సాక్షి, హైదరాబాద్: ఏడాదికి రెండుసార్లు వైద్య పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసినందున ఏళ్లుగా ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. డాక్టర్లు, నర్సు లు, ఇతర పారా మెడికల్ సిబ్బంది పోస్టుల నియామకాలు చేపట్టడం ద్వారా ఎక్కడా ఖాళీలు లేకుండా చూడాలని, ప్రజారోగ్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీలు జరిగేవి. అయితే దాని ద్వారా భర్తీతో ఏళ్ల కొద్దీ ఆలస్యమయ్యేది. దీంతో ఎక్కడికక్కడ ఖాళీలు పేరుకుపోయేవి.. ఫలితంగా అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది కొరత పట్టి పీడించేది. కానీ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుతో అటువంటి సమస్య తలెత్తదని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డును మరింత బలోపేతం చేయడం ద్వారా భర్తీలు చేపట్టాలని భావిస్తున్నారు. పోస్టులు ఖాళీ అయిన వెంటనే బోర్డుకు సమాచారం వస్తుంది. సరాసరి ఏడాదికి 40 నుంచి 50 వరకు రిటైర్‌మెంట్లు జరుగుతాయి. ఇంత తక్కువ సంఖ్యలో భర్తీ ప్రక్రియ చేపట్టడం బోర్డుకు పెద్ద సమస్య కాదని అంటున్నారు. తమిళనాడులో మెడికల్ బోర్డు ద్వారానే భర్తీలు చేస్తున్నందున అక్కడ వైద్య సిబ్బంది కొరత ఏమాత్రం ఉండటం లేదని చెబుతున్నారు. ఈ బోర్డు ద్వారా మొదటిసారిగా ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేశారు.
వైద్య విధాన పరిషత్‌లో 500 మందికి..
ఇటు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. దాదాపు 500 మంది డాక్టర్లు, నర్సులకు పదోన్నతులు లభించే అవకాశమున్నట్లు వైద్య విధాన పరిషత్ వర్గాలు తెలిపాయి. వారం పది రోజుల్లో పదోన్నతులతోపాటు, కౌన్సెలింగ్ ద్వారా వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఎవరికి ఎక్కడ పోస్టింగ్ కావాలో నేరుగా కౌన్సెలింగ్‌లో అడుగుతారు. వారి ముందే ఖాళీల వివరాలు బహిర్గతం చేస్తారు. ఇష్టమైన చోటుకు వెళ్లేందుకు ఆప్షన్లు నేరుగా అడుగుతారు. ముందుగా భార్యాభర్తల కౌన్సెలింగ్ చేపట్టి, తదనంతరం అనారోగ్య సమస్యలున్నవారు, ఆ తర్వాత ఇతరులకు నిర్వహిస్తారు. అందుకు సంబంధించి వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి కసరత్తు చేపట్టారు. పారదర్శకంగా పదోన్నతులు, పోస్టింగ్‌లు ఇచ్చేలా పకడ్బందీ చర్యలు చేపడతామని అధికారులు అంటున్నారు. కౌన్సెలింగ్‌లో ఇష్టమైన చోటు దక్కనివారు తమకు అంగీకారం లేదని కూడా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిసారి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిశాక, రెండోసారి మిగిలిన వారికి నిర్వహించే అవకాశముంది. ఆప్షన్లు ఎంచుకున్న వైద్యులు, నర్సులు తప్పనిసరిగా ఆ ప్రాంతానికి వెళ్లి చేరాల్సి ఉంటుంది. ఆ మేరకు ఈసారి కఠినంగా ఉండాలని భావిస్తున్నారు. గతంలో కౌన్సెలింగ్ నిర్వహించకుండా పోస్టింగ్‌లు ఇవ్వడంతో చాలామంది చేరలేదు. పదోన్నతులు వచ్చే నెల రెండో వారం నాటికి పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఖాళీ అయ్యే పోస్టులు, ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులు అన్నీ కలిపి దాదాపు 1,400 వరకు భర్తీ ప్రక్రియ మొదలుకానుంది. మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. పదోన్నతుల ప్రక్రియ ముగిశాక ఖాళీల వివరాలపై మరింత స్పష్టత రానుందని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment