ఇరవై ఏళ్లలో బ్రెడ్ ధర రెండింతలు పెరిగింది, కానీ గోధుమల ధర సగానికి తగ్గింది. రైతులను మినహాయిస్తే అందరినీ సంతోషపెట్టే ఏర్పాటు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఓవైపు రైతుల ఆదాయం పడిపోతుంటే, మరోవైపు కార్పొరేట్లు మాత్రం లాభార్జన చేస్తున్నాయి. భారత దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. 45.5 శాతం మంది శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తూ, వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చడం ఈ కాలపు అవసరం. 2024–25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాయత్తమవుతున్న తరుణంలో, వ్యవసాయాన్ని పునర్నిర్మించే రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరమో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
‘పంజాబ్ ఫార్మర్స్ అండ్ ఫార్మ్ వర్కర్స్ కమిషన్’ మాజీ చైర్‌పర్సన్ అజయ్ వీర్ జాఖడ్ ఇటీవల ట్వీట్ చేస్తూ, ‘ఇరవై ఏళ్ల క్రితం, స్విట్జర్లాండ్‌లో బ్రెడ్ ధర 2.5 స్విస్ ఫ్రాంకులు, గోధుమ ధర కిలోకు 110 స్విస్ ఫ్రాంకులు ఉండేది. ఇప్పుడు బ్రెడ్ ధర 4 ఫ్రాంకులు కాగా, గోధుమల ధర కిలోకు 50 ఫ్రాంకులు అయింది’ అన్నారు. కొంతకాలం క్రితం, నేను కూడా కెనడా నుండి ఒక ఉదాహరణను షేర్ చేశాను. గత 150 సంవత్సరాలుగా కెనడాలో గోధుమ ధరలు పడిపోతున్నాయి, కానీ గత నాలుగు దశాబ్దాలుగా బ్రెడ్ ధరలు పెరుగుతూ వచ్చాయి.
వ్యవసాయ ఉత్పాదక ధరల తగ్గుదలకు సంబంధించి ఈ ఆందోళనకరమైన ధోరణి స్విట్జర్లాండ్, కెనడాకు మాత్రమే కాదు, కాస్త ఎక్కువ లేదా తక్కువగా ప్రపంచమంతటా ఇలాగే ఉంటోంది. ఒక శతాబ్దానికి పైగా, వ్యవసాయ ధరలు బాగా పడిపోతున్నాయి. ఇది రైతులను ఆత్మహత్యలకు లేదా వ్యవసాయాన్ని వదిలేసేలా పురిగొల్పుతోంది. ఇది ఆహార అసమానత్వమే.
స్థోమత లేని పోషకులు
ఆహారాన్ని ఉత్పత్తి చేసేవారు నిరంతరం పేదరికంలో జీవిస్తున్నారు. తరచుగా, వ్యవసాయ ధరలు తక్కువగా ఉండటమే కాకుండా ఉత్పత్తి ఖర్చు కూడా రైతులకు దక్కడం లేదు. విషాదమేమిటంటే, మన పళ్లేల దగ్గరికి ఆహారం తెచ్చేవారికి తమను తాము పోషించుకునే స్థోమత ఉండటం లేదు. తమను ‘అన్నదాత’లు అని పిలిచినప్పుడు రైతులు సులభంగా ఉప్పొంగిపోతారు; వ్యవసాయ సరఫరా గొలుసులోని ఇతర వాటాదారులు మాత్రం లాభాల్లో మునిగితేలుతారు.
రైతులు కష్టాల్లో కూరుకుపోతూ, గ్రామీణ వేతనాలు స్తబ్ధుగా ఉంటున్నప్పడు కూడా విచ్ఛిన్నమైన ఆహార వ్యవస్థ వినియోగదారులను మాత్రం సంతోషంగా ఉంచింది. ఆహార ధరలను ఉద్దేశపూర్వకంగా తక్కువగా ఉంచడం, ఏటికేడూ వాటి ధరలను ఇంకా తగ్గించి వేయటం... అదే సమయంలో అధిక లాభాలను పొందడం (దీనిని విక్రేత లాభమని ఇప్పుడు పిలుస్తున్నారు) అనేది వ్యవసాయ వ్యాపార సంస్థలను సంతోషంలో ముంచెత్తుతోంది.
పెరుగుతున్న వేతనాలు, ధరల వల్ల సరఫరా వ్యవస్థకు అడ్డంకులు పెరుగుతాయని కార్పొరేట్లు నిందించినప్పటికీ, అమెరికాలో ఉదాహరణకు, 2023 సంవత్సరం రెండవ, మూడవ త్రైమాసికాల్లో, కార్పొరేట్ లాభాలు ద్రవ్యోల్బణంలో 53 శాతానికి ఆజ్యం పోశాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా, కోవిడ్ మహమ్మారి తర్వాత కార్పొరేట్ లాభాలు మరింతగా పెరిగాయి. 2023 చివరి త్రైమాసికం నాటికి ఇది రికార్డు స్థాయికి చేరుకుంది. మహమ్మారికి ముందు నాలుగు దశాబ్దాలలో, ద్రవ్యోల్బణానికి కార్పొరేట్ లాభాల సహకారం కేవలం 11 శాతం మాత్రమే.
