
రాష్ట్రవ్యాప్తంగా 30మహిళా ఎస్సీ డిగ్రీ కాలేజీలు
వీటిలో 25 వేల సీట్లుంటే..సగానికిపైగా ఖాళీ.. కాలేజీలను20 లేదా 15కు తగ్గించాలని నిర్ణయం
తక్కువ అడ్మిషన్లు ఉన్న కోర్సులు మరో కాలేజీకి బదిలీ
ఇలా సైన్స్, ఆర్ట్స్ కాలేజీలుగావేర్వేరుగా ఏర్పాటు.. ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలేజీలు ప్రారంభమైన నాటి నుంచి జరిగిన ప్రవేశాలు, ప్రస్తుత విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని వాటి సంఖ్యను కుదించాలని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ భావిస్తోంది.
ఇందుకు సంబంధించి వారం రోజులుగా డిగ్రీ కాలేజీల ప్రిన్స్‌పాళ్లతో సొసైటీ కార్యదర్శి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే వీటి సంఖ్యను కుదించి అక్కడున్న విద్యార్థులను సమీప కాలేజీల్లో విలీనం చేసే దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
అరకొరగా ప్రవేశాలు
ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 30 మహిళా డిగ్రీ కాలేజీలున్నాయి. ప్రతి ఉమ్మడి జిల్లాకు 3 కాలేజీల చొప్పున ఏర్పాటు చేశారు. ఇవి 2016–17 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రాగా.. తొలి ఏడాది డిగ్రీ మొదటి సంవత్స రం మాత్రమే ప్రారంభించారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఒక్కో కాలేజీలో 7 కోర్సులు నిర్వహిస్తున్నారు.
ఒక్కో కోర్సులో 40 మంది చొప్పున 280 మంది విద్యార్థులుంటారు. 3 సంవత్సరాలకు కలిపి 840 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే చాలాచోట్ల అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేవు. ప్రారంభంలో విద్యార్థులు బాగానే చేరినప్పటికీ, కోవిడ్ తర్వాత చేరికలు తగ్గుతూ వచ్చాయి.
మరోవైపు ఇంజనీరింగ్, వృత్తివిద్యా కోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతుండడంతో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు తగ్గాయి. దీంతో కాలేజీల నిర్వహణ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాలేజీల సంఖ్యను కుదించేందుకు సొసైటీ చర్యలు చేపట్టింది.
సగం కాలేజీలు విలీనం
ఈ కాలేజీల్లో కోర్సులవారీగా ప్రవేశాలు, ఖాళీలను సొసైటీ అధికారులు విశ్లేషిస్తున్నారు. అడ్మిషన్లు సగం కంటే తక్కువగా వచి్చన కోర్సులను సమీప కాలేజీలో విలీనం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఏ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీని అదే వర్సిటీ పరిధిలోని మరో కాలేజీలో విలీనం చేయాలని నిర్ణయించారు. కొన్నింటిని పూర్తిగా సైన్స్ కాలేజీలుగా, మరికొన్నింటిని ఆర్ట్స్ కాలేజీలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు కాలేజీలున్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఒక కాలేజీని సైన్స్ కాలేజీగా, మరో కాలేజీని ఆర్ట్స్ కాలేజీగా మార్చి, మూడో కాలేజీని పై రెండింటిలో విలీనం చేసేలా సొసైటీ ప్రధాన కార్యాలయంలోని అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
30 కాలేజీల్లో కలిపి 25,200 సీట్లు ఉండగా, మొత్తం 12 వేలకు మించి విద్యార్థులు లేరని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కాలేజీలను 20కి తగ్గించాలా? 15కు కుదించాలా? అనే తర్జనభర్జన పడుతున్నారు. ఒకటిరెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment