
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం 2023–24 నుంచి ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నంలోని కొత్త వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు నిర్వహించడానికి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం అనుమతిచ్చింది. దీంతో ఒక్కో కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లతో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయా కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌లను నియమించారు.
ఆయా జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా మార్పు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం అఫ్లియేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా కళాశాలలు గురువారం నుంచి ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేయబోతున్నట్టు డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. కాగా, వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు చేపట్టిన సీఎం జగన్ సర్కార్.. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఐదు కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ఇప్పటికే ఉన్న సీట్లకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment