రూపాయి మరింత డౌన్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లో బలహీన ట్రెండ్‌తో పాటు డాలర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రూపాయి మారకం విలువ మంగళవారం మరింత క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే మరో 21 పైసలు క్షీణించి 62.76 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. కరెంటు అకౌంటు లోటు గణాంకాల విడుదలకు ముందు మార్కెట్ వర్గాలు ఆచితూచి వ్యవహరించడం సైతం రూపాయి తగ్గుదలకు కారణమైంది.
ఫారెక్స్ మార్కెట్లు ముగిసిన తర్వాత విడుదలైన గణాంకాల ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కరెంటు అకౌంటు లోటు.. రెట్టింపయ్యింది. 8.2 బిలియన్ డాలర్ల మేర పెరిగి స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 1.6 శాతానికి చేరింది. సోమవారంనాడు రూపాయి మారకం విలువ 39 పైసలు క్షీణించింది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఊహించిన దానికన్నా ముందుగానే వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నాయన్న ఆందోళనలు మార్కెట్లను కుదిపేస్తుండటం రూపాయి మీద కూడా ప్రభావం చూపుతోంది.