టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి రూ.వేల కోట్ల విలువైన భూములు
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో పలు సినిమాలకు నిర్మాత
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో కలిసి సంయుక్తంగానూ చిత్ర నిర్మాణం
ఈ క్రమంలో ఓర్వకల్లులో ఈ–మొబిలిటీ పార్కు పేరుతో భూ సంతర్పణ!
పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఈ–మొబిలిటీ వాహన రంగంలోకి ప్రవేశం
ఏమాత్రం అనుభవం లేకున్నా, అనుభవం ఉన్న కంపెనీతో భాగస్వామ్యం లేకున్నా కదిలిన ఫైల్
ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు 2,621 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం
ఆ పక్కనే 1,200 ఎకరాల్లో మొబిలిటీ పార్క్ అంటూ అదే రోజు సర్కారు ఒప్పందం
కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు కూటమి పెద్దలు గ్రీన్ సిగ్నల్
వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పసందైన విందు భోజనానికి కొదవుండదన్నట్లు.. భూములు కేటాయించేవాడు బిజినెస్ పార్ట్‌నర్ అయితే ఎన్ని వందల ఎకరాలైనా సొంతమైపోతాయనేందుకు ఈ ‘ఒప్పందం’ అతికినట్లు సరిపోతుంది. సినిమా నిర్మాణానికి, వాహనాల తయారీకి ఎక్కడా పొంతన కుదరకున్నా, ఏ మాత్రం అనుభవం లేకున్నా.. ఆ పార్ట్‌నర్ అడగడం.. ఈ పార్ట్‌నర్ మద్దతు పలకడం.. పొలిటికల్ పార్ట్‌నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. కనీసం ఈ–మొబిలిటీ వాహనాలు తయారు చేసే కంపెనీతో భాగస్వామ్యం కూడా లేకుండానే ఏకంగా 1,200 ఎకరాలు కేటాయిస్తూ కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం పట్ల అటు వ్యాపార ప్రముఖులు, ఇటు అధికారులు నివ్వెరపోతున్నారు.
సాక్షి, అమరావతి: టీజీ విశ్వ ప్రసాద్.. ఈ పేరు చాలా మందికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పలు సినిమాలు తీయడమే కాకుండా, ఆయనతో భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది ఈయనే. టీజీ విశ్వప్రసాద్‌కు ఇప్పుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వేల కోట్ల రూపాయల విలువైన భూములు కేటాయించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో కలిపి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్‌ఎల్‌పీ (లిమిటెడ్ లయబులిటీ పార్ట్‌నర్‌షిప్) తొలి దశలో 15 చిత్రాలు నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో ‘బ్రో’ అనే సినిమా కూడా తీశారు.
అందులో అప్పటి జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిత్వ హననం చేసే విధంగా నటుడు పృథ్వీతో ఓ సీన్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా 2024 ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి జనసేన తరుఫున అభ్యర్థిగా పోటీ చేయడానికి విశ్వప్రసాద్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి ఒప్పందంలో భాగంగా ఆ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో పోటీ చేయలేకపోయారు. అయితే ఎన్నికల ప్రచారానికి భారీగా నిధులు సమకూర్చినట్లు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఫలితాల అనంతరం ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో హైదారాబాద్‌లో విశ్వప్రసాద్ గ్రాండ్ పార్టీ ఇవ్వడంపై భారీగా చర్చ జరిగింది. పవన్‌కళ్యాణ్ పార్టనర్ అయినందునే ఆయనకు రూ.కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టేయడానికి ఫైళ్లు చకచకా కదిలాయని, ఆ వెంటనే ఒప్పందం కుదిరిందనే వాదన వినిపిస్తోంది.
అనుభవం లేని కంపెనీతో ఒప్పందం
పీపుల్ టెక్ టెక్నాలజీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ స్క్రీన్స్, పీఎంఎఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, పీటీజీ వెంచర్స్, వీ జోన్ హాస్పిటల్స్ వంటి విభిన్న రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీజీ విశ్రప్రసాద్ ఇప్పుడు ఎటువంటి అనుభవం లేకుండానే ఈ–మొబిలిటీ పార్కుతోపాటు ఈ– స్కూటర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.
ఈ–మొబిలిటీ వాహన తయారీ కోసం ఇంకా భాగస్వామ్య కంపెనీని కూడా ఎంచుకోలేదు. తైవాన్, కొరియా, చైనా దేశాలకు చెందిన కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలోనే స్పష్టంగా పేర్కొన్నారు. రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెట్టే ఆర్థిక స్థితి పీపుల్ గ్రూపుకు లేనే లేదు. అయినా ఈ విషయాలు ఏమీ పరిగణనలోకి తీసుకోకుండా ఏపీ ఈడీబీ పీపుల్స్ గ్రూపుతో ఒప్పందం చేసుకుంది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 1,200 ఎకరాలను రూ.1,800 కోట్లతో ఈ–మొబిలిటీ పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు, యాంకర్ (ప్రధాన) కంపెనీగా పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ రూ.300 కోట్లతో ఈ –మొబిలిటీ యూనిట్‌ను ఏర్పాటు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.
సచివాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్‌ను కలిసిన విశ్వప్రసాద్
రూ.6 వేల కోట్లు పైమాటే
హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధికి 2,621 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే ఆ భూమి పక్కనే 1,200 ఎకరాల్లో ఈ మొబిలిటీ పార్కు ఏర్పాటు చేస్తామంటూ పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకోవడం.. అనంతరం ఆ కాగితాలతో విశ్వప్రసాద్.. డిప్యూటీ సీఎంను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి.
ప్రస్తుతం ఎకరం రూ.కోటి వరకు ఉన్న ఈ భూమి ధర.. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధి చెందితే రూ.ఐదారు కోట్ల వరకు వెళుతుంది. ఈ లెక్కన 1,200 ఎకరాల భూమి విలువ రూ.ఐదారు వేల కోట్లకు పైగానే ఉంటుందని పరిశ్రమల శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ అంశం తెలుగుదేశం పార్టీతో పాటు పరిశ్రమల శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
కారు చౌకగా కొట్టేసే యత్నం
ఓర్వకల్లు వద్ద సుమారు 9,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో తొలి దశలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిక్‌డిక్ట్ నిధులతో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం పారిశ్రామిక పార్కు కోసం 2,621 ఎకరాల భూమి బదలాయింపునకు ఆమోదం తెలిపింది.
ఒక్కసారి పారిశ్రామిక పార్కు అభివృద్ధి పనులు మొదలైతే అక్కడ భూముల రేట్లు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి 80 లక్షల నుంచి కోటి రూపాయల పైనే పలుకుతోంది. ఒకసారి పారిశ్రామిక పార్కు అభివృద్ధి అయితే ఈ రేట్లు నాలుగైదు రెట్లు పెరుగుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న డిప్యూటీ సీఎం వ్యాపార భాగస్వామి కారు చౌకగా ఈ భూములను కొట్టేసే విధంగా పథకం రూపొందించారు. పీపుల్ టెక్ పేరుతో ఈ మొబిలిటీ పార్కును ఏర్పాటు చేస్తున్నామంటూ ఎకరా రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షలకు అప్పగించే విధంగా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పుతున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పుడక్కడ ఏపీఐఐసీనే ఎకరం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలకు విక్రయిస్తుంటే అత్యంత కారు చౌకగా భూములను అప్పగించడానికి రంగం సిద్ధం కావడం వెనుక ఏం జరిగి ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నికల్లో గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్‌కళ్యాణ్ వ్యాపార భాగస్వామికి రూ.వేల కోట్ల విలువైన భూములను అత్యంత కారుచౌకగా ధారాదత్తం చేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment