మూడు వారాల కనిష్టానికి పసిడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ట్రెండ్ బలహీనంగా ఉండటం, జ్యువెల్లర్స్, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల గతవారం బంగారం ధ ర మూడు వారాల కనిష్ట స్థాయికి చేరింది. ఈ వారంలో (సెప్టెంబర్ 17) అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు సమావేశం ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,098 డాలర్లకు తగ్గింది. ఆగస్ట్ 11 నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. వారం ప్రారంభంలో పండుగ, పెళ్లిళ్ల సీజన్ కారణంగా ముంబైలో 99.9 స్వచ్ఛత బంగారం ధర రూ.26,565 వరకు పెరిగి, చివరకు వారాంతానికి వచ్చేసరికి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా అంతక్రితం వారంతో పోలిస్తే రూ.435 తగ్గి రూ.26,110 వద్ద ముగిసింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా రూ.26,415 వరకు పెరిగి, చివరకు రూ.435 క్షీ ణించి రూ.25,960 వద్ద ముగిసింది.
పసిడి దిగుమతుల వెల్లువ..: అంతర్జాతీయంగా బంగారం ధ రలు తగ్గడంతో దేశంలోకి బంగారం దిగుమతులు బాగా పెరిగాయి. ఆగస్ట్‌లో బంగారం దిగుమతులు 120 టన్నుల మార్క్‌ను అధిగమించాయి. ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే గరిష్ట స్థాయి. జూలై నెలలో బంగారం దిగుమతులు 89 టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఆగస్ట్ నెలలో బంగారం దిగుమతులు 50 టన్నులుగా ఉన్నాయి.