పోలీసుల అదుపులో నిందితుడు సబీత్
హైదరాబాద్, సాక్షి: కేరళలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ఉదంతం వెనుక నగర మూలాలు ఉండడం కలకలం రేపుతోంది. కీలక సూత్రధారులు ఇక్కడివాళ్లే అని.. ఓ ప్రముఖ డాక్టర్ సూత్రధారిగా కేరళ పోలీసులు నిర్ధారించుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వయా కొచ్చి టూ ఇరాన్ కేంద్రంగా నడిచిన ఈ కిడ్నీ రాకెట్ వివరాల్లోకి వెళ్తే..
కేరళ కొచ్చిలో తాజాగా ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే కిడ్నీ దానం పేరిట మోసం జరిగిందని, ఒక ముఠా తమ కొడుకును బలిగొందని అతని కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన కొచ్చి పోలీసులు సబీత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సబీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును చేధించారు.
పేద యువకులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుని ఈ కిడ్నీ రాకెట్ నడిపిస్తోంది. ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షలు ఇస్తామని ఆశజూపి.. ఇరాన్‌కు తీసుకెళ్తోంది. అక్కడ కిడ్నీలు తీసుకుని.. తిరిగి ఇండియాకు తీసుకొస్తోంది. తీరా ఇక్కడికి వచ్చాక కేవలం రూ. 6 లక్షలే ఇవ్వడంతో బాధితులు కంగుతింటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు చనిపోవడంతో ఈ ముఠా అరాచకాలు వెలుగు చూశాయి.
హైదరాబాద్ నుంచే..
ఈ కిడ్నీ రాకెట్ కీలక సూత్రధారులు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులుగా కేరళ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 40 మందికిపైగా యువకుల నుంచి కిడ్నీలు ఈ ముఠా సేకరించినట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు నగరానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా గుర్తించిన కేరళ పోలీసులు.. ఆ వైద్యుడితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తుల కోసం వెతుకుతున్నారు.
20 కాదు 40 లక్షలు!
కొచ్చి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి యువకుల్ని కొచ్చి తరలించి.. అక్కడి నుంచి ఇరాన్‌కు తీసుకెళ్లి కిడ్నీలు సేకరిస్తున్నట్లు ధృవీకరణ అయ్యింది. ఆపరేషన్ తర్వాత 20 రోజులకు దాతలకు ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు. ఇక ఈ వ్యవహారంలో సబీత్ గ్యాంగ్.. కొచ్చి గ్యాంగ్‌తో ఒక్కో కిడ్నీకి మొత్తం రూ.40 లక్షలకు డీల్ కుదుర్చుకుంటోంది. అందులో సబీత్ గ్యాంగ్ రూ.20 లక్షలు, కొచ్చి గ్యాంగ్ రూ.10 లక్షలు.. డోనర్‌కు రూ.10 లక్షలుగా పంచుకుంటున్నారు. అయితే.. దాతలకు ఇవ్వాల్సిన డబ్బు విషయంలోనూ సబీత్ గ్యాంగ్ మోసం చేస్తూ వచ్చినట్లు తేలింది. ఇక.. హైదరాబాద్‌లోనే మకాం వేసిన కేరళ పోలీసులు.. ఇరాన్ వెళ్లిన బాధితులు ఎవరన్నదానిపై దృష్టిసారించారు.
Comments
Please login to add a commentAdd a comment