
క్యూ3లో వృద్ధి రేటు 6.2 శాతం
వ్యవసాయం మెరుగైన పనితీరు
పుంజుకున్న గ్రామీణ వినియోగం
పెరిగిన మూలధన వ్యయాలు
తయారీ, సేవలు ఫర్వాలేదు
2024–25కు 6.5 శాతం అంచనా
ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి
గణాంకాలు విడుదల చేసిన ఎన్‌ఎస్‌వో
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ3లోనూ (2024 అక్టోబర్–డిసెంబర్) బలహీన ధోరణి ప్రదర్శించింది. జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైంది. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో నమోదైన ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.6 శాతం (తాజా సవరణకు ముందు 5.4 శాతం) నుంచి, డిసెంబర్ క్వార్టర్‌లో 6.2 శాతానికి పుంజుకున్నప్పటికీ.. క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)క్యూ3లో నమోదైన 9.5 శాతం రేటుతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది.
అంతేకాదు, ఆర్‌బీఐ అంచనా 6.8 శాతం కంటే కూడా తక్కువగానే నమోదైంది. తయారీ, మైనింగ్ రంగాల పనితీరు బలహీనపడడం వృద్ధి రేటును తక్కువ స్థాయికి పరిమితం చేసింది. పట్టణ వినియోగం కూడా బలహీనంగానే కొనసాగింది. అదే సమయంలో వ్యవసాయ రంగం పటిష్ట పనితీరుకుతోడు ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచడం.. మెరుగైన వర్షాలకుతోడు పండుగల సీజన్‌లో గ్రామీణ వినియోగం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలి చాయి. డిసెంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) శుక్రవారం విడుదల చేసింది.
నాలుగేళ్ల కనిష్టం..
2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5% వృద్ధిని (స్థిర కరెన్సీలో రూ.188 లక్షల కోట్లు) సాధిస్తుందని ఎన్‌ఎస్‌వో తన ద్వితీయ ముందస్తు అంచనాల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో వేసిన తొలి ముందస్తు అంచనాల్లో ఇది 6.4 శాతంగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ ఇది నాలుగేళ్ల కనిష్ట వృద్ధి కానుంది. క్రితం ఆర్థిక సంవత్సరం 9.2 శాతం కంటే కూడా తక్కువ. ఎన్‌ఎస్‌వో తాజా అంచనాల మేరకు జీడీపీ 6.5 శాతానికి పుంజుకోవాలంటే చివరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగైన పనితీరు చూపించాల్సి ఉంటుంది.
రంగాల వారీ పనితీరు..
→ స్థూల విలువ జోడింపు (జీవీఏ/ఆర్థిక కార్యకలాపాల తీరు) డిసెంబర్ త్రైమాసికంలో 6.2 శాతంగా నమోదైంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.6 శాతంగా ఉంది.
→ వ్యవసాయ రంగం ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయికి పుంజుకున్నది. డిసెంబర్ త్రైమాసికంలో ఐదు రెట్లు బలపడి 5.6 శాతం వృద్ధిని చూపించింది. అంతకుముందు త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) ఇది 4.1 శాతంగా ఉంటే, క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు 1.5 శాతమే కావడం గమనించొచ్చు.
→ తయారీ రంగంలో వృద్ధి సెపె్టంబర్ క్వార్టర్‌లో ఉన్న 2.1 శాతం నుంచి డిసెంబర్ త్రైమాసికంలో 3.5 శాతానికి చేరింది. అయినప్పటికీ క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో 14 శాతం వృద్ధి రేటుతో పోల్చి చూస్తే చాలా తక్కువే.
→ మైనింగ్‌లో వృద్ధి 1.4%కి పడిపోయింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది 4.7%.
→ సేవల రంగం వృద్ధి రేటు క్యూ3లో 7.4 శాతానికి మెరుగుపడింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది 8.3 శాతం కావడం గమనార్హం.
క్యూ4లో బలమైన పనితీరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకోవడంతోపాటు, ఎగుమతులు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయి.
– అనంత నాగేశ్వరన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు
Comments
Please login to add a commentAdd a comment