జీఎస్‌టీపై కొత్త డిమాండ్లు
♦ రైల్వే, రోడ్లను మినహాయించాలన్న అసోచామ్
♦ వైద్యం ఖరీదవుతుంది: అపోలో
♦ భారం కానున్న ఆర్థిక సేవలు
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుకు గడువు మరో పది రోజులే మిగిలి ఉండగా, కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. రోడ్లు, రైల్వేలను తప్పనిసరిగా జీఎస్టీ నుంచి మినహాయించాలని అసోచామ్ తాజాగా కేంద్రాన్ని కోరింది. ఈ విభాగాల్లో ప్రాజెక్టులు ఫలితాలనిచ్చేందుకు సుదీర్ఘ సమయం తీసుకోవడంతోపాటు, ప్రతికూల రాబడుల నేపథ్యంలో మినహాయింపు అవసరమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు ఓ ప్రతిపాదన పంపింది. ప్రస్తుత ప్రాజెక్టులకు మినహాయింపులు ఎత్తివేయడం వల్ల వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ప్రస్తుతమున్న మినహాయింపులను ఎత్తివేసేట్టు అయితే జీఎస్టీలో కాంట్రాక్టు విలువపై జీరో రేటింగ్ వంటి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని అభ్యర్థించింది.
దీనివల్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అదనపు పన్ను భారం పడకుండా ఉంటుందని వివరించింది. ‘‘ప్రస్తుతం రహదారులపై ప్రయాణికుల నుంచి వసూలు చేసే టోల్‌కు, రహదారుల నిర్మాణం, నిర్వహణకు గాను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి అందుకునే కాంట్రాక్టు మొత్తాలపై సేవా పన్ను మినహాయింపు ఉంది. జీఎస్టీలో రహదారులు, వంతెనల సేవలను పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ, ఈ తరహా మినహాయింపు ఎన్‌హెచ్‌ఏఐ నుంచి అందుకునే మొత్తాలపై లేదు’’ అని అసోచామ్ పేర్కొంది.
ఆరోగ్య సేవలపై పన్ను భారం: ప్రతాప్ సి రెడ్డి
జీఎస్టీ కారణంగా ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరిగిపోతాయని అపోలో హాస్పిటల్స్ పేర్కొంది. కొన్ని సేవలు, ఉత్పత్తులపై 15–18 శాతం పన్ను రేటు విధించడమే ఇందుకు కారణమని తెలిపింది. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ... ‘‘రెండు శాతం వరకు వ్యయాలు పెరిగితే వాటిని ఆస్పత్రులు సర్దుబాటు చేసుకోగలవు. అంతకు మించితే మాత్రం రోగులే వాటిని భరించాల్సి ఉంటుంది. మాకు జీఎస్టీ లేకపోయినా కొన్ని సేవలు, ఉత్పత్తులు 15–18 శాతం పన్ను పరిధిలో ఉండడం వల్ల భారం పడనుంది’’ అని వివరించారు.
క్రెడిట్ కార్డు బిల్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రియం
క్రెడిట్ కార్డు వినియోగదారులు, ఇన్సూరెన్స్ పాలసీదారులు జూలై 1 తర్వాత అదనంగా చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. క్రెడిట్ కార్డ్ బిల్లు, పాలసీ ప్రీమియంలపై ప్రస్తుతం 15 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండగా, జీఎస్టీలో 18 శాతం పన్ను అమలు కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు తమ కస్టమర్లకు అధిక చెల్లింపులపై అలర్ట్ మెస్సేజ్‌లు పంపడాన్ని ప్రారంభించాయి వీటిలో ఎస్‌బీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం టర్మ్ పాలసీ ప్రీమియం, యులిప్ పాలసీల్లో ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలపై 18 శాతం పన్ను భారం పడనుందని తన ఖాతాదారులకు పంపిన ఈమెయిల్‌లో తెలిపింది. ఇక సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలపై 1.88 శాతం పన్ను స్థానంలో 2.25 శాతం అమలు కానుంది. అన్ని ఆర్థిక సేవలు, టెలికం సేవలను సైతం 18 శాతం పన్ను పరిధిలో చేర్చిన విషయం తెలిసిందే.
ఆటోమొబైల్ రంగానికి కొత్త సవాలు
పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత భారత్‌స్టేజ్–4 ప్రమాణాల అమలు దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు సవాళ్లుగా నిలిచాయి. ఇప్పుడు జీఎస్టీ రూపంలో కొత్త సవాల్ ఎదురుకానుందన్న ఆందోళన నెలకొంది. జీఎస్టీతో తాత్కాలిక విఘాతం ఉంటుందని శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ ఎండీ ఉమేశ్ రేవంకర్ అన్నారు. కొత్త విధానానికి సర్దుబాటు అయ్యే వరకు వినియోగం తగ్గుముఖం పట్టొచ్చన్నారు. దీనివల్ల కొంత కాలం పాటు రవాణా చార్జీలు, వాణిజ్య వాహనాలపై ప్రభావం ఉంటుందన్నారు. మరోవైపు వాహన రుణాలపై సేవా పన్ను భారం సైతం పడనుంది. లోన్ ప్రాసెసింగ్ చార్జీలపై ప్రస్తుతమున్న 15 శాతం పన్ను జీఎస్టీ అనంతరం 18 శాతం కానుంది.