
ఏడో రోజూ ర్యాలీతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఈ ఏడాది నష్టాలన్నీ పూడ్చుకోగలిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ వరుస లాభాల పరంపర, ఎఫ్‌ఐఐల పునరాగమనంతో దేశీయ కరెన్సీ వరుస ఏడు ట్రేడింగ్ సెషన్లలో 154 పైసలు బలపడింది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, డాలర్ ఇండెక్సు బలహీనత అంశాలు కలిసొచ్చాయి. తాజాగా సోమవారం డాలర్ మారకంలో 37 పైసలు బలపడిన రూపాయి 85.61 వద్ద ముగిసింది. కాగా, 2024 డిసెంబర్ 31న 85.64 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 85.93 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 85.49 వద్ద గరిష్టాన్ని, 86.01 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!
‘ఆర్థిక సంవత్సరం ముగింపు సర్దుబాటులో భాగంగా విదేశీ బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఏప్రిల్ 2 నుంచి అమెరికా ప్రతీకార సుంకాలు అమల్లోకి రాకముందే చర్చలు జరుపుతామని భారత ప్రతినిధుల ప్రకటన ఇన్వెస్టర్లకు భరోసానిచ్చింది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు దిలీప్ పర్మార్ తెలిపారు.
