సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ‘ఈ సర్కారు ఉత్త బేకారు ఉన్నదని ప్రజలు అనుకుంటున్నరు. ఎవరు మెచ్చుకునే పరిస్థితి లేదు గనుక, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నడు. మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నడు’అని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో హరీశ్‌రావు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ అపరిపక్వత (ఇమ్మెచ్యూరిటీ), అసమర్థత (ఇన్ క్యాపబులిటీ), ప్రతికూల వైఖరి (నెగెటివ్ ఆటి ట్యూడ్)తో రాష్ట్రంలో అన్నిరంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొందన్నారు. ‘మేము మంచి ఆర్థిక/వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థికవృద్ధి రేటు పెరగలేదు. వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. నెపం ప్రతిపక్షం మీదకు నెట్టుతున్నవు.
కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే.. ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ కవిత లాగ ఉంది’అని హరీశ్‌రావు విమర్శించారు. ‘ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15వేలు ఇస్తామని చెప్పిన విషయం. నీకు గుర్తులేకపోవచ్చు రేవంత్‌రెడ్డి. ఆ ఫిర్యాదు కాపీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలను, మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా చూడండి’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment