దేశ వృద్ధిలో భాగమవ్వండి; అవకాశాలు అందిపుచ్చుకోండి
అమెరికా సీఈవోలకు ప్రధాని మోదీ పిలుపు
న్యూయార్క్: భారత్ త్వరలో మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో దేశ ఆరి్థక వృద్ధిలో భాగమవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికన్ దిగ్గజ సంస్థల సీఈవోలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారం చేపట్టిన మూడో విడత కాలంలో (2024–29) భారత్‌ను భారీ ఎకానమీల్లో మూడో స్థానానికి చేర్చేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం 3.9 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ అయిదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక, సాంకేతికత ప్రగతితో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీలకు ప్రధాని సూచించారు. యావత్ ప్రపంచం కోసం ఉత్పత్తులు, సేవలను రూపొందించేందుకు, ఉత్పత్తి చేసేందుకు భారత్‌తో చేతులు కలపాలని ఆయన పేర్కొన్నారు.
మేధోహక్కుల పరిరక్షణకు, టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తయారీ, సెమీకండక్టర్లు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘సెమీకండక్టర్ల తయారీకి గ్లోబల్ హబ్’గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు.
‘టెక్ సీఈవోలతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. టెక్నాలజీ, నవకల్పనలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. ఆయా విభాగాల్లో భారత పురోగతిని వివరించాను’ అని ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వహించిన సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఎడోబ్ సీఈవో శంతను నారాయణ్, యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన విధానాలతో భారత్, అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందని సీఈవోలు కితాబిచ్చారు.
ఎన్‌విడియా, గూగుల్ మరింత ఫోకస్
భారత్‌పై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు గూగుల్, ఎన్‌విడియా తదితర టెక్ దిగ్గజాలు వెల్లడించాయి. దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ పెట్టనున్నట్లు మోదీతో భేటీ అనంతరం సీఈవోలు తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్ ద్వారా భారత్‌లో పరివర్తన తేవడంపై ప్రధాని దృష్టి పెట్టారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.
‘హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం వంటి విభాగాల్లో వినూత్న సొల్యూషన్స్ రూపొందించాలని ఆయన సూచించారు. భారత్‌లో ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరింతగా కలిసి పనిచేయడంపై ఆసక్తిగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. భారత్‌తో తమకు ఇప్పటికే వివిధ విభాగాల్లో భాగస్వామ్యం ఉందని, అధునాతన టెక్నాలజీ లను అందుబాటులోకి తెస్తున్నామని ఎన్‌విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment