ఈ ఏడాది కూడా వృద్ధి వేగవంతమే
ఆశాజనకంగా మూడో త్రైమాసికం గణాంకాలు
వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో అనిశి్చతులు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తిరిగి గాడిన పడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు, వృద్ధికి సంబంధించి చర్యలు, మౌలిక వసతులపై ఖర్చు చేయడం సహజంగానే తగ్గుతాయి. ప్రస్తుత త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో పండుగల వ్యయాలకుతోడు, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి పుంజుకోవడం, మౌలిక వసతులపై వ్యయాలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వచ్చే మార్చి చివరికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాం’’అని టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన సదస్సులో భాగంగా మంత్రి గోయల్ చెప్పారు.
తయారీ, మైనింగ్ రంగాల్లో బలహీన పనితీరుతో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఇది ఆందోళన కలిగిస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు గోయల్‌పై విధంగా బదులిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో వృద్ధి 8.1 శాతంగా ఉండడం గమనించొచ్చు. చివరిగా 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో జీడీపీ 4.3 శాతం కనిష్ట వృద్ధి రేటును నమోదు చేసింది.
అయినా వేగవంతమే..
ఇప్పటికీ ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గోయల్ చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు, ఆవిష్కరణలు దేశ వృద్ధి రేటును నడిపిస్తాయన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.6 శాతమే కావడం గమనార్హం. ప్రతిపక్ష పారీ్టలు చేస్తున్న తప్పుడు, ప్రతికూల ప్రచారం దేశ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోలేవన్నారు. ‘‘వక్ఫ్ బిల్లు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుల ఆమోదానికి కట్టుబడి ఉన్నాం. ఇవి నిర్మాణాత్మక మార్పులు. దేశానికి మంచి చేసే వీటి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం’’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment