కొత్తగా 400 ఎంబీబీఎస్‌ సీట్లు | Central govt has approved 4 medical colleges 400 new MBBS seats | Sakshi
Sakshi News home page

కొత్తగా 400 ఎంబీబీఎస్‌ సీట్లు

Published Wed, Sep 11 2024 5:59 AM | Last Updated on Wed, Sep 11 2024 5:59 AM

Central govt has approved 4 medical colleges 400 new MBBS seats

తాజాగా 4 మెడికల్‌ కాలేజీలకు కేంద్రం అనుమతి  

దీంతో ఈ ఏడాది మొత్తం

8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు 

ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 4,090కి చేరిన సీట్లు 

మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయత్నాలు సఫలం  

కేంద్రానికి, సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన దామోదర

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది అదనంగా 400 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం 4 కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్‌ కాలేజీలకు అనుమతి ఇస్తూ ప్రిన్సిపాళ్లకు లేఖ రాసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 8 కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసింది. వాటిలో నాలుగింటికి గత నెలలో అనుమతులు రాగా, తాజాగా మిగిలిన నాలుగింటి అనుమతులపై స్పష్టత ఇచ్చింది. 

గత నెలలో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వీటిల్లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగినట్టు మంత్రి వెల్లడించారు.  

ముమ్మర ప్రయత్నాలు... 
ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది. జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్‌ఎంసీ అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్‌ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో అవసరమైన నిధులను కొత్త సర్కార్‌ కేటాయించింది. ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్‌ అప్పీల్‌కు వెళ్లింది. ఈ అప్పీల్‌ తర్వాత ములుగు, నర్సంపేట, గద్వాల నారాయణపేట కాలేజీలకు పర్మిషన్‌ ఇచ్చిన ఎన్‌ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. 

ఈ కాలేజీల అనుమతులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెగ్యులర్‌గా పర్యవేక్షించారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌ కాలేజీలకు సిబ్బందిని నియమించారు. ఇటీవల జరిగిన జనరల్‌ ట్రాన్స్‌ఫర్లలో తొలుత ఆ 4 కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్‌ను బదిలీ చేశారు. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిటల్‌లో ఉండాల్సిన లేబొరేటరీ, డయాగ్నస్టిక్స్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. 

ఇలా ఎన్‌ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్‌ అప్పీల్‌ చేశారు. మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశాలతో వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తూ, డీఎంఈ డాక్టర్‌ వాణి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్‌ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. 

ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ జారీ చేయాలని ఎన్‌ఎంసీని ఆదేశించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఆయన కృషి ఫలితంగా కొత్తగా మెడికల్‌ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement