దేశవ్యాప్తంగా సుమారు 30 ప్రత్యేక ఆర్థిక మండళ్లను(సెజ్‌లు) అభివృద్ధి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి ఏడాది కాలం వరకూ గడువును పొడిగించింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 30 ప్రత్యేక ఆర్థిక మండళ్లను(సెజ్‌లు) అభివృద్ధి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి ఏడాది కాలం వరకూ గడువును పొడిగించింది. వీటిలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), రియల్టీ సంస్థ పార్శ్వనాథ్ డెవలపర్స్ తదితరాలున్నాయి. ఇటీవల కేంద్ర వాణిజ్య కార్యదర్శి ఎస్‌ఆర్ రావు అధ్యక్షతన సమావేశమైన అంతర్‌మంత్రిత్వ శాఖల బోర్డ్(బీవోఏ) ఇందుకు అనుమతించింది.
ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించాక ఐదేళ్ల గడువు దాటిన సంస్థలకు ఏడాది, ఆరేళ్ల వ్యవధి పూర్తయిన సంస్థలకు ఆరు నెలలు చొప్పున గడువును పెంచేందుకు అంగీకరించినట్లు మినిట్స్‌లో బీవోఏ పేర్కొంది. పోస్కో ఇండియా, యూనిటెక్ ఇన్‌ఫ్రాకాన్, లోథా డెవలపర్స్ సైతం ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు అదనపు సమయాన్ని కోరిన జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ మందగమనం, ఒడిదుడుకుల మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను ప్రాజెక్ట్‌ల ఆలస్యానికి కారణాలుగా పేర్కొన్నాయి. కోల్‌కతా సెజ్ కోసం టీసీఎస్ 2014, డిసెంబర్ 13వరకూ గడువును పొందగా, రాష్ర్టంలోని బయోటెక్నాలజీ సెజ్ అభివృద్ధికి పార్వ్శనాథ్ ఇన్‌ఫ్రా ఆరు నెలల కాలాన్ని అదనంగా సాధించింది. వెరసి ఈ సెజ్ అభివృద్ధికి 2014, మే 8 వరకూ సమయం లభించింది. ఇక పోస్కో ఇండియా సెజ్‌కు ఏడాదిపాటు గడువు పొడిగించగా, వీటితోపాటు కేరళ రాష్ట్ర ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్సెండెంట్ డెవలపర్స్ ప్రతిపాదించిన రెండు ఐటీ జోన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ విజ్ఞప్తి...
హైదరాబాద్: రక్షణ సంబంధ అదనపు ఉత్పత్తుల తయారీని చేపట్టేందుకు అనుమతించాల్సిందిగా టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్(టీఏసీఎల్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)కు గల సెజ్‌లో కంపెనీకి ఇప్పటికే చాపర్ క్యాబిన్ తయారీ ప్రాజెక్ట్‌ను కలిగి ఉంది. విస్తరణ కార్యక్రమాల ద్వారా ఇక్కడ రక్షణ సంబంధ అదనపు ఉత్పత్తుల తయారీను చేపట్టాలని కంపెనీ భావిస్తోంది.