Gurukul colleges
-
అంబేడ్కర్ గురుకులాలకు యమా డిమాండ్
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ఐదవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఇందుకు అద్దంపడుతున్నాయి. దరఖాస్తులకు గురువారం ఆఖరి తేదీ కావడంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 8 వరకు ఆ గడువు పెంచుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు వెల్లడించారు. 2022–23 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతిలో 14,940 సీట్లు ఉండగా.. 53,946 మంది దరఖాస్తు చేశారని చంద్రుడు తెలిపారు. అలాగే, జూనియర్ ఇంటర్లో 13,560 సీట్లకు 34 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఐదో తరగతికి అత్యధికంగా కర్నూలు, అనంతపూరం, విశాఖపట్నం జిల్లాల నుంచి.. ఇంటర్ ఫస్టియర్ కోసం కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీటిపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. -
నేటి నుంచి బీసీ గురుకుల స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం
సాక్షి, అమరావతి: బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టింది. ఏ ఒక్కరూ కరోనా వైరస్ బారిన పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముందుగా తల్లిదండ్రుల సమ్మతి లేఖతో విద్యార్థులు గురుకులాలకు రావలసి ఉంటుంది. నాలుగు మాస్కులు వెంట తెచ్చుకోవాలి. గురుకులాల వద్ద విద్యార్థులను థర్మల్ స్కానర్లతో సంస్థ వైద్య బృందం పరీక్షిస్తుంది. కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే ఆ విద్యార్థిని వెంటనే తిరిగి ఇంటికి çపంపిస్తారు. కాగా క్లాసులు ఉదయం 8:15 నుండి సాయంత్రం 1:30 వరకు జరుగుతాయి. క్యాంపస్, హాస్టల్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు ఇలా ప్రతిచోటా విద్యార్థులు సురక్షిత వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ వివరాలు వెల్లడించారు. ► చేతులు కడుక్కునేందుకు సబ్బు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు. ► అందుబాటులో స్టాఫ్ నర్సులతో కూడిన ఆరోగ్య బృందాలు ► విద్యార్థుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం. ► ముందుజాగ్రత్త చర్యగా ప్రతి పాఠశాలలో ఐసోలేషన్ రూమ్ / వార్డ్ ఏర్పాటు ► ప్రతి తరగతి గదిలో 16 మందికి మించకుండా విద్యాబోధన. ► ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, పెన్సిళ్లు, లైబ్రరీ పుస్తకాలు, క్రీడా సామగ్రి వాడకం తాత్కాలికంగా నిలిపివేత. ► వసతి గృహంలో విద్యార్థులు మంచం, తువ్వాళ్లు, దుస్తులు, బూట్లు, సాక్స్‌లు వంటి తమ వస్తువులు దూరంగా, విడివిడిగా ఉంచుకునేలా ఏర్పాటు. ► మరుగుదొడ్లు, బాత్రూములను రోజుకు మూడుసార్లు శుభ్రం చేయాలి. ► అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనానికి ముందు, ఆ తర్వాత డైనింగ్ హాల్ శుభ్రపరుస్తారు. ► ప్రతి విద్యార్థి తమ సొంత ప్లేట్, గ్లాసు, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. ► సాధారణ అసెంబ్లీ ఉండదు. విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనుమతి లేదు. -
సీఓఈ కాలేజీల్లో అడ్మిషన్లు షురూ
సాక్షి, హైదరాబాద్: గురుకుల సొసైటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ) కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు తెరలేచింది. జేఈఈ, నీట్, ఎయిమ్స్, ఎంసెట్, క్లాట్, సీఏ–సీపీటీ తదితర పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఈ కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ నెల 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై డిసెంబర్ 20తో ముగియనుంది. రాత పరీక్ష ద్వారా అర్హులను గుర్తించనున్నారు. పదో తరగతి చదివే వారికే: సీఓఈ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులే అర్హులు. గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పదో తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ సొసైటీలో సీటు పొందాలనుకుంటున్నారనే అంశాన్ని పరిశీలించుకుని https://www.ts wreis.in, http://www.tgtwgurukulam.telangana.gov.inలో వివరాలు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 28 కాలేజీలు, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో 17 కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలో 40 సీట్లుంటాయి. మొత్తంగా 1,800 సీట్లకు ప్రవేశాలు చేపట్టే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. కాలేజీల వివరాలు, రిజర్వేషన్లు, పరీక్ష విధానం తదితర సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపర్చారు. -
టీజీటీ నియామకాలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) నియామకాల ప్రక్రియ పూర్తయింది. టీజీటీకి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను గురుకుల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వెబ్సైట్లో పొందుపర్చింది. ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి పక్షం క్రితమే తుది జాబితా విడుదల చేయగా.. గతవారం ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో చేర్చింది. తాజాగా మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలనూ వెబ్సైట్లో ఉంచింది. ఇప్పటికే నియమితులైన అర్హుల జాబితాలను సంబంధిత సొసై టీలకు పంపింది. ఆయా సొసైటీ కార్యదర్శులు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఈనెల 10లోగా నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఇప్పటికి 960 టీజీటీ, 1,972 పీజీటీ పోస్టుల భర్తీ పూర్తయినట్లే. నెలాఖరులోగా డీఎల్, జేఎల్ భర్తీ గురుకుల కాలేజీల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ భర్తీ సైతం వేగవంతమైంది. గురుకుల నియామకాల బోర్డు ఇటీవలే 466 డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరి ధ్రువపత్రాలు పరిశీలించాక తుది జాబితా ఖరారు చేయనుంది. వారంలోగా 281 జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన వారి జాబితాను ఖరారు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. దీంతో గురుకుల నియామకాల బోర్డుకు అప్పగించిన రిక్రూట్మెంట్ బాధ్యతలు పూర్తి కానున్నాయి. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలంటే జోన్ల వ్యవస్థపై స్పష్టత రావాల్సి ఉంటుందని, పోస్టుల విభజన పూర్తయితేనే భర్తీ చేపట్టే వీలుందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
3 నెలలు.. 5,318 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈ–ఐఆర్బీ) ద్వారా మూడు నెలల్లో 5,318 పోస్టులు భర్తీ చేయనున్నట్లు బోర్డు చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఇప్పటికే 3,213 ఉద్యోగాలకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు జారీ చేశామని, వారాంతం లోగా మరో 465 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పోలీస్ ఆఫీసర్స్ క్లబ్లో టీఆర్ఈ–ఐఆర్బీ కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. గురుకుల విద్యా సంస్థల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకే ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసిందని, ఇందులో గురుకుల సొసైటీల్లోని ఉద్యోగులు, సిబ్బందిని డిప్యుటేషన్పద్ధతిలో తీసుకుని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బోర్డు నిర్వహణకు గురుకుల సొసైటీల ద్వారా ఆర్థిక సహకారాన్ని తీసుకుంటున్నామని, అక్టోబర్ ఆఖరుకల్లా అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వహించి నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా నియమితులైన టీజీటీ, పీజీటీలకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వారికి క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, జీవనశైలి తదితర అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కొత్త టీచర్లను విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు పంపుతున్నామని వివరించారు. రెండ్రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో టీచర్లకు విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు అర్థమవుతాయని, దీంతో బోధన కార్యక్రమాలెలా నిర్వహించాలనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. స్వేరోస్.. విద్యార్థి సంఘం కాదు.. స్వేరోస్ సంస్థ విద్యార్థి నాయకుల సంఘం కాదని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. స్వేరోస్ కార్యక్రమాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గురుకుల పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులతో ఏర్పాటైన సంస్థ స్వేరోస్ అని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లోని కాంట్రాక్టు పనులను ఎస్సీలకే కేటాయించే క్రమంలో భాగంగా జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా స్వేరోస్‌కు కాంట్రాక్టులు ఇస్తున్నామని, సొసైటీ నిబంధనల్లోనే ఈ అంశం ఉందని, ప్రభుత్వ ఆమోదంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్వేరోస్ వచ్చిన తర్వాత గురుకులాల్లో చాలా మార్పులు వచ్చాయని, సివిల్ సర్వెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఇందులో ఉన్నారని, వీరిని ఆదర్శంగా తీసుకుంటూ విద్యార్థులు ముందుకెళ్తున్నారని వివరించారు. విద్యార్థులపై లైంగిక దాడులు జరిగితే సహించబోమని, బాధ్యులు ఎవరైనా వదిలేది లేదన్నారు. అన్ని గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రత కట్టుదిట్టంగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్, సభ్యులు మల్లయ్యభట్టు, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీ కాలేజీల ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల సొసైటీ(టెమ్రీస్) జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ కార్యదర్శి బి.