ఒకటిన్నర శతాబ్దానికి పైగా, మన ఆర్థిక విధానాల రూపకల్పన రైతులకు సరైన ధరలను నిరాకరించింది. వ్యవసాయ రంగంలో ముదిరిపోతున్న సంక్షోభం పట్ల విధాన నిర్ణేతలు కళ్ళుమూసుకోవడంతో, గ్రామీణ ప్రాంత ఆగ్రహం ఎన్నికల సీజన్ లో మాత్రమే నొక్కి చెప్పబడుతోంది. ‘భారత ప్రభుత్వం రైతులకు రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటిస్తుంటుంది, కానీ వాస్తవానికి వారినే బాధపెడుతుంది’ (ది ఎకనామిస్ట్, 2018 జూలై 12) అనే కథనం ఆసక్తికరమైన అంతర్దృష్టిని అందిస్తుంది.
ధనిక వాణిజ్య కూటమి అయిన ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) దేశాలు ఉత్పత్తిదారులకు వ్యవసాయ ఆదాయంలో 18 శాతానికి సమానమైన మొత్తాన్ని అందజేస్తుండగా, భారతదేశం వాస్తవానికి వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించడంతో సరిపెట్టింది.
సాయం చేయని సాంకేతికత
2024–25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాయత్తమవుతున్న తరుణంలో, రైతులలో పెరుగుతున్న ఆగ్రహాన్ని చల్లార్చడమే కాకుండా వ్యవసాయాన్ని పునర్నిర్మించే రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరమో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా, ఆర్థికవేత్త జీన్ డ్రేజ్ పేర్కొన్న ఒక విషయాన్ని గుర్తుంచుకోండి.
‘‘భారతదేశంలో రాజకీయ చర్చలు సాధారణంగా ప్రత్యేకాధికారులు, శక్తిమంతులు నిర్దేశించిన కొన్ని సరిహద్దుల్లోనే జరుగుతాయి. మీరు ఈ సరిహద్దులను అధిగమించినట్లయితే, ఇబ్బందిని ఎదుర్కొంటారు’’. వ్యవసాయానికి ‘అవుటాఫ్ ద బాక్స్ థింకింగ్’ అవసరం. అయితే అది పాలించే ఉన్నత వర్గాన్ని చాలావరకు కలవరపెట్టవచ్చు.
ఈ అన్ని సంవత్సరాలలో, సాంకేతిక జోక్యాలకు మరింత బడ్జెట్ మద్దతును అందివ్వడమే వ్యవసాయ ఆదాయాలను పెంచడానికి ప్రధాన మార్గంగా ఉంటూ వచ్చింది. డిజిటలీకరణ, కృత్రిమ మేధ, రోబోటిక్స్, కచ్చితమైన వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ, తద్వారా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ ఒడిలోకి తీసుకువస్తున్నప్పటికీ, వ్యవసాయం చుట్టూ ఉన్న పరిశ్రమకు ఇటువంటి బడ్జెట్ మద్దతుతో అపారమైన ప్రయోజనం ఉంది. అదే సమయంలో రైతులు మరింత దుఃస్థితిలోకి కూరుకుపోవడం కొనసాగుతోంది.
హరిత విప్లవం సాగిన 60 ఏళ్ల తర్వాత కూడా వ్యవసాయ ఆదాయాలు పిరమిడ్‌లో అట్టడుగునే కొనసాగితే, వ్యవసాయ విప్లవం 4.0 వైపు సాంకేతిక పరివర్తనను చేపడతామని చేస్తున్న వాగ్దానాన్ని, వ్యవసాయాన్ని పట్టి పీడిస్తున్న అన్ని రుగ్మతలకు దివ్యౌషధంగా చూడలేము. ఎప్పటిలాగే, విధాన నిర్ణేతలు మరోసారి వ్యవసాయ కష్టాలకు నిజమైన కారణాన్ని (వ్యవసాయ ఆదాయాలు పడిపోవడం), సాంకేతిక జోక్యాలు ఆదాయాన్ని పెంచుతాయనే లోపభూయిష్ట ఆలోచనతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు.
‘ప్రపంచం వేడెక్కిపోతున్న’ స్థితిలో, పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతుల నుండి స్థితిస్థాపక వ్యవసాయం వస్తుంది. కృత్రిమ మేధస్సు కంటే ముందుగా అందుబాటులో ఉన్న సహజ మేధస్సును ఉపయోగించుకోవడం అవసరం. వ్యవసాయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో, వ్యవసాయంలో నిమగ్నమైన మానవ జనాభా సామర్థ్యాన్ని పెంచడానికి మొదటగా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం.
దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయమే. 45.5 శాతం మంది శ్రామికశక్తికి ఉపాధి కల్పిస్తూ, వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చడం ఈ కాలపు అవసరం. వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో తోడ్పడే పరిశ్రమకు సహాయం చేయాలనే సాంప్రదాయిక ఆలోచన (ట్రికిల్–డౌన్ సూత్రానికి అనుగుణంగా) ఇప్పుడు పని చేసే అవకాశం లేదు.ఆహార అసమానతలను తొలగించడానికి, తాజా ఆలోచనలు అవసరం.
ముందుగా, ఎంఎస్ స్వామినాథన్ సూత్రం ప్రకారం వ్యవసాయ ధరలకు హామీ ఇవ్వడానికి చట్టపరమైన యంత్రాంగాన్ని అందించాలి; రెండవది, బడ్జెట్‌లో 50 శాతాన్ని జనాభాలో దాదాపు సగం మందికి కేటాయించేలా ఆర్థిక మంత్రి చూడాలి. దీనికోసం, వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం మొత్తం బడ్జెట్‌లో 10 శాతం పెంచడం ప్రారంభించాలి. ప్రస్తుతం ఇది 3 శాతం కంటే తక్కువగా ఉంది.
- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు
ఈ–మెయిల్: hunger55@gmail.com
- దేవీందర్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment