మీ స్మార్ట్‌ వాచ్‌ మీకు నిజమే చెబుతోందా? | Is our smartwatch actually telling the truth | Sakshi
Sakshi News home page

మీ స్మార్ట్‌ వాచ్‌ మీకు నిజమే చెబుతోందా?

Published Thu, Mar 13 2025 5:00 AM | Last Updated on Thu, Mar 13 2025 5:00 AM

Is our smartwatch actually telling the truth

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ : ఓ రోజున అమర్‌ అనే యువకుడు నాకు అత్యవసరంగా ఫోన్‌ చేశాడు. ఆ సమయంలో తను జిమ్‌లో ఉన్నాడు. తన స్మార్ట్‌ వాచ్‌ గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 38 మాత్రమే చూపిస్తోందని చెప్పాడు. నిజానికి 60–100 మధ్యలో ఉండాలి.కానీ ఓసారి వాచ్‌ తీసి..మళ్లీ వేసుకునే సరికి అది100 చూపించింది. అదిఆ వాచ్‌ కచ్చితత్వంలో ఉన్న ఎర్రర్‌. కానీ ఆ సమయంలో నిజంగానే తనకు హార్ట్‌ అటాక్‌ వచ్చేస్తుందేమోఅన్నంతగా తను టెన్షన్‌ పడ్డాడు..

స్మార్ట్‌ వాచ్‌లు.. ఇప్పుడు చాలామంది వీటిపైనే ఆధారపడుతున్నారు. తామెంత నడిచాం.. ఎంత సేపు పరిగెత్తాం.. ఎంత సేపు స్విమ్‌ చేశాం.. పడుకున్నాం.. ఎన్ని కాలరీలు బర్న్‌ చేశాం.. ఇవన్నీ ఉదయాన్నే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ.. స్టేటస్‌లు పెడుతున్నవాళ్లూ ఎక్కువయ్యారు. ఇదంతా నాణానికి ఓవైపు.. మరోవైపు చూస్తే.. నిజానికి ఇదో వ్యసనంలా మారుతోందా? స్మార్ట్‌ వాచ్‌లపై మనంఅతిగా ఆధారపడుతున్నామా? అసలు మన స్మార్ట్‌ వాచ్‌ నిజమే చెబుతోందా? 

హార్ట్‌ రేట్‌  
స్మార్ట్‌ వాచ్‌కు సంబంధించి ముఖ్యంగా వైద్యపరమైన అంశాల్లో గుడ్డిగా నమ్మడం మంచిది కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘యువకులు వీటిపై అతిగా ఆధారపడుతున్నారు. హార్ట్‌ రేట్‌ బాగా పెరిగిందనో.. లేదా బాగా తగ్గిందనో భయంతో మా వద్దకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది’అని పుణేకు చెందిన కార్డియాలజిస్ట్‌ అభిజిత్‌ వైద్య తెలిపారు. నిజానికి స్మార్ట్‌ వాచ్‌లు పల్స్‌ రేట్‌ను మాత్రమే చూపిస్తాయని.. జనానికి ఈ రెండింటి మధ్య తేడా పెద్దగా తెలియదన్నారు. 

‘ప్రతీ సారి గుండె కొట్టుకునేటప్పుడు రక్తప్రసరణలో వచ్చిన మార్పులను పరిశీలించడం ద్వారా గుండె కొట్టుకునే రేటును గణించడానికి స్మార్ట్‌ వాచ్‌లు ఫొటోప్లెథిస్మోగ్రఫీ(పీపీజీ)ని వాడతాయి. గుండె కొట్టుకునే రేటును కచి్చతంగా గణించడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్‌(ఈసీజీ) బెస్ట్‌. పీపీజీ కూడా కొంత మొత్తంలో పనిచేస్తుంది గానీ.. ఈసీజీతో పోలిస్తే.. అది కచ్చితంగా లెక్కించలేదు’అని చెప్పారు. చాలా చిన్నచిన్న మార్పులు పల్స్‌ రేట్‌ను ప్రభావితం చేస్తుంటాయని.. దీనివల్ల స్మార్ట్‌ వాచ్‌ హార్ట్‌ రేట్‌ను కచ్చితంగా చూపించలేదని చెప్పారు. 

‘నేను చాలాసార్లు ఇలాంటివారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి వచ్చింది. అదే పనిగా హార్ట్‌ రేట్, బీపీని స్మార్ట్‌ వాచ్‌లో చెక్‌ చేసుకోవడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే’ అని తెలిపారు. 2022లో ఫ్రాన్స్, కెనడా, నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకులు ఒక పాపులర్‌ స్మార్ట్‌ వాచ్‌లోని ఈసీజీ సదుపాయాన్ని పరీక్షించి చూడగా.. ఫాల్స్‌ పాజిటివ్‌లు(తప్పుడు ఫలితం) ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 

‘నిజంగానే గుండెకు సంబంధించి సమస్య ఉండి.. మీ ఖరీదైన స్మార్ట్‌ వాచ్‌ ఈసీజీలో అంతా నార్మల్‌ అని చూపిస్తే.. అప్పుడు ఆ రోగి వైద్యుడు వద్దకు వెళ్లడు. అది ప్రమాదకరం. హృదయ ధమనుల్లో ఏదైనా పూడికల్లాంటివి ఉంటే ఈసీజీలో తెలుస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌ అలాంటి వాటిని పట్టుకోదు’ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొన్ని నాణ్యమైన స్మార్ట్‌ వాచ్‌లు గుండె కొట్టుకోవడంలో తేడాలను(అరిర్థియా) సరిగానే గుర్తిస్తున్నాయని చెప్పారు. 

స్లీప్‌ ట్రాకర్‌
స్లీప్‌ ట్రాకర్ల విషయానికొస్తే.. మన నిద్ర ఆధారంగా అవి 0–100 వరకూ మార్కులిస్తుంటాయి. ఎక్కువ వస్తే.. మనం మంచిగా నిద్రపోయినట్లు అన్నమాట. ‘స్మార్ట్‌ వాచ్‌లు సెన్సర్లను ఉపయోగిస్తాయి. ఆక్సిలరోమీటర్, గైరోస్కోప్, హార్ట్‌ రేట్‌ మానిటర్‌ ఇలా.. అవి నిద్రలోని వివిధ దశలను గుర్తించలేవు. నిజమైన నిద్రను స్లీప్‌ ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్‌తో లెక్కించవచ్చు. 

అంతేకాదు.. స్మార్ట్‌ వాచ్‌లు మన కదలికలను బట్టి.. నిద్రను గణిస్తాయి. ఒకవేళ మీరు పడుకోకున్నా.. కదలకుండా ఉంటే.. అది నిద్ర కింద లెక్క తీసుకుంటుంది’అని డయాబెటాలజీ అండ్‌ స్లీప్‌ మెడిసన్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ స్మిత వివరించారు. సరైన స్లీప్‌ స్కోర్‌ రాలేదని టెన్షన్‌ పడే వాళ్ల సంఖ్య కూడా ఈ మధ్య పెరిగిందని చెప్పారు. 

ఖర్చు చేసే కేలరీలు 
కేలరీల ఖర్చు అంచనాల్లోనూ ఇదే పరిస్థితి. స్టాన్‌ఫోర్ట్‌ వర్సిటీ చేసిన పరిశోధనలో కేలరీలు ఎంత ఖర్చయ్యాయి అన్న విషయాన్ని స్మార్ట్‌ వాచ్‌లు సరిగా గణించలేకపోయినట్లు తేలింది. ‘ఇద్దరు 60 కేజీల బరువున్న వాళ్లను తీసుకుంటే.. ఒకరిలో 15 శాతం బాడీ ఫ్యాట్, రెండో వారిలో 45 శాతం బాడీ ఫ్యాట్‌ ఉంది అనుకుందాం. 

నిజానికి కేలరీల ఖర్చు అన్నది ఇద్దరిలో వేరువేరుగా జరుగుతుంది. స్మార్ట్‌ వాచ్‌లో మనం బరువు మాత్రమే నమోదు చేస్తాం కాబట్టి.. ఇద్దరికీ ఒకేలా కేలరీలు ఖర్చయినట్లు చెబుతుంది. కానీ శరీరతత్వం బట్టి.. కేలరీల ఖర్చు వేర్వేరుగా ఉంటుంది’అని న్యూట్రిషనిస్ట్‌ రాధిక తెలిపారు. 

స్టెప్‌ కౌంట్‌
గతంలో 111 దేశాలకు చెందిన 7 లక్షలకు పైగా జనాన్ని శాంపిల్‌గా తీసుకుని అమెరికా, ఆ్రస్టేలియా పరిశోధకులు అధ్యయనం చేశారు. దీని ప్రకారం.. స్టెప్‌ కౌంట్‌ అనేది.. వాచీ స్థాయిని బట్టి 15–66 శాతం తేడా వస్తోందని తేలింది. అయితే, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందింపజేసుకోవడానికి స్మార్ట్‌ వాచ్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని.. అదే సమయంలో ఆరోగ్యపరమైన అంశాల్లో వీటిపైనే అతిగా ఆధారపడటం మంచిది కాదని.. పైగా.. ఇది అనవసరమైన ఆందోళనకు తెర తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

అందుకే..
మీ స్మార్ట్‌ వాచ్‌ ఏం చెబుతోందోదాన్ని కాదు..  మీ శరీరం మీకుఏం చెబుతుందో దాన్ని వినండి..అని వైద్యులు సూచిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement