రూ.8,400 కోట్ల పంపిణీకి ప్రాథమిక అంచనా
26 తర్వాత రైతు ఆత్మి య భరోసా తొలి విడత
ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
దావోస్ నుంచి సీఎం ఈసారి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు తెస్తారు
జూనియర్ అసిస్టెంట్లకు నియామక పత్రాల పంపిణీలో భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా వర్తింపజేస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పథకం కోసం రూ.8,400 కోట్లను వెచ్చించడానికి ప్రాథమికంగా అంచనా వేశామని వెల్లడించారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎన్పిడీసీఎల్)లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన 92 మందికి శనివారం సాయంత్రం సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. భూమి లేని రైతుకూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మి య భరోసా పథకం కింద ఈ నెల 26వ తేదీ తర్వాత మొదటి విడత వాయిదా (ఇన్‌స్టాల్‌మెంట్) డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
అబద్ధాల పార్టీ.. పదేపదే అబద్ధాలు
అబద్ధాల మీద పుట్టిన రాజకీయ పార్టీవాళ్లు పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు భ్రమలు కల్పించి బతికారని, ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలతో తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. మూడెకరాల భూమి,
ఇంటికో ఉద్యోగం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు ఇస్తామని గత పాలకులు హామీ ఇచ్చి గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని తెలిపారు. రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దావోస్ వెళ్లారని భట్టి తెలిపారు.
యాసంగిలో నాణ్యమైన విద్యుత్: తుమ్మల
యాసంగి సీజన్ రైతులు పండిస్తున్న వరి పంటలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో 35 శాతం నిధులు కేటాయించామని చెప్పారు. పంటలసాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, డిస్కంల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు డీఏ
విద్యుత్ ఉద్యోగుల పెండింగ్ డీఏను మంజూరు చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను సభా వేదికగా భట్టి విక్రమార్క విడుదల చేశారు. 11.78% నుంచి 14.074 శాతానికి పెరిగిన డీఏను గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపజేయనున్నారు. విద్యుత్ ఉద్యోగులకు వేతన అడ్వాన్స్‌లు, రుణాల చెల్లింపుల కోసం విద్యుత్ సంస్థలు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో 28 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కోసం రూ.8,729 కోట్లను అందజేస్తున్నామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.148.5 కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.1,485 కోట్ల బిల్లులను చెల్లించిందని తెలిపారు. రాష్ట్రంలో 25 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ గ్రామాలుగా మార్చబోతున్నామని, వ్యవసాయ పంపు సెట్లకు, గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment