సాక్షి, కరీంనగర్ జిల్లా: అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు. హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ నేతల మీడియా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. ‘అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలి. అందుకే ఇక్కడి ఆరు గ్యారంటీల మోసాన్ని గ్రహించే.. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను ఓడించి బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, సీఎం కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకుని ఆరు గ్యారంటీలు అమలు చేయాలి.
మీరు ఇచ్చిన ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం కూడా తెలంగాణాలో ఖూనీ అయిపోయింది. హుజూరాబాద్‌లో కొందరికి దళితబంధు ఆగింది. ఆగిపోయిన దళితబంధు రెండోవిడత డబ్బులిమ్మంటే పోలీసులతో దాడి చేయించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దళితులకు చేసే మేలు ఇదేనా..? జులై 19, 2024 నాడు ఫార్మాసిటీ పేరిట గెజిట్ ఇచ్చి.. ఇప్పుడు ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ సీఎం మాట మారుస్తున్నారు. పచ్చని పంటలు పండే భూములను.. తొండలు గుడ్డు పెట్టని భూములుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.
కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్న నీవు.. 20 టీఎంసీల నీటిని అదే ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు ఎలా తీసుకెళ్తావు? మిషన్ భగీరథపై సాక్షాత్తు ప్రధానమంత్రి లోక్ సభలో మెచ్చుకున్నది నిజం కాదా..?. ఇవాళ కోటి 60 లక్షల ధాన్యం పండడానికి కాంగ్రెస్ ఘనత అని చెప్పుకుంటున్నాడు రేవంత్‌రెడ్డి.
తెలంగాణ రావడానికి ముందు ఇక్కడ పండింది 30 లక్షల మెట్రిక్ టన్నులే.. కేసీఆర్ హయాంలోనే కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటైనా అమలైందా..? హుజూరాబాద్‌లో దళిత సోదరులపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాం. డిసెంబర్ 9 నుంచి జరిగే అసెంబ్లీలో దళితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’ అని హరీష్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment