Country Economic growth
-
జీడీపీ.. ప్చ్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ3లోనూ (2024 అక్టోబర్–డిసెంబర్) బలహీన ధోరణి ప్రదర్శించింది. జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైంది. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో నమోదైన ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.6 శాతం (తాజా సవరణకు ముందు 5.4 శాతం) నుంచి, డిసెంబర్ క్వార్టర్లో 6.2 శాతానికి పుంజుకున్నప్పటికీ.. క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)క్యూ3లో నమోదైన 9.5 శాతం రేటుతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. అంతేకాదు, ఆర్బీఐ అంచనా 6.8 శాతం కంటే కూడా తక్కువగానే నమోదైంది. తయారీ, మైనింగ్ రంగాల పనితీరు బలహీనపడడం వృద్ధి రేటును తక్కువ స్థాయికి పరిమితం చేసింది. పట్టణ వినియోగం కూడా బలహీనంగానే కొనసాగింది. అదే సమయంలో వ్యవసాయ రంగం పటిష్ట పనితీరుకుతోడు ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచడం.. మెరుగైన వర్షాలకుతోడు పండుగల సీజన్లో గ్రామీణ వినియోగం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలి చాయి. డిసెంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసింది. నాలుగేళ్ల కనిష్టం.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5% వృద్ధిని (స్థిర కరెన్సీలో రూ.188 లక్షల కోట్లు) సాధిస్తుందని ఎన్ఎస్వో తన ద్వితీయ ముందస్తు అంచనాల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో వేసిన తొలి ముందస్తు అంచనాల్లో ఇది 6.4 శాతంగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ ఇది నాలుగేళ్ల కనిష్ట వృద్ధి కానుంది. క్రితం ఆర్థిక సంవత్సరం 9.2 శాతం కంటే కూడా తక్కువ. ఎన్ఎస్వో తాజా అంచనాల మేరకు జీడీపీ 6.5 శాతానికి పుంజుకోవాలంటే చివరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగైన పనితీరు చూపించాల్సి ఉంటుంది. రంగాల వారీ పనితీరు.. → స్థూల విలువ జోడింపు (జీవీఏ/ఆర్థిక కార్యకలాపాల తీరు) డిసెంబర్ త్రైమాసికంలో 6.2 శాతంగా నమోదైంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.6 శాతంగా ఉంది. → వ్యవసాయ రంగం ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయికి పుంజుకున్నది. డిసెంబర్ త్రైమాసికంలో ఐదు రెట్లు బలపడి 5.6 శాతం వృద్ధిని చూపించింది. అంతకుముందు త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) ఇది 4.1 శాతంగా ఉంటే, క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు 1.5 శాతమే కావడం గమనించొచ్చు. → తయారీ రంగంలో వృద్ధి సెపె్టంబర్ క్వార్టర్లో ఉన్న 2.1 శాతం నుంచి డిసెంబర్ త్రైమాసికంలో 3.5 శాతానికి చేరింది. అయినప్పటికీ క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో 14 శాతం వృద్ధి రేటుతో పోల్చి చూస్తే చాలా తక్కువే. → మైనింగ్‌లో వృద్ధి 1.4%కి పడిపోయింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది 4.7%. → సేవల రంగం వృద్ధి రేటు క్యూ3లో 7.4 శాతానికి మెరుగుపడింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది 8.3 శాతం కావడం గమనార్హం. క్యూ4లో బలమైన పనితీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకోవడంతోపాటు, ఎగుమతులు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయి. – అనంత నాగేశ్వరన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు -
యువత ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యుక్తవయస్కుల ఆరోగ్య సంరక్షణ కోసం మరిన్ని నిధులు వెచ్చించాలని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక సూచించింది. తద్వారా ప్రతీ డాలర్ వ్యయంపై 4.6 నుంచి 71.4 డాలర్ల స్థాయిలో ప్రతిఫలం లభిస్తుందని అంచనా వేసింది. ఇందుకోసం ప్రభుత్వం, ప్రవేటు రంగం నుంచి సహకారం అవసరమని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, మేటర్నల్, న్యూబోర్న్ అండ్ చైల్డ్ హెల్త్ (పీఎంఎన్‌సీహెచ్) సహకారంతో ఈ నివేదిక రూపొందించింది. యుక్త వయస్కుల (కౌమరదశ/10–19 ఏళ్లు) ఆరోగ్యంపై చేసే పెట్టుబడులతో జీడీపీ ఏటా 10 శాతం మేర పుంజుకుంటుందని అంచనా వేసింది. హెచ్‌పీవీ టీకా, టీబీ చికిత్స, మయోపియా గుర్తింపు–చికిత్సకు 2024–2035 మధ్య ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. 2024–2050 మధ్య కాలంలో విద్య, ఉపాధి, బాల్య వివాహాల తగ్గింపు, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని సూచించింది. ఇలా యుక్త వయసు్కల ఆరోగ్యంపై చేసే పెట్టుబడులతో పెద్ద ఎత్తన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అభిప్రాయపడింది. దేశ భవిష్యత్తులో కీలక పాత్ర.. ‘‘ఈ తరహా భవిష్యత్ పెట్టుబడులు దేశ జీడీపీని సగటున ఏటా 10 శాతం మేర పెరిగేలా చేస్తాయి.ప్రభుత్వం, ప్రైవేటు రంగం, పౌర సమాజం, కమ్యూనిటీలు, కుటుంబాలు కలసి ఏటా ఇందుకోసం చేసే 33 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏటా 476 బిలియన్ డాలర్ల ప్రయోజనాలు ఒనగూడతాయి’’అని ఈ నివేదిక తెలిపింది. ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాలను అరికట్టడంపై చేసే ప్రతీ డాలర్ పెట్టుబడికి 4.6 డాలర్ల నుంచి 71.4 డాలర్ల వరకు ప్రతిఫలం వస్తుందని పేర్కొంది. -
వృద్ధి తిరిగి ట్రాక్‌లోకి వస్తుంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో అనిశి్చతులు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తిరిగి గాడిన పడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు, వృద్ధికి సంబంధించి చర్యలు, మౌలిక వసతులపై ఖర్చు చేయడం సహజంగానే తగ్గుతాయి. ప్రస్తుత త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో పండుగల వ్యయాలకుతోడు, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి పుంజుకోవడం, మౌలిక వసతులపై వ్యయాలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వచ్చే మార్చి చివరికి తిరిగి ట్రాక్‌లోకి వస్తాం’’అని టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన సదస్సులో భాగంగా మంత్రి గోయల్ చెప్పారు. తయారీ, మైనింగ్ రంగాల్లో బలహీన పనితీరుతో సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఇది ఆందోళన కలిగిస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు గోయల్‌పై విధంగా బదులిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వృద్ధి 8.1 శాతంగా ఉండడం గమనించొచ్చు. చివరిగా 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో జీడీపీ 4.3 శాతం కనిష్ట వృద్ధి రేటును నమోదు చేసింది. అయినా వేగవంతమే.. ఇప్పటికీ ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గోయల్ చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు, ఆవిష్కరణలు దేశ వృద్ధి రేటును నడిపిస్తాయన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.6 శాతమే కావడం గమనార్హం. ప్రతిపక్ష పారీ్టలు చేస్తున్న తప్పుడు, ప్రతికూల ప్రచారం దేశ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోలేవన్నారు. ‘‘వక్ఫ్ బిల్లు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుల ఆమోదానికి కట్టుబడి ఉన్నాం. ఇవి నిర్మాణాత్మక మార్పులు. దేశానికి మంచి చేసే వీటి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం’’అని చెప్పారు. -
మూడో భారీ ఎకానమీ దిశగా భారత్!
న్యూయార్క్: భారత్ త్వరలో మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో దేశ ఆరి్థక వృద్ధిలో భాగమవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికన్ దిగ్గజ సంస్థల సీఈవోలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారం చేపట్టిన మూడో విడత కాలంలో (2024–29) భారత్‌ను భారీ ఎకానమీల్లో మూడో స్థానానికి చేర్చేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 3.9 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ అయిదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక, సాంకేతికత ప్రగతితో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీలకు ప్రధాని సూచించారు. యావత్ ప్రపంచం కోసం ఉత్పత్తులు, సేవలను రూపొందించేందుకు, ఉత్పత్తి చేసేందుకు భారత్‌తో చేతులు కలపాలని ఆయన పేర్కొన్నారు. మేధోహక్కుల పరిరక్షణకు, టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తయారీ, సెమీకండక్టర్లు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘సెమీకండక్టర్ల తయారీకి గ్లోబల్ హబ్’గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ‘టెక్ సీఈవోలతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. టెక్నాలజీ, నవకల్పనలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. ఆయా విభాగాల్లో భారత పురోగతిని వివరించాను’ అని ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వహించిన సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఎడోబ్ సీఈవో శంతను నారాయణ్, యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన విధానాలతో భారత్, అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందని సీఈవోలు కితాబిచ్చారు. ఎన్విడియా, గూగుల్ మరింత ఫోకస్ భారత్‌పై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు గూగుల్, ఎన్విడియా తదితర టెక్ దిగ్గజాలు వెల్లడించాయి. దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ పెట్టనున్నట్లు మోదీతో భేటీ అనంతరం సీఈవోలు తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్ ద్వారా భారత్‌లో పరివర్తన తేవడంపై ప్రధాని దృష్టి పెట్టారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం వంటి విభాగాల్లో వినూత్న సొల్యూషన్స్ రూపొందించాలని ఆయన సూచించారు. భారత్‌లో ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరింతగా కలిసి పనిచేయడంపై ఆసక్తిగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. భారత్‌తో తమకు ఇప్పటికే వివిధ విభాగాల్లో భాగస్వామ్యం ఉందని, అధునాతన టెక్నాలజీ లను అందుబాటులోకి తెస్తున్నామని ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ తెలిపారు. -
ఆర్థిక నిర్ణయాల్లో రాజకీయాలొద్దు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక వృద్ధిరేటుకు సంబంధించిన కీలక నిర్ణయాలను రాజకీయాల నుంచి వేరు చేయాలని ఇండస్ట్రీ అసోసియేషన్ అసోచామ్ డిమాండ్ చేసింది. కీలకమైన ఆర్థిక నిర్ణయాల విషయాల్లో పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కకు పెట్టి దేశ వృద్ధికి తోడ్పడాలని అసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోరియా పేర్కొన్నారు. కేవలం అధికార, ప్రతిపక్ష పార్టీల మొండి పట్టుదల వల్ల కీలకమైన జీఎస్టీ బిల్లు ఆరేళ్ల నుంచి ఆమోదం పొందలేకపోతోందని, దీనివల్ల దేశప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే ఇండియా దేశ ఆర్థిక వృద్ధిరేటు 1.5 శాతం నుంచి 2 శాతం వృద్ధి చెందుతుందని, ముఖ్యంగా తయారీ రంగం వేగంగా విస్తరించడం ద్వారా అనేకమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇందుకు అవసరమైతే పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమై జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం కాకుండా పన్నులు విధించుకోవడానికి రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తే జీఎస్టీ ముఖ్యోద్దేశ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఈ ఏడాది ఆర్థిక వృద్ధిరేటు 7.4 శాతం, వచ్చే ఏడాది 8 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇన్ఫ్రా కోలుకుంటోంది... ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇన్ఫ్రా రంగం కోలుకుంటోందని, ఒకటి రెండు నెలల్లో చాలా కంపెనీల్లో ఈ ప్రతిఫలాలు కనిపిస్తాయని సునీల్ పేర్కొన్నారు. పలు ఇన్ఫ్రా ప్రాజెక్టులు వివాదాల్లో కూరుకుపోవడం వల్ల సుమారు రూ. 5 లక్షల కోట్లు ఆర్బిట్రేషన్‌లో ఇరుక్కుపోయాయని, ఒక్కసారి ఆర్బిట్రేషన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే ఈ నిధులు ఇన్ఫ్రా కంపెనీలకు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగురాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయన్నారు. డెక్కన్ క్రానికల్ పునర్ వ్యవస్థీకరణ: శ్రేయి ఇన్ఫ్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్)ను పునర్ వ్యవస్థీకరించే ఆలోచనలో ఉన్నట్లు శ్రేయి ఇన్ఫ్రా ప్రకటించింది. డీసీహెచ్ఎల్లో 24 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న శ్రేయి ఇన్ఫ్రా, రుణాలు ఇచ్చిన ఇతర సంస్థలతో కలిసి కంపెనీని పునర్ వ్యవస్థీకరించనున్నట్లు తెలి పింది. హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సునీల్ కనోరియా మాట్లాడుతూ కోర్టు అనుమతులతో కంపెనీని పునర్ వ్యవస్ధీకరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కంపెనీ యాజమాన్య వ్యవస్థను మరింత పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. డీసీహెచ్‌ఎల్‌కి ఇచ్చిన రూ. 220 కోట్ల రుణాన్ని రాబట్టుకోవడానికి శేయి ఇన్ఫ్రా డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. డీఆర్టీ ఆదేశాల మేరకు డీసీహెచ్ఎల్ గత జనవరిలో 6.6 కోట్ల షేర్లను జారీ చేయడంతో శ్రేయి వాటా 24 శాతానికి పెరిగింది. తప్పుడు పత్రాలను పెట్టి రుణాలను తీసుకున్నందుకు కెనరా బ్యాంక్ సీబీఐని ఆశ్రయించగా, ఆంధ్రా బ్యాంక్ కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం డీసీహెచ్‌ఎల్‌కి సుమారు రూ. 4,000 కోట్ల అప్పులున్నాయి.