మార్కెట్‌ను దెబ్బకొట్టే ధరలతో లాభమేంటి?
వాణిజ్య మంత్రి గోయల్ విమర్శలు
చిన్న రిటైలర్ల మార్కెట్‌ను కొల్లగొట్టడంపై ఆందోళన
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం కొనసాగించడానికే అమెజాన్ తాజా పెట్టుబడులు చేస్తుందని, ఇందులో సంబరపడాల్సిందేమీ లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెజాన్ తన పెట్టుబడులతో భారత్‌లోని సేవల రంగానికి, ఆర్థిక వ్యవస్థకు చేసిందేమీ లేదన్నారు. పనిలో పనిగా ఈ–కామర్స్ పరిశ్రమ లక్షలాది రిటైలర్ల ఉపాధిని దెబ్బతీస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్‌లో బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అమెజాన్ చేసిన ప్రకటన పట్ల సంతోషించాల్సిందేమీ లేదన్నారు. భారత వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికే తాజా పెట్టుబడులను తీసుకొస్తున్నట్టు వ్యాఖ్యానించారు.
కొల్లగొట్టే ధరల విధానాన్ని ఈ నష్టాలు సూచిస్తున్నాయంటూ.. ఇది భారత్‌కు ఎంత మాత్రం మేలు చేయబోదని, చిన్న వర్తకులను దెబ్బతీస్తుందన్నారు. ‘ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సంక్షేమంపై ఈ–కామర్స్ రంగం చూపించే నికర ప్రభావం’ పేరుతో ఓ నివేదికను మంత్రి బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దేశంలో చిన్న రిటైలర్ల ఉపాధిని దెబ్బతీసే ఈ–కామర్స్ కంపెనీల వ్యాపార నమూనాను మంత్రి ప్రశ్నించారు.
ఈ–రిటైలర్లతో 1.58 కోట్ల ఉద్యోగాలు
ఆన్‌లైన్ వర్తకులు దేశంలో 1.58 కోట్ల మందికి ఉపాధి కల్పించినట్టు మంత్రి గోయల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో 35 లక్షల మంది మహిళలు ఉన్నట్టు, 17.6 లక్షల రిటైల్ సంస్థలు ఈ –కామర్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదికను పహలే ఇండియా ఫౌండేషన్ (పీఐఎఫ్) విడుదల చేసింది. భారత్‌లో ఉపాధి కల్పన పరంగా, కస్టమర్ల సంక్షేమం పరంగా (మెరుగైన అనుభవం) ఈ–కామర్స్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ–కామర్స్ తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. టైర్–3 పట్టణాల్లోని వినియోగదారులు నెలవారీగా రూ.5,000కు పైనే ఆన్‌లైన్ షాపింగ్‌పై ఖర్చు చేస్తున్నట్టు వివరించింది. ఉపాధిపై ఈ–కామర్స్ రంగం చూపిస్తున్న ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 2,062 మంది ఆన్‌లైన్ వర్తకులు, 2,031 ఆఫ్‌లైన్ వర్తకులు, 8,209 మంది వినియోగదారుల అభిప్రాయాలను పీఐఎఫ్ తెలుసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment