న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్ల (ఎస్‌ఈజడ్) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎగుమతులు భారీగా 41.5 శాతం పెరిగాయి. విలువలో ఇది 2.15 లక్షల కోట్లు. ఔషధాలు, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి.
దేశం మొత్తం ఎగుమతుల్లో నాల్గవ వంతు ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి జరుగుతుండడం గమనార్హం. 2019–20లో ఎస్‌ఈజడ్‌ల నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల విలువ రూ.7.97 లక్షల కోట్లు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020–21లో 7.56 లక్షల కోట్లకు తగ్గింది.
జోన్ల పరిస్థితి ఇదీ...
దేశంలో మొత్తం 427 జోన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర ఉంది. అయితే జూన్ 30వ తేదీ నాటికి వీటిలో 267 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2021 జూన్ 30వ తేదీ నాటికి ప్రత్యేక జోన్లపై రూ.6.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది. వీటిలో దాదాపు 24.47 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. జోన్ల నుంచి ఎగుమతుల భారీ పెరుగుదలకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి– ఈపీసీఈఎస్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. మండలికి భవనేశ్ సేథ్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు.
దేశం ఎగుమతులు ఇలా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు దేశం లక్ష్యం. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశ ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య ఎగుమతులు 74.5 శాతం పెరిగి 130.82 బిలియన్ డాలర్లకు చేరాయి. మరో ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టు–మార్చి 2022) 269.44 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది.
అంటే నెలకు సగటును 33.68 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాల్సి ఉంది. కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో 2020 మార్చి నుంచి వరుసగా ఆరు నెలలు ఆగస్టు వరకూ ఎగుమతులు క్షీణతను చూశాయి. అయితే సెప్టెంబర్‌లో వృద్ధిబాటలోకి వచ్చినా, మళ్లీ మరుసటి రెండు నెలలూ (అక్టోబర్–నవంబర్) క్షీణతలోకి జారిపోయాయి. తిరిగి 2020 డిసెంబర్‌లో స్వల్పంగా 0.14 శాతం వృద్ధి నమోదయ్యింది. అప్పటి నుంచీ వృద్ధి బాటలోనే ఎగుమతులు పయనిస్తున్నాయి. 2020–21 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ చూస్తే, ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, మరింత పెరగనున్న ఇళ్ల కొనుగోళ్లు
Comments
Please login to add a commentAdd a comment