అంతకుముందు ప్రభుత్వ పథకం కింద ఇల్లు పొందినా ‘ఇందిరమ్మ’కు అర్హులే
ఆ తర్వాత పొందిన వారు అనర్హులు
30 ఏళ్లలో నాటి ఇళ్లు శిథిలమై ఉంటాయన్నఅంచనాతో సర్కారు తాజా నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పటికే ఓ పర్యాయం పేదల కోసం ప్రభుత్వం కట్టిచ్చే ఇంటిని పొందిన వారు ఇందిరమ్మ పథకంలో ఇంటిని పొందేందుకు అర్హులు కాదు’అని ఇటీవలే స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు దానికి చిన్న సవరణ చేసింది. 1994 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ణయించినట్లు తెలిసింది. 1994కు ముందు ప్రభుత్వ పథకంలో ఇంటిని పొందిన నిరుపేదలు ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆ కటాఫ్ సంవత్సరం తర్వాత ప్రభుత్వం నుంచి పేదల ఇంటిని పొందిన వారు మాత్రం ఇందిరమ్మ పథకానికి అనర్హులవుతారు.
ఆ ఇళ్లు శిథిలమై ఉంటాయన్న ఉద్దేశంతో..
రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టి సాచురేషన్ పద్ధతిలో ఇళ్లను మంజూరు చేశారు. 2004 నుంచి పదేళ్ల కాలంలో తెలంగాణలో దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చారు. అప్పట్లో ఈ ఇళ్లను పొందిన వారు ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవటానికి వీలు లేదని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఈ పథకం కింద ఇల్లు పొందిన వారి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నందున, ఆ లబ్ధిదారులకు మళ్లీ ఇల్లు కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకు నే అవకాశం ఉంది. ఆధార్ నంబర్‌తో కూడా ఆ వివరాలను అనుసంధానించినందున వడపోత సులభంగా జరుగుతుంది.
అంతకుముందు వరకు ప్రభుత్వ పక్షాన ఇలా ఉధృతంగా ఇళ్ల నిర్మాణం జరిగేది కాదు. పరిమిత సంఖ్యలో ఇళ్లను నిర్మించేవారు. 1995కు పూర్వం అర్బన్ పర్మనెంట్ హౌసింగ్, రూరల్ పర్మనెంట్ హౌసింగ్ పేరుతో ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందేది. ఆ సమయంలో గ్రామాల్లో వ్యక్తిగత పెంకుటిల్లు నిర్మించి ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యక్తిగత ఇళ్లను నిర్మించారు. అప్పట్లో కేంద్ర ప్రభు త్వం కూడా ఇందిరమ్మ ఆవాస్ యోజన పేరుతో పేదల ఇంటికి ఆర్థిక సాయం అందించింది.
ఇలాంటి పథకాల్లో లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆ ఇళ్లు పెంకులతో కూడినవి కావటం, 30 ఏళ్ల సమయం అవటం.. వెరసి అవి శిథిలావస్థకు చేరి ఉంటాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించినందున, వీరిని కూడా అర్హుల జాబితాలో చేర్చింది. 1994కు ముందు అలా ఇల్లు పొందిన వారు కూడా అర్హులవుతారు. ఇప్పటికీ ఆ ఇళ్లలోనే ఉంటున్నవారూ దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నట్టు అధికారవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment