలించిందని పేర్కొంది. డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్‌కు సంబంధించిన 14కేసులు, ఏపీ మార్క్‌ఫెడ్, డీసీ వీసెజ్‌కు చెందిన ఒక కేసులో సెజ్‌ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా తలెత్తిన పరిస్థితుల కారణంగా ఈ 15 కేసులను బీఓఏ వాయిదావేసింది. మరింత గడువు పొందిన సెజ్‌ల్లో-డీఎల్ఎఫ్ ఇన్ఫోపార్క్(పుణే), నవీ ముంబై సెజ్, ఇండియాబుల్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కర్ణాటక సెజ్‌లు ఉన్నాయి. కాగా సెజ్‌లకు సంబంధించి పునర్వ్యస్థీకరణ కసరత్తును కేంద్రం ప్రారంభించింది. సెజ్‌లకు సంబంధించి విధి, విధానాలను ప్రామాణీకరించడం, నిబంధనలు, ఫీజుల సరీళీకరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై కసరత్తును మొదలు పెట్టింది. సెజ్ డెవలపర్లు వివిధ అంశాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. -
విప్రో, టెక్ మహీంద్రాలో ఎమ్మెల్యేల బృందం
విశాఖ : విశాఖలోని విప్రో, టెక్ మహీంద్రా సంస్థలను నలుగురు ఎమ్మెల్యేల బృందం మంగళవారం సందర్శించింది. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు, గణేష్ కుమార్, పల్లా శ్రీనివాస్ ...రెండు సంస్థలను సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల కప్పనలో విప్రో సంస్థ విఫలమైందని ఆరోపించారు. ఇప్పుడు ఎస్ఈజెడ్లో వర్తింపచేయాలని కోరటం విడ్డూరంగా ఉందన్నారు. అయిదేళ్లలో రెండువేల మందికి ఉద్యోగాలు ఇస్తామన్న విప్రో... ఏడేళ్లు అవుతున్నా ఇప్పటికి 600మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయిందన్నారు. -
‘విశాఖ ఐటీ రాజధాని’ ఉత్తిమాటేనా?
విశాఖపట్నం: రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్దదిక్కుగా ఉన్న విశాఖ ప్రస్తుతం భవిష్యత్తు ప్రయాణం ఎటో తేల్చుకోలేకపోతోంది. నగరాన్ని ఐటీ రాజధానిగా తీర్చుదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో స్పష్టత ఇవ్వకపోవడంతో కంపెనీలు గందరగోళానికి గురవు తున్నాయి. ఒకపక్క సమస్యలతో మనుగడ కష్టంగా మారగా, మరోపక్క పభుత్వం మొక్కుబడి వ్యవహారంతో అయోమయానికి గురవుతున్నాయి. కంపెనీల విస్తరణ, ఉద్యోగ నియామకాల విషయంలో ముందడుగు వేయడానికి సంశయిస్తున్నాయి. ఉన్న సంక్షోభ పరిస్థితులు చక్కదిద్దకుండా హడావుడి చేస్తుండడంతో మొదట్లో కాస్తోకూస్తో ఆశగా ఉన్న యాజమాన్యాలు క్రమక్రమంగా నిరుత్సాహానికి లోనవుతున్నాయి. సోమవారం విశాఖలో ఐటీశాఖ అత్యున్నతస్థాయి విధానపరమైన సమీక్ష జరుగుతుండడంతో తాడోపేడో తేల్చుకోవడానికి సమాయత్తమవుతున్నాయి. ఐటీ రాజధానిగా చేస్తారా? విభజనకు ముందు హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఐటీ రంగంలో విశాఖది రెండోస్థానం. అక్కడ మొత్తం 2,500 కంపెనీలు పనిచేస్తుండగా, వార్షిక టర్నోవర్ రూ.60,200 కోట్లు. విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మొత్తం 70 కంపెనీల టర్నోవర్ రూ.1450 కోట్లు. కానీ విడిపోయిన తర్వాత రాష్ట్రంలో విశాఖ ఐటీ రంగం కేవలం మూడుశాతమే మిగిలింది. దీంతో విశాఖను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం అదే పనిగా ప్రకటిస్తోంది. కానీ ఇక్కడ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రిని కలిసి సమస్యలు వివరించినా పెద్దగా స్పందన లేకపోవడంతో భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకుంటున్నాయి. ప్రస్తుతం నగరంలో 70 ఐటీ కంపెనీలు, నాలుగు ఎస్ఈజెడ్లున్నాయి. ఇవన్నీ అనేక పురిటినొప్పులు పడుతున్నాయి. ఎస్ఈజెడ్లకు కేటాయించిన భూముల్లో సగానికిపైగా కంపెనీలు నిర్మాణాలు చేపట్టకుండా భూములు ఖాళీగా ఉంచాయి. నిర్మాణం పూర్తిచేసుకున్న కంపెనీలకు అనుమతులు, మౌలిక సదుపాయాలు లేక పాడుబడ్డ భవనాలుగా మారాయి. ఐటీకి పవర్‌హాలీడే విధిస్తుండడంతో ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ఏదో చేస్తామని యాజమాన్యాలను ఊరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 16న ఐటీశాఖ నుంచి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్, ఐటీఈ అండ్ సీ సెక్రటరీ సంజయ్‌జాజూ, పరిశ్రమల అభివృద్ధి ఫోరం చైర్మన్ జె.