
చెన్నై/న్యూఢిల్లీ: కేంద్రం-తమిళనాడు మధ్య భాషా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా రూపాయి సింబల్(Rupee Symbol) ₹ ప్లేస్‌లో తమిళ అక్షరం చేర్చిన డీఎంకే ప్రభుత్వం తీరుపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమిళంలోనే ఆమె కౌంటర్ ఇచ్చారు. అంత అభ్యంతరాలు ఉంటే.. గతంలోనే ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారామె.
తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును (₹) తొలగించి.. రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది స్టాలిన్ ప్రభుత్వం. ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు చెలరేగాయి. బీజేపీ నేత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఒకవేళ ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో దాన్ని కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డీఎంకేను ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఒక పోస్ట్ చేశారు.

గతంలో.. యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్యపక్షంగా ఉంది. ఆ సమయంలో ఆ గుర్తును తీసుకొచ్చారు. పైగా ‘₹’ సింబల్‌ను రూపొందించిన వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే తనయుడే. ఇప్పుడు దీన్ని పక్కనపెట్టడం ద్వారా.. డీఎంకే ఓ జాతీయ గుర్తును తిరస్కరించడమే కాకుండా.. తమిళ యువకుడి సృజనాత్మకతను విస్మరిస్తోంది అని సీతారామన్ అన్నారు.

రూపాయి చిహ్నం ‘₹’ అంతర్జాతీయంగా బాగా గుర్తింపు పొందిందని.. ప్రపంచ ఆర్థిక లావాదేవీల్లో దేశానికి గుర్తింపుగా నిలుస్తోందని అన్నారామె. అలాగే.. యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క సొంత కరెన్సీ చిహ్నాన్ని మనం బలహీనపరుస్తున్నామా? అని డీఎంకేను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు.. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను నిలబెడతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారు. అలాంటిది జాతీయ చిహ్నాలను తొలగించడమంటే.. ఆ ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించడమే అని వ్యాఖ్యానించారామె.
డీఎంకే చేసిన పని జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీసే చర్యలన్న ఆమె.. ఇది భాష, ప్రాంతీయ దురభిమానానికి ఉదాహరణగా పేర్కొన్నారు.
దేశ ఐక్యతను బలహీనపరిచే, ప్రాంతీయ గర్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment