రింగ్ రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునే దిశగా ప్రభుత్వ అడుగులు
ఇందుకోసం భారీగా భూమిని సేకరించే యోచన
ప్రస్తుతం రోడ్డు కోసమే 2,400 హెక్టార్లు అవసరం
సెజ్‌ల కోసం మరింతగా సేకరించాల్సిన పరిస్థితి
అలైన్‌మెంట్ మార్పు నేపథ్యంలో ప్రతిపాదనలు
సాధ్యాసాధ్యాలపై అధికారుల అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిని గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనుండటంతో..ఈ రోడ్డు ఉండే చాలా ప్రాంతాలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. అక్కడి భూములకు డిమాండ్ పెరుగుతుంది, రోడ్డు సదుపాయం వల్ల పరిశ్రమల స్థాపనకూ వీలవుతుంది. అలాంటి చోట్ల ‘స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)’లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
తద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గం సుగమం అవుతుందని.. అదే సమయంలో సెజ్‌లలో కంపెనీలకు భూములు కేటాయించటం ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇది సాకారం కావాలంటే.. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ ఖరారయ్యే ప్రాంతా ల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టాల్సి ఉండనుంది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ సాధ్యాసా ధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.
గతంలోనే ప్రతిపాదనలున్నా..
హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల నిడివితో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్).. నగర రూపురేఖలను మార్చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా 2006లో ఓఆర్‌ఆర్ నిర్మాణానికి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు. ఆరేళ్ల తర్వాత దశలవారీగా అది అందుబాటులోకి వచ్చింది. ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మంచి పురోగతి మొదలైంది. డిమాండ్ పెరిగింది. కానీ ఆ రోడ్డును ఆనుకుని ప్రభుత్వానికి కొత్తగా భూవనరులేవీ సమకూరకపోవడంతో.. అదనపు ఆదాయమేదీ రాలేదు.
భవిష్యత్తులో రీజనల్ రింగురోడ్డు కూడా ఔటర్ రింగు రోడ్డు తరహాలోనే ఆయా ప్రాంతాలకు కొత్త రూపును ఇవ్వడం ఖాయమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఔటర్ నిర్మాణ సమయంలో ప్రభుత్వం సొంతంగా ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోకపోవటం వంటి పొరపాటును ఇప్పుడు చేయవద్దని.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొంత భూమిని సేకరించి పెట్టుకోవాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
అలైన్‌మెంట్ మార్పు నేపథ్యంలో..
రీజనల్ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని సొంతంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గతంలో రూపొందించిన అలైన్‌మెంట్‌ను కాదని.. కొత్త అలైన్‌మెంట్‌ను రూపొందిస్తోంది. భూసేకరణ వ్యయంలో 50శాతం భరించటం మినహా మొత్తం నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించే అవకాశాన్ని కూడా కాదనుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ సాహసానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రింగ్‌రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునే అంశంపై దృష్టి పడింది.
అంత భూసేకరణ సాధ్యమేనా?
రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి 2 వేల హెక్టార్ల భూమి అవసరమవుతోంది. దానికంటే దక్షిణ రింగ్ దాదాపు 50 కిలోమీటర్ల నిడివి ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తోంది. అంటే సుమారు 2,400 హెక్టార్లకుపైగా భూమి రోడ్డు నిర్మాణానికే కావాలి. ఈ భూముల సేకరణ ఎలాగన్నది చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే రీజనల్ ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అలాంటిది రోడ్డు కోసమే కాకుండా అదనంగా భూమిని సేకరించడం ఎంతవరకు సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో మల్లన్నసాగర్, ఇతర ప్రాజెక్టులకు భూములి చ్చేందుకు రైతులు ఇష్టపడక న్యాయ పోరాటం చేశారు. ఇప్పుడు రీజనల్ రింగ్ విషయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు కాకుంటే.. రీజనల్ రోడ్డు వెంట భవిష్యత్తులో భూమిని సమీకరించడం సాధ్యమయ్యే పనికాదని.. ఇప్పుడే ముందుకెళ్తే ప్రయోజనమని అధికారవర్గాలు చెబుతు న్నాయి.
Comments
Please login to add a commentAdd a comment