షఫియుల్లా, అకాడమీ అధిపతి ఎంఏ లతీఫ్ అత్హర్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పన్నెండు జూనియర్ కళాశాలల్లో 2018–19 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్సెస్సీలో వచ్చిన మార్కుల గ్రేడ్ల ఆధారంగా ఈ నెల 16 నుంచి 20 వరకు విద్యార్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను 21న విడుదల చేస్తామని, 22 నుంచి 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. గురుకుల కళాశాలలు జూన్ ఒకటి నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. మైనారిటీలకు 75 శాతం సీట్లు మైనారిటీ గురుకుల కళాశాలల్లో 75 శాతం సీట్లు మైనారిటీ వర్గాలు, 25 శాతం సీట్లను మైనారిటీయేతరులతో భర్తీ చేస్తున్నట్లు షఫియుల్లా, లతీఫ్ అత్హర్లు వెల్లడించారు. కుటుంబ వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల వరకు గల విద్యార్థులు గురుకుల ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. 12 గురుకుల కళాశాలల్లో 960 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామన్నారు. పదకొండు గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు, నిజామాబాద్‌లో మాత్రం సీఈసీ, ఎంఈసీ విభాగాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఎంపీసీలో 440, బైపీసీలో 440, సీఈసీలో 40, ఎంఈసీలో 40 సీట్లు ఉన్నాయని చెప్పారు. కళాశాలల్లో అదనంగా ఫౌండేషన్ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాల్లో రోబోటిక్ ల్యాబ్‌ను ప్రారంభించామని, శిక్షణ కోసం ఇప్పటికే సింగపూర్‌లోని ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. త్వరలో ప్రత్యేక క్రీడాపాఠశాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. -
12 నుంచి మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పలు సబ్జెక్టుల మెయిన్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. ఒక సబ్జెక్టు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి విజ్ఞప్తి మేరకు షెడ్యూల్‌ను సవరించినట్లు తెలిపింది. మెయిన్ పరీక్షలకు 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, స్కూల్స్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీల్లో మార్పు లేదని పేర్కొంది. డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పరీక్ష తేదీల్లో మార్పులు ఉన్నట్లు వివరించింది. హెచ్ఎండీఏ పరిధిలో కంప్యూటర్ ఆధారితంగా మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. -
3 వేల సీట్లు.. 24 వేల దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కాలేజీలకు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల ఆయా కాలేజీలు సాధించిన మెరుగైన ఫలితాలతో వాటి పరపతి మరింత పైకి ఎగబాకుతోంది. తాజాగా ఈ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సైతం రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 19 బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలో నాలుగు కోర్సులకు సంబంధించి 160 చొప్పున 3,040 సీట్లున్నాయి. వీటికి సంబంధించి రెండ్రోజుల క్రితం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. నాలుగు కోర్సులకు సంబంధించి 24,327 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీసీ కేటగిరీలో 11 వేల మంది, బైపీసీలో 10 వేల మంది, సీఈసీలో 3 వేల మంది, ఎంఈసీలో దాదాపు వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు బీసీ గురుకులాల సొసైటీ ఈ నెల 26న రాతపరీక్ష నిర్వహించనుంది. సొసైటీ వెబ్సైట్లో విద్యార్థులకు హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. రాతపరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు పేర్కొన్నారు. డిగ్రీ కాలేజీల్లోనూ... మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సొసైటీ పరిధి లో రెండు మహిళా డిగ్రీ కాలేజీలున్నాయి. వీటి పరి ధిలో డిగ్రీ ఫస్టియర్ కేటగిరీలో 240 సీట్లకు సంబం ధించి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ గతవారం ముగిసింది. 5,589 మంది విద్యార్థులు దరఖాస్తు లు సమర్పించారు. వీరికి రాతపరీక్ష ఈ నెల 26నే నిర్వహించేందుకు సొసైటీ ఏర్పాట్లు చేసింది. హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
గురుకుల కళాశాలల్లో మెరుగైన ఫలితాలు
ఉట్నూర్ : ఐటీడీఏ పరిధిలోని గురుకుల కళాశాలలు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫలితాలు గతేడాతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాయి. గతేడాది 56.89 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 2014-15 విద్యా సంవత్సరంలో 87.42 శాతం సాధించాయి. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇచ్చోడ, ఉట్నూర్, ఆసిఫాబాద్ బాలికల కళాశాలలు, ఆదిలాబాద్, నార్నూర్, లాల్టెక్డి బాలుర కళాశాలలు కలిపి మొత్తం ఆరు కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 779 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరు కాగా.. 681 మంది ఉత్తీర్ణత సాధించారు. 98 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇచ్చోడ బాలికల కళాశాల అత్యధికంగా 99.13 శాతం సాధించి మొదటి స్థానంలో నిలువగా.. రెండో స్థానంలో నార్నూర్ బాలుర కళాశాల 96.48 శాతం సాధించింది. ఆదిలాబాద్ బాలుర కళాశాల 68 శాతం సాధించి చివరి స్థానంలో నిలిచింది.