రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న విష జ్వరాల కేసులు
జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,254 డెంగీ కేసులు నమోదు... హైదరాబాద్‌లో డెంగీ, చికున్‌గున్యా..
భద్రాద్రి జిల్లాలో మలేరియా కేసులు అధికం
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, చికున్‌గున్యా, మలేరియా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి విష జ్వరాలు తిరిగి విజృంభిస్తున్నాయి. మరోవైపు దగ్గు, జలుబు బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇటీవలి వానలతో నీళ్లు నిలవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో దోమలు స్వైర విహారం చేయడం, వాతావరణంలో మార్పులు వంటివి దీనికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో డెంగీ ప్రతాపం
ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో 9,254 డెంగీ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 2,731 డెంగీ కేసులు, తర్వాత మేడ్చల్ జిల్లాలో 700 కేసులు నమోదైనట్టు తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యంత తక్కువగా 24 డెంగీ కేసులు నమోదైనట్టు పేర్కొంది. అయితే అధికారికంగా నమోదు కాని డెంగీ కేసులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉంటాయని అంచనా.
మరోవైపు ఇదేకాలంలో తెలంగాణవ్యాప్తంగా 397 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్‌లో ఏకంగా 204 కేసులు రికార్డయ్యాయి. ఇక 229 మలేరియా కేసులు నమోదవగా.. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 67 కేసులు ఉన్నాయి. డెంగీ, చికున్‌గున్యా తదితర విష జ్వరాల కేసులు చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే నమోదవుతున్నాయి.
మొత్తం డెంగీ కేసుల్లో 8,409 కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవగా.. ప్రైవేట్‌లో 845 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనేక ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ, చికున్‌గున్యా కేసుల వివరాలను సరిగా అందజేయకపోవడమే దీనికి కారణమనే విమర్శలు ఉన్నాయి. తమ వద్దకు వస్తున్న ప్రతీ 10 జ్వరం కేసుల్లో ఇద్దరు, ముగ్గురికి చికున్‌గున్యా లక్షణాలు ఉంటున్నట్టు వైద్యులు చెప్తుండటం గమనార్హం.
రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలు
రాష్ట్రంలో డెంగీ ముప్పున్న 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే గుర్తించింది. గతంలో నమోదైన డెంగీ కేసుల ఆధారంగా ఈ ప్రాంతాలను నిర్ధారించింది. ప్రస్తుతం డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే 42 డెంగీ పరీక్షా కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు కల్పించింది.
రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా.. అందులో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్‌లెట్ యూనిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లాలని.. దోమల ఉత్పత్తిని నివారించే చర్యలు, అవగాహన చేపట్టాలని సూచించారు. మరోవైపు వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాధిపతులంతా ఆస్పత్రులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఒకేసారి రకరకాల జ్వరాలు
ఈ ఏడాది రకరకాల వైరల్ జ్వరాలు కలిపి ఒకే సమయంలో దాడి చేస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొందరిలో డెంగీ, చికున్‌గున్యా రెండూ కూడా ఉంటున్నాయని అంటున్నారు. ఇక నడివయసువారు, వృద్ధుల్లో చికున్‌గున్యా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు.
ఏదైనా సరైన పరీక్షలు చేయించుకుని.. వ్యాధిని స్పష్టంగా నిర్ధారించుకుని, చికిత్స పొందాలని స్పష్టం చేస్తున్నారు. డెంగీకి కేవలం ప్లేట్‌లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటివి సరిపోవని.. ఐజీఎం పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment