తన కిడ్నీని అమ్మాలనుకుని, చివరకు.. | Kerala Organ Trade Case: Key Accused Also Try To Sell | Sakshi
Sakshi News home page

తన కిడ్నీని ఎవరూ కొనలేదు!.. కిడ్నీ రాకెట్‌ కింగ్‌పిన్‌గా ఎదిగి..

Published Mon, Jun 3 2024 7:47 AM | Last Updated on Mon, Jun 3 2024 9:34 AM

Kerala Organ Trade Case: Key Accused Also Try To Sell

హైదరాబాద్‌: కేరళ నెడుంబస్సేరి కిడ్నీ రాకెట్‌ మూలాలు నగరంలో బయటపడడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బెల్లంకొండ రాంప్రసాద్‌ అలియాస్‌ ప్రతాపన్‌(41) విచారణ సందర్భంగా కీలక వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముఠా ఏర్పడిన తీరు కూడా పోలీసులను ఆశ్చర్యపరిచింది.

ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సేనా వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌, విజయవాడలో రియల్టర్‌ అయిన రాంప్రసాద్‌.. తన కిడ్నీని అమ్మాలని ప్రయత్నించాడు. అయితే అతనికి ఉన్న అనారోగ్యంతో అది వీలుకాలేదు.  ఈలోపు ఇరాన్‌లో కిడ్నీ రాకెట్‌ నడిపించే మధుతో రాంప్రసాద్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటికే మరో నిందితుడు సబిత్‌ కూడా తన కిడ్నీని అమ్మేశాడు. కిడ్నీ రాకెట్‌ ద్వారా మధు సంపాదన తెలిసి వీళ్లకూ ఆశపుట్టింది. అలా.. మధు ద్వారా రాంప్రసాద్‌, సబిత్‌.. ఇంకొందరు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రాంప్రసాద్‌ ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించాడు. ఇరాన్‌తో పాటు కువైట్‌, శ్రీలంక కేంద్రాలుగా ఈ గ్యాంగ్‌ కిడ్నీ రాకెట్‌ వ్యవహారాన్ని నడిపించినట్లు దర్యప్తులో వెల్లడైంది.  

ఇక.. ఈ ముఠా దాదాపు 40 మందికిపైగా యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి కిడ్నీలు అమ్మినట్లు వెల్లడైంది. పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని.. యువకులకు గాలం వేసేది ఈ గ్యాంగ్‌.  ఆధార్‌ కార్డు, ఇతర డాక్యుమెంట్లతో ఫేక్‌ పాస్‌పోర్టులు తయారు చేసి ఇరాన్‌కు తీసుకెళ్లేది. అక్కడ వాళ్లను అనుమానం రాకుండా ఉండేందుకు అపార్ట్‌మెంట్‌లలో ఉంచేవాళ్లు. ఆ తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లి కిడ్నీలను సేకరించేవాళ్లు. 

కిడ్నీ దాతలను గుర్తించేందుకు హైదరాబాద్, విజయవాడలలో తనకు పలువురు సహకరించారని, అందులో వైద్య రంగానికి చెందిన వారితోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు, ఇందుకోసం వారికి కొంత కమీషన్‌ కూడా ముట్టజెప్పానని రాంప్రసాద్‌ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

ఇక.. ఈ కేసులో పోలీసులు సైతం ఆశ్చర్యపోయే విషయం ఒకటి ఉంది. కిడ్నీ మార్పిడి చేయాలంటే రక్తం గ్రూపు నిర్ధారణ దగ్గర నుంచి అనేక పరీక్షలు నిర్వహించి, ఫలానా దాత కిడ్నీ ఫలానా గ్రహీతకు సరిపోతుందని నిపుణులైన వైద్యులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. రాంప్రసాద్‌ పంపిన వారందరి కిడ్నీలు ఇరాన్‌లో ఎదురుచూస్తున్న వారందరికీ సరిగ్గా సరిపోయాయి. గ్రహీతల వైద్య పరీక్షల వివరాలను రాంప్రసాద్‌ ముందుగానే తెప్పించుకునేవాడని, కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధమైనవారికి ఇక్కడున్న ల్యాబొరేటరీల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో ఎవరిది ఎవరికి సరిపోతుందో ముందుగానే నిర్ధారణకు వచ్చేవాడని పోలీసులు భావిస్తున్నారు. రాంప్రసాద్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. మరిన్ని అరెస్టులు ఈ కేసులో జరిగేలా తప్పడం లేదు. 

ఈ కేసులో అంతకు ముందే త్రిస్సూర్‌కు చెందిన సబిత్‌ నాజర్‌, కళామస్సేరికి చెందిన సాజిత్‌ శ్యామ్‌రాజ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సబిత్‌ను విచారణ చేపట్టాకే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగింది. ప్రస్తుతానికి ఈ గ్యాంగ్‌కు సంబంధించి భారత్‌లోని ముఠా సభ్యులందరినీ అరెస్ట్‌ చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. ఇక అరెస్ట్‌ కావాల్సింది ఇరాన్‌లో రాకెట్‌ నడిపించిన మధు మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement