కేరళలో ముగ్గురు చిన్నారుల మృతితో సంచలనం.. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తం
తెలుగు రాష్ట్రాల్లో లేని ‘నెగ్లేరియా ఫౌలేరీ’ ఆనవాళ్లు
కలుషిత చెరువులు, సరైన నిర్వహణ లేని స్విమ్మింగ్ పూల్‌ల వల్లవ్యాపించే చాన్స్.. జాగ్రత్త అవసరమంటున్న వైద్య నిపుణులు
హెల్త్‌డెస్‌్క : కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన దేశవాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ తరహా అమీబా అనవాళ్లు లేకపోయినా వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కలుషితమైన చెరువులు, నీటివనరులతో పాటు సరైన నిర్వహణ లేని స్విమ్మింగ్ పూల్‌లలో చిన్నారులు ఈదడం వల్ల ఈ తరహా అమీబా వ్యాపించే అవకాశం ఉంది. చిన్నారుల్లో రోగ నిరోధకత తక్కువ కాబట్టి వారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది.
ముక్కు రంధ్రాల్లోంచి మెదడుకు..
నెగ్లేరియా ఫౌలేరీ అని పిలిచే ఈ అమీబా ప్రపంచవ్యాప్తంగా లోతుతక్కువ ఉండే చెరువులు, సరస్సులు, కాల్వలతో పాటు పంటపొలాలు, నేలల్లోనూ నివసిస్తుంది. బాగా వేడిగా ఉండే నీటి బుగ్గల్లో (హాట్ స్ప్రింగ్స్) కూడా ఇది మనుగడ సాగించగలుగుతుంది.
ఇది మెదడులో ‘ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్‌కెఫలైటిస్ – (పామ్)’ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను కలుగజేస్తుంది. (ఈ కారణంగానే దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా పేర్కొంటున్నారు) నాడీ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల మరణించే అవకాశమూ ఉంది. చిన్నారులు చెరువులు, ఈత కొలనుల్లాంటి వాటిల్లో ఈదుతున్నప్పుడు ఈ అమీబా వాళ్ల ముక్కు రంధ్రాల్లోంచి మెదడుకు చేరి ‘పామ్’ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.
లక్షణాలు
» తీవ్రమైన జ్వరం
» తీవ్రమైన తలనొప్పి
» వికారం, వాంతులు
» వణుకు ళీ అయోమయం చివరగా కోమాలోకి వెళ్లే ప్రమాదం
» మెదడువాపులో కనిపించే అన్నిలక్షణాలతో పాటు మెడకదలించలేకపోవడం (స్టిఫ్ నెక్), వెలుతురు చూడలేకపోవడం.
నిర్ధారణ
» లంబార్ పంక్చర్ ప్రక్రియ ద్వారా వెన్నుపాము చివరి భాగం నుంచి నీరు (సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్) తీసి పరీక్షించాల్సి ఉంటుంది.
» కొన్నిసార్లు మెదడు బయాప్సీ నిర్వహించి అక్కడ అమీబా ఉనికిని గుర్తించాల్సి ఉంటుంది.
నివారణ
» కలుíÙత నీటితో కూడిన చెరువులు, కాల్వలు,సరస్సుల వంటి వాటిల్లోకి పిల్లలు వెళ్లకుండా చూసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగాఉండే పిల్లల విషయంలో ఇది మరీ ప్రమాదం.
» నగరాల్లోని స్విమ్మింగ్ పూల్స్‌లో వాటి నిర్వహణ సరిగా (క్లోరినేషన్ చేయడం, పరిశుభ్రమైన నీటినే వాడటం) ఉందా లేదా? అనే విషయాలను పరిశీలించాకే పిల్లలను పంపాలి.
» కొందరు యోగా నిపుణులు ఓ కొమ్ము చెంబు నుంచి నేరుగా ముక్కు రంధ్రం ద్వారా నీటిని బయటకు స్రవించేలా చేసే ‘నేతి’ప్రక్రియ చేయిస్తుంటారు. అయితే మామూలు నల్లా / కొళాయి నీళ్లతో చేసేవారు బాగా మరగబెట్టి చల్లార్చిన నీటితోనే దీన్ని చేయాలి. కలుషితమైన నీళ్లతో చేస్తే పెద్దవారిలోనూ బ్రెయిన్‌ఈటింగ్ అమీబా తాలూకు ‘పామ్’ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది.
ఎంత వేగంగా చికిత్స చేస్తే అంత మేలు
దీనికి నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. కరోనా కేసుల్లో మెదడుకు బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఉపయోగించిన యాంఫోటెరిసిన్–బి వంటి మందులతో పాటు రిఫాపిన్, ఫ్లుకోనాజోల్, మిల్టెఫొసైన్ వంటి మందులను ఉపయోగిస్తారు. (మిల్టెఫొసైన్‌ను.. శాండ్‌ఫ్లై అనే కీటకాల్లో ఉంటూ లీష్మానియాసిస్ అనే వ్యాధిని కలిగించే పరాన్నజీవి సంబంధిత ఇన్ఫెక్షన్‌కు ఉపయోగించడానికి ‘ఎఫ్‌డీఏ’అనుమతించింది). త్వరగా వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే అంత మేలు. చిన్నారులకు చల్లటి నీళ్లతో (మరీ చల్లటివి కాదు) స్పాంజింగ్ చేస్తూ జ్వరం తగ్గేలా చేయడం వల్ల వేగంగా కోలుకుంటారు.
డా. విజయ్, న్యూరాలజిస్ట్,కిమ్స్ ఐకాన్, వైజాగ్
Comments
Please login to add a commentAdd a comment