ఎ.చౌదరి తదితరులు నగరానికి వస్తున్నారు. రాష్ట్రంలో విశాఖను ఐటీ రాజధానిగా ఏవిధంగా తీర్చిదిద్దాలి? సమస్యలు? వంటివాటిపై విధానపరమైన సమీక్ష జరపనున్నారు. ఇందులో ఐటీ సమస్యలను ఏకరువుపెట్టడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ ఐటీ కంపెనీల సమావేశాలు, ఇతరత్రా అవసరాలను తీర్చేందుకు రూ.20 కోట్లతో చేపట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ రెండేళ్లవుతున్నా నిర్మాణం పూర్తవలేదు. రెండో ఇంక్యుబేషన్ కేంద్రానికి మరో రూ.23 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నా భూములే లేవు. దీనిపై కంపెనీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి. ఐటీ కంపెనీలకు కనీసం బస్సు సౌకర్యం, తాగునీటి వసతి ఇలా ప్రాథమికంగా ఏవీ లేవు. ముందు ఈ సౌకర్యాలు కల్పించి ఆ తర్వాత ఐటీ రాజధానిగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేయనున్నట్లు రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. రూ.50 వేల కోట్లతో 10వేల ఎకరాల్లో విశాఖకు ఐటీఐఆర్ వస్తుందని గత ప్రభుత్వంతోపాటు సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 4 వేల ఎకరాల భూములు కూడా సిద్ధం చేసి ఉంచారు. ఐటీఐఆర్‌ను ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వెనక్కి తీసుకుని వేరే కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనిపైనా తాము ప్రశ్నిస్తామని నరేష్కుమార్ చెప్పారు. -
తయారీకి బూస్ట్..!
మందగమనంతో అల్లాడుతున్న దేశ ఆర్థిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే లక్ష్యమని ఘంటాపథంగా చెబుతున్న ప్రధాని నరేంద్ర మోడీ.. దీనికి సత్వర చికిత్సగా తయారీ రంగంపైనే ప్రధానంగ దృష్టిసారించనున్నారు. వృద్ధి రేటుకు ఊతమిస్తూ... దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారీగా కొత్త కొలువులు వచ్చేలా చేయాలంటే తయారీ రంగమే చాలా కీలకం. దీంతో ఈ రంగానికి సంబంధించిన భారీ ప్రోత్సాహకర చర్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్లో ప్రకటించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా బడ్జెట్‌కు ముందే ఆటోమొబైల్, వినియోగ వస్తువుల(కన్సూమర్ గూడ్స్) రంగాలకు అత్యంత ఊరటనిచ్చే చర్యలు వెలువడటం విశేషం. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన ఎక్సైజ్ సుంకాల తగ్గింపును డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా తయారీ రంగంపై మోడీ సర్కారు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లు స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇదీ...: మొత్తం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 15.2% వాటా కలిగిన తయారీ రంగం గత రెండుమూడేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో పయనిస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1% వృద్ధిరేటును మాత్రమే నమోదు చేసిన ఈ రంగం... గతేడాది (2013-14)లో తిరోగమనంలోకి జారిపోయిం ది. మైనస్ 0.7% క్షీణించింది. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో 70% వాటా తయారీ రంగానిదే. విజ్ఞప్తులు.. అంచనాలు ఇవీ... కార్మిక చట్టాల్లో మరింత స్పష్టత, పన్నుల హేతుబద్ధీకరణపై ఆర్థిక శాఖ దృష్టిసారిస్తోంది. కొన్ని కీలకమైన తయారీ పరిశ్రమల్లో పూర్తిగా తయారైన ఉత్పత్తిపై తక్కువ పన్నులు, సుంకాలు అమలవుతుండగా... వినియోగిస్తున్న ముడివస్తువుల(రసాయనాలు ఇతరత్రా)పై అధికం సుంకాలు ఉన్నాయి. వీటి మధ్య అసమానతల తొలగింపు ప్రధానాంశం. ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడకుండా ఈ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు కొన్ని పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడుల జోరును పెంచి... భారీగా కొలువులను కల్పించే దిశగా ప్రత్యేక ప్రాం తీయ తయారీ కేంద్రాల(హబ్)ను ఏర్పాటు చేయాలనేది మోడీ సర్కారు యోచన. ఈ దిశగా బడ్జెట్లో ప్రకటనలు, చర్యలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల(ఎస్ ఈ జెడ్)ను కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) నుంచి మినహాయించాలనేది ఎగుమతిదారుల ప్రధాన డిమాండ్. దీనివల్ల తయారీ రంగానికి ఉత్తేజం కల్పించినట్లవుతుందని ప్రీ-బడ్జెట్ విజ్ఞప్తుల్లో పేర్కొంది. ఎస్ఈజెడ్లను సేవల పన్ను నుంచి మినహాయించాలనీ కోరింది. ప్రస్తుతం ఎస్ఈజడ్ డెవలపర్లు, సంస్థల బుక్ ఫ్రాఫిట్పై 18.5 శాతం మ్యాట్ అమలవుతోంది. ఒకవేళ మినహాయించడం సాధ్యపడకపోతే కనీసం 7.5 శాతానికి తగ్గించాలనేది ఎగుమతి సంస్థల విజ్ఞప్తి. -
'ఖాళీ భూమల కోసం జిల్లాల్లో పర్యటన'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఖాళీ భూముల కోసం జిల్లాల్లో పర్యటించనున్నట్లు డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. పర్యటన అనంతరం ఖాళీ భూములపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన సోమవారమిక్కడ చెప్పారు. గత ప్రభుత్వంలో సెజ్‌లు, పరిశ్రమలకు కేటాయించిన భూములు వినియోగించకుండా ఉన్న భూములు ఎలా స్వాధీనం చేసుకోవాలో తర్వాత నిర్ణయిస్తామని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. వినియోగంలో లేని భూములను వెనక్కు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఎఫ్‌టీఏలు, సెజ్‌లపై సర్కారు సమీక్ష
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి చెన్నై: దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు), ఇతర దేశాలతో కుదుర్చుకున్న విదేశీ వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) భారతీయులకు ఏమాత్రం లబ్ధి చేకూర్చాయన్న అంశాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘అన్ని ఎఫ్టీఏలనూ విశ్లేషించి, అవి ప్రయోజనకరమైనవో కావో తేల్చి, వాటికి చేయాల్సిన సవరణలను నిర్ణయించాల్సిందిగా నా శాఖ అధికారులను ఆదేశించాను. సెజ్‌లు ఎందుకు సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయో పూర్తిస్థాయిలో సమీక్షించాలని చెప్పాను...’ అని ఆమె శనివారం చెన్నైలో మీడియాకు తెలిపారు. ఎఫ్‌టీఏలు, సెజ్‌లకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటినీ పునఃసమీక్షించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టంచేశారు. కొత్త కంపెనీల చట్టంలోని కొన్ని అధికరణలపై వ్యాపారులు, స్టేక్హోల్డర్లు ఆందోళన వెలిబుచ్చారనీ, వీటిపై వచ్చే శనివారం న్యూఢిల్లీలో చర్చిస్తామనీ చెప్పారు. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుత తరుణంలో సబబు కాదని అన్నారు. -
ఎస్ఈజెడ్లకు మ్యాట్ మినహాయించాలి
కేంద్రానికి ఎగుమతిదారుల విజ్ఞప్తి న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లను(ఎస్ఈజెడ్) కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) నుంచి మినహాయించాలని ఎగుమతిదారుల మండలి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్య ఎగుమతుల వృద్ధితోపాటు, దేశీయ తయారీ రంగానికి సైతం సానుకూల ప్రయోజనం కల్పిస్తుందని ఈఓయూ అండ్ ఎస్ఈజెడ్ ఎగుమతి అభివృద్ధి మండలి(ఈపీసీఈఎస్) తన ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తెలియజేసింది. ఎస్ఈజెడ్లపై మ్యాట్‌ను తొలగించాలన్నది తమ ప్రథమ డిమాండ్ అని పేర్కొంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే కనీసం దీనిని 7.5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఎస్ఈజెడ్ డెవలపర్లను డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని కూడా సూచించింది. మ్యాట్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నులు ఎస్ఈజెడ్లకు సంబంధించి ‘పెట్టుబడుల సానుకూల ధోరణిని’ దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. సేవల పన్నుల నుంచి సైతం ఎస్ఈజెడ్లను మినహాయించాలని కోరింది. దేశ ఎగుమతుల్లో ఎస్ఈజెడ్లదే కీలకపాత్ర. దేశ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 33 శాతం ఎస్ఈజెడ్లదే. దాదాపు 15 లక్షల మందికి ఎస్ఈజెడ్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎస్ఈజెడ్ల నుంచి 2005-06లో ఎగుమతుల విలువ రూ.22,840 కోట్లు. 2013-14లో ఈ విలువ రూ.4.94 లక్షల కోట్లకు ఎగసింది. -
సెజ్‌లకు మరింత గడువు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 30 ప్రత్యేక ఆర్థిక మండళ్లను(సెజ్‌లు) అభివృద్ధి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి ఏడాది కాలం వరకూ గడువును పొడిగించింది. వీటిలో సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), రియల్టీ సంస్థ పార్శ్వనాథ్ డెవలపర్స్ తదితరాలున్నాయి. ఇటీవల కేంద్ర వాణిజ్య కార్యదర్శి ఎస్ఆర్ రావు అధ్యక్షతన సమావేశమైన అంతర్మంత్రిత్వ శాఖల బోర్డ్(బీవోఏ) ఇందుకు అనుమతించింది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించాక ఐదేళ్ల గడువు దాటిన సంస్థలకు ఏడాది, ఆరేళ్ల వ్యవధి పూర్తయిన సంస్థలకు ఆరు నెలలు చొప్పున గడువును పెంచేందుకు అంగీకరించినట్లు మినిట్స్‌లో బీవోఏ పేర్కొంది. పోస్కో ఇండియా, యూనిటెక్ ఇన్ఫ్రాకాన్, లోథా డెవలపర్స్ సైతం ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు అదనపు సమయాన్ని కోరిన జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ మందగమనం, ఒడిదుడుకుల మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను ప్రాజెక్ట్‌ల ఆలస్యానికి కారణాలుగా పేర్కొన్నాయి. కోల్‌కతా సెజ్ కోసం టీసీఎస్ 2014, డిసెంబర్ 13వరకూ గడువును పొందగా, రాష్ర్టంలోని బయోటెక్నాలజీ సెజ్ అభివృద్ధికి పార్వ్శనాథ్ ఇన్ఫ్రా ఆరు నెలల కాలాన్ని అదనంగా సాధించింది. వెరసి ఈ సెజ్ అభివృద్ధికి 2014, మే 8 వరకూ సమయం లభించింది. ఇక పోస్కో ఇండియా సెజ్‌కు ఏడాదిపాటు గడువు పొడిగించగా, వీటితోపాటు కేరళ రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్సెండెంట్ డెవలపర్స్ ప్రతిపాదించిన రెండు ఐటీ జోన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ విజ్ఞప్తి... హైదరాబాద్: రక్షణ సంబంధ అదనపు ఉత్పత్తుల తయారీని చేపట్టేందుకు అనుమతించాల్సిందిగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏసీఎల్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)కు గల సెజ్‌లో కంపెనీకి ఇప్పటికే చాపర్ క్యాబిన్ తయారీ ప్రాజెక్ట్‌ను కలిగి ఉంది. విస్తరణ కార్యక్రమాల ద్వారా ఇక్కడ రక్షణ సంబంధ అదనపు ఉత్పత్తుల తయారీను చేపట్టాలని కంపెనీ భావిస్తోంది.