ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా వ్యాపించే ‘నిఫా’ వైరస్
అవి కొరికిన పండ్ల ద్వారా మనుషుల్లోకి ప్రవేశం
కొన్ని సందర్భాల్లో పందులద్వారా కూడా సోకే అవకాశం
దాదాపు పాతికేళ్లుగా దీని ఉనికి..
ప్రత్యేక చికిత్స ఏదీ లేదు
తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్న వైద్య నిపుణులు
ఈ వైరస్ వ్యాప్తి తీరు, లక్షణాలు, జాగ్రత్తలపై నిపుణుల సూచనలివి..
హెల్త్ డెస్క్: ఇటీవల కేరళలో నిఫా వైరస్‌తో పద్నాలుగేళ్ల చిన్నారి మృతిచెందడం కలవరం రేపింది. ఆ వైరస్ వ్యాపిస్తోందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో జనంలో ఆందోళన మొదలైంది. కానీ ‘నిఫా’ విషయంలో అంత భయమేమీ అవసరంలేదని.. ప్రస్తుతం కేరళలో తప్ప మరే రాష్ట్రంలోనూ దాని ఆనవాళ్లు లేవని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉంటే ‘నిఫా’ మన దరికి చేరే ప్రమాదం ఉండదని స్పష్టం చేస్తున్నారు.
ఎప్పట్నుంచో ఉన్న వైరసే ఇది..
ఆరేళ్ల కింద మన దేశంలో తొలిసారిగా ‘నిఫా’ వైరస్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇది ప్రపంచానికి కొత్తదేమీ కాదు. 1998లోనే మలేషియాలోని ‘కాంపంగ్ షుంగై నిఫా’ అనే ప్రాంతంలో తొలిసారిగా మనుషులకు సంక్రమించింది. ఆ ప్రదేశం పేరిటే దీన్ని ‘నిఫా’గా పిలుస్తున్నారు. తర్వాత 2004లో బంగ్లాదేశ్‌ను బెంబేలెత్తించింది. కాస్త అరుదుగానైనా అప్పుడప్పుడూ (స్పొరాడిక్‌గా) భారత్, బంగ్లాదేశ్‌లలో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
వ్యాపించేది ఇలా..
» ‘నిఫా’ ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే (జూనోటిక్) వ్యాధి.
» తాటి, ఈత, ఖర్జూర జాతికి చెందిన చెట్ల పండ్లను తినే ఫ్రూట్ బ్యాట్స్ రకం గబ్బిలాల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. వీటితోపాటు జామ వంటి ఇతర పండ్లనూ అవి తింటుంటాయి. ఆ పండ్లలో ‘నిఫా’ వైరస్ ఉండే ప్రమాదం ఎక్కువ.
» చిలక కొట్టిన పండు అంటూ సగం కొరికి ఉన్న ఏ పండ్లనూ తినకపోవడం మంచిది.
» కొన్నిచోట్ల పందుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపించే ప్రమాదముంది. అప్పటికే వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకూ సంక్రమిస్తుంది.
నిర్ధారణ చేసేదిలా..
‘నిఫా’ లక్షణాలున్న బాధితుల నుంచి శాంపిళ్లను సేకరించి పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపుతారు. ప్రస్తుతం దేశంలో ‘నిఫా’ వైరస్‌ను కచ్చితంగా గుర్తించే సదుపాయాలు అక్కడే ఉన్నాయి. వైరాలజీ ల్యాబ్‌లో ఎలిసా టెస్ట్,క్వాంటిటేటివ్ పీసీఆర్ (పాలిమరేజ్ చైన్ రియాక్షన్), సెల్ కల్చర్ (వైరస్ ఐసోలేషన్) తదితర టెస్టుల ద్వారా వైరస్‌ను గుర్తిస్తారు.
నిఫా నుంచి రక్షణ ఇలా..
» ఏదైనా కొరికినట్టు కనిపించిన ఏ పండునూ కూడా తినకపోవడం.
» పందుల ఫామ్స్‌కూ, పందుల పెంపకందార్లకు కొద్దిరోజులు దూరంగా ఉండటం.
» ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి దూరంగా ఉండటం.
» వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం. శానిటైజర్లను వాడటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం.
ప్రత్యేకమైన చికిత్స ఏదీ లేదు..
నిఫా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కచ్చితమైన చికిత్సా విధానం, మందులు లేవు. లక్షణాల తీవ్రతను బట్టి ఉపశమనం కోసం మందులు ఇస్తుంటారు. కొన్నిరకాల యాంటీ వైరల్ ఔషధాలతో చికిత్స చేస్తారు. వ్యాక్సిన్‌ను రూపొందించినా అది అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదని తేలింది. ‘నిఫా’ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తారు. – డాక్టర్ కె.శివరాజు, సీనియర్ ఫిజీషియన్, కిమ్స్
Comments
Please login to add a commentAdd a comment