ఆర్థిక నిర్ణయాల్లో రాజకీయాలొద్దు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక వృద్ధిరేటుకు సంబంధించిన కీలక నిర్ణయాలను రాజకీయాల నుంచి వేరు చేయాలని ఇండస్ట్రీ అసోసియేషన్ అసోచామ్ డిమాండ్ చేసింది. కీలకమైన ఆర్థిక నిర్ణయాల విషయాల్లో పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కకు పెట్టి దేశ వృద్ధికి తోడ్పడాలని అసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోరియా పేర్కొన్నారు. కేవలం అధికార, ప్రతిపక్ష పార్టీల మొండి పట్టుదల వల్ల కీలకమైన జీఎస్‌టీ బిల్లు ఆరేళ్ల నుంచి ఆమోదం పొందలేకపోతోందని, దీనివల్ల దేశప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
జీఎస్‌టీ అమల్లోకి వస్తే ఇండియా దేశ ఆర్థిక వృద్ధిరేటు 1.5 శాతం నుంచి 2 శాతం వృద్ధి చెందుతుందని, ముఖ్యంగా తయారీ రంగం వేగంగా విస్తరించడం ద్వారా అనేకమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇందుకు అవసరమైతే పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమై జీఎస్‌టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం కాకుండా పన్నులు విధించుకోవడానికి రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తే జీఎస్‌టీ ముఖ్యోద్దేశ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఈ ఏడాది ఆర్థిక వృద్ధిరేటు 7.4 శాతం, వచ్చే ఏడాది 8 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇన్‌ఫ్రా కోలుకుంటోంది...
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇన్‌ఫ్రా రంగం కోలుకుంటోందని, ఒకటి రెండు నెలల్లో చాలా కంపెనీల్లో ఈ ప్రతిఫలాలు కనిపిస్తాయని సునీల్ పేర్కొన్నారు. పలు ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు వివాదాల్లో కూరుకుపోవడం వల్ల సుమారు రూ. 5 లక్షల కోట్లు ఆర్బిట్రేషన్‌లో ఇరుక్కుపోయాయని, ఒక్కసారి ఆర్బిట్రేషన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే ఈ నిధులు ఇన్‌ఫ్రా కంపెనీలకు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగురాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
డెక్కన్ క్రానికల్ పునర్ వ్యవస్థీకరణ: శ్రేయి ఇన్‌ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్)ను పునర్ వ్యవస్థీకరించే ఆలోచనలో ఉన్నట్లు శ్రేయి ఇన్‌ఫ్రా ప్రకటించింది. డీసీహెచ్‌ఎల్‌లో 24 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉన్న శ్రేయి ఇన్‌ఫ్రా, రుణాలు ఇచ్చిన ఇతర సంస్థలతో కలిసి కంపెనీని పునర్ వ్యవస్థీకరించనున్నట్లు తెలి పింది. హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సునీల్ కనోరియా మాట్లాడుతూ కోర్టు అనుమతులతో కంపెనీని పునర్ వ్యవస్ధీకరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
కంపెనీ యాజమాన్య వ్యవస్థను మరింత పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. డీసీహెచ్‌ఎల్‌కి ఇచ్చిన రూ. 220 కోట్ల రుణాన్ని రాబట్టుకోవడానికి శేయి ఇన్‌ఫ్రా డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. డీఆర్‌టీ ఆదేశాల మేరకు డీసీహెచ్‌ఎల్ గత జనవరిలో 6.6 కోట్ల షేర్లను జారీ చేయడంతో శ్రేయి వాటా 24 శాతానికి పెరిగింది. తప్పుడు పత్రాలను పెట్టి రుణాలను తీసుకున్నందుకు కెనరా బ్యాంక్ సీబీఐని ఆశ్రయించగా, ఆంధ్రా బ్యాంక్ కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం డీసీహెచ్‌ఎల్‌కి సుమారు రూ. 4,000 కోట్ల అప్పులున్నాయి.