రేషన్ కార్డుల జారీలో లబ్ధిదారులను కుదిస్తున్నారు
ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయ పరిమితిని పెంచాలి
సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా, కోతలు విధించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆరు గ్యారంటీల హామీ తో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం వాటిని నిజాయితీగా అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. రేషన్ కార్డులు, వ్యవసాయ కూలీలకు భరోసా, రైతుబంధు, పేదల గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను భా రీగా కుదిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివా రం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, చింత ప్రభాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకుడు దేవీప్రసాద్‌తో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా హరీశ్‌రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపికను గ్రామాల్లో చేయకుండా, కులగణన సర్వే ఆధారంగా జాబితా తయారు చేశారు. గతంలో ప్రజాపాలనలో వచ్చిన 11 లక్షల దరఖాస్తులతో పాటు రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను చెత్తబుట్టలో వేశారు’అని ఆయన ధ్వజమెత్తారు.
ఆదాయ పరిమితి పెంచాలి..
‘పదేళ్ల క్రితం బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల ఆదాయ పరిమితిని పెంచి కొత్తగా 6.47 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చాం. ఇప్పుడు కూడా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పేద వర్గాలకు లాభం జరిగేలా ఆదాయ పరిమితిని పెంచాలి. లేకుంటే అనేక కుటుంబాలు కొత్త రేషన్‌కార్డులకు అర్హత కోల్పోతాయి. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వకుంటే బీఆర్‌ఎస్ తరఫున నిలదీస్తాం. వ్యవసాయ కూలీలకు ఇచ్చే భరోసా విషయంలోనూ క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులను గుర్తించడం లేదు. 20 రోజుల పనిదినాలు అనే నిబంధనతో అర్హుల సంఖ్యను ఆరు లక్షలకు కుదించారు. రైతు రుణమాఫీలో రేవంత్ చేసిన మోసంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారాన్ని ఆ రైతు కుటుంబానికి చెల్లించాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
నెలలు గడిచినా వేతనాలేవీ..
ముఖ్యమంత్రి పాలనలో చిరుద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. చిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మంత్రి సీతక్క